అంటరాని వసంతం

0
653

అంటరాని వసంతం
జి.కళ్యాణ రావు


ఒక కుటుంబం ఎనమిది తరాలుగా తాము ఎదుర్కున్న వివక్షతతో పోరాడిన కథే ఈ అంటరాని వసంతం.అలెక్స్ హేలీ రాసిన రూట్స్ ని గుర్తుచేస్తూ దానికంటే కూడా ఎన్నో రెట్లు కదిలించిందీ పుస్తకం.

రూబేను భార్య రూతు రచయిత్రి.వెన్నెల రాత్రుల్లో రూబేను తన ముందుతరాల గురించి చెప్పిన గాఢానుభూతివున్న అనేక విషయాలను మనసులో ముద్రించుకొని , ఆ కుటుంబాన్ని ఎంతో ఆరాధిస్తూ వారినీ వాళ్ళ ఊరినీ తన సొంతం చేసుకొని అతని జ్ఞాపకాలతో ఈ కథ చెప్తుంది.తన జ్ఞాపకం గతం కాదు దీనికి కొసమెరుపు లేదు, కొనసాగింపు మాత్రమే అంటూ పాత తరాలతో పాటు తన కొడుకు ,మనుమడి విషయాలూ చెప్తుంది.

ఎన్నెలదిన్ని మాలపల్లికి చెందిన సినసుబ్బడి కొడుకు ఎల్లడు.ఎల్లడి కొడుకు ఎర్రెంకడు.ఈ మూడు తరాలు కరణం దగ్గర వెట్టిచేసి బతికేవాళ్ళు.

ఎర్రెంకడి కొడుకుకు ఎల్లన్న అని తండ్రి పేరు పెట్టుకుని గారాబంగా పెంచుతుంది మేనత్త బూదేవి.తనకొచ్చిన ఆటపాటలన్నీ నేర్పిస్తుంది.ఎర్రగొల్లల ఆట చూస్తున్న ఎల్లన్న ను అగ్రకులస్తులు తరమడంతో ప్రాణభయంతో ఊరూ,ఏరూ దాటి పక్కూరికి చేరుతాడు.అక్కడ ఉరుముల నాట్యం చేస్తున్న నాగన్న ను చూసి తనూ అతనితో కలిసి ఆడతాడు.ఎల్లన్న లో వున్న ప్రతిభ ను గుర్తించి చేరదీస్తాడు నాగన్న.వాళ్ళ ఊరి వాడే అయిన నాగన్నది ఒక అద్భుతమైన కథ. పల్లెవాసుల్లో చైతన్యం కలిగించిన కథ.ఎల్లన్న ద్వారా ఎన్నెలదిన్నికి వచ్చిన నాగన్న ఆ ఊరితో తన అనుబంధం చెప్పి అందరి అభిమానం పొంది అక్కడే వుండిపోతాడు.ఎల్లన్నకు తనకు వచ్చిన కళ అంతా నేర్పించి పాటలెల్లడు, ఆటలెల్లడుగా తీర్చిదిద్దుతాడు.పిట్టోడి గారాల కూతురు సుభద్ర ఎల్లన్ననే పెళ్ళి చేసుకుంటానని పట్టుబట్టి చేసుకుంటుంది.సుభద్రను చుక్కల ముగ్గుకర్ర అంటూ ఎన్నో పాటలు కట్టి పాడేవాడు.తన ఊర్లో, చుట్టు పక్కల ఊర్లల్లో ప్రదర్శనలు ఇచ్చేవాడు.తన ఆటకు అగ్రవర్ణఅహంకారం అడ్డుపడడంతో తన కళనూ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఊరిని, తనను ఎంతగానో ప్రేమించే కుటుంబాన్ని కూడా విడిచి వెళ్ళిపోయి ఎన్నో ప్రాంతాలలో ఆడి పాడి బైరాగి గా పేరుపడతాడు.అతని ప్రతి పాటలో సుభద్ర పేరు ఉండేది.వలస కూలి శశిరేఖ నోటి నుండి ఆ పాట విని నచ్చి ఆమెను తన కోడలుగా చేసుకుంటుంది సుభద్ర.

ఎల్లయ్య కొడుకు శివయ్య కరువు తట్టుకోలేక శశిరేఖ తో పాటు వలస వెళ్తాడు.అక్కడ పనిచేసుకోడానికి కులం అడ్డురావడంతో బ్రతకడానికి క్రిస్టియన్ సీమోను గా మారుతాడు.

వారి కొడుకే రూబేను.ఆస్పత్రిలో బోధకుని గా వున్న అతను రూతును పెళ్ళిచేసుకుంటాడు.

