Signs of the Unseen

0
383

రంజాన్ మాసం గడిచిపోయింది కాని ఇంకా ఆ ప్రార్థనా ఋతుసుగంధం మెహిదిపట్నాన్ని అంటిపెట్టుకునే ఉంది. ఉపవాసాలతో, దానాలతో, ప్రార్థనలతో శుభ్రపడ్డవీథుల్లో తిరిగినందుకు, నేను కూడా ఉండబట్టలేక, రూమీని తెరిచాను.

ఎప్పుడో, ఇరవయ్యేళ్ళకింద కొన్న పుస్తకం, Signs of the Unseen. కౌలాలంపూరు ఏర్ పోర్ట్ లొ, కంప్యూటర్, మేనేజిమెంటు పుస్తకాల మధ్య దొరికిన పెన్నిధి. ఇన్నేళ్ళుగా, మొదటిపేజీల్లోనే ఆగిపోయినవాణ్ణి, ఇప్పటికి చదవడం పూర్తిచెయ్యగలిగాను.

జలాలుద్దీన్ రూమీ (1207-73) రచనల్లో ‘మస్నవీ’, ‘దివానీ షమ్స్-ఈ- తబ్రీజీ’ సుప్రసిద్ధాలు. కాని అంతగా సుప్రసిద్ధంగాని మరొక రచన ‘ఫిహీ మ ఫిహీ’ (ఉన్నదేదో అందులోనే ఉన్నది). ఇది ఆయన ప్రవచనాల, సంభాషణల, చర్చల సంకలనం. 71 అధ్యాయాల ఈ సంకలనాన్ని హార్వర్డుకి చెందిన వీలర్ థాక్ స్టన్ జూనియర్ అనే ఆయన Signs of the Unseen పేరిట ఇంగ్లీషులోకి అనువదించి, చక్కటి పరిచయ వ్యాసం కూడా పొందుపరిచాడు.

తన కవిత్వంలో చాలాచోట్ల వక్రోక్తిమీద ఆధారపడ్డ రూమీ ఈ ప్రవచనాల్లో చాలా సూటిగా మాట్లాడతాడు. ఈజిప్టుకి చెందిన తొమ్మిదో శతాబ్దానికి చెందిన ఒక సూఫీ అన్నాడట: ‘ నువ్వు భగవంతుడెలా ఉంటాడని ఊహిస్తావో, ఆయన దానికన్నా భిన్నంగా ఉంటాడు’ అని. ఈశ్వరుడు వాక్కుకీ, మనసుకీ అతీతుడని ఉపనిషత్తులు చెప్పిన మాటనే ఇది. నేతి నేతి అనడమే ఒక విధంగా. కానీ, రూమీ ఏమంటాడంటే, నువ్వు ఈశ్వరుడి గురించి ఏదైతే ఊహించుకుంటావో, ఆయన ఆ రూపంలో కూడా నీకు సాక్షాత్కరిస్తాడు అని. ‘పూర్ణం అదమ్’ మాత్రమే కాదు, ‘పూర్ణం ఇదమ్’ కూడా.

మౌలానా దృష్టిలో ఆ ప్రపంచం,ఈ ప్రపంచం రెండూ ఒకే అనుభవానికి రెండు కొసలు. ఆయన దృష్టిలో మనిషి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఈ ప్రపంచం ఒక రంగశాల. మనిషి ఖనిజంగా, వృక్షంగా, పశువుగా జన్మలెత్తాకనే మనిషిగా జన్మ ఎత్తాడు. అతడికి ఒక కొసన సర్పం ఉంది, మరొక కొసన విహంగం ఉంది. అతడిలోని పశువు అతణ్ణి కిందకి లాగుతుంది, దైవత్వం పైకి లేపుతుంది. ఆ క్రమంలో అతడు మూడు దశల్లో ప్రయాణించవలసి ఉంటుంది. ప్రపంచమే ముఖ్యంగా ఉండేది మొదటిదశ, దేవుడే సమస్తమనుకునేది రెండవ దశ. ఇక తాను మరణించి దేవుడు మాత్రమే మిగిలేది మూడవదశ. శలభం దగ్ధమై పోతుంది, దీపం మాత్రమే మిగుల్తుంది. ఎందుకంటే, దీపంలో ఉన్నదే శలభంలోనూ ఉన్నది.

