మిర్దాద్

0
518

రమణమహర్షి భక్తురాలైన ఒక స్నేహితురాలి ద్వారా మిర్దాద్ పుస్తకం నా దగ్గరకు వచ్చింది. ఇంతవరకు దీని గురించి వినలేదు, కానీ ” మనిషి భూమి మీద బ్రతికినంత కాలం మిర్దాద్ పుస్తకం శాశ్వతంగా జీవించి ఉంటుంది. ప్రతి వాక్యం, ప్రతి మాటా చాలా ముఖ్యమైనవే. దీనిని నవల గా కాదు అద్భుత సధ్గ్రంధంగా చదవాలి ” అని ఓషో మాటలు చూసి పుస్తకం మీద ఆసక్తి పెరిగింది. అసలేంటో చూద్దామని తెరిచి ఆపకుండా మొత్తం పుస్తకం చదివేసాను. రమణ మహర్షి బోధనలలో ముఖ్యమైన మౌనముద్ర, ఆత్మజ్ఞాణం, స్వీయ శోధన మిర్దాద్ మాటల్లో కనిపించింది. మిర్దాద్ పుస్తకాన్ని పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ వారు తెలుగులో ప్రచురించారు.

కథలోకివస్తే మంచుపర్వతాలలో ఆల్టర్ పీక్ అనే ఉన్నత శిఖరం మీద ది ఆర్క్ అనే మఠాన్ని నోవా తన వారసుడైన శామ్ తో స్థాపింపచేస్తాడు. ఆ మఠంలో ఎన్నుకోబడిన తొమ్మిది మంది వ్యక్తులు మాత్రం వుండాలి. వారిలో ఒకరు చనిపోయినపుడు అక్కడికి ఏ అగంతకుడు ముందుగా వస్తే అతనిని తొమ్మిదో వ్యక్తి గా అంగీకరించాలి. అలా నోవా, శామ్ లు ప్రతిపాదించిన అనేక నియమాలతో ఆర్క్ ప్రారంభమై సక్రమంగా నడుస్తూంటుంది.

కానీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆర్క్ లో షమాదమ్ అనే మఠాధిపతి ఆధ్వర్యంలో అక్రమాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో ఒక సభ్యుడు చనిపోతే అతని స్థానంలో ఆర్క్ లోకి ప్రవేశిస్తాడు మిర్దాద్. తన బోధనలు అర్థం చేసుకునే స్థాయికి వచ్చే వరకు ఏడు సంవత్సరాలు మౌనంగా ఎదురు చూసి తర్వాత ఆర్క్ సభ్యులు మరియు ప్రజల సందేహాలన్నీ తీర్చి, వారి మనసులు గెలిచి వారందరి సహకారంతో షమాదమ్ దేవుడిని అడ్డుపెట్టుకుని చేసే ఆగడాలను నియంత్రించి ఆర్క్ కి పూర్వపు ప్రతిష్టను తీసుకువస్తాడు.

” మీరు సరిగ్గా చూస్తే, మాట్లాడితే మిమ్మల్ని తప్ప మరెవర్నీ చూడరు. మీ గురించి తప్ప ఏదీ మాట్లాడరు. అన్నింటిలో, పదాలలో, పదాల వెనుక వున్నది మీరే. మీ తెరలను తొలగించుకొండి అన్నీ అర్ధమౌతాయి ” అని తను చెప్పబోయే మాటలకు సంసిద్దం చేసి, తర్వాత జీవితంలోని అన్ని పార్శ్వాలను స్పృశిస్తూ ఎంతో లోతుగా మాట్లాడుతాడు.

“నేను అన్నది నదీ మూలం. అక్కడి నుండే అన్నీ ప్రవహిస్తాయి. హృదయంలోని మంచి, చెడు అన్ని భావాలకు నేను అనేదే కారణం. నేను లోనే దేవుడు ఇమిడి వున్నాడు. దేవుడి నుండీ తోటి మానవులనుండీ మనిషి వేరు చేయబడడు. ఈ అవగాహన కలిగినపుడు జీవితం తన అనంతమైన హృదయంలోకి మీరు ప్రవేశించే అవకాశాన్ని మీకు సమకూరుస్తుంది.అదే ప్రేమలోని కీలకం. ప్రేమకు ఎక్కువ, తక్కువలు లేవు. కొలవడానికి ప్రయత్నించిన క్షణమే చేదు స్మృతులను మిగిల్చి జారుకుంటుంది” అంటూ వివిధ వర్గాల ప్రజలందరి మధ్య ప్రేమ ముఖ్యమంటాడు.

“మీ కోసం రొట్టెలు కాల్చేవారిని ఆకలిపాలు చేసారు. వాళ్ళు కొట్టే రాళ్ళతో వాళ్ళకు చెరసాలలు నిర్మించారు. వారు సమకూర్చే చెక్కలతో వారికే కాడి, శవపేటికలు నిర్మిస్తారు. వారి చెమటనూ రక్తాన్నీ వారికీ అప్పుగా వడ్డీకి ఇస్తారు. ఇది క్షమించరాని సిగ్గుమాలిన కృతఘ్నత “అని దోపిడీదారులను నిలదీస్తాడు.

“మీ జీవితాలకు విలువకట్టగలిగితే తప్ప,దేనికీ విలువ కట్టవద్దు. అతి స్వల్పమైనది కూడా అత్యంత విలువ కలిగి వుంటుంది అంటూ” సుఃఖాలపై వస్తువులపై వ్యామోహం వద్దంటాడు.

“ప్రార్థించటానికి మీకు దేవాలయాలు అవసరం లేదు. తన హృదయంలో గుడిని చూడలేని వాడు, గుడిలో తన హృదయాన్ని చూడలేడు. దేవుడు మిమ్మల్ని మండించమనేది సాంబ్రాణి కాదు, మీ కోపాన్నీ గర్వాన్నీ క్రూరత్వాన్నీ. అపుడు మీరూ దేవుడిలా స్వేచ్ఛగా సమగ్ర శక్తివంతంగా ఉంటారు.” అంటూ అర్ధం లేని మతాచారాలకంటే మానవత్వం మిన్న అంటాడు.

పుస్తకం జాగ్రత్తగా,వోన్ చేసుకొని చదివితే మనలో వుండే కొన్ని సందేహాలకు సమాధానాలు దొరకొచ్చు. చిన్న పుస్తకం లో ఎక్కువ విషయాలు చెప్పటమే కాక పోయెటిక్ గా కూడా వుంది కాబట్టి నాకైతే నచ్చింది.

మిర్దాద్ – మైకేల్ నేమి (అరబీ,ఇంగ్లీష్ )
డా॥సూర్యకుమారి (తెలుగు అనువాదం)

@ శృతకీర్తి

 

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.