వాళ్ళ పిల్లలు యిమ్మానియేలు, రోజి.యిమ్మానియేలు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి నక్సల్బరీ లో పాల్గొంటాడు.

అతని కొడుకు జెస్సీ. పేదరిక నిర్మూలనే తన కల అని జెస్సీ కూడా ఉద్యమబాట పడ్తాడు.ఎన్నెలదిన్ని ఇంటిలో మరదలు రూబీని పెళ్ళి చేసుకుంటాడు జెస్సీ. రూబీ కూడా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటుంది.ఇదీ ఎనమిది తరాల చరిత్ర.

ప్రధాన కథతో పాటు ఇంకా ఎన్నో ఉద్విగ్నమైన కథలు, జీవంవున్న సంఘటనలున్నాయిందులో. కళ కోసం ,అస్తిత్వం కోసం, పంటనీళ్ళ కోసం , మంచినీళ్ళ కోసం ,దేవాలయప్రవేశం కోసం,భూమికోసం,ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటేలెన్నో వున్నాయి.చాలా పాత్రలను ఎంతో ఉన్నతంగా ప్రేమగా తీర్చిదిద్దారు రచయిత.

ఇంత విషాధకథను కూడా ఎంతో భావుకత్వంతో,కవితాత్మకంగా చెప్పటం వలన మరింత ఉద్వేగంగా చదివిస్తుంది.

పుస్తకంలో ఆలోచింపచేసే కొన్ని వాక్యాలు :

1.అనుకుంటాం కానీ త్యాగానికి వున్నంత విలువ దేనికీ లేదు.ఎంత చిన్నవాడైనా చెయ్యొచ్చు.మనుషుల గుండెల్లో గూడుకట్టుకుని, వాళ్ళ మాటల్లో మరణం లేకుండా వుంటుంది.

2.ఎన్నెలదిన్ని మాలా మాదిగల యిళ్ళల్లో ఉట్టి మీద మీగడ లేదు. వెన్నముద్దలు లేవు. వుంటే ఎండుచాపలుంటాయి. అంతగా కాకపోతే ఎండొరిక లుంటాయి. వాటి కోసం ఏ బాలగోపాలుడు రాడు. వాడిని అంతా సుకుమారంగా నాట్యంలో కొడుతో సరిగమల్లో తిడుతో విన్నావా యశోదమ్మా అని అంటే వినేందుకు యశోదమ్మలు లేరు. ఎన్నెలదిన్ని యశోదత్త ఆ సమయాన తన బిడ్డపైన అందమైన, అతి సుకుమారమైన, రాగయుక్తమైన ఫిర్యాదు వస్తుందని ఆరుబయట ఎదురు చూస్తూ కూర్చోదు. కూరసట్లోకి యిసుకదూసరాకు కోస్తూ వుంటుంది. కాకపోతే తనది కాని పొలంలో నారు పీకుతూ వుంటుంది. ఆ పూట యింత సంకటి ముద్దకి భూమంతా వెతుకుతుంటుంది. అంతా అన్వేషణే. అంతా పోరాటమే.

3.కొత్త దారి ఎప్పుడూ బాగుండదు.నడిస్తే బాగౌతుంది.చెయ్యాల్సింది నడవడమే.ఇది వేదాంతం కాదు.బతుకు పాఠం.

4.నిజంగా పేదాళ్ళు ఎంత గొప్ప ప్రేమికులు.వాళ్ళు మనిషిని ఎందుకట్టా ప్రేమిస్తారు.అట్టా చేయడంకన్నా గొప్ప విలువ ఏది ఉంది ప్రపంచంలో.ప్రవక్తలు విలువల్ని బోధిస్తారు.పేదలు విలువలతో జీవిస్తారు.

5.శివయ్య అంటరానితనం పోగొట్టుకోడానికి ,ఆకలి తీర్చుకోడానికీ, మనుషుల వేట నుండి రక్షించుకోడానికి క్రీస్తును నమ్మాడు.విచిత్రం జాన్ పాల్ రెడ్లు, యిమ్మానియేలు శాస్త్రులు, యెహోవా చౌదర్లు పుట్టుకొచ్చారు.వాళ్ళ మెడలలో బంగారు సిలువ గొలుసులు.

6.తవ్వాల్సింది పూడ్చాల్సింది చాలా వుంది.తవ్వినా యుద్ధమే, పూడ్చినా యుద్ధమే.ఈ నేల మీద పొద్దు పొడిచి పొద్దుకూకే దాకా అంతా యుద్ధమే.


@ శృతకీర్తి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.