ఈశ్వరానుగ్రహం ఏ కొద్దిమందికో మటుకే లభిస్తుందని రూమీ నమ్మలేదు. తమ మనసనే అద్దాన్ని తుడిచిపెట్టుకోగలిగితే చాలు, ఈశ్వరవదనం ప్రతి ఒక్కరిలోనూ ప్రతిఫలిస్తుంది.

Signs of the Unseen లో నన్ను మరీ మరీ వెన్నాడిన కొన్ని వాక్యాలు మీ కోసం:

1
ఒకప్పుడొక రాజు ఒక దర్వేషుని ‘నువ్వు భగవంతుడి సన్నిధిలో ఉన్నప్పుడు నా గురించి కూడా తలుచుకోవా’ అని అడిగాడు.’నేనాయన సన్నిధిలో ఉన్నప్పుడు, ధగధగలాడే ఆ సౌందర్య సన్నిధానంలో నా గురించే నాకు గుర్తుండదు. ఇక నీ గురించి ఎక్కడ గుర్తుంటుంది?’ అన్నాడా దర్వేషు.

2
భగవంతుడి విషయంలో రెండు వ్యక్తిత్వాలకి తావులేదు. నువ్వు ‘నేను’ అంటావు, ఆయన కూడా ‘నేను’ అంటాడు. ఈ ద్వంద్వం అదృశ్యం కావాలంటే, అయితే అయనైనా నీకోసం మరణించాలి లేదా నువ్వైనా ఆయనకోసం మరణించాలి. ఊహలోగానీ, వాస్తవంగా గానీ, ఆయన అనంతుడూ, అనశ్వరుడూ కాబట్టి ఆయనకి నీ కోసం మరణించడం సాధ్యమయ్యే పని కాదు. కాని ఆయన ఎంత దయామయుడంటే, ఒకవేళ అట్లా మరణించడం సాధ్యమైతే, మీ మధ్య ఈ ద్వంద్వం అంతరించిపోవడం కోసం, అందుకు వెనకాడడు కూడా. కాని ఆయనకి మరణించడం సాధ్యం కాదు కాబట్టి, మరణించవలసింది నీ అహంకారమే.

3
ఎవరో అడిగారు ప్రార్థన కన్నా మరింత మేలైందేమిటని? ప్రార్థించే హృదయం ప్రార్థన కన్నా మేలైనది. మరొక జవాబు చెప్పాలంటే, విశ్వాసం ప్రార్థన కన్నా గొప్పదని చెప్పాలి, రోజుకి అయిదు సార్లు ప్రార్థన చెయ్యాలని నిబంధన ఉంది. కాని విశ్వాసం నిర్విరామం. తగినంత కారణమున్నప్పుడు, ప్రార్థన చెయ్యకుండా ఉండటానికి మినహాయింపు ఉంది. అవసరమైతే, ప్రార్థన వాయిదా వెయ్యవచ్చు. ప్రార్థించకపోయినా విశ్వాసం కలిగి ఉంటే చాలు, కాని విశ్వాసం లేకుండా ప్రార్థించడం ఆత్మవంచన. మతాల్ని బట్టి ప్రార్థనలు మారతాయి, కాని మతాలేవైనప్పటికీ, విశ్వాసం మటుకు మారదు.

4
నీ దగ్గర ఓ సీసాలో కస్తూరి ఉంటే, ఆ సీసా మూత మరీ సన్నగా ఉందనుకో, దాన్ని వేలితో బయటకు తియ్యబోతావు. ఆ కస్తూరి బయటకు రాదుగాని, పరిమళం గుప్పున బయటికొస్తుంది. భగవంతుడి గురించి తలుచుకోవడం కూడా అంతే. ఆయన సారాంశాన్ని నువ్వందుకోలేకపోవచ్చు. కాని ఆ స్మరణ చాలు, శుభాలు వర్షిస్తుంది.

