అమ్మకి తోడు..! – ప్రత్యేక బహుమతి పొందిన కధ

0
767

అమ్మకి తోడు


ఇదేం చోద్యమే తల్లి! అని బుగ్గలు నొక్కుకున్నారు. ఆ తరం వాళ్ళు. ఊ! ఊ! అని మూతి మూడు వంకర్లు తిప్పి సాగదీసుకొన్నారు మధ్యతరం వారు. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్? ఈజ్ షి మాడ్ అనుకొన్నారు ఈ తరం కుర్రకారు. ఇంతకీ ఇంత మంది ఒకొక్క లాగా ఆశ్చర్యపోయే పని ఏంటంటే అపర్ణ ఇంటింటికి వెళ్ళి తన అమ్మకి పెళ్లని, నిరాడంబరంగా పెళ్లి చేస్తున్నాం కానీ రిసెప్షన్ ఒక స్టార్ హోటల్ లో గ్రాండ్ గా చెయ్యదలచాం కాబట్టి అందరూ తప్పకుండా రావాలని పిలవడం, ఇన్విటేషన్ కార్డులు పంచడం, ఇదేదో వింతగా ఉంది కదూ! అవును, అమ్మకి మళ్ళీ పెళ్లి , నాన్న పోయాక కుమిలిపోతూ జీవచ్ఛవంలా అయిన అమ్మని కొద్దో గొప్పో శివం అంకుల్ పరిచయం కొద్దిగా మనుషుల్లో పడేసింది. ఇంచు మించు అలాంటి పరిస్థితులలోనే వున్న వాళ్ళిద్దరిని చూసి మనస్సులో మేదిలిన భావం మొగ్గలోనే తుంచెయ్యలేకపోయింది.

వాళ్ళిద్దరిని ఒప్పించే సరికి తలప్రాణం తోకకి వచ్చింది అపర్ణకి. నిజమే! ఇలాంటి పరిస్థితి ఏ పిల్లలకి రాకూడదు. కానీ తన తల్లిని ఆ స్థితిలో చూసేసరికి తట్టుకోలేకపోయింది అపర్ణ. ఎలా ఉండేది సుమతి? కల కలా, గల గలా కదిలి వచ్చిన కృష్ణ వేణిలా తను ఎక్కడుంటే అక్కడ వరద వచ్చిన గోదావరిలా తన చుట్టూ ఉన్న వాళ్లందరిని సుఖ సంతోషాలని పంచే కృష్ణలా అన్నీ తనలోనే ఇముడుచ్కునే నిండు నదిలా ఉండేది. అటువంటి అమ్మ ఒక్కసారిగా నాన్న పోగానే మూగబోయింది. మాట పలుకు లేకుండా, తిండి నీరు మానేసి, అసలు బతుకుతుందా అని భయం వేసింది.  అనుకోకుండా ప్రక్కింట్లో శివం అంకుల్ దిగారు. రిటయిర్ద్ బ్యాంక్ ఆఫీసర్, పిల్లరిద్దరూ విదేశాలలో స్థిరపడ్డారు. భార్య పోయి ఐదేళ్ళయిందట. పుస్తకాలంటే పిచ్చి .. రోజూ ఏదో ఒక పుస్తకం చదువుతూ కనిపించేవారు.

