అపరాజిత – ప్రత్యేక బహుమతి పొందిన కధ

0
555

అపరాజిత


”ప్రియమైన మానసా !

ఇంచుమించు రెండు దశాబ్దాలు దగ్గర అవుతోంది మనం కలిసి. నిన్న  సింగపూర్  ఎయిర్  పోర్ట్ లో నిన్ను చూసినపుడు కలయో ,వైష్ణవ మాయయో కాదుకదా ! అన్న భ్రమకి లోనయ్యాను. కొన్ని క్షణాలే నీతో గడిపినా,చెక్కుచెదరని నీ స్నేహాభిమానం నాకు ఏనుగంత బలమిచ్చింది.

అవును మానసా ! ఒక చల్లని ఆప్యాయమైన పలకరింపు, స్నేహపూర్వక ఆలింగనం, మండుటెండలో ఎడారిలో సాగిపోయే బాటసారికి ఒయాసిస్సు లాటివి. ఇది పైత్యంకాదే..నిజం . ( చిన్నపుడు నేను కవితలు రాసి నీకు బలవంతంగా విన్పిస్తుంటే,నీకు పైత్యం ప్రకోపించిందే తల్లీ ! నన్ను వదిలి పెట్టు అనేదానివి కదూ…అది గుర్తొచ్చి నవ్వోచ్చిందిలే)

ఆ రోజులు ఎంత బాగుండేవి.చింతలు,వంతలు,బాధలు ,బరువులు ఏవీ లేకుండా. కిల కిలా నవ్వుతూ,గలగలా మాటాడేస్తూ, తుళ్ళింతలాడే సెలయేరులా సాగిపోయేది  జీవితం  . ఎప్పుడు ఒకేలా వుంటే అది జీవితం ఎందుకవుతుంది?.అందరు నీలాటి అదృష్టజాతకులు కాలేరు కదా ! నా లాటి శాపగ్రస్తులు కూడా వుంటారు .అటువంటివారి జీవితాలు అస్తవ్యస్తంగానే తయారవుతాయి. .

సరే ,నా గురించి వివరాలు అడిగావు. నీకు కాకపొతే ఇంకెవరికి చెప్పుకోగలను నా మనసులో మాట. నిజానికి శరీరాలు వేరుకాని మనసోకటిగా మసలేము మనిద్దరం .నువ్వు నా మానసవే కాదు మానసానివి, స్నేహ బంధము అంత మధురం కదా మరి . ఆ రోజుల్లో బలవంతంగా నా కవితలు వినిపించి నిన్ను విసిగించేదాన్ని.ఇప్పుడు పదేపదే విషయాలన్నీ వివరంగా వ్రాయి అంటూ పది నిముషాల కలయికలో వందసార్లు అడిగావు.అందుకే దశాబ్దాలు నాలో లావాలా రగిలి పొంగి పొరలి కరడు కట్టిన ఆవేదనని అక్షరీకరిస్తూ నీకు పంపిస్తున్నాను.

మనం చదువుకొనే రోజుల్లో ఆడది అంటే అబలకాదు, ఆదిపరాశక్తి. మగవాడి దాష్టికానికితలవంచకూడదు.. సమానహక్కులకోసంపోరాడాలిఅని నేను ఉపన్యాసాలు దంచితే, నిన్నెవడు చేసుకుంటాడో కానీ ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళుతాగిస్తావు అనేదానివి .నా పెళ్ళయ్యాక ఆ మాటలు గుర్తోచ్చినపుడేల్లా వైరాగ్య పూరితమైన నవ్వు పెదవులని ఆశ్రయించేది.. నాపెళ్ళి తర్వాత మనం కలిసింది ఒకే ఒక్కసారి ,మా నాన్నగారు పోయినపుడు మా వూరిలో అనుకోకుండా కలిసాము. .నన్ను చూస్తూనే నీరయిపోతు,ఇదేమిటే ఇలా అయిపోయావు? సుస్తీ చేసిందా ! అని నువ్వదిగినప్పుడే నిన్ను వాటేసుకొని భోరుమనిఏడవాలనిపించింది,అలా చేస్తే నేను నీ నీలూ నే కాదు.

నా జీవితం  నా చుట్టూ పరిస్థితులనే పద్మ వ్యూహం పన్ని సవాలు విసిరింది నువ్వు అభిమాన్యుడవి అవుతావా! అర్జునుడివవుతావా ? అని.పద్మవ్యుహాన్ని చేదించి బయట పడి అర్జునుడినే అవుదామనుకున్నాను . అర్ధమయ్యేలా వివరంగాచెప్పాలంటే నా ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళాలి ,అంటే పెళ్లి నాటినుండి అన్నమాట.

నాపెళ్ళికి నువ్వొచ్చావుకదూ! పెళ్ళికొడుకుని చూసి నాకన్నా నువ్వే ఎక్కువ మురిసిపోయావు.అందగాడు ,పెద్ద ఉద్యోగం ,ఆస్తిపాస్తులు,ఓహ్ ,నా జీవితమే పూలతేరు ఏవేవో ఊహించేసుకున్నావు,నువ్వేకాదు పెళ్ళికొచ్చిన అందరు అలాగే అనుకున్నారు,నేనూ అలాగే పగటికలలు కన్నాను.ఆడపిల్లపెళ్లి సంభందాలు వెతకడానికే చెప్పులజతలు అరుగుతాయంటారు మా లాటి మధ్యతరగతి మిధ్యా బతుకులకు.కానీ మొదటిసారి ,ఎవరో మధ్యవర్తుల ద్వారా నా గురించి విని ,తమకి తాముగా వెతుక్కుంటు వచ్చి,తొలిచూపులోనే పిల్లనచ్చిందని, కట్నకానుకలు అక్కరలేదని,పెళ్లి సింపుల్ గా చేసెయ్యమని, లాంచానాల పేరిట ఆడపెళ్ళివారిని ఇబ్బంది పెట్టడం తమకి ఇష్టం లేదని చెప్తూ,ఆ రోజే నిశ్చయ తాంబూలాలు పుచ్చుకొన్నారు .మా అత్తగారు తనమెడలోని బరువైన చంద్రహారాలు నామెడలోవేసి ,తన చేతికున్న పదిజతల గాజుల్లో మూడేసి గాజులు నాచేతికి తోడుగుతూ ,”ఏదో పెళ్ళిచూపులని వచ్చాము ,పిల్ల నచ్చడంతో నిశ్చితార్ధం చేసేసాము.పాత బంగారం పెట్టానని ఏమీ అనుకోవద్దు,పెళ్ళికి ఏడువారాల కొత్త నగలు చేయిస్తాను ”అని మా అత్తగారు నా తల నిమిరి చెప్తుంటే మా వాళ్ళ ఆనందం అంబరం తాకింది..అప్పటివరకు పెళ్ళంటే విముఖత వున్ననాలో కూడా సుముఖత కలిగింది.

టెన్త్ క్లాసు ఫస్ట్ రాంక్ తెచ్చుకున్ననాకు ,నీలాగే కాలేజ్ లో చేరాలని,కనీసం డిగ్రీ అయినా సంపాదించి నా కాళ్ళమీద నేను నిలబడగలగాలనే ఆశ అడియాస అయింది. పెళ్ళిచూపులు అన్నపుడే నేను గోడవచేసాను నాకిప్పుడు పెళ్ళి,గిళ్ళీ వద్దని ,కాలేజ్ లో చేరుతానని,కానీ మా అమ్మ నచ్చ చెప్తూ ;

” వాళ్ళంతట వాళ్ళు కబురుచేసారు, చాలా ధనవంతులు, ఒక్కడే కొడుకు . తండ్రి ఆ అబ్బాయి చిన్నపుడే చనిపోయాడు . తల్లికి కొడుకంటే పంచప్రాణాలట. అందుకే కోడల్ని కూడా అపురూపంగా చూసుకుంటుంది అని చెప్పాడు మధ్యవర్తి . అబ్బాయి బాగా చదువుకున్నాడు మంచి ఉద్యోగం హైదరాబాద్ లో..వద్దు అంటే బాగోదు.అయినా వాళ్లకి పిల్ల నచ్చాలి,మన స్థితి గతులు నచ్చాలి,అప్పుడు కదా ! మనకి నచ్చకపోయినా సరే అనలేము కదా ! చూడకుండానే వద్దనడం మర్యాద కాదు ”అనడం తో మౌనం వహించి పెళ్లిచుపులకు ఒప్పుకున్నాను .

వాళ్ళు ఏ షరతులు లేకుండా సరే అనడంతో కలిసొచ్చిన అదృష్టంగా మా వాళ్ళు మురిసిపోయారు .వారి ఆనందం చూసి నేను కూడా కాదనలేకపోయాను. మా కుటుంబ పరిస్ధితులు నీకు తెలిసినవే కదా ! మీలా ధనవంతులంకాదు. ..నాన్నగారు తెచ్చే జీతం రాళ్ళు తప్ప వేరే ఆధారం లేదు.నా తరువాత ఇంకా ఇద్దరాడపిల్లలు ,కట్నకానుకలమాట అటుంచితేపెళ్ళిఖర్చులకేఠికాణాలేదు . యీపరిస్తితుల్లోఅంత గోప్పవాళ్ళు వెతుక్కుంటూ వచ్చి పెళ్లి కూడా క్లుప్తంగా జరపమన్నారంటే అది నా అదృష్టం అని మురిసి పోయారు.నాకు నిజమనిపించి ,మా వాళ్ళ ఆనందాన్నిఎందుకు భగ్నం చెయ్యాలి అని తలవంచి తాళి కట్టించుకున్నాను.