5
ఒక రాజు ఎవరికైనా ఉరి శిక్ష విధిస్తే, అతణ్ణి ఎవరికీ కనబడకుండా ఎక్కడో ఉరి తీసే అవకాశమున్నా కూడా, అందరూ చూసేటట్టు బహిరంగంగానే ఉరితీస్తాడు. ప్రజలందరికీ అది గుణపాఠం కావాలని కోరుకుంటాడు. అట్లా తన శాసనాన్నినలుగురిముందూ అమలు పరిచి చూపిస్తాడు. మనం తెలుసుకోవలసిందేమంటే, ఉరికంబాలన్నీ ఉరికొయ్యలేకానక్కర్లేదని. ఉన్నత పదవులు, అత్యున్నత గౌరవాలు, ప్రాపంచిక విజయాలూ కూడా ఉరికొయ్యలే. నలుగురూ చూసేటట్టు నిలబెట్టిన ఉరికంబాలే. భగవంతుడి ఎవరి పనైనా పట్టాలనుకున్నప్పుడు, వాడికి పెద్ద పదవినో లేదా విస్తృతమైన అధికారమో ఇచ్చి చూస్తాడు. అప్పుడు వాడికేమి జరుగుతుందో ప్రజలంతా కళ్ళారా చూస్తారని.

6
ఈశ్వర సంకల్పంలో మంచీ, చెడూ రెండూ ఉంటాయి కాని, ఆయన మంచికి మాత్రమే సంతోషిస్తాడు. ‘నేనొక రహస్య ఐశ్వర్యాన్ని, నన్ను వెతికి తీసుకోండి ‘అంటున్నాడాయన. ఈశ్వరుడి ఆదేశాల్లో ఇలా చెయ్యమని చెప్పే విధులూ ఉన్నాయి, ఇలా చెయ్యొద్దని చెప్పే నిషేధాలూ ఉన్నాయి.ఆయన మనల్ని ఏదైనా చెయ్యమని చెప్తున్నాడని చెప్పడానికి కొండగుర్తు ఏమిటంటే, ఆ పని చెయ్యడానికి మనకి సుతరామూ మనసుకి రుచించకపోవడమే. ఆకలి గొన్నవాడిని పాయసం తినమని ప్రత్యేకించి బతిమిలాడవలసిన పని లేదు కదా. ఆకలిగొన్న వాణ్ణి ఏదైనా తినమని చెప్పడం దయతో చెప్పిన మాటే అవుతుంది తప్ప, దాన్ని ఆదేశం అనలేం కదా.

7
ఈజిప్టుకి చెందిన యోసేపు మిత్రుడొకతను ఏదో దూరప్రయాణం తరువాత యోసేపుని చూడటానికి వచ్చాడు.’నాకోసం ఏ కానుక తెచ్చావు?’ అనడిగాడు యోసేపు అతణ్ణి. ‘నీదగ్గరలేనిదంటూ ఏమున్నది కనుక? నీకు నిజంగా కావలసిందంటూ ఏదన్నా ఉందా?’ అన్నాడు ఆ మిత్రుడు. ‘అయినా నీకోసం నేనో కానుక తేకపోలేదు. నీకన్నా అందమైంది ప్రపంచంలో మరేదీ లేదు కాబట్టి, ఇదుగో ఈ అద్దం తీసుకొచ్చాను. అనుక్షణం నిన్ను నువ్విందులో చూసుకుంటూ ఉండవచ్చు’ అన్నాడా మిత్రుడు.

భగవంతుడిది లేనిదేది? అతడికి నిజంగా కావలసిందంటూ ఏదన్నా ఉంటుందా? మనం చెయ్యవలసిందల్లా, మన హృదయం మసకబారకుండా అద్దంలాగా చూసుకోవడమే. అప్పుడాయన దాన్లో తనని తాను చూసుకుంటాడు.

8
మనిషి మూడు స్థితుల్లో ప్రయాణిస్తాడు. మొదటి స్థితిలో అతడికి భగవంతుడిమీద తప్ప, స్త్రీలు, పురుషులు, సంపదలు, పిల్లలు, రాళ్ళు రప్పలు, దేనిమీదైనా, ఎవరిమీదైనా శ్రద్ధ ఉంటుంది. ఆ తర్వాత అతడికి కొంత జాగృతి కలిగాక, కొంత జ్ఞానం పొందాక, దేవుడు తప్ప మరేమీ పట్టదు. ఆ దారిలో అట్లానే కొంతకాలం ముందుకు సాగాక, మూగబోతాడు. ‘నేను దేవుణ్ణి సేవిస్తున్నాను’ అని గానీ, ‘దేవుణ్ణి సేవించడం లేదు’ అని గానీ ఏదీ అనడు. ఆ రెండు ఆలోచనలూ వదిలిపెట్టేస్తాడు. అట్లాంటి మనుషుల ప్రపంచంనుంచి మనకెట్లాంటి శబ్దమూ వినిపించదు.

