అర్ధనారీశ్వరుడు

0
400

సుమిత విధ్యావంతురాలైన యువతి. తనను ఎంతగానో ప్రేమించే భర్త, అత్తమామాలతో ముద్దులొలికే కొడుకుతో సంతోషకరమైన కుటుంబజీవితం గడుపుతుంటుంది. అలాంటి సమయంలో దుండగులనుండి భర్తను, ఆడపడుచును రక్షించి తను అత్యాచారానికి గురౌతుంది. ఆ సంఘటన తర్వాత కుటుంబంలో ఆమె విలువ మరింత పెరిగి ఇంకా అపురూపంగా చూసుకుంటారు అందరూ. కానీ ఆమె అంతులేని దిగులు, భయంతో విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతుంది. తన భర్తలో కూడా అభద్రతను,స్థబ్దతను గుర్తిస్తుంది. ఆ బాధలనుండి విముక్తి కోసం తను నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ క్రమంలో ఎంతో మంది బలాత్కారానికి, వివక్ష కు పీడనకు గురైన స్త్రీలను కలుస్తుంది. ఎందరికో ఆశ్రయం యిచ్చి అక్కున చేర్చుకుంటుంది. వాళ్ళను సమాజానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతుంది. వారిపై పరిశోధన వ్యాసాలు రాసి పత్రికలలో ప్రచురించి సమస్యపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తుంది. అర్థవంతమైన చర్చల ద్వారా తమ ఇద్దరి మానసిక స్థితినీ పరిశీలించుకొని భర్తతో తన అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకుంటుంది. ఇదీ స్థూలంగా అర్ధనారీశ్వరుడు లోని కథ.

ఈ నవలలో సంఘానికి సంబంధించిన అనేక సమస్యలను మన ముందుంచుతారు రచయిత. సమస్యలకు పరిష్కారం కూడా చూపిస్తారు. బలాత్కార సంఘటనలు, అనేక రకాలైన స్త్రీ-పురుష సంబంధాలను సునిషితంగా చర్చిస్తారు. అత్యాచారానికి గురైన మహిళల మానసిక స్థితిని చదువుతుంటే మనసు దుఃఖంతో నిండిపోయింది. చాలా వరకు నేరం రుజువు కాక, పరువు ప్రతిష్టలకు భయపడి అసలు కేసు కూడా పెట్టనపుడు నేరస్తుడు దర్జాగా తిరుగుతుంటాడు. నేరానికి గురికాబడిన స్త్రీకే శిక్షవేస్తుంది సమాజం తన ప్రవర్తన ద్వారా. ఎంత బాధ, ఎంత కఠినమైన నిజం. 25 ఏళ్ళ క్రితం రాసిన పుస్తకమిది. ఇప్పటికీ పెద్దగా మార్పులేదనే చెప్పొచ్చేమో మన దేశంలో ప్రతిరోజు జరిగే నేరాలు, అవి జరిగిన తర్వాత పరిస్థితులు చూస్తుంటే.

రాతియుగం నుండీ ఇప్పటి వరకూ సమాజం ఎంత ముందుకు పోయినా స్త్రీ-పురుష సంబంధాలలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వుంది. ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయిస్తూనే ఒకరికొకరు బానిసలుగా వున్నారు. పూర్తిగా భ్రష్టమైన వ్యవస్థ లో మనం ఉంటున్నాం. పైపైకి ఎన్నెన్నో మెరుగులు.పైపైన ఎంతో ఉన్నతమైన సమాజం. కాని లోలోపల ఎంత దుర్గంధం. మేడి పండులా ఉంది మన వ్యవస్థ అని అంటారు రచయిత.

మహిళలు కుంగుబాటు నుండి పీడన నుండీ బయట పడాలంటే తనలోని బానిసత్వం నుండి, పురుషుని పట్ల ఆకర్షణ నుండీ విముక్తి పొందాలి. నిరంతర సంఘర్షణ, నిరంతరం ముందుకు నడవడం,సంపూర్ణత్వ సాధనకు ప్రయత్నించటం, నిరంతర సత్యాన్వేషణ చేయాలి.కోరికలనుండి కాదు కోరికల దాస్యం నుండి, పురుష బలాకర్షణ నుండి కాదు బలంలోని పశుత్వాకర్షణ నుండి, ఆధారపడడం నుండి కాదు పరాధీనత నుండి విముక్తి పొందాలి అంటారు.

పురుషుడు అధికారం చూపాలి అన్న అహం కారణంగా, తనే యజమాని అనే స్వార్ధంతో, కామవాంఛ తీర్చుకోడం కోసం, వైవాహిక జీవితంలోని చిన్న సుఃఖాలకోసం బానిసగా వుంటాడు. స్త్రీ-పురుషులిద్దరూ ఒకరి బానిసత్వం నుండి మరొకరు విముక్తి పొంది, ఒకరి బలహీనతలొకరు స్వీకరించి తమ శక్తి ద్వారా పటిష్ఠమైన లోపాలు లేని ఒక కొత్త ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేయాలి అదే ‘అర్ధనారీశ్వరుడు’ అని ప్రతిపాదిస్తారు రచయిత.

స్త్రీ-పురుషులిద్దరు ఒకరి పాత్రను మరొకరు నింపండి. కానీ ఒకరి పాత్రలో మరొకరు తాగకండి. ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు నిలబెట్టాలంటే ఆసక్తినుండి విముక్తి పొందడం తప్పని సరి అని జిబ్రాన్ మాటలు నవలలో ఎన్నో సంఘటనల్లో ఉటంకించిన రచయిత ఖలీల్ జిబ్రాన్, గాంధీ, మార్క్స్ , డా.అంబేడ్కర్ మొదలైన వారి సిద్ధాంతాలను, అభిప్రాయాలను ఆధారంగా చేసుకొని తను చెప్పదలచుకున్నది చెప్పే ప్రయత్నం చేసానంటారు తన ముందుమాటలో.

జిడ్డు కృష్ణమూర్తి చెప్పినట్టు తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది. కానీ కొన్ని సార్లు మనకు మనం కూడా అర్థంకాము, అలాంటిది ఈ పుస్తకం జాగ్రత్తగా అర్ధం చేసుకుంటూ చదవితే బంధాల మధ్య వుండే సున్నితమైన విషయాలు స్పష్టమవుతాయి అనిపించింది. వడ్డెర చండీదాస్ తన అనుక్షణికం పుస్తకంలో అనేక మంది స్త్రీ-పురుషుల మధ్య అస్త వ్యస్తమైన బంధాలను చూపిస్తూ ఇవన్నీ చక్కదిద్దుకోవాలంటే ఒక ఆదర్శవంతమైన నవ ప్రపంచం ఒక్కటే దారి అంటాడు ఒక సందర్భంలో. ఈ పుస్తకంలో ఆ ఆదర్శ ప్రపంచం ఎలా నిర్మించాలో చూపించారు విష్ణు ప్రభాకర్. పురోగమనానికి కొత్త దారులే రాచబాటలు అంటూ మూసలు పగలగొట్టుకొని బయటకు వచ్చిన ఎన్నో స్త్రీ-పురుష ఆదర్శ పాత్రలను మన ముందుంచారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం ఇది.


@ శృతకీర్తి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.