పెళ్ళిఅయి మూడు నిద్రలకి అత్తవారింటికి వెళ్ళినపుడు ,మొదటి రాత్రే అతను,అంటే నా మెడలో తాలికట్టిన భర్త అనబడే నాగుపాము ,అదే ..నాగరాజు ప్రవర్తన,మాటలు కొంత జుగుప్సాకరంగా,భయం గొలిపాయి.ఏదో తేడా కనిపించింది.కానీ పూర్తిగా అర్ధం చేసుకోలేని లేతవయసు నాది.మొదటి రాత్రి అనుభవం నూతనజంట ఇద్దరికీ కొత్త అనే భావం నాలో వుండేది .కానీ అతని ప్రవర్తనలో మాత్రం కొన్నిగంటల ముందు అతని జీవితంలో నేను ( అంటే ఒక స్త్రీ )అడుగుపెట్టాను అనే భావం ఏమాత్రం కనిపించలేదు .

ముందు పెళ్లి వద్దనుకున్నా,ఎంతో అనుకులమయిన జీవితమని అందరు అంటుంటే ,కోటి ఆశలతో,ముద్దు ముచ్చట్లతో ,మురిపాలతో గడపాలని పాల గ్లాసుతో శోభనం గదిలో అడుగుపెట్టిన నాకు చేదు అనుభవం మిగిలింది. చేతిలో పాల గ్లాసు సిగ్గుపడుతూ అతనికి అందించబోతే,నన్నుకానీ ,కనీశం గ్లాసుని కాని చూడకుండా విసుగ్గా

”చూడు .ఇలాటి ఫార్మాలిటీస్ నాకు ఇష్టం లేదు.ఆ పాలు నువ్వు తాగేయ్,లేదంటే అక్కడ ఆ గ్లాస్ పెట్టి లైట్ ఆర్పి ,వచ్చి పడుక్కో.” అన్నాడు తను మంచం మీద వెల్లకిలా పడుక్కొని.. తెల్లబోయి మాటా పలుకు లేకుండా అవ్వాక్కయి నిలబడిన నా వైపు నిర్లక్ష్యంగా చూస్తూ ,

”ఏం..చెముడా .ఆ లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుక్కోమన్నానుగా.” గద్దించాడు .

తప్పని సరిగా అతను చెప్పినట్టు చేసాను. ఆ నాలుగ్గోడల మద్య మమ్మల్ని పెద్దలు బంధించినది కేవలం శరీరాలు ఒకటి కావడం కోసం అన్నట్టు ,ఆకలి లేనివాడు తనకోసం వడ్డించిన కంచం ముందు కూర్చొని,ఏదో ఇతరులకోసం కంచంలో పదార్ధం కతికాను,అన్నట్టు కానిచ్చి ,కంచాన్ని పక్కకి తోసేసినట్టు అనిపించింది అతని పద్దతి.

తెల్లవారాక రాత్రి పక్క టేబిల్ పై పెట్టిన గ్లాస్ లోని విరిగిన పాలలాగా ,విరిగిన మనసుతో,పక్కపై జల్లిన మల్లెపువుల్లా నలిగిన మేనితో,దారం తెగి, చెల్లా చెదరుగా రాలిన నా తలలో పూల దండలాటి తెగిన ఉహాలతో,అస్తవ్యస్తంగా బయట అడుగు పెట్టిన నన్ను చూసి మా అత్తమ్మ మాత్రం ఏదో ఘనకార్యం సాధించిన విజయ రేఖలేవో ముఖం లో విల్లి విరుస్తుండగా,చిరునవ్వుతో ఆప్యాయంగా పలుకరించింది.

మూడు రోజులు మార్పులేని,ఏ అనుభూతులు లేని ఒకే అనుభవం.నాలుగవరోజు ఉదయాన్నే అతను ఎక్కడికో ప్రయాణ మవుతున్నట్టున్నాడు.అనుకోకుండా నేనటు వెళ్ళడం ,నేనటు వస్తానని బహుశా వారుహించకపోవడం అనుకుంటా,మూసిన గది తలుపుల నుండి తల్లి కొడుకులు తీవ్రంగా వాదించుకోవడం వినిపించింది..ఇద్దరూ గొంతుపెంచి వాదించుకుంటున్నారు కనుక కొంచం జాగ్రత్తగా వింటే స్పష్టంగా వినిపిస్తుందని గది తలుపులకి చెవి ఒగ్గాను..ఇతరుల మాటలు చాటుగా వినడం సంస్కారం కాదు,కానీ నేను పరాయిదాన్ని కాదు ,యీ ఇంటికోడలుగా అడుగుపెట్టాను,పైగా ఎదో మొక్కుబడిగా,నా మీద అనాసక్తంగానే నాతో మూడురోజులు మూడు నిద్రలు చేసిన నా భర్త విషయంలో ఎందుకో మనసులో ఎదో శంక .అందుకే సంస్కారాన్ని పక్కకి నెట్టాను.లంకంత లోగిలి అది .నిశ్శబ్దం రాజ్యమేలే ఆ లోగిల్లో మేము ముగ్గరం తప్ప నాలగవ వ్యక్తీ గడప దాటికూడా రావడం చూడలేదు మూడు రోజుల అనుభవం లో …ఒక మారుమూల మా పడకగది.వీరు వాదులాడుతున్నది బహుశా మా అత్తగారి గది అనుకుంటా..అందుకే స్పష్టంగా వినిపిస్తున్న మాటల్ని ధైర్యంగా వినసాగాను.ఒక్క పదినిముషాల్లోతెరవెనుక జరిగిన భాగవతం తెరమీద బొమ్మల్లాగా నా కళ్ళముందు కదలాడేలాజేసాయి నేను విన్న మాటలు.విషయం తేటతెల్లం అవగానే నా కాళ్ళక్రింద భూమి పగిలి నేనేదో పాతాళంలోకి కూరుకుపోతున్నాట్టు ,ఆకాశం నుండి వేయి పిడుగులు ఒకేసారి నెత్తిన పడి శరీరం చిద్రమైనట్టు అనిపించింది.పగిలిపోతున్న తలని రెండుచేతులతో పట్టుకొని ఇక అక్కడ నిలబడలేక ఎలాగో తడబడుతూ ,మెల్లిగా నా గదిలోకి వచ్చి మంచం పై వాలి తలగడలో ముఖం దాచుకొని బావురుమని ఏడ్చాను.

మోసపోయాను ,ఘోరంగా మోసపోయాను. నాగరాజుకి పెళ్ళికి ముందే ఒకామెతో ఘనిష్టమైన సంభంధం వుంది.తాళి కట్టలేదు కానీ భార్యాభర్తలుగా చెలామణి అవుతున్నారువారు…ఆమె వివాహిత ,ఒక కొడుకు తల్లి, భర్తకి విడాకులిచ్చి,నాగారాజుతో సంబంధం పెనవేసుకుంది..విషయం తెలిసిన తల్లి అతన్ని నిలదీస్తే, తాను ఆమెని వివాహం చేసుకుంటానని నాగరాజు పట్టుబట్టినపుడు,ఎండ్రిన్ తాగి ఆత్మహత్య చేసుకోబోయింది ఆమె.అతికష్టం మీద తల్లిని బతికించుకున్న నాగరాజు తప్పనిసరి పరిస్తితిలో తల్లి మాటకోసం ,ఆమె పరువు కోసం ,ఆమె కోరుకొనే వంశాంకురం కోసం రాజీపడి తల్లి చెప్పిన పిల్లని పెళ్లి చేసుకుందికి అంగీకారం తెలిపాడు. వెంటనే పెళ్ళిళ్ళ పేరయ్య సహకారం తో ,నా గురించి తెలుసుకొని,మా వాళ్ళ ఆర్ధిక దౌర్భాల్యాన్ని ఆసరాగా తీసుకొని,డబ్బు బంగారం ఎరగా చూపి వారు విసిరిన వలలో నేను చేప గా చిక్కాను..

నేను విన్న పది నిముషాల వారి వాద్వివాదంలో యీనిజాలన్నీ వెలువడ్డాయి.భరించలేకపోయాను.అప్పటికప్పుడు మెడలోవున్నతాళి తెంచి అది కట్టినవాడి ముఖాన కొట్టి నా పుట్టింటికి వెళ్ళిపొవాలనిపించింది. కానీ కంచుకోట లాటి ఆ ఇల్లోక జైలు లాగ, తల్లి కొడుకులు జైలర్స్ లాగ అనిపించింది.నాకుగా నేను తప్పించుకుపోలేను . నాన్నగారు ఎలాగు వస్తారు యీ మధ్యలో,అప్పుడు వెళ్ళిపోయి ఇక యీ ఇంటివైపు జీవితంలో తిరిగి చూడను .మా అందరి కళ్ళు కప్పి మోసం చేసినందుకు అదేశిక్ష అని మనసులో దృడంగా తీర్మానించుకున్నాను.అంతవరకు నేను వారి మాటలు విన్నట్టు వారికి తెలియనివ్వకూడదు అనుకున్నాను.