ఒక రోజు అనుకోకుండా వాళ్ళింటిలో కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యి చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. ఆయనని రోజూ తన ఆఫీసుకి  వెళ్ళుతున్నప్పుడు, వచ్చేటప్పుడు చూస్తుంటుంది.  చాలా మంచి, మర్యాద ఉన్న మనిషి అనే ధైర్యంతో అన్నీ సర్దుకునేంత వరకు తమ ఇంట్లో భోంచేయమని ఆహ్వానించింది. అతి కష్టం మీద ఒప్పుకొన్నారు. వచ్చిన రోజు చాలా సరదాగా కలుపుగోలుగా మాట్లాడాడు. మంచి హ్యూమర్ ఉన్న వ్యక్తి. అమ్మ సంగతి  తెలుసుకొన్నారు. ఒక రకంగా కాస్త చనువు పెరిగాక తనే రిక్వస్టు చేసింది, అమ్మని మామూలు మనిషిని చేయటంలో సహాయం చెయ్యమని. ఆ రోజు నుండి అమ్మకి కూడా పుస్తకాలంటే ప్రాణం అని తెలుసు కొని, విశ్వనాధ సత్యనారాయణ గారివి, అడవి బాపిరాజు,  శరత్ చంద్ర, గోపి చంద్ ఇలా ప్రముఖుల పుస్తకాలు. రోజుకొకటి సాయంత్రం తను ఇంటికి వచ్చాక వచ్చి, కావాలని తనతో మాట్లాడుతున్నట్టు ఏదో ఒక పుస్తకం గురించి, ఆ పాత్రల  గురించి మాట్లాడేవారు. మొదట్లో చాలా నీరాసక్తంగా వింటున్నట్టు పున్న అమ్మ తనకి తెలియకుండానే ఆ  సంభాషణ వైపు ఆసక్తి చూపేది సహజంగా పుస్తకాలంటే ఇష్టం కనుక. రోజు రోజుకి అతని రాకకై తానే ఎక్కువ ఎదురు చూడటం మొదలు పెట్టింది.  సాయంత్రం తను వచ్చి కాఫీ తాగుతున్నా.. ఆయన ఇంకా రాకపోతే అటు ఇటు 10 సార్లు గుమ్మం వైపు చూడటం, ఇవన్నీ గమనించి అమ్మ దారిలోకి వస్తుంది అనుకుంది అపర్ణ. మొదటి సారి ఏం అడగలేదు కానీ ఇక ఉండబట్టలేక మూడవ రోజు అడిగేసింది. ఒక్క దానివే తాగుతున్నావేం కాఫీ? అని. ఏం నువ్వు తాగుతావా? రోజూ నేను వచ్చేసరికి నువ్వు తాగేస్తావుగా, ఇంకెవరున్నారు నాతో కలసి తాగడానికి? అంది అపర్ణ. ఏం ఎరగనట్టు.. ఒక్కసారి అపర్ణ వైపు చూసి మొహం తిప్పుకుంది సుమతి. పోనిలే అంత మాత్రం అయినా అడిగింది. ఇంకా లాగితే బాగుండదని శివం అంకుల్ గురించా? ఆయనకి ఒంట్లో బాగోలేదట, జ్వరం అందుకే రావటం లేదు. అంది అపర్ణ. అయ్యో! జ్వరమా? ఎలా ఉంది?  నువ్వు వెళ్ళి చూశావా? ఆతృతగా అడిగింది సుమతి. “ఆ” ఇందాకే వెళ్ళి పలకరించాను. ఇవ్వాళ కొంచం నయం అన్నారు.. అంది అపర్ణ. ఇంకేదో అడగబోయి తమాయించుకొని లోపలికి వెళ్లిపోయింది సుమతి. కానీ ఆమే మొహంలో ఆందోళన ప్రస్పుటంగా కనిపించి .. అమ్మ మారుతోంది అని మళ్ళీ ఇంకోసారి అనుకొంది అపర్ణ.  రెండు రోజుల తర్వాత శివం అంకుల్ చేతిలో ఒక కొత్త పుస్తకంతో వచ్చారు. ఒక్కసారిగా సంతోషంతో వెలిగింది సుమతి మొహం. గబుక్కున బయటికి వచ్చి “ ఎలా ఉంది ఇప్పుడు మీకు” అని అడిగింది ఆత్రుతగా … వింతగా చూశాడు  శివం. అతనితో ఆమె మాట్లాడటం ఇంచుమించు అదే మొదటిసారి. అతనిలో ఆశ్చర్యం చూశాక ఆమెకి తన తప్పు తెలిసి .. కప్పిపుచ్చుకొంటూ  “ అపర్ణ చెప్పింది” అని లోపలికి వెళ్లిపోయింది. ఇప్పుడు బానే ఉందండి అని అన్నారు. అపర్ణ రాలేదా? అని అడిగారు శివం. “ లేదు, ఇవ్వాళ ఆలస్యం అవుతుందని చెప్పింది” అంది సుమతి. ఏం చెయ్యాలో తోచలేదు శివంకి.. వెళ్ళాలా? ఉండాలా?  అమెకి అర్ధంకాలేదు ఉండాలా? వద్దా? .. ఇద్దరూ ఒకటేసారి” అయితే వెళ్తానండి” అని అతను కూర్చోండి  అన్నారు శివం..ఫర్వాలేదు అని సుమతి అన్నారు. అపర్ణ వచ్చాక వస్తాను అన్నారు శివం. పర్వాలేదు కూర్చోండి ఏదో క్రొత్త పుస్తకం తెచ్చినట్టున్నారు అని అంది సుమతి అతని చేతిలో పుస్తకం వంక ఆసక్తిగా చూస్తూ. ఇది రావూరి భరద్వాజగారి “పాకుడు రాళ్ళు”  అన్నారు శివం. “అరే ఎన్నాళ్ల నుంచో దీనిని చదవాలని అనుకొన్నాను కుదరనే లేదు” అంది సుమతి  అయితే తీసుకొని చదవండి మీరు చదివాక దాని గురించి మాట్లాడుకొందాం అన్నారు శివం. కూర్చోండి  కాఫీ తాగి వెలుదురుగాని అని లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చింది.

