అక్షరాలు దాడిచేస్తున్నాయి
మనసుతో యుద్ధం చేస్తామంటూ
భావాలన్నీ దాచేస్తోందట తమలో పొదగకుండా..
పరామర్శల బాధ పడలేకనో
విడమరచి చెప్పేవైనం కుదరకనో
మేటలవుతున్నాయట భావాలు ఎదసంద్రంలో..
సుడి తిరిగే ఙ్ఞాపకాల ఊటలు
గతానికి పయనం కట్టిస్తున్నాయేమో
బాల్యపు మధురిమలన్నీ ధారగా సాగుతున్నాయి ..
అమ్మ చేతి గోరుముద్దలు
నాన్న పెట్టిన తీపి ముద్దులు
తాటాకు పెళ్ళికూతురు బొమ్మలాటలు
స్నేహితులతో ఆడిన నాలుగు స్తంభాలాటలు
వాకిటి దొంగిలించిన చుక్కల ముగ్గులు
గొబ్బిళ్లతో మొదలయ్యే సంక్రాంతి సందళ్ళు
తెల్లవారుతూ మొదలయ్యే అట్లతద్దెలు
చెమటలెరుగని వేసవి ముచ్చట్లు
అరచేత ఎగురుతూ
గుర్రాలు, ఏనుగులయ్యే చింతపిక్కలు
గుడి అరుగులు ఆక్రమించే పులిమేకలు
గవ్వల గలగలలతో పేర్చే పచ్చీసులు
చిరిగిన జేబుల నిండుగా మోగే గోలీలు
కుండలెన్నో ఓడుచేసిన కర్రబిళ్ళాటలు……
లెక్కరాస్తూపోతుంటే తరగనంటున్నాయి
మరలిపోతానంటే కదలనీకున్నాయీ ఙ్ఞాపకాలు
వీడలేకున్నా విరామమిస్తున్నా
మరోమారుకి కూసింత దాచుకుందామని..