కొంతసేపటి తర్వాత నాగరాజు విసురుగా లోపలికి వచ్చి తన సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోయాడు.కనీసం తలతిప్పి కూడా నన్ను చూడలేదు.అతను వెళ్ళాక చివరగా నేను విన్న వాక్యాలు చెవిలో గింగురుమన్నాయి.

”చూడు.నీ మాట వినలేదని చావడానికి సిద్డమయ్యావు కనుక నీ కోసం నువ్వు చెప్పిన అమ్మాయి మెడలో తాళి కట్టాను.అంతమాత్రం చేత ఆమె నా భార్యకాదు,సమాజంలో నీకు కోడలు మాత్రమె. ,నీ వంశానికి ,ఆస్తికి వారసులుకావాలన్నావు కనుక ఆ విషయంలో మాత్రం నేను సహకరిస్తాను. ఇక మిగిలిన నా వ్యక్తిగత విషయాల్లో మీరెవరు తల దుర్చినా సహించేది లేదు.తాళి కట్టపోయినా సిటీ లో వున్నామే నా భార్య. ఆమెని వదిలే ప్రసక్తి లేదు.ఈ విషయం లో కాదు ,కూడదు అని పేచీ పెడితే ,ఇప్పుడు నువ్వు కాదు ,నీ ఎదురుగా నేను ఎండ్రిన్ తాగి చస్తాను..ఆలోచించుకో..అరగంటలో నాకు బస్సు వుంది నేను వెళ్ళాలి..”

తల్చుకున్నకొద్దీ మనసులో అగ్ని రగులుతూనే వుంది..సమాజంలో వీరి పేరు నిలపడం కోసం కోడలు స్థానం లో కూర్చోపెట్టారు.పాడి పశువుని కొని తెచ్చుకున్నట్టు ,పసుపు తాడనే పలుపుతాడు కట్టి ,వారి వంశాంకురాలకుజన్మనివ్వడం కోసం నన్నొక ‘బలి’ పశువుగా లాక్కొచ్చి వీరి లోగిట్లో గుంజకు కట్టారు అని అర్ధం అయింది .

రెండురోజుల తర్వాత నాన్న వచ్చారు .నన్ను,అల్లుడుగారిని మనుగుడుపులకి తీసుకెళ్ళి పదహారు రోజుల పండగ జరిపాక పంపాలనే ఆశతో వచ్చారు.అల్లుడుగారు ఉద్యోగం పేరుతో పట్నం ఉడాయించడం ఆయనకీ నిరాశ కలిగించింది.మాటల్లో నమ్మించడం లో అత్తగారు దిట్ట అని నాకు తెలిసిపోయింది,నాన్నకి తెలియదు గా.అందుకే తరువాత తనకొడుకు వస్తాడు అని చెప్తే,అవుననుకొని నన్ను తీసుకొని బయలుదేరారు.వెళ్తున్నపుడుమా అత్తగారు ఏడువారాల నగలు వద్దంటున్నా ఒంటిపై నింపింది .వేల ఖరీదు చేసే పట్టుచీర కట్టబెట్టింది .నన్ను చూసి తన కుతురొక బంగారు బొమ్మలా కనిపించిందేమో,నాన్న కళ్ళు ఆనందంతో మెరిసాయి.కారులో పంపింది మమ్మల్ని.నాన్న గర్వంగా ఫీలయ్యారు.

ఇక ఇంట్లో ,అమ్మ ,చెల్లెళ్ళు,ఇంకా చెదురు మదురుగా వున్నచుట్టాలు,చుట్టుపక్కల వాళ్ళు ,బండెడు నగలతో కారులో వచ్చిన నన్నొక సేలిబ్రేటీ గా ఫీలయిపోతూ చూడ్డం నాకు ఇబ్బంది కలిగించింది.చేదుమాత్రకి పంచదార పూతలాటి బతుకు నాదని పాపం వీరికి తెలియదు అనుకున్నాను.వచ్చిన రోజే అమ్మకి నాన్నకి విషయాలన్నీ చెప్పెయ్యాలనుకున్నాను.కానీ వీలుపడలేదు.ముందుగానే మా అత్తగారు హుకుం జారీ చేసింది,

”ఒకవేళ అబ్బాయి శెలవు దొరక్క రాలేకపోయినా,మీ నోములు,లాంచనాలు ముగించిపదహారు రోజులపండగ అవ్వగానే పంపెయ్యాలి.తెల్లవారేసరికి కారు మీ గుమ్మం లో వుంటుంది.”అని రోజు కుడా తానే నిర్ణయించేసింది.సుగ్రీవాజ్ఞ..చుట్టాలతో కలిసి సారే కోసం ఏవేవో రకరకాల వంటకాలు,పసుపుకుంకాలు సర్దడంలో అమ్మబిజీ.

మర్నాడు ఉదయమే ప్రయాణం అనగానే ఎలాగో వీలు చేసుకొని,చెల్లెళ్లకి కూడా తెలియకుండా గదిలో తలుపులు మూసి, అమ్మ,నాన్నగారితో విషయం అంతా వివరించి భోరున ఏడ్చేసాను ఇక ఉగ్గ బట్టలేక. అంతావిని నాన్న గారి ముఖం పాలిపోయింది .అమ్మ మనసులో భావాలు ఆమె ముఖంలో చదవడానికి వీలుపడకుండాచాలా గుంభనంగా వుంది.

”నేను ఇంక ఆ ఇంటికి వెళ్ళనమ్మా ! ”అన్నాను ఏడుస్తూనే.రెండునిముషాల మౌనం తర్వాత నాన్న గారు లేచి నిలబడి అమ్మముఖం లోకి చూసి

”మీరిద్దరూ మాటాడండి. ఇప్పుడే వస్తాను.”అని బయటకు వెళ్లి తలుపు దగ్గరవేసి వెళ్ళిపోయారు.నాన్న చూపులో భావమేమిటో అమ్మ మాత్రమె అర్ధం చేసుకోగలదు.

”రేపువాళ్ళు వస్తే నేను రాను అని చెప్పెయ్యండి. నేను వెళ్ళను గాక వెళ్ళను ”అన్నాను స్థిరంగా. ఈ సారి అమ్మ సీరియస్గా చూసింది నావైపు.నేను పుట్టి బుద్దేరిగాక నా వంక అమ్మ అలా చూడడం మొదటిసారి.

”నువ్వు వెళ్ళాలి .”అంది అంతే సీరియస్గా.అదిరిపడ్డాను ఆ జవాబుకి.అమ్మ నన్ను సమర్ధిస్తుంది అనుకున్నా ,కానీ …

”ఏమిటమ్మా ! విషయం అంతా చెప్పిన తర్వాత కూడా నన్నానరకంలోకి వెళ్ళమంటున్నావా!’అసహనంగా అన్నాను.

”తప్పదు నీలూ! పెళ్ళయ్యాక స్వర్గామయినా, నరకమయినా మెట్టినిల్లె ఆడదానికి.మంచివాడయినా ,చెడ్డవాడయినా భర్తతోడిదే లోకం”

”పెళ్ళికి ముందు మంచి చెడ్డలు విచారించకుండా గొప్పవాళ్ళని తెలియగానే వాళ్లకి అంటగట్టి నా గొంతుకోసారు .ఇప్పుడు అతని నిజస్వరూపం తెలిసాక కూడా నన్ను ఆ నరకంలో పడి ఏడవమని తోసేస్తున్నారు.కన్నవారే ఇంత కఠినాత్ములయితే పరాయి వాళ్ళుఆదరిస్తారా ! నేను మీకు బరువయితే చెప్పండి.నా దారి నేను చూసుకుంటాను.ఈ విశాల ప్రపంచంలో నాకు కొంచం చోటుదోరక్కపోదు ”ఉక్రోషంతో అన్నాను. నా చెయ్యి తనచేతిలోకి తీసుకొని అనునయంగా నిమురుతూ అంది అమ్మ.

”చెట్టుకి కాయ ,కన్నవారికి బిడ్డలు ఎప్పుడు భారం కాదమ్మా! అండదండలు లేకుండా యీ సమాజంలో ఆడది ఒంటరిగా బతకడం తేలిక కాదు ,అదిమరింత ఘోర నరకం .అంతకన్నా కష్టమో ,నిష్టురమో ఒకరి చాటున వుండడం శ్రేయస్కరం.” ఒక్కసారి చెయ్యి విసురుగా లాక్కున్నాను.అమ్మ స్వరంలో ,ముఖంలో భాద నిండింది నా చర్యకి.