ఆనాటి నుంచి వారి పరిచయం మలుపు తిరిగింది. అనేక పుస్తకాల మీద, సాహిత్యం మీద, మంచి మంచి క్లాసిక్ అనబడే తెలుగు, హిందీ సినిమా మీద చర్చించుకునేవారు. కొన్నాళ్ళకి అపర్ణ వాళ్ళ సంభాషణలో జోక్యం చేసుకోవడం మానేసింది. ఇద్దరూ ఒక విషయం మీద మాట్లాడటం మొదలు పెడితే అంతెక్కడో తెలిసేది కాదు. వాళ్ళని వదిలేసి తనకి కావలసిన పుస్తకం చదవటం, సినిమా చూడటమో చేసేది. వాళ్ళూ అపర్ణని పట్టించుపోవడం మానేశారు. తను అక్కడ ఉందనే ధ్యాస కూడా ఉండేది కాదు వాళ్ళకి … ఇలా ఇంచు మించు ఒక ఏడాది గడిచిపోయింది.

అపర్ణ వాళ్ళకి పెళ్లి చేయాలన్న ఆలోచన రావడానికి కారణం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న తన కొలీగ్ సుధాకర్. ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలసి పెరిగారు. అనుకోకుండా ఒకటే ఆఫీసులో పనిచేస్తున్నారు. సుధాకర్ అపర్ణని “అప్పూ” అని పిలుస్తాడు.  అప్పూ! ఒక్కసారి లంచ్ టైమ్ లో కలుస్తావా? అన్నాడు. ఎప్పుడూ అలా అడగలేదని ఆశ్చర్యపోతూ ఎందుకు? అంది అపర్ణ. నీతో కొంచం మాట్లాడాలి అన్నాడు. ఏమై ఉంటుందా అనుకొంటూ …ఆతృతగా అతని వైపు చూస్తూ చెప్పు! అంది.  ప్లేట్లో ఉన్న దోసె వంక చూస్తూ కొంచం తటపటాయించాడు ఎలా చెప్పాలా అని! ఫర్వాలేదు చెప్పు! ఏమైయింది? అంది. మళ్ళీ  “ మరి నువ్వేం అనుకోకూడదు” నేను ఇలా చెప్పానని.. తప్పుగా అనుకోకూడదు, నా మీద కోపం తెచ్చుకోకూడదు అంటూ తన షరతులు చెప్పాడు. అబ్బా! చంపకుచెప్పు సుధాకర్ అంది విసుగ్గా అపర్ణ. మరేంలేదు , మీ శివం గారు రోజూ మీ ఇంటికి వస్తుంటారని మీ అమ్మ  అతను చనువుగా…… అపర్ణ వైపు చూసి మాట పూర్తి చెయ్యలేకపోయాడు. నిప్పులు కక్కుతూ “ అయితే ఏంటంటా? అదే ప్రక్కింటి అంటి రోజూ వచ్చి ఉంటే ఇలా మాట్లాడే వాడివా నువ్వు? అంది. నేను అనటం కాదు అప్పూ అమ్మ చెప్పింది మన కాలనీ వాళ్ళు అనుకుంటున్నారని అన్నాడు. “ వాళ్ళు ఏ గంగలో దూకితే నాకేంటి? అనుకొనీ  “ఐ  డోంట్ కేర్” కోపంగా అంది. కరక్టే కానీ ఇంకోసారి ఆలోచించు. ఈ వయస్సులో ఆవిడకి ఇలాంటివి అవసరమా అన్నాడు సుధాకర్. అంటే నీ ఉద్దేశ్యం? మళ్ళీ కోపంగా అంది. నేను తప్పుగా అనడం లేదు. నన్ను అపార్ధం చేసుకోకు. ఈ వయస్సులో ఆవిడ ఇలాంటి మాటలు పడటం అవసరమా అని. నీవైపే మాట్లాడుతున్నాను, కానీ మన సమాజం ఎప్పుడూ మనిషిలో తప్పులు వెదికే ప్రయత్నం చేస్తుంది. నువ్వు సమాజాన్ని కాదని పారిపోలేవు కదా .. అనునయిస్తూ అన్నాడు. నిజమేమో! అన్న ఆలోచన్లో పడింది. అపర్ణ ఆ రోజంతా  అన్యమనస్కంగానే ఉంది. వారం రోజులకి అనుకోకుండా కంటబడిన ఒక వార్త ఆమె ఆలోచనలకి ఓ పరిష్కారం చూపింది. ఇక్కడ వృద్ధుల పెళ్లిళ్లు చేయబడును. ఇలా కారణాంతరాలవల్ల ఒంటరై, బతుకుతున్న పెద్దవారికి తోడూ నీడా కల్పించే సంస్థ అది. నిజమే తను కూడా ఆ ప్రయత్నం ఎందుకు చేయకూడదు? అనుకుంది.

