భూభ్రమణ కాంక్ష..!

0
393

భూభ్రమణ కాంక్ష… అసలు ఎంత అందమైన ఊహ. అసలు పర్యటింఛటం ఎంత అదృష్టం. పర్యటనల్లో ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రకృతితో అక్కడి సమాజంతో అనుసంధానించుకోవటం ఎంత బాగుంటుంది !! తన పర్యటనా దాహాన్ని కాలినడక నీళ్ళతో తీర్చుకున్న సాహసి ప్రాఫెసర్. ఆధినారాయణ. భారతదేశం నలుమూలల కలియదిరగటమే ఒక సాహసం అనుకుంటే, దాన్ని కాలినడకన సాధింఛటం నిజంగా అపురూపం. ఆ పాద యాత్రల్లో మూడింటిని కలిపి భూభ్రమణ కాంక్షగా ప్రచురింఛారు.

మొదటి పాద యాత్రం, రాహుల్ సాంకృత్యాయన్ కోసం, ఆయన జన్మదినాన వైజాగ్ లో బయల్దేరి డార్జిలింగ్ లో ఆయన సమాధి ని దర్శింఛటంతో పూర్తవుతుంది. 1800 కి.మీ దూరం, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ల మీదుగా జరిపిన ఈ పాదయాత్ర ని 40 రోజుల్లో పూర్తి చేసాడు.

రెండవ పాద యాత్ర, మొదటి దానితో పోలిస్తే చిన్నదే, కానీ నాకు అపురూపమైనది, మా జిల్లా మధ్యలో మా ఊరి పక్కన, మా పొలాలను సస్యశ్యామలం చేస్తూ , మా గుండెల గుండా ప్రవహించే గుండ్లకమ్మ ఒడ్డున సాగిన ప్రయాణం, గుండ్ల బ్రహ్మేశ్వరంలో పుట్టి, గుండాయపాలెంలో సముద్రంలో కలిసే మా గుండ్లకమ్మ, పుట్టుక నుండి , దాని సంగమం వరకు సాగిన పాద యాత్ర. నెమలిగుండం రంగనాయకస్వామి పాదాలను అభిషేకం చేస్తూ, కంభం చెరువు అలుగు గుండా ప్రవహిస్తూ , సముద్రం కేసి వెళ్తున్న అ ఏటి పక్కన పాటలా సాగిన యాత్ర. 300 కి.మీ దూరమే కావచ్చు కానీ ఆ యాత్ర తాలూకూ అయన వర్ణించిన అనుభవాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేవే.

ఇక మూడవ యాత్ర, మా ఊరి పక్కనుండే బయల్దేరి, డిల్లీ చేరుకున్న మహా యాత్ర. 70 రోజుల పాటు 2300 కి.మీ నడిచి వెళ్ళి తన చెల్లి సమాధిని చేరుకొన్న యాత్ర. మధ్యలో అంధ్రప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర,, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల నుండి సాగిన ఈ యాత్ర నిస్సందేహంగా గొప్పది, ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా పల్లెటూర్లనుండి సాగిన ఈ యాత్రలో మనం గ్రామీణభారతాన్ని దర్శించవచ్చు. ఎక్కడికి వెళ్ళినా , ఎవరో తెలియకపోయినా, ఆప్యాయంగా, ఆదరించి అన్నం పెట్టే వాళ్లకి భారతదేశం అడుగడుగున దర్శనమిస్తారు. వివిధ సంస్క్ర్తతులు, వివిధ బాషలు, వివిధ సాంప్రదాయాలు, వివిధ ఆహారపు అలవాట్లు అన్నిటినీ వివరిస్తాడు. ముఖ్యంగా సంచార జీవనం సాగించే వారి జీవన విధానాలు, ఇవన్నీ మనకళ్ళముందు చూపిస్తాడు.

ఈ పుస్తకం ఒక ట్రావెల్ గైడ్ మాత్రమే కాదు. అప్పుడప్పుడే ప్రపంచీకరణ అనే పేరు పరిచయం అవుతున్న సమయంలో ఉన్న గ్రామీణభారతాన్ని మన కళ్ళముందుంచుతుంది. డిల్లీ యాత్రలో పశ్చిమ భారతం మన కళ్ళముందుంటే, డార్జిలింగ్ యాత్రలో తూర్పు భారతం మన కళ్ళముందుటుంది. తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.

ప్రొ. ఎం. ఆదినారాయణ సార్, ఇంత మంచి బుక్ ఇచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు

ఫైనల్ గా అసలు ఆదినారాయణ గారివా కాళ్లా, డన్లప్ టైర్లా అనేది ఒకసారి గట్టిగా చూడాలి…

మొహన్ రావిపాటి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.