” నీలూ!చదువుకున్నదానివి .కష్టసుఖాలు తెలిసినదానివి .నీకు ఎక్కువగా చెప్పలేనమ్మా ! నువ్వన్నట్టు పెళ్ళికి ముందు పెళ్ళికొడుకు గురించి వాకబు చెయ్యాల్సింది .కానీ యీ సంబంధం తెచ్చిన పేరయ్యగారు మనకిబాగా కావలసినవారే.పైగా మీ అత్తవారిని తెలియనివారు యీ పరగణా లో లేరు .మంచి ఆస్తి పరులని ,ఒక్కగానొక్క కొడుకని,సాంప్రదాయ కుటుంబమని అందరికీ తెలుసు. వేలమంది పిల్లనివ్వడానికివరుసలో నిలబడి వుండగా వాళ్ళు మనసంబంధం ఏరికోరి వచ్చారంటే అది నీ అదృష్టం అనుకున్నాము. ఎవరయినా కుటుంబ మంచి చెడ్దలే చుస్తారనుకుంటాము కానీ లోపల ఇలాటి లొసుగులు వుంటాయనుకోము. పెళ్లి చూపుల్లో కుర్రవాడు బుద్ధిమంతుడు లాగ,ఆరోగ్యంగా కనిపించాడు.హైదరాబాద్ లాటి నగరంలో ఒక మనిషి సముద్రంలో నీటి బిందువు లాటివాడు.ఎవరెలా ఉంటారో ఎవరికెరుక.? ఇప్పుడు విషయం తెలిసినా మనమేమీ చెయ్యలేము.మన చెయ్యి దాటిపోయింది…”

”ఏమిటి దాటిపోయింది.నిజాన్ని దాచి ఒక ఆడపిల్ల గొంతు వాళ్ళు కోయ్యాలనుకోవడం తప్పులేదు కానీ,అన్నీ తెలిసి మనసుని చంపుకొని,జీవితంతో చచ్చేవరకు రాజీ పడాలా..?”గట్టిగా అరిచినట్టు అడిగాను.

”ఉష్..కొంచం నెమ్మదిగా మాటాడు.బయట వాళ్లువింటే యాగీ అవుతుంది..”అని గొంతు తగ్గించి ,

”తప్పదు.రాజీ పడాలి.అరిటాకు సామెత ఆడదాని జీవితం. మనలాటివాళ్ళకిసంబంధాలు దొరకడమే చాలా కష్టం. విషయం వచ్చింది కనుక చెప్తున్నాను. ఉభయ ఖర్చులు వాళ్ళు భరించినా,కొద్దిపాటి దానికే మీ నాన్న ఎందరి కాళ్ళో పట్టుకోక తప్పలేదు .మనలాటి వారికి ఆడపిల్ల పెళ్ళికోసం తలలు తాకట్టు పెట్టక తప్పదు.నీ తరవాత ఇద్దరు ఆడపిల్లలు వున్నారు .నీకు వచ్చినలాటి స్థితి మంతులు కాకపోయినా ,గంతకితగ్గ బొంతలు వెతకాలి.నీకు గొప్ప సంబంధం రావడంతో మన బంధువుల్లో మన పరపతి పెరిగింది.అలా అయినా నీ చెల్లెళ్లకి సంబంధాలు వస్తాయని నేను మీ నాన్నగారు కొండంత ఆశతో ఉన్నాము.ఇప్పుడు నువ్వు పెళ్ళయిన మూడు రోజులకే నీ భర్త ప్రవర్తన బాగులేదని బంధం తెంచుకు వచ్చేస్తే మేము సమాజంలో తలెత్తుకు తిరగలేమమ్మా! నీ చెల్లెళ్ళ కోసమయినా…” అమ్మకి దుఖంతో గొంతు పూడుకు పోయింది.అమ్మ కన్నీళ్లు నా మనసుని కరిగించలేదు,పైగా అగ్నిలో ఆజ్యం పోసినట్టయింది.

”అంటే సమాజంలో మీ పేరు కోసం,నా తరవాత వాళ్ళకోసం నా జీవితాన్నిత్యాగం చేసి ,నేనొక బలిపశువు కావాలా..?”

” త్యాగం ,బలిపశువు లాటి పెద్ద పెద్ద మాటలేందుకే..నీ భర్త కుంటి,గుడ్డి కాదు,రోగిష్టి అంతకన్నా కాదు..పెళ్ళయ్యాక కట్నాలు కానుకలు తేలేదని ఆడపిల్లల్నిఎంతమంది అత్తవారు హత్యలు చేసిన వార్తలు వినడం లేదు.ఉభయ ఖర్చులు వాళ్ళు భరించి ,ఏడు వారాల నగలు నీకు పెట్టారు.నీ చెల్లెళ్ళ మెడలో,నా మెడలో,నిన్న మొన్నటి వరకు నీ మెడలో కూడా గిల్టు గొలుసులు తప్ప ఏమున్నాయి..? తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తులున్నాయి నీ అత్త వారికి. ఇది త్రేతాయుగం కాదు శ్రీ రామ చంద్రుడి లాటి భర్తలు దొరకడానికి.ఆ అవతార పురుషుడే ద్వాపర యుగంలో అవతరించినపుడు అష్ట భార్యలని కట్టుకున్నాడు.ఈ యుగంలో చెప్పాలా !ఇంకా నయమే ,అతనికెవరితోనో పెళ్ళికాకముందు సంబంధం వుంది.దాన్నెవతినో పెళ్లి చేసుకోలేదుగా..పెళ్ళికి ముందు ఎలా వున్నా పెళ్ళయ్యాక మారే మగవాళ్ళు ఎంతమంది లేరూ..భర్తని తనవైపు తిప్పుకొనే నైపుణ్యం ఆడదానిలో వుండాలి..”

”నన్ను భార్యగా అంగీకరించలేను అని ఖచ్చితంగా చెప్తున్నాడు. కలిమితో కాపురం చెయ్యమంటావా !అతని తల్లికొక కోడలు కావాలట..వాళ్ళ వంశాన్ని నిలిపే వాళ్లకి నేను జన్మనివ్వాలట..వారి దృష్టిలో నేనొక మనిషినికాదు,నాకొక మనసు లేదు”

” అలా ఎందుకనుకోవాలి..? ఏదో మోజులోపడి అలా అన్నా,అగ్ని సాక్షిగా కట్టుకున్న నిన్నుభార్య కాదని ఎలా అంటాడు..? తన తల్లికి కోడలయితే తనకి భార్యే కదా ! నీకు పుట్టిన బిడ్డలకి తాను తండ్రి కాదనగలడా! ఇవన్నీ కొద్ది రోజులుంటాయి.పిల్లలు పుట్టగానే మారతాడు చూడు ,నేను చెప్తున్నాను..నా తల్లి కదు..అర్ధం చేసుకోమ్మా!”

”నువ్వేమి చెప్పినా నా మనసు మారదమ్మా!” విసుగ్గా అన్నాను.

‘ సరే .నీ ఇష్టం . కానీ ఒక్క విషయం. డబ్బు లేకపోయినా పరువే ధనంగా బతుకుతున్నాము.ఇప్పుడు నువ్వు పెళ్ళయిన రెండురోజుల్లో బంధం తెంపుకొని వచ్చేస్తే ,ఎదిగిన నీ చెల్లెళ్ళతో పాటు ,మొగుణ్ణి వదిలి వచ్చిన నిన్ను కూడా జీవితాంతం గుండెలమీద కుంపట్ల లాగ భరిస్తూ బతికేకన్నా నేను ,మీ నాన్న ఇంత విషం తిని చస్తాము.ఆ తర్వాత మీ ముగ్గురు ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు బతకండి..”అంటూ అమ్మ కోపంగా వెళ్ళిపోయింది.

మనసు మూగబోయింది ,మెదడు మొద్దుబారింది. కలత చెందిన కళ్ళు పోడారిపోయాయి.జీవమున్న శిలనయ్యాను.మర్నాడు ఉదయం అమ్మ గదిలోకి వచ్చేసరికి నా బట్టలు సర్దుకున్నాను.అమ్మ అనునయంగా ఎదో చెప్పబోయింది.ఆమె వెనుకే నాన్న గారు కూడా వచ్చారు.నేను మాటవినకుండా దూసుకుపోయాను బయటకి.అమ్మ ఎదో అనబోతుంటే నాన్నగారు వారించడం కనిపించింది. అంటే నాన్న గారి సహకారం కూడా  లేదని అర్ధం అయింది.

తిరిగి వచ్చిన నన్ను మా అత్తగారు ఎంతో ప్రేమగా ఆహ్వానించింది…అవును అమ్మవారికి బలిచ్చే మేక పిల్లని తక్కువ ముద్ద్దు చేస్తాడా దాని యజమాని!.నా మనసుకి నా మట్టుకు నాకు అలానే అనిపించింది ఆమె ప్రేమ . తృప్తి లేని జీవితమని ఆత్మహత్య చేసుకోనేంత పిరికి తనం లేదు,వదిలించుకొని పారిపోయెంతసాహసం లేదు అనేకన్నా పరిస్థితులు అనుకులించేవరకు ప్రస్తుత పరిస్తుతులతో సర్డుకుపోకతప్పదు అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను.

