ఆత్మవిశ్వాసం – ప్రత్యేక బహుమతి పొందిన కధ

0
584

ఆత్మవిశ్వాసం


ఉదయం ఎనిమిదయ్యింది. ఆరోజు ఆదివారం. వంటగదిలో టిఫిన్ చేస్తూ ఆలోచనలలో నిమగ్నమై ఉన్న రాధికకి ‘ఇదిగో దీనిని అవతలికి తీసుకుఫో!’ అన్న గోపాల్ అరుపు వినపడింది. ఉలిక్కిపడి ఏం జరిగిందోనని చేస్తున్న పని ఆపి పరుగు పరుగున హాల్లోకి వచ్చింది . ఏడాదిన్నర చంద్రిక తండ్రి అరుపులకి ఝడుసుకుని ఏడుపు లంకించుకుంది . చిరాకుగా ఉన్న గోపాల్ ని చూసి “ఎందుకు పసిపిల్లని అలా కసురుకుంటారు?” అంటూ ఏడుస్తున్న పాపని ఎత్తుకుని బాల్కనీలోకి తీసుకెళ్ళింది.

ఇది ఇవాళ కొత్తకాదు, కూతురు చంద్రిక అందరి పిల్లల వంటిది కాదు ‘ప్రత్యేకమైన పాప’ అని తెలిసినప్పటినించి తరచూ అయినదానికీ కాని దానికీ పాపని కసురుకుంటున్నాడు గోపాల్ .
ఏడాది పుట్టినరోజు తరువాత కొన్నిరోజుల వరకు బాగానే ఉంది చంద్రిక. వినికిడి శక్తి, నడవటం వచ్చినప్పటికీ మాటలు మాత్రం రాలేదు. కొంతమందికి మాటలు ఆలస్యంగా వస్తాయని తెలుసు కనుక ఆ విషయమై పెద్దగా కలతపడలేదు.

కానీ తరువాత తరువాత చిన్న చిన్న శబ్దాలకి విపరీతమైన అలజడికి లోనవడం, కీచుగా అరవడం , కావలసినది ఏదైనా ఇవ్వకపోతే పెద్దగా అరచి గోల చేయడం….లాంటివి చేస్తుండటంతో ఆందోళనచెంది డాక్టర్ కి చూపిస్తే చంద్రిక ఎదుగుదల సరిగా లేదని పాప ఒకరకమైన బుద్ధిమాంద్యత కలిగి ఉందని తెలిసింది. పాప చూపించేవన్నీ కూడా ఒక రకమైన ‘బుద్ధిమాంద్యత’(ఆటిజం) లక్షణాలేనని తెలిసింది.
అంతే అప్పటినుండీ గోపాల్ పాపని దగ్గరకి తీసుకోకపోగా పాప ఎదురుపడితేనే చిరాకు పడుతున్నాడు.
పాప పట్ల భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పు రాధిక మనసుని కలతకి గురిచేసింది . ఏడుస్తున్న చంద్రికని ఓదారుస్తున్న రాధిక ఆలోచనలు గతంలోకి తొంగిచూసాయి………………


అందమైన విశాఖపట్టణం నగరం విశాలమైన రహదారులతో ‘ఉంటే ఇలాంటి పట్టణంలో ఉండాలి’ అనేలా అందరినీ ఆకర్షిస్తున్నది. నగరంలో అభివృద్ధి చెందుతున్న ప్రదేశమైన మధురవాడలో ఒక ఇల్లు కొనుక్కుని ఈ మధ్యనే గృహ ప్రవేశం చేసుకుని ప్రవేశించారు విజయ, విష్ణు. ఆ దంపతులకి ఇరువురు అమ్మాయిలు. విష్ణు ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పెద్ద పదవిలో ఉన్నాడు. ఆఫీసు పనిమీద తరచూ విదేశాలు వెళ్ళి వస్తుంటాడు.

విజయ తెలుగు భాషలో పి.హెచ్.డి. చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం తాలూకు అనుబంధిత కాలేజీలోని తెలుగు విభాగంలో ప్రొఫెసర్ గా పని చేస్తోంది. భర్త ఒక నెల రోజుల పాటు విదేశాలు వెళ్ళి ఉండటంతో, పిల్లల్ని స్కూలుకి పంపించి పని ముగించుకుని తను కూడా గబగబా తయారై కాలేజీకి బయలుదేరుదామని అనుకుంటుండగానే ఫోను మ్రోగింది.

అవతల సమయం మించిపోతోంది. తీద్దామా వద్దా అనుకుంటూనే ఎవరైనా అత్యవసరమై చేస్తున్నారేమో అనుకుంటూ తాళం వేయబోయినదల్లా తిరిగి ఇంట్లోకి వచ్చి ఫోన్ తీసి “హలో!” అంది
“ఇవాళ సెలవట , మీకు తెలుసా విజయా?” అవతలినుండి రాధిక స్వరం
“అవునా, తెలియదే! సెలవైతే మనకి మెసేజ్ రావాలే, ఇప్పటిదాకా నాకేమీ రాలేదు. నేను తాళంవేసి కాలేజీకి బయలుదేరుతూ ఫోన్ వచ్చిందని మళ్ళీ లోపలికి వచ్చాను. పోనిలే మంచిపనే అయింది. అవును సెలవని నీకు ఎవరు చెప్పారు?”
“ఇప్పుడే సరళ ఫోన్ చేసి చెప్పింది”
సరళ రాధిక వద్ద రీసర్చి చేస్తున్న విద్యార్థిని.
“అవునా! సరే ఉండయితే, నేనూ కాలేజీకి ఫోన్ చేసి కనుక్కుని చెప్తాను”
“సరే” అని ఫోన్ పెట్టేసింది రాధిక
కాసేపటికే రాధిక సెల్ మ్రోగింది.
“నువ్వు చెప్పింది నిజమే! కాలేజి వ్యవస్థాపకులలో ఎవరో హఠాత్తుగా చనిపోయారని సెలవు ప్రకటించారుట”
విజయకి థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేసి కాలేజీకి వెళ్లాలనే హడావిడి లేదు కాబట్టి నెమ్మదిగా దైనందిన కార్యక్రమంలో నిమగ్నమయింది రాధిక.


రాధికా వాళ్ళది మధ్య తరగతి కుటుంబం. తండ్రి పరమేశంగారు బ్యాంకులో సీనియర్ క్లర్కు . తల్లి శారద గృహిణి. రాధిక చెల్లెలు నళిని, డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉంది .
రాధికా వాళ్ళది రెండు గదులు వంటిల్లు ఉన్న సొంత ఇల్లు. తోటపని అంటే ఎంతో ఇష్టమైన రాధిక ఇంటికి నాలుగువైపులా ఉన్న ప్రాంగణాన్ని రకరకాల పూలమొక్కలతో నింపేసింది. రోజూ సాయంత్రం తప్పనిసరిగా ఒక గంటసేపైనా తోటలో మొక్కల సంరక్షణలో గడపనిదే తోