వనవాసి

0
379

ప్రకృతిని ఆరారగా దోసిళ్ళతో తాగాలనుందా?వెన్నెల వర్షంలో తడిచి స్వప్న జగత్తులో విహరించాలని ఉందా? అయితే బిభూతిభూషన్ బంధోపాధ్యాయ రచించిన వనవాసి (బెంగాలీ మూలం అరణ్యక) చదవాల్సిందే..

కథానాయకుడు ఉద్యోగరిత్యా ఒక జమీందారుకు సంబంధించిన ఎస్టేటులోని భూములను కౌలుకు ఇచ్చేపని మీద బీహార్ లోని కూశీ నది తీరంలో ఉన్న దట్టమైన అరణ్యప్రాంతానికి చేరి,ఆరు సంవత్సరాలు అరణ్యవాసం చేసి వన సౌందర్యానికి ముగ్ధుడై అక్కడి జనజీవితాన్ని దగ్గరగా పరిశీలించి,వారితో ఆత్మీయ సంబంధాలను పెంచుకొని తన పని ముగిసాక తిరిగి కలకత్తా వెళ్ళిపోడం నవల వృత్తాంతం.

ఇంటికి దూరంగా భయంకరమైన ఏకాంతంలో ఎలా ఉండడం అని భయపడ్డ రచయితను క్రమంగా అడవే ఆవహిస్తుంది.

అపూర్వ రక్తారుణ రాగరంజిత మేఘమాలలు ధరించిన సంధ్యలూ, ఉగ్రభైరవ స్వరూపం ధరించిన మధ్యాహ్నాలూ, హిమస్నిగ్ధ వనకుసుమ పరిమళం తో జ్యోత్స్నాలంకార నిశీధులూ అతన్ని వివశున్ని చేసాయి. దిగంతాలకు వ్యాపించిన జ్యోత్స్నాప్లావిత నిర్జన ప్రాంతాలను చూసి అదే ప్రేమ స్వరూపం అంటాడు.

అరణ్యమంతటా,కొండలపైన స్థిర ప్రశాంత స్నిగ్ధకాంతులు వ్యాపించి స్వప్న జగత్తును సృష్టించిన వెన్నెలలో పరవశించి అది చూడని వారు ఈశ్వరుని అద్భుత సృష్టిని కోల్పోయినట్టే అంటాడు.దిగంచలాలలోని మహాలిఖారూప పర్వతారణ్యంలో అనేక రకాల వన పుష్ప పరిమళాలను,వన్య ప్రాణులను మనసులో నిల్పుకుంటాడు. దన్ ఝరి శైలశ్రేణి పై పుష్పిత సప్తవర్ణ వనాన్ని, సరస్వతీ నది ఒడ్డున ఉన్న అనేక రకాల పూల వనాల్ని, విరగ పూసిన మోదుగ, బూరుగ, కాశీ వనాలను మనతో దర్శింప చేస్తాడు. గోల్గోలీ,దూధలి,భండీర,స్పైడర్ లిల్లీ వంటి అడవి పుష్పాల సుగంధాలను మనతో ఆఘ్రానింప చేస్తాడు.

అడవి అందాలతోనే కాక అక్కడి గిరిజనుల జీవితాలతోనూ మమేకమై వారి కష్ట సుఃఖాల్లో తోడుంటాడు. ఇందులో కనిపించే అనేక పాత్రలు తాత్వికత అద్దుకొని ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి.

ఒక విధ్యార్థిలేకున్నా బడి తెరిచిన నిరుపేద ఉపాధ్యాయుడు మటుక్ నాథ్ పాండే, జొన్నవంటి ధాన్యాల కోతకు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిబతికే నక్ ఛేదీ లాంటి పేద గంగోతాలు, బతకుదెరువు కోసం చిన్ని కృష్ణుడి నృత్యం చేసే అరవై ఏళ్ళ దశరథ్, పూర్వ వైభవాన్ని కోల్పోయి పశువుల కాపరిగా మిగిలిన సంతాల్ వీరుడూ రాజూ అయిన దొబ్రూపన్నా, అతని అందాల అమాయకపు మననుమరాలు భానుమతి, శివలింగాన్ని ప్రతిష్టించిన ద్రోణుడనే గంగోతా, పుక్కిటి పురాణాలు చెప్తూ అవసరంలో వైధ్యం చేసి ఆదుకునే రాజూపాండే, నాట్యపిపాసి గిరగిర నృత్యం చేసే ధాతురియా, ఒక అడవీ ప్రాంతంలో లేని పూల మొక్కలను మరో అడవి నుండి తెచ్చి నాటే యుగళ ప్రసాద్, అద్భుత కథలు చెప్పే గనూమహతో, కొండల మీద ఫలాలు ఏరుకొచ్చి కుటుంబానికి ఆహారంగా ఇస్తూ అందమైన పక్షులు జంతువులను పట్టి ఆడుకునే బాలికలు సురతియా ఛనియా లు, భర్త మరణంతో దీనస్థితిలో వుండి కూడా సేవా గుణం కల కడుబీద కుంత, గాజులు పూసలు నృత్యాలను ఇష్టపడే గిరిజన యువతి మంచీ, మరో వైపు జనాన్ని అంగ అర్ధ బలంతో అదుపులో ఉంచుకొనే రాసవీహారీసింగ్, ఛటుసింగ్ వంటి సంపన్నులు ఇలాంటి అనేక గుర్తుండిపోయే పాత్రలు వున్నాయి.

నాఢా,పూల్కియా,లవటులియా అరణ్య భూముల పంపిణీ పూర్తి అయి అవి జనపధాలుగా మారాక తిరిగి వెళ్ళే సమయంలో అంతరించిన అరణ్యాలను తలచుకొని ‘మనిషికి కావలసింది అభివృద్ధా ? ఆనందమా? నా వల్ల రూపుమారిన అరణ్యానీ, ఆదిదేవతా నన్ను క్షమించు ‘ అంటాడు రచయిత.

అడవుల అందాన్ని, వాటిని పరిరక్షించుకునే అవసరాన్ని సున్నితంగా చెప్పే వనవాసి చదివాల్సిన పుస్తకం.


@ శృతకీర్తి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.