ఈ మాట అపర్ణ నోట వినగానే నిశ్చేష్టురాలై చూస్తువుండిపోయింది సుమతి. కళ్ల క్రింద భూమి కొంపించినట్లైంది. “ ఏంటి? మతి ఉండే మాట్లాడుతున్నవ? నువ్వేమంటున్నావో అర్ధం అవుతుందా? కోపంగా అంది సుమతి. మతి పోవడానికి ఏముందమ్మా? నేను పై చదువులకి విదేశాలకు వెళ్దామని ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తున్నాను. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లలేక , మానలేక ,, నాలో నేనే సతమతమవుతున్నాను. నేను ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుకి విదేశాల్లో మంచి ప్రోత్సాహం ఉంది. కానీ నిన్ను ఒంటరిగా ఎలా వదిలి వెళ్లగలను? నేను వెళ్లిపోతే నిన్ను చూడటానికి ఎవరున్నారు? శివం అంకుల్ ని  ఏడాది నించి చూస్తున్నాం .. అతనికి ఎవ్వరూ లేరు, ఉన్నవాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారు. వాళ్ళకి ఈయన అక్కరలేదు. ఒంటరి జీవితం గడుపుతున్నారు. మీఇద్దరి అభిరుచులు , అభిప్రాయాలూ చాలా వరకు కలుస్తాయి. ఓ రకంగా ఈ ఆ ఏడాదంతా నువ్వు అమెరికాలో లాగా డేటింగ్ చేసావనుకుందాం. నవ్వుతూ అంది అపర్ణ. వాతావరణాన్ని తేలికపరచడానికి ట్రై చేస్తూ..నీమొహం! చదవేస్తే ఉన్న మతి పోయిందట. నాకు మళ్ళీ పెళ్ళేంటి? అదీ ఈ వయస్సులో? మన వాళ్ళలో తలెత్తుకు తిరగగలమా? కూతురికి పెళ్లి చెయ్యవలిసిన వయస్సులో తల్లికి పెళ్ళా? నలుగురిలో నవ్వుల పాలవమా? ముందు ఈ సంగతి తెలిసి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఇవన్నీ ఆలోచించావా అసలు ? అంది సుమతి.

అమ్మా! అవన్నీ ఆలోచించాను. ఇంతకీ నలుగురి మాటకొస్తే ఎన్నాళ్లు చెప్పుకొంటారు? ఒక నాలుగు రోజులు అనుకొంటారు. అనుకొనీ మనకేం జరుగుతుంది. ఇంకో కొత్త సంగతి రాగానే ఇది మరచిపోతారు.  నువ్వు సుఖంగా, సంతోషంగా ఉండటం మనకి కావాలి. ఇక నా పెళ్లి సంగతి , నా ప్రాజెక్టు అయిన తర్వాత మాట. ఇలా అర్ధం చేసుకునే వాడు దొర్కక్కపోడు. అలాంటి వాడు దొరికినప్పుడే చేసుకొంటాను. అయినా నీ కెప్పటినుంచో చెబ్దామానుకొంటున్నాను. మన కమలత్త కొడుకు వినయ్ నన్ను ఇష్టపడుతున్నట్టు… నా అంగీకారం తెలుపమని అడిగాడు. ఈ సంగతి అతనితో చెప్పాను. తనకేం అభ్యంతరం లేదన్నాడు. నాకూ పెద్ద అభ్యంతరం లేదు. నాకూ అన్ని విధాలా నచ్చినవాడు. నన్ను మెచ్చినవాడు. అమెరికాలోనే ఉన్నాడు కనుక నేను ప్రాజెక్టు కోసం వెళ్ళినా మాకు ప్రోబ్లమ్ ఉండదు. ఇక నా పెళ్ళి ముందా? మీ పెళ్లి ముందా?  అన్నది నువ్వు చెప్పు నవ్వుతూ.. అంది అపర్ణ. ఏంటి ? నీకు అన్నీ వేళాకోళంగా ఉన్నాయి? ఇది జీవితాలతో చెలగాటం, హాస్యంగా తీసుకోకు ఇప్పుడు మనం నవ్విన నలుగురిలో మనం నవ్వుల పాలు కాకూడదు. అంది సుమతి. మళ్ళీ అమ్మా! అదేం వర్రీ అవ్వకు నువ్వు, నేనున్నాను. నీకు ఇష్టం అని ఒక్కమాట చెప్పు చాలు అంది అపర్ణ. ఏం మాట్లాడలేక లోపలికి వెళ్లిపోయింది సుమతి. నిజమే! ఇలాంటివి వెంటనే జవాబు చెప్పటం కష్టం. అమ్మకి కొంత సామ్యం ఇవ్వాలి ఆలోచించుకోడానికి అనుకొంది. ఒక వారం రోజులు తప్పించుకు తిరిగింది సుమతి.