9
ఉమర్ కాలంలో ఒక ముసలతను ఉండేవాడు. అతడి కుమార్తె అతణ్ణి ఎంతో శ్రద్ధగా చూసుకునేది, అతడికి దగ్గరుండి తినిపించి, చిన్నపిల్లవాడిలాగా సంరక్షించుకునేది. ఆమెని చూసి ఉమర్ ‘అమ్మా, ఈ రోజుల్లో ఏ బిడ్డా కూడా తన తండ్రిపట్ల నువ్వు చూపిస్తున్నంత బాధ్యత చూపించడం నేను చూడలేదు’ అన్నాడు.

‘కానీ ఒక తేడా ఉంది’ అందామె. ‘నాకూ, నా తండ్రికీ మధ్య ఒక తేడా ఉంది. నేను మా నాన్నని బాగానే చూసుకుంటున్నానుగాని, ఆయన నన్ను పెంచిపెద్ద చేసే రోజుల్లో నాకే కష్టం వస్తుందో అన్న ఊహకే తల్లడిల్లిపోయేవాడు. ఇప్పుడు నేను సేవచేస్తున్న మాట నిజమేగాని, ఆయన వీలైనంత తొందరలో ప్రశాంతంగా మరణిస్తే చాలనుకుంటున్నాను. నేను సేవచేస్తున్న మాట నిజమే గాని, నా తండ్రిలాగా ఎక్కడ తల్లడిల్లిపోతున్నాను చెప్పండి?’ అందామె.

10
ఈ ప్రపంచంలో, చెప్పడం ద్వారానూ, తెలుసుకోవడం ద్వారానూ మనకు లభించే జ్ఞానం భౌతికదేహాల జ్ఞానం మాత్రమే. మరణానంతరం లభించే జ్ఞానం మటుకే మతాల ద్వారా లభించే జ్ఞానం. ‘నేను-ఈశ్వరుణ్ణి’ అని తెలుసుకోవడం భౌతికపదార్థ జ్ఞానం మటుకే. ‘నేను -ఈశ్వరుణ్ణి’ కావడం మతం ద్వారా లభించే జ్ఞానం. ఒక దీపం వెలుగుతున్నదని చూడటం, ఆ జ్వాలనీ, ఆ కాంతినీ చూడటం శాస్త్రజ్ఞానం. కాని ఆ జ్వాలలో నువ్వు కూడా ఒకటై జ్వలించగలడం మతాల ద్వారా దొరికే జ్ఞానం. ‘తెలుసుకోడానికి’ సంబంధించిన ప్రతి ఒక్క జ్ఞానమూ భౌతిక ప్రపంచానికి చెందిన జ్ఞానం. కాని ‘దర్శించడానికి’ చెందిన జ్ఞానం మతాలకి సంబంధించిన జ్ఞానం. చూసినప్పుడు మాత్రమే జ్ఞానం సాకారమవుతుంది. తక్కిందంతా మానసిక భావనమాత్రమే.

11
దివ్య ఖొరాను నవవధువు వంటిది. నువ్వామె మేలిముసుగు పక్కకు లాగేసినా ఆమె తన వదనాన్ని నీకు చూపించదు. నీ అధ్యయనంలో నీకు సంతోషం ఎందుకు కలగడంలేదంటే, నువ్వా మేలిముసుగుని లాగెయ్యాలని చూస్తున్నావు. దాన్ని ఆమె నిరోధిస్తోంది. అంతేకాదు, ఆమె చమత్కారంగా తాను అసుందరంగా కనిపిస్తూ ‘నువ్వనుకుంటున్న సౌందర్యం నేను కాదు’ అని కూడా అంటున్నది… నువ్వట్లా బలవంతంగా ఆ మేలిముసుగు పక్కకు లాగేసే బదులు, ఒకింత మృదువుగా, సానునయంగా నడుచుకో, ఆమెకి ఏది సంతోషం కలిగిస్తుందో, అట్లా నడుచుకోడానికి ప్రయత్నించు. అప్పుడామె తనంతతానే తన వదనాన్ని నీకు చూపిస్తుంది.