పెళ్ళయిన నాలుగవ రోజుని వెళ్ళిన నాగరాజు పదిహేను రోజుల తర్వాత వచ్చాడు.తల్లీ కొడుకుల మధ్య మళ్ళీ ఎదో వివాదం.ఆ రాత్రి షరా మాములే.పాల గ్లాస్ తో అత్తగారు లోపలి అంపకం పెట్టడం ,అమ్మ కిచ్చిన మాటకోసం నా మనసు శరీరం ,తలలో పూలు,పందిరి మంచం పై పడక నలిగిపోవడం..పొద్దుటే నలిగి బయటకి వచ్చిన నన్నుచూసిఅత్తగారు సంతృప్తిగా తనలో తాను నవ్వుకోవడం,వెలలేని వెలయాలిలాటి నా బతుకుని చూసి ఏడ్వలేక నాలో నేనే విషాదంగా నవ్వుకోవడం.రెండురోజుల అనంతరం అతని తిరుగు ప్రయాణం..ఇదీ తంతు .

బండబారిన మనసులో బతుకులో,రాలలో పూలు పూచినట్లు ఒక ఆశాకుసుమం వికసించింది. ఆదిత్య కడుపున పడ్డాడు.నేను నెలతప్పిన విషయం తెలియగానే మా అత్తగారి ఆనందానికి అవధులు లేవు.ఇంత త్వరలో తన కల నిజం చెయ్యబోతున్న నన్ను కాలు కింద పెట్టనివ్వలేదు.ఈ శుభవార్త వినగానే తప్పక తన కొడుకు మారతాడని కొండంత ఆశతో ఎదురుచూసింది .నాలో కూడా ఎదో మూల ఒక చిగురంత ఆశ పొటమరించింది. సాధారణంగా ప్రతి పదిహేను రోజులకొకసారి శనాదివారాల్లో తల్లిని చూడడానికి వస్తాడట.కొండంత ఆనందంతో ఎదురు చూసిందామె ,కానీ అతను రాలేదు..తల్లికి నా తోడు దొరికిందిగా.ఇక అతని యదేచ్చాకి అడ్డేమిటి..? కొడుకు రాకపోవడంతో టెలిగ్రాం ఇప్పించింది.అప్పట్లో మా అత్తవారి గ్రామంలో టెలిఫోన్ సదుపాయం లేదు .టెలిగ్రాం అందుకొని హుటాహుటిని వచ్చిన అతను పిడి రాయిలా వున్నతల్లిని చూసి ;

” టెలిగ్రాం ఇస్తే నీకేమయిందో అని హడలి చచ్చాను.అయినా శలవు పెట్టించి మరీ పిలిపించిన రాచకార్యం ఏమిటి ..?”కోపంగా అన్నాడు.

”రాచకార్యం కాదులే ,రాజా లాటి వార్త .” అని బులిపిస్తున్నట్టు చూసి ,మురిపెంగా చెప్పింది ;

”నేను త్వరలో నానమ్మని కాబోతున్నానురా !” అని.

ముందు అర్ధం కాలేదేమో .తర్వాత వెలిగినట్టుంది.

”అదా !”అన్నాడు తేలిగ్గా .

”అంత తేలిగ్గా అంటావేమిటిరా! నేను నానమ్మని అయితే నువ్వు నాన్న కాబోతున్నావు.అర్ధం కాలేదా !”

”నువ్వు కొత్తగా నానమ్మవి అవుతున్నావు .నేను కొత్తగా నాన్నని అవడంలేదులే..”

హతాసురాలయినట్టుంది ఆ మాటకి .నేను కూడా కొద్దిగా షాక్ అయ్యాను ఊహించని జవాబుకి .కనీసం కొంచమయినా సంతోషం వ్యక్త పరుస్తాడనుకున్నా..

”అదేమిట్రా అలా అంటావు .ఏ అబ్బకోపుట్టిన వాడు నీకు కొడుకేలా అవుతాడు ? నువ్వువాడికెలా నాన్నవిఅవుతావు ..?”

ఇక ముసుగులో గుద్దులాటలు అవసరం లేదన్నట్టునాకు వినిపిస్తుందేమో అనే సంశయం లేకుండా బిగ్గరగానే వాదనలోకి దిగింది .ముందే బరిదేగించిన అతను మాత్రం భయపడతాడా ! తల్లికన్నా బిగ్గరగానే గొంతుపెంచి చెప్పాడు ;

”ఆ బిడ్డతల్లి నా బార్య అయినపుడు ,ఆమె కొడుకు నా కొడుకు ఎందుకు కాడు..”

”కాడు..ముమ్మాటికీ కాడు..మాయచేసి బుట్టలో వేసుకున్న వగలాడి భార్య ఎలా అవుతుంది..? పందిరేసి పెళ్లి చేసారా ! మెడలో పసుపు తాడు కట్టావా !” ఉగ్రం రూపం ధరించింది.

”బారెడు పసుపు తాడుతో భార్య అయితే అదెప్పుడో కట్టేద్దును..నువ్వు కట్టమన్నావుగా నీకు నచ్చిన పిల్లతో. కన్నతల్లివి కనుక నా కోసం చచ్చేవన్ననింద నాకెందుకని నీ మాట కి కట్టుబడ్డాను…కానీ ఆ పిల్ల మెడలో పసుపుతాడు నాకు బంధం వెయ్యలేదు..నన్ను విసిగించకు.ముందే చెప్పాను.ఐదేళ్ళ నుండి ఆండాళ్ తో వున్ననా బంధం అంత తేలిగ్గా తెగిపోదు… …”

”తేలిగ్గా కాకపోతే దానికి కావలసినదేదో దాని ముఖాన కొట్టి వదిలించుకో ..”

”డబ్బిచ్చి ఇప్పుడు కొని తెచ్చుకున్నావుగా నా ఇష్టం లేకుండా ..దానికీ దానికి పుట్టిన సంతానానికి పెట్టుకో నీ ఆస్తి పాస్తులు .నా సంపాదన నా ఇష్టం వచ్చిన వాళ్లకి పెట్టుకుంటాను .”

అని తెగేసి చెప్పి ఆ రాత్రే వెళ్ళిపోయాడు.వాళ్ళ మాటలు నేను విన్నానని గ్రహించి ఆ రాత్రి నా గదిలోకి వచ్చి అనునయించబోయింది అత్తగారు.

”చూడమ్మా ! మా నాగరాజు చాలా మంచివాడే.కానీ ఆ మాయదారి వగలాడి వాడికేదో మండుపెట్టింది…”సగంలో ఆపేస్తూ అన్నాను .

”మందు మాకు పెట్టి లొంగ దీసుకుందికి మీ కొడుకేమీ అమాయకుడు కాదు తెలివితక్కువవాడు కాదు ..” తీవ్రంగా అన్నాను.తాటాకు చప్పుళ్ళకి కుందేళ్ళు బెదరవు అన్నట్టు నా గొంతులో తీవ్రతనామే లెక్కచెయ్యలేదు.

” ఏమనుకున్నాసరే ,ముళ్ళమీద గుడ్డని జాగ్రతగా తియ్యాలి..”

”అసలు మీ కొడుకు అభిప్రాయం అడగకుండా పెళ్ళెందుకు చేసారు…?”

”ఎద్దునడిగి గంతలు కడతారటమ్మా! నా కొడుకు బాగోగులు చూడవలసిన భాద్యత తల్లిగా నాది.పిల్లలు తెలియక తప్పుదారిలో వెళ్తుంటే అలా చూస్తూ ఏ తల్లయినా నాకెందుకు అన్నట్టు వూరుకుంటుందా!”

”మీ అబ్బాయి ఎద్దుకాదు అడగకుండా గంతలు కట్టడానికి ..నన్ను బలిపశువుని చేసారు మీ స్వార్ధం కోసం ..”ఉప్పెనలా దుఖం ,ఉక్రోషం ముంచుకొచ్చాయి.అయినా తొణకలేదు ,బెణకలేదామె..ఇతరుల అభిప్రాయాలతో ,మనోభావాలతో వారికి పనిలేదు అన్నట్టు తోచింది .అయినా సాధ్యమైనంతవరకు నా కోసం నేను ఒంటరి పోరాటం తప్పదు.

”బలి పశువుని చెయ్యడానికి నీకు చేసిన అన్యాయం ఏమిటి.? కాణీ ఖర్చు లేకుండా ఉభయఖర్చులతో పెళ్ళిచేసాను.ఏడు వారాల నగలు పెట్టాను.కాలుకింద పెట్టకుండా పువ్వులా చూస్తున్నాను…నా కొడుకు నిన్ను నిర్లక్ష్యం చేస్తే కడుపులో బిడ్డనేలా మోస్తున్నావు..? నీ కడుపున పెరుగుతున్నది వాడి బిడ్డే కదా! ”

” అవును .అతని బిడ్డే .ఎదురింటి ఆడకుక్క ,మీ పెరట్లో కట్టిన ఆవులు ,గేదెలు కూడా  వాటి  ఇష్టాయిష్టా లతో  నిమిత్తం  లేకుండా  కంటున్నాయి పిల్లల్ని .వాటికీ నాకు తేడ ఒకటే ,అవి  నోరులేని పశువులు నేను మీ వంశం ఉద్దరించడానికి వచ్చిన బలిపశువుని .”అని కోపంగా వెళ్ళిపోయాను అక్కడ నుండి .