ఈ పని చేస్తున్న ఇదే ఆలోచన, ఇది వరకు లాగా శివంతో చనువుగా మసలలేకపోయేది. అతనికి అర్ధం కాలేదు ఎందుకిలా చేస్తోందో? విషయం అర్ధం చేసుకోలేకపోతున్నాడు. కరక్టే ! ఎంత తప్పు చేశాను అనుకొంటూ.. అమ్మ అభిప్రాయమే కాదు, అతని అభిప్రాయం కూడా కనుక్కోవాలని ఆ సాయంత్రం అతని ఫోన్ కి మెసేజ్ చేసింది. ఒక్కసారి దగ్గర్లో ఉన్న గుడిలో కలుద్దామని .. ఈ విషయం అర్ధం కాలేదు శివంకి. ఏమైయింది? ఎందుకు? లాంటి ప్రశ్నలు తలెత్తాయి. అంతలో సరే! సాయంత్రం వస్తుందిగా.. తెలుస్తుంది అంకొన్నాడు. చెప్పిన టైమ్ కంటే గంట ముందే వచ్చి ఆదుర్ధాగా అటూ ఇటూ పచార్లు మొదలుపెట్టాడు. పది సార్లు టైమ్ చూసుకొన్నాడు. ఎలాగైతేనేం అన్న టైమ్ కి వచ్చింది అపర్ణ.  ఏంటి అప్పూ? ఏమైయింది? ఎందుకు రమ్మన్నావు? అమ్మ ఎందుకు ముభావంగా ఉంటుంది? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? అని ప్రశ్నల వర్షం జురిపించాడు. ఒక్క నిమషం ఆగండి సార్.. నేను దండం పెట్టుకొని వస్తాను అంది అపర్ణ. “ అయ్యో! నిజమే! తను కూడా ఈ ఆందోళనలో గుడి లోపలికి వెళ్లలేదు. అనుకొని పద నేనూ వస్తాను అన్నాడు. ఇద్దరూ అర్చన చేయించి బయటకి వచ్చి అరుగు మీద కూర్చున్నాక “ ఇక సస్పెన్స్ ఆపి చెప్పు తల్లి అన్నాడు.  ఏం లేదంకుల్, మీకు అమ్మకి పెళ్లి చేయాలని నా ఉద్దేశ్యం అంది డైరెక్టుగా విషయం లోనికి వస్తూ.. ఏంటి? ప్రక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కి పడి .. ఆశ్చర్యపోతూ మళ్ళీ చెప్పు ! అన్నారు.అవునంకుల్, మీరు కూడా ఒప్పుకొంటే అమ్మకి, మీకు పెళ్లి చెయ్యాలని… అంది. ఇంత సడన్ గా అడిగితే ఎలా? సుమతికి చెప్పావా? ఊ! క్రిందటి వారం అడిగాను అంది. ఓహో! ఆదా సంగతి! తనను అందుకని తప్పించుకొని తిరుగుతోందా? తనకి కూడా ఈ గూడుపుఠాణిలో భాగం ఉందనుకొని.. ఏమంది మరి తను? కుతూహలంగా అడిగాడు.  