12
భగవంతుడు ఫారో చక్రవర్తికి నాలుగువందల సంవత్సరాల ఆయుర్దాయ మిచ్చాడు. సంపదలు, బంధువులు, సమస్తం ఇచ్చాడు. కోరిన ప్రతి కోరికా తీర్చాడు. ఇవన్నీ తన సన్నిధినుంచి ఫారోని దూరంగా ఉంచడానికి భగవంతుడు దించిన తెరలు. ఆయన ఫారోకి ఒక్కరోజు కూడా దీనత్వాన్నివ్వలేదు, ఎక్కడ తన కృపణత్వం చూపించవలసి ఉంటుందోనని. ‘నువ్వు నీ విలాసాల్లో మునిగితేలు, మమ్మల్ని మటుకు తలుచుకోకు, చక్కటి కలలు కను, సుఖంగా నిద్రపో’ అన్నాడు దేవుడు ఫారోతో.

13
ఏ దీపజ్వాలలో దూకినా కూడా శలభం దగ్ధం కాదో ఆ దీపం దీపమే కాదు. అట్లానే, ఈశ్వరుడిలో లీనంకాకుండా ఆయన్ని అవగతం చేసుకోవాలని చూసే మనిషి మనిషే కాడు. అసలు ఒక మనిషికి అవగతమయ్యే దేవుడు దేవుడే కాడు. ఆ మనిషి కూడా ఈ ఈశ్వరజాగృతి చుట్టూ ఊరికే రెక్కలార్చుకుంటూ తిరిగే పురుగుమాత్రమే. ఎవరు ఆ మనిషిని తనలోకి తీసుకునిలేశమాత్రం కూడా మిగల్చకుండా దగ్ధం చేసేస్తాడో అతడే ఈశ్వరుడు.

14
ఒక రాజు మజ్నూకి కబురంపించాడు. నీకు పిచ్చిపట్టిందా? నువ్విట్లా ఎందుకు వీథినపడ్డావు, అయినవాళ్ళని వదులుకుని సర్వనాశనం అవుతున్నావు? ఆ లైలా ఎవరు? ఆమేమన్నా అతిలోక సౌందర్యవతినా? సౌందర్యమంటే ఏమిటో నేను చూపిస్తాను, చూడు ‘అని తన రాజ్యంలో ఉన్న సౌందర్యవతులందరినీ అక్కడ హాజరుపరిచాడు. ఆ సుందరాంగులు అతడిముందు నిలబడ్డారు, కాని మజ్నూ తల కిందకు దించుకుని నేలవైపు చూస్తున్నాడు.

‘తల పైకెత్తు ‘ఆదేశించాడు రాజు, ‘నీ ముందు ఎట్లాంటి అందగత్తెలు నిలబడ్డారో చూడు.’ అన్నాడు.

‘క్షమించండి ‘అన్నాడు మజ్నూ. లైలా మీద నాకున్న ప్రేమ ఒక కత్తిలాగా నా మెడమీద వేలాడుతోంది, శిరసు పైకెత్తానా, తల తెగిపడుతుంది’ అన్నాడు.

15
మనిషిలోపల కనవచ్చే దుర్మార్గం జంతువుల్లో కూడా కనరాదంటారు. కాని దానర్థం మనిషి జంతువులకన్నా తక్కువని కాదు. అతడిలో కనవస్తున్న క్షుద్రత్వం, అల్పత్వం, నీచత్వం అతడిలోని మరేదో రహస్యసారాంశం నుంచి ప్రభవిస్తున్నవే. ఆ రహస్యకేంద్రాన్ని ఆ అల్పత్వం, ఆ క్షుద్రత్వమే మరుగు పరుస్తున్నవి. ఆ సారాంశం ఎంత ఉదాత్తం, ఎంత మహనీయం, ఎంత అపురూపమైతే, అంత అజ్ఞాతంగా ఉంటుందని అర్థం. ఆ సారాంశాన్ని కప్పిపుచ్చడానికే ఆ అల్పత్వం, ఆ నీచత్వం పైకి కనిపిస్తున్నాయని కూడా మనం అర్థం చేసుకోవాలి. ..అక్కడ పెద్ద తాళం కప్ప వేసిఉందంటే దానర్థం ఆ లోపల దాచిందేదో చాలా విలువైందనేగా.


Vadrevu Ch Veerabhadrudu

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.