నెల తప్పానని తెలిసి అమ్మా ,నాన్న వచ్చారు అమితానందంతో .ఐదవ నెల రాగానే నన్ను పురిటికి తీసుకువెళ్ళి ,సీమంతం జరపాలనుకుంటున్నామని మా అత్తగారి అనుమతి కోరారు.ఆమె జవాబు చెప్పెలోపల నేను కలుగజేసుకొని ,పుట్టబోయేది ఈ ఇంటికి ,వంశానికి వారసుడు. నేను ఈ ఇంటికి వచ్చింది వారసుల్ని ఇవ్వడానికే కనుక ఎవరి సొత్తు వారివద్ద ,ఎక్కడి వారు అక్కడ వుండడం శ్రేయస్కరం.నేను ససేమిరా ఇక పుట్టింటి గడపలో అడుగు పెట్టదల్చుకోలేదు.. అని నిష్కర్షగా చెప్పేసి లోపలి వెళ్ళిపోయాను.. తరువాత ఎవరేమనుకున్నది నేను పట్టించుకోదల్చుకోలేదు .

ఆదిత్య పుట్టాడు.వాడు పుట్టాక అయినా కొడుకులో మార్పు వస్తుందనుకున్న అత్తగారి ఆశ అడియాస అయింది.. బాబుని కనీసం కళ్ళారా చూడలేదు కూడా వాడి జన్మ కారకుడు .ఆదిత్య పుట్టాక నాలోనాకె తెలియని మార్పు వచ్చింది .మునుపటి నిరాశా ,నిస్పృహలు క్రమంగా కరిగిపోయి ,వాటి స్థానంలో మాతృత్వపు మమత చోటు చేసుకుంది .బాబు తోటిదే లోకం అయిపొయింది నాకు .చందమామలాటి బాబు నా చీకటి బతుకున వెన్నెల వెలుగులు పూయించాడు.అత్తగారికి మనుమడంటే పంచప్రాణాలు .

ఆదిత్యకి మూడేళ్ళు నిండాయి .మా పెరట్లో గోవు మా లక్ష్మి ఆడ దూడని ప్రసవించింది .నేను ఐశ్వర్యకి జన్మనిచ్చాను. .వంశోద్దారకుడు,ఇంటి మహాలక్ష్మి ఆడపిల్ల.మా అత్తగారి కలలు ఫలించాయి .నా బ్రతుకే ఒక పీడకల ,బిద్డ్డలిద్దర్నీ కళ్ళల్లో పెట్టుకు పెంచడం ,వారిని ప్రయోజకుల్ని చెయ్యాలన్నదే నాకలగా మారింది .

ఐశ్వర్య పుట్టాక ఇక తల్లికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాననుకున్నాడో లేక సంతు పెరిగితే సంత గా మారుతుందనుకున్నాడో నాగరాజు నాకు దూరమయ్యాడు.అదీ నాకు ఒక మహోపకారమే అనుకున్నా.ఇరవై రెండేళ్ళ వయసునుండి ,పిల్లలిద్దరే లోకంగా ,లోకం ఎగతాళి చెయ్యకుండా మెడలో తాళితో భతృవిహీనగా మనుగడ సాగించాను .

ఐశ్వర్య కి పదేళ్ళ ప్రాయంలో అత్తగారు కాలం చేసారు.పోతూ పోతూ ఆమె చేసిన మంచిపని తన ఆస్తిని ముడుభాగాలుగా చేసి ,రెండు భాగాలు పిల్లలిద్దరి పేరవ్రాసి సర్వాధికారాలు నాకు ఉండేలా వ్రాయించారు.ఒక వాటా కన్నందుకు కొడుకు పేర వ్రాసారు.తనకి సగం ఆస్తి కూడా దక్కకుండా నేనేదో మాయచేసి పిల్లల పేర వ్రాయించి సర్వాధికారాలు పొందానని దుర్భాషలాడుతూ,పదిమంది ఎదురుగా చెయ్యి చేసుకున్నాడు నాగరాజు. చివరికి చేసేదిలేక తనపేర వ్రాసిన ఇల్లు .పొలం అమ్ముకొని ఆ డబ్బు హైదరాబాద్ పట్టుకుపోయాడు.

పిల్లలపేర వున్నలంకంత లోగిలిలో నేను ,ఇద్దరు పిల్లలు మిగిలాము .తండ్రి లేని లోటు తెలియ కుండానే పెంచాను వాళ్ళిద్దర్నీ ఆదిత్య ,ఐశ్వర్య చదువులో మంచి రాంకులు తెచ్చుకుంటూ నిరాటంకంగా కాలేజ్ చదువులు ముగించారు. తన టాలెంట్ తోనే పై చదువులకు ఆదిత్య అమెరికా వెళ్ళాడు .ఐశ్వర్య కంప్యూటర్స్ లో మాస్టర్ కోర్స్ చెయ్యడానికి యునివర్సిటీ లో చేరింది..

మొత్తానికి పిల్లలవిషయంలోనాకలలు ఫలించాయి .ఇద్దరూ ప్రయోజకులయ్యారు. ఐశ్వర్య యునివర్సిటీ లో తన క్లాస్ మెట్ ని ఇష్టపడింది.ఆమె ఎంపిక సరయినదే అనిపించి నేను ‘తధాస్తు ‘ అన్నాను.కానీ ఒక చిక్కు సమస్య ,ఆ అబ్బాయి తలితండ్రులు ఏమీ కోరలేదు కానీ సాంప్రదాయంగా పెళ్లి జరిపించమని కోరారు .అలా జరపాలంటే భార్యాభర్తలు కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలి. నా ఆత్మాభిమానాన్ని చంపుకొని అతన్ని ఆసమయంలో నిలబడమని నేను ఆ వెలయాలి ఇంటికి వెళ్లి ,ఆమె వద్ద నున్న అతన్ని ప్రాదేయపడాలి .. అంతకన్నా విషం తాగి చావడం మేలు అనిపించింది .

ఈ లోపల కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్నట్టు ,అది దురదృష్టమో,లేక నా మాట నిలుపుకొనే అవకాశం ఆ విధంగా కలిగిందో చెప్పలేను ,నాగరాజుకి ఏక్సిడెంట్ అయి ఒక కాలు తీసివేసారు .పూర్తిగా బెడ్ మీద వున్నాడు .ఆ పరిస్టితిలో అతనితో అంతవరకూ కాపురం చేసినామె,ఆమె కొడుకు నాగరాజుని తీసుకొచ్చి నేనున్నఇంట్లో కుదేసి పోయారు .ఆమె వెళ్లేముందు ఇద్దరూ ఘర్షణ పడ్డారు.

”ఇంతకాలం నా సంపాదనంతా నీకు ధారపోశాను ,ఆస్తులన్నీ అమ్మి నీపేర పెద్ద ఇల్లుకొన్నాను.నీ కొడుకుని చదివించాను .చివరికి ఇలాటి అసహాయ స్థితిలో ఇక్కడ నన్ను పడేసి నీ దారి నువ్వు  చూసు కుంటున్నావు .అదినీకు భావ్యం కాదు .”అన్నాడతను .

”ఓయబ్బో ..న్యాయమట న్యాయం ..అందుకే అన్నారు ఉంచుకున్నవాడు మొగుడు పెంచుకున్నవాడు కొడుకు కాదని .నా మీద మోజు అంటూనే అమ్మకోసం పెళ్లి చేసుకున్నాను అన్నావు ,అమ్మకోసమే పిల్లల్ని కన్నాను అన్నావు .నీ దొంగమాటలు నిజం అనుకున్నా.మీ అమ్మ చచ్చాక ఆస్తి పాస్తులన్నీ నాకొస్తాయని ఆశిస్తే అవన్నీ నీ కన్నబిడ్డలకే దోచబెట్టావు. లంకంత మేడ తాళి కట్టిన దానికే చెందేలా చేసావు ..భరించినంతకాలం  నేను  భరించాను , నీ ఆస్తి పాస్తులకే వారసులు కాదు ,నీ భాద్యత కూడా వాళ్ళదే ఇకపై ..”అని మారు మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది.

మంచం లో కదలలేని స్థితిలో వున్న నాగరాజుని చూస్తేజాలి ఏ కోశాన్నా కలగలేదు. పైగా అసహ్యం వేసింది .అయినా కొద్దిరోజుల్లో ఐశ్వర్య పెళ్లి .ఈ స్థితిలో నా సంయమనాన్ని ,సహనాన్ని కోల్పోతే ఆడపిల్ల జీవితం అభాసుపాలవుతుంది అనుకోని మలగి పోతున్న మానవత్వాన్ని కళ్ళాలు వేసి బిగించాను ఓర్మితో . అతనికి తప్పనిసరి పరిస్టితి లో సేవ చేసాను .కదలలేని స్థితి లో వున్నాడు కనుక కోరలు తీసిన పాములా టి నాగరాజు విషం కక్కలేకపోయినా , బుసకోట్టడం మానలేదు ..చింత చచ్చినా పులుపు చావని అహంకారి.

