ఏడుండవ్ మావా..

1
560

ఓ మావ
పొద్దుననగా పోతివి
పొద్దుగుంక ముందే వస్తనంటివి
ఏడనున్నవో..ఏమో..
పెందలాడే వస్తనని పోతివి
పగలెల్లా పోయే రాతిరి కూడా
ఊరంతా సద్దుమణిగిపాయె
చుక్కలన్ని పక్కలేసి
సందమామతో గారాలు మొదలెట్టె
గుమ్మం లోనే కళ్ళు పరచి చూసినా
నీ జాడనే కానరాదయె
ఒంటిగా ఉండటం కష్టమే మావా..

మావా…అంటూ పిలుస్తా
నే చెప్పే కబుర్లన్నీ
గమ్మున ఇంటూ ముసిముసిగా
నవ్వులు రువ్వుతా ఉంటే..
ఆ వంకర తిరిగిన మీసకట్టు మాటున
తళుక్కుమనే తెల్లని పల్వరస..
అబ్బ..నా దిష్టే తగిలేట్టుంది అంటే…
పకాయించి నవ్వే నా మావ..
ఏంది మావా ఆ నవ్వు అనడిగితే..
కనుబొమలు ముడేసి
వచ్చే నవ్వుని ఆపుతా..
ఉబ్బిన ముక్కుతో ..కూసింత పసిదనం
కాసంత చిలిపిదనం కలబోసి
నన్నే చూస్తూ నవ్వే నవ్వుకి
చుక్కలు సైతం మావని చూసి
ఓలమ్మో అనవా…
ఏడనున్నాడో ఎప్పుడొస్తడో..ఏమో!

చూడు మావా..
ఆ చుక్కలతో సందమామ ఆటలు
ఎన్నెల ఎలుగులో ఎలిగిపోతావున్నాడు
చుక్కలేమో సిగ్గులమొగ్గలయ్యి మెరుస్తా ఉండె
అటూ ఇటూ పోయే మేఘాలతో
సుక్కలకి కవ్వింపు రాయబారాలు
సుక్కలు నవ్వాయని కాబోలు అలకతో
మేఘాల్లో దాక్కుని దాగుడు-మూతలు
ఎన్ని ఆటలో సెంద్రయ్యకి
ఎందరి కళ్ళో సెంద్రయ్యపై
ఓ సారి బెట్టు పోయినా
చివరికి చేరేది చుక్కల సెంతకే
సుక్కల్లో సందమామ ఎంతందంగా ఉన్నాడో
నా మావలా…ఏడుండవ్ మావా..


@తులసి.

1 COMMENT

  1. ఏడుండవ మావా…తులసి గారి కవితకు వడ్డాది పాపయ్య గారి చిత్రం బంగారానికి తావినలదినట్టుంది…..అభినందనలు

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.