ఇంకా ఏం చెప్పలేదు. తనకి ఆలోచించుకోవడానికి టైమ్ ఇవ్వాలిగా అంటూ … మరి మీరు…. అంది. తనకే గాని, నాకు ఆలోచించుకోవడానికి టైమ్ ఇవ్వవా? నేను ఇప్పుడు అర్జెంటుగా పెళ్లి చేసుకోవడానికి రెడీగా కూర్చున్న పెళ్లికొడుకుగా కనబడుతున్నానా? అయినా నన్ను అడగకుండా అన్నీ నువ్వే డిసైడ్ చేసేస్తున్నావా? కొంత కోపంతోనూ, కొంత చిన్న బుచ్చుకొంటూ అన్నాడు. సారి అంకుల్! అదేం లేదు, నాది తప్పే నిజమే! మీకు ముందు చెప్పాలి కానీ ఒక రకంగా కొంచం భయపడ్డాను, మొహమాటపడ్డాను. కాదంటే ఎలా అని ఆందోళన చెదాను. అసలు అమ్మ ఒప్పుకుంటుందన్న నమ్మకం లేదు. తనని ఒప్పించి అప్పుడు మీకు చెబుదామని.. నసుగుతూ చెప్పింది. మీ అమ్మ అంగీకారమే గాని, నా ఇష్టాయిష్టాలతో పనిలేదా? కొంచం కోపంగా అడిగాడు. ప్లీజ్ అంకుల్! కోపం తెచ్చుకోకండి, ఇలాంటి సిచ్యుయేషన్ ఎవరికీ రాకూడదు. నాకేం తోచలేదు. మరోసారి క్షమించమని అడుగుతున్నాను, ముందు చెప్పనందుకు. నాకు అమ్మని, మిమ్ముల్ని చూశాక ఈ ఆలోచన వచ్చింది. ఇద్దరూ ఒంటరిగా ఉన్నారు, చాలా వరకూ అన్నీ అభిప్రాయాలూ కలసి పంచుకుటున్నారు, ఎందుకు ఒకటవ కూడదు అని అంది. ఏం ఇలా ఉంటే తప్పా? లోకానికి భయపడుతున్నావా? అన్నాడు. లోకానికి కాదు, రేపు నేను ఏ కారణం చేతనైనా అమ్మని సరిగా చూసుకోకపోతే తను ఒంటరితనంతో బాధ పడకూడదు. తన కష్టం, సుఖం పంచుకోవడానికి చివరి వరకూ తనకి ఒక తోడూ నీడ ఉంటే నేను నా జీవన ప్రయాణంలో నిశ్చితంగా ఉండగలను. నేను ప్రాజెక్టు నిమిత్తం విదేశాలకి వెళ్లవలసి ఉంటుంది,  కానీ అమ్మని ఇలా ఒంటరిగా వదిలి వెళ్లలేను. ఒక రకంగా నా స్వార్ధం కూడా ఉందనుకోండి. కానీ ఒక్క సందేహం, మీ పిల్లలు ఒప్పుకుంటారా? సందేహంగా అంది. అదేం పర్వాలేదు. వాళ్ళు వాళ్ళ జీవితాలలో స్థిరపడి ఎన్నో ఏళ్ళగా విదేశాల్లో స్థిరపడిపోయారు. నాన్న, అక్కడ ఒక్కడివి ఏం చేస్తావు? వచ్చేయి అని మటవరసకి అప్పుడప్పుడు అంటుటారు, కానీ అది నాలిక చివర నుంచి వచ్చిన మాటని నాకు తెలుసు. వాళ్ళు నన్ను పట్టించుకోరు. నేను కొన్నాళ్ళు బాధ పడ్డాను, కానీ ఇది ఇంతే అని నాకు నేనే రాజీ పడడం మొదలు పెట్టాను. దేవుడి దయవలన నా ఆర్ధిక పరిస్థితికి లోటులేదు. వాళ్ళ మీద ఆధారపడవల్సిన అవసరం లేదు. కానీ నువ్వు చెప్పిన, మనం అనుకొన్నంత సులువు కాదు. తర్వాత మనం ముగ్గురం సమాజాన్ని, సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి అన్నాడు శివం. అవి ఫరవాలేదు అంకుల్ మీ చేయూత ఉంటే చాలు అంది అపర్ణ.