మొత్తానికి ఐశ్వర్య పెళ్లి అయిపొయింది.అంతా చాలా ఆనందించారు .కర్రల సహాయంతో వచ్చి పీటలపై కూర్చున్న నాగరాజు కాళ్ళు కడిగి కన్యాదానం చేసాడు .ఆ మరుక్షణంలో స్వర్గారోహణం చేసినంత ఆనందం కలిగింది.రెక్కలు విప్పుకొని స్వేచ్చగా ఆకాశ మార్గాన ఎగిరిపోవాలి అనిపించింది.పిల్లలకోసం ఆ ఇంట అడుగుపెట్టాను కోడలిగా ,భార్యగా ,తల్లిగా నా వంతు కర్తవ్య కర్మని సక్రమంగా నిర్వర్తించానన్న ఆత్మ తృప్తి నాకుంది.అటు పుట్టినింటికి ,మెట్టినింటికీ ఏ కళంకం ఆపాదించకుండా ఒంటరి పోరాటం చేసాను.విజేతనే కాగలిగాను అనే సంతృప్తి నాకు మిగిలింది ..

మానసా ! అందరిలాగే నేనూ మనిషినే.ఆశలు ,ఆశయాలు ,కోర్కెలు లేకపోవచ్చు కానీ అలసిన మనసుకి ,శరీరానికి కొంత విశ్రాంతి ,సాంత్వన కోరుకోవడంలో తప్పులేడుకదా! అందరి ఆడవాళ్లలాగాభర్తతో, పిల్లలతో కలిసి ఆనందం  పంచుకోలేదు ..పరువు ,ప్రతిష్ట అంటూ గడపదాటి ఎరుగను.వారి వారి స్వార్ధం కోసం పెద్దలు ఆడిన చదరంగంలో ఒక పావుని అయ్యాను. నాతొ ఆడుకున్న వారిని గెలిపించాను,నేను మాత్రం ఎందుకు ఓటమి అంగీకరించాలి. ? కొన్ని అనివార్య పరిస్థితులకి కొంత తల ఒగ్గినా రాజీ పడలేదు. అవకాశం కోసం ఎదురు చూసాను.

పక్షుల లాటివే తమ పిల్లల్ని భాద్యతాయుతంగా రెక్కలు వచ్చేవరకూ సాకుతాయి , వాటికి ఎగరడం వచ్చాక ఇక వాటి గురించి పట్టించుకోవు.విద్యా వివేకం వున్న మనషులు,ముఖ్యంగా స్తీలు మాత్రం జీవితాంతం నా తలితండ్రులు ,నా భర్త ,నాపిల్లలు ,నా మనుమలు ,ముని మనుమలు అనుకుంటూ జీవితమంతా బానిస భావంతో బతుకుతుంటారు చాలామంది.మరి నువ్వు చేసిందేమిటీ..? అని డైరెక్ట్ గా అడగకపోయినా కనీసం మనసులో అనుకుంటావని నాకు తెలుసు.

అందుకే నా ఆత్మ కధ నా ప్రాణ స్నేహితురాలివయిన నీకయినా చెప్పుకోవాలనిపించి వ్రాసాను .

హై స్కూల్ లో చదువుకున్నపుడువిరిసీ విరియని ప్రాయం ,తెలిసీతెలియని జ్ఞానం.”పిల్ల కాకికేమి తెలుసు ఉండేలు దెబ్బ అన్న సామెత ఉరికే పుట్టలేదు. స్త్రీ స్వాతంత్రం ,సమాన హక్కులు అంటూ ఉపన్యాసాలు ఇచ్చినంత తేలిక కాదు ,ఆచరణలో చూపడం అని నాకు అనుభవం లోకి వచ్చినపుడు కానీ తెలియలేదు .ఆ స్థాయికి ఎదగాలంటే ఆడదానికి ఆర్ధిక స్వాతంత్రం కావాలి,తన కాళ్ళమీద తాను నిలబడగలగాలి. అని అర్ధం చేసుకున్నాను

టెన్త్ ముగిసిన వెంటనే మెడలు వంచి తాళి కట్టించారు.తాళి సెంటిమెంట్ లేకపోయినా ఆ లేతవయసులో ఒంటరిగా సమాజాన్ని ఎదిరించి బతికే సాహసం చెయ్యలేకపోయాను. తరువాత తల్లినయ్యాక కొంత భావ పరిపక్వత,మనోబలం ఏర్పడినా,ఇద్దరు పిల్లల్నీ ఉన్నతంగా తీర్చి దిద్దాలంటే నాకు ఆర్ధిక బలం కావాలి,తగిన అండదండలు కావాలి .దానికోసం అత్తగారిని అంటిపెట్టుకొని,పిల్లల్ని

సాకకతప్పలేదు. వాళ్ళు ప్రయోజకులు అయ్యారు.ఎవరి దారిని వాళ్ళు రెక్కలు వచ్చి ఎగిరిపోయారు.

ఆదిత్య అమెరికాలో సెటిల్ అయ్యాడు ,ఐశ్వర్య పెళ్ళయిన నెలలోపే తన భర్తతో కలిసి ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. ఇక నేను ఎవరికోసం ,ఎందు కోసం ఆ బందిఖానాలో…!

మానసికంగా,శారీరకంగా ఇంతకాలం దహించివేసిన, దావానలాన్ని. ఆప్యాయతానురాగాలకి నోచుకోని ఒంటరి బతుకును ఇంకా భరించే ఓపిక ,అవసరం నాకు ఉంటాయనిపించలేదు. అందుకే సాహసించి గడపదాటి సువిశాల ప్రపంచంలో అడుగుపెట్టాడానికి నిశ్చయించుకున్నాను.

ఒకప్పుడు ఏ ఆస్తి కోసం పదుగురి ఎదుట నామీద చెయ్యి చేసుకున్నాడో ఆ పత్రాలపై సంతకం చేసి అతని ముందర పడేసి ,ఒక సూట్ కేస్ లో నావి కొన్ని చీరలు ,అవసరానికి కొంతడబ్బుపట్టుకొని గడప దాటబోతుంటే

”నన్నీ పరిస్తితిలో వదిలి ఎక్కడికి వెళ్తున్నావు ,..?”అని అడిగాడు సీరియస్ గా నాగరాజు.

”నీ స్థితి గతులతో నాకు పనిలేదు. నీ ఇంటి వారసులు  కోసం  నీ తల్లి నన్ను ఎదురు కట్నం ఇచ్చి తెచ్చుకుంది. నీ తల్లి చనిపోతానని బెదిరించిందని ఆమెకోసం నన్ను తల్లిని చేసావు. కన్నందుకు పిల్లల్ని పెంచి పెద్దచేసి ,ప్రయోజకుల్ని చేసి ,వారికొక మార్గం చూపే వరకూ తల్లిగా నా పాత్ర నేను పోషించాను .ఇక నాకు ఈ ఇంటితో ,బంధాలతో ఋణం తీరిపోయింది.నేను వెళ్తున్నాను ”వెనక్కి తిరిగి చూడకుండానే చెప్పాను .

”అంటే ..నా మీద కక్ష సాదిస్తున్నావా ?”

”అలా అనిపిస్తే దానికి నేను భాద్యురాలను కాదు .”

” నీకు అంత ఇష్టం లేనపుడు పెళ్ళయిన మర్నాడే తాళి తెంచుకొని పోకుండా నాకు పిల్లల్ని ఎందుకు కన్నావు..? ఇప్పుడు ఆ తాళికి ,తాళి కట్టిన వాడికి విలువ లేకుండా పోయిందా !”తీవ్రంగా అన్నాడు .

”ముందే చెప్పానుగా .రుణానుబంధంకి కట్టు బడ్డాను అని. పెళ్ళయిన కొత్తలోనే అన్నావు బారెడు పసుపు తాడు తో భార్య అవుతుందా ! ఆ పిల్ల మెడలో పసుపుతాడు నాకు బంధం వెయ్యలేదు అని ..ఆ రోజు ఎగతాళి చేసిన తాళి ఇప్పుడు విలువయినది అయిందా !”

” …నువ్వేమనుకున్నా,నువ్వు తల్లివి కావడానికి కారకుడిని నేను ,ఈ రోజు ఎంతో గొప్పగా పెంచాననుకుంటున్నబిడ్డలకి తండ్రిని నేను ..ఆ హక్కు,అధికారం నాకు లేవా ! ఇప్పుడు నిస్సహాయంగా వున్నానని కనీసం మానవత్వం లేకుండా వదిలేసి వెళ్తున్నావు.”చివరి అస్త్రం ప్రయోగించాడు.