వారం తరువాత తానే నిలదీసి అడిగింది అపర్ణ అమ్మా! ఏం నిర్ణయించుకొన్నావు? ..ఏంటి? నీ మొండి పట్టుదల? త్రీవ్రంగా, కోపంగా, విసుగ్గా అడిగింది సుమతి. అమ్మా! నువ్వు నిజంగా నన్ను ప్రేమోచేటట్టయితే నా మంచి కోరేదానివైతే ఈ పెళ్ళికి ఒప్పుకో, నా ఫ్యూచర్ , నా ఎదుగుదల నీ ఈ అభిప్రాయం మీద ఆధారపడి ఉంది. ఏం మాట్లాడలేక పోయింది సుమతి. మొత్తానికి అలిగి బతిమాలి, నిరాహార దీక్ష చేసి, కోప్పడి , అన్ని విధాలా ప్రయత్నం చేసి ఒక్క నెలరోజులకి ఒప్పించగలిగింది. ఆ తర్వాత తన సంతోషానికి హద్దులు లేవు, కానీ నిజంగా అమ్మ సుఖంగా ఉండడటమే తనకి కావాలి అనుకొంటూ నిట్టూర్చింది.

ఇద్దరూ పెళ్లి చాలా నిరాదబరంగా జరగాలని పట్టుబట్టడంతో సరేనని రిజిస్ట్రార్ ఆఫీసులో జరిపించింది. కానీ ఇవ్వాళ కాకపోయినా రేపైనా అందరికీ ఈ నిజం తెలుస్తుంది, మనమే గర్వంగా చెప్పుకుందాం, వాళ్ళ గుస గుసలకి తావివ్వకుండా ఇద్దరినీ ఒప్పించి రిసెప్షన్ ఒక స్టార్ హోటల్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేసి అందరినీ పిలిచింది. ప్రేమతో, అభిమానంతో వచ్చిన వాళ్ళకంటే కుతూహలంతో వచ్చిన వారు ఎక్కువ. వాళ్లందరి ముందు సుమతి, శివంతో కేక్ కట్ చేయించి మైక్ తీసుకొని” డియర్ ఫ్రెండ్స్ ఈ పెళ్లి మీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిందని నాకు తెలుసు, అమ్మ, నాన్న ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్లు, ఒకర్ణతే ఒకరికి ఎంత ఇష్టం అన్నది మనందరికి తెలుసు, ఆదర్శదంపతులుగా పేరు పొందారు వాళ్ళు, అలాంటి నాన్న పోగానే అమ్మ మోడుబారిన చెట్టు అయింది. తను కూడా కృంగి కృశించి నాకు దక్కకుండా పోతుందా అని భయం వేసింది ఎంత ప్రయత్నించినా మనిషిని చేయడానికి నేను చేసిన ప్రయత్నలేవీ ఫలించలేదు. అటువంటి సమయంలో శివం గారు రావడం  మా జీవితాలలో కొన్ని మార్పులు, ముఖ్యంగా అమ్మలో చిన్న మార్పు రావటం కనిపించింది. అమ్మ  ఆయన్ని ప్రేమించిందని మీరంతాల అపోహ పడకండి. ఆయనలోని సాహిత్యాన్ని, విజ్ఞానాన్ని ప్రేమించింది. వారు ఒకరికొకరు సరైనజోడీ అనిపించింది అప్పుడే బి బి సి న్యూస్ లో ఒక వార్త .. ఇచ్చట వృద్ధులకి పెళ్లిళ్లు చేయబడును అని , పెళ్లి అనేది కేవలం ఒక వయస్సు ముచ్చట కాదు. తోడు ఎవరికైనా అవసరమే. ఒంటరి తనాన్ని భరించలేని వృద్దులు జీవిత చరమాంకంలోను తోడును కోరుకొంటున్నారు. తోడు నీడ ఆ సంస్థ పేరు. ఒంటరితనం, వేదన శారీరిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. గణాంకాల ప్రకారం భారతదేశంలో వృద్దులు సంఖ్య 10.38 కోట్లని, అందులో 14% మాత్రమే తమ జీవిత భాగస్వామితో జీవిస్తున్నారని, నగరాలలో 15.10%, పట్టణాలలో 12.40% వృద్దులు ఇతరులపై ఆధారపడుతున్నారని, మన తెలుగు రాష్ట్రాలలోనే 20% వృద్దులు ఉన్నారని ఆ సంస్థ తెలిపింది. ఆస్తి కోసం కాదని, తమతోడుకోసమేనాని పిల్లలు అర్ధం చేసుకొంటే వృద్దాప్య వివాహాలు పెరుగుతాయని ఆ సంస్థ అధ్యక్షురాలు అభిప్రాయపడింది.

మీరు కూడా ఆలోచించండి. ఇలాంటివి జరిగినప్పుడు ఆడవాళ్ళు కొడుకు, కూతురు దగ్గర గాని ఉంటూ  ఓపిక ఉన్నా లేకపోయినా వారికి అన్నీ పనులు చేసి పెడ్తూ మనస్సులో వారికి భారమై ఉంటున్నామన్న భావనతో, అదే మగవారైతే కోడలిని లేదా కూతుర్ని మరోసారి కాఫీ అడగలన్నా సంకోచపడుతూ… ఇలా ఉంటాయి వారి జీవితాలు. అమ్మ తరువాత అంతటి స్థానం ఆక్రమించేది భార్య, తన దగ్గర ఉన్న చనువు ఇంకెవ్వరి దగ్గర ఉంటుంది? కాటికి కాళ్ళు చాపుకున్న వాళ్ళందరూ కూడా ఇదే పద్దతి అవలభించాలని నేను చెప్పటం లేదు. పరిస్థితులుఅనుకూలిస్తే ఇది తప్పు కాదంటాను. అని మా శ్రేయోభిలాషులుగా మీ అందరి దీవెనలు, అశ్వీర్వచనాలు మా కుటుంబానికి కావాలి అంది అపర్ణ. అందరూ ఒక్కసారిగా హర్షాతి ధ్వనులు చేశారు.

మళ్ళీ పసుపు కుంకుమల్తో, అందంగా మెరుస్తున్న తల్లిని, ఆమె వైపు ప్రేమగా చూస్తున్న శివాన్ని చూసి ఆనందంగా , సంతోషంగా అమ్మకి ఒక తోడు దొరికింది. దీంతో అపర్ణ తన అనుకొన్నరీతిలో జీవన ప్రయాణం అనుకొంది తృప్తిగా అపర్ణ.


షబ్నవీష్ ఇందిరా రావు

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.