”మీ పెరట్లో వున్నఆవు కూడా ఈనిన తర్వాత తన బిడ్డని ప్రేమగా సాకుతుంది ,కానీ ఆ దూడ జన్మ కారకుడు ఎవరు ..? అని వెతుకులాడదు.పసుపు తాడు పలుపు తాడు అయితే ,గోమాత కూడా కొన్ని సందర్భాలలో పలుపు తెంపుకొని,కట్టు రాటని కాల దన్నుతుంది…వివేకమున్న మనిషిగా పుట్టిన నేను ఇంకా ఆత్మాభిమానం చంపుకుంటే, పశువుకన్నా తక్కువే అవుతాను .ఇక మానవత్వం లేకుండా విడిచి వెళుతున్నాను అన్నావు ,నాలో మంచిని ,మమతని ,మానవత్వాన్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసి నన్నొక జీవచ్చవంగామార్చినది నువ్వే . ఆస్తి పిల్లల పేర వున్నా,బతికి ఉన్నంతవరకు అనుభవించే సర్వాధికారాలు నీవే కనుక నీ సేవలు చెయ్యడానికి ,అవసరాలు తీర్చడానికి వెలకి ఆలిని తెచ్చుకోవడం నీకు కొత్తకాదు .గుడ్ బై ”అని అతను పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాను .

ఎక్కడికి వెళ్ళాననే కదా నీ ప్రశ్న . ,నన్ను నా వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ,నాకోక సముచిత స్థానాన్నిచ్చి, నన్ను ఒక ఉన్నత మార్గంలో నడిపించి,నా జీవితానికొక సార్ధకత కలిగించిన చోటికి.,నా కధని,వ్యధని తెలుసుకొని పవిత్రమైన మనసుతో నా శ్రేయోభిలాషి ఒకరు చేయూతనిచ్చి నన్నాదుకొని ఆ నరక కూపం నుండి బయటకి లాగారు.వివరంగా  చెప్పాలంటే ;

నా పిల్లలిద్దరూ  ఎదిగి ఉహ తెలిసాక  ఎవరూ చెప్పకుండానే ఇంటి పరిస్థితి ,నా జీవితం ఎలా గడిచిందో తెలుసుకున్నారు .పిల్లల ప్రోద్బలంతో  కంప్యుటర్  కోర్సు లో చేరి  డిప్లొమా  సంపాదించాను ..గడపదాటి బయట అడుగుపెట్టడం అలవాటులేని  నాకు ప్రపంచాన్నే  నా గుప్పెట్లోకి  తీసుకొచ్చింది  అంతర్జాలం .కాలక్షేపం కోసం ఏవో చిన్న చిన్న ఆన్ లైన్ జాబ్స్ చేసేదాన్ని ఇంట్లో కూర్చొని . సోషల్ మీడియాల ద్వారా ప్రపంచ స్వభావ ,స్వరూపాల పట్ల కొంత అవగాహన  ఏర్పడింది  ‘

అలా లింక్డిన్  ద్వారా పరిచయమయింది  గాయత్రి అనే ఆమె .ఆమె అమెరికాలో  ఒక  ఐ టి కంపెనీ  CEO.  . ఆమె అప్పచెప్పిన పనులు కొన్ని చేసేదాన్ని .ఆమెకి  నాపై బాగా గురి కుదిరింది .ఆ విధంగా  పరిచయం  స్నేహంగా  మారి ,ఒకరి  విషయాలు ఒకరు చెప్పుకోనేంత  సన్నిహితులయ్యాము .ఆమెది  కూడా ఇంచుమించు నా కధ లాటిదే .ఎవరో బంధువుల సహకారంతో అమెరికా వెళ్లి ,నిలదొక్కుకొని ,మంచి స్థాయికి ఎదగడమే కాదు ,ఎందరికో సహాయ సహకారాలు అందించింది .

నా గురించి వివరాలు తెలుసుకొని నన్ను తనవద్దకు వచ్చెయ్యమని ,తనకి చేదోడు వాదోడుగా వుంటూ ,అవసరమయితే  పై కోర్స్ లు కూడా చేసి   ఐ టి  కంపెనీలో  ఒక స్థాయిని,స్థానాన్ని సంపాదించవచ్చని ,ఎలాగూ అబ్బాయి ఆదిత్య అక్కడే వున్నాడు కనుక తనవద్ద వుండడం ఇష్టం లేకపోతె కొడుకు వద్ద ఉంటూనే ,నా కాళ్ళ మీద నేను నిలబదవచ్చని సలహా ఇచ్చింది గాయత్రి  .రెండుతరాలలో ఎదురు దెబ్బలు తిన్న నేను పిల్లల తరంలో వారి పంచన చేరి అక్కడ కూడా వారికి ఇబ్బంది కలిగిస్తూ ,నాకొక వ్యక్తిగత స్వతంత్రం  ఇప్పుడు కూడా  లేకుండా బతకడం నాకు ఇష్టం లేదు .అదే మాట గాయత్రికి  చెప్తే ,నా నిర్ణయాన్ని  ఆమె కూడా హర్షించింది.

ఐశ్వర్య  పెళ్లి నిశ్చయం అవగానే గాయత్రికి  నాకు అమెరికా వెళ్ళే ఏర్పాట్లు  చెయ్యమని  చెప్పాను . పిల్లలికి కూడా తెలియకుండా  అన్ని ఏర్పాట్లు  జరిగిపోయాయి .అంతే ..నాకు ఆ ఇంటికీ  బంధం తెగిపోయింది ..ఇంచుమించు  ఐదు సంవత్సారాలనుండి  న్యూయార్క్ లో ఉంటున్నాను .కంపెనీ పనిమీద సింగపూర్ రావడం ,నిన్ను తలవని తలంపుగా కలియడం , నువ్వు  వివరాలు అడగడం   నా గతాన్ని మరొకసారి కళ్ళముందుకు తీసుకొని వచ్చాయి .

నా జీవితం నాకు నేర్పిన పాఠం ఒక్కటే ;

ఆడది అబల కాదు మగవాడి అండదండలు లేకుండా ఆడవాళ్ళు ఈప్రపంచంలో మనుగడసాగించలేరు అనుకోవడం పొరపాటు .వైవాహిక వ్యవస్థని , ,భార్యాభర్తల అనుబంధాన్ని కించపరచడం నా అభిమతం కాదు .ఆడదానికి మగవాడి ఆలంబన ఎంత అవసరమో ,మగవాడికి ఆడదాని ఆసరా అంతే అవసరం .ఈ నిజం గ్రహించగలిగినప్పుడే వివాహ బంధాలు పటిష్టం అవుతాయి .నేడు పెళ్లి ఒక ఒప్పందం ,వ్యాపారంగా మారడం వల్లనే ఈ వ్యవస్థ నానాటికీ కుప్పకూలి పోతోంది. పుట్టింటి వారు సహకరించాలేదనో ,భర్త  అనుకూలంగా లేడనో ,పిల్లలు  ఎదురుతిరిగారనో ,పరిస్తితులు  ప్రతికూలంగా  ఉన్నాయనో ,పిరికి తనంతో చదువు సంద్యలు వుండి కూడా   ఎందఱో మహిళలు ఆత్మ హత్యకి పూనుకోవడమో  లేక ఆత్మ న్యూనతా భావం తో జీవితాంతం క్రుంగి కృశించి పోవడమో  చేస్తుంటారు ..సమస్య ఎంత జటిలమైనా సాహసంతో ఎదుర్కొనే  సహనం ,సంస్కారం ,బుద్దికుశలత ఆడవారిలో వున్నాయి ..వాటిని ఆయుధంగా  చేసుకొని  మహిళలు విజేతలు కాగలగాలి ..ఏమంటావ్ ..!

ఆ రోజు ఎయిర్ పోర్ట్ లో కొన్ని క్షణాలు మాత్రమె మనం కలిసాము .ఆ కొన్ని క్షణాలలో కొన్ని వేల సందేహాలు నీ ముఖంలో చూసాను. . నీ కనెక్షన్ ఫ్లైట్ వైపు పరుగులెడుతూ   విషయాలన్నీ వివరంగా వ్రాయమంటూ నీ ఈమెయిలు ఐ డి ఇచ్చావు. సరే .నీ ముచ్చట ఎందుకు కాదనాలి అని వివరంగా వ్రాసేశాను . నీ పశ్నలలో కొన్నిటికయినా జవాబు దొరుకుతుందని నా స్వ ‘గతాన్ని’ ఇలా టైపు చేసి పంపుతున్నాను..దశాబ్దాల అనుభవాల్ని ,జీవిత విశేషాలను కొన్ని క్షణాలలో మన కళ్ళముందు ఆవిష్కరించగలుగుతున్న అంతర్జాల మహేంద్ర జాలానికి నిజంగానే మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి .

మానసా ! నా యీ జీవన సమరంలో గెలిచి ఓడానా,!ఓడి గెలిచానా ! నువ్వే చెప్పాలి .

వెంటనే జవాబు వ్రాస్తావు కదూ…..

నీ

ప్రియమైన ‘నీలూ’

( నీలాంబరి )

” నువ్వు అపరాజితవి నీలూ..”

నీళ్ళు నిండిన కళ్ళతో ఒకే ఒక్క వాక్యం టైప్ చేసింది మానస ..


ఉమాదేవి అద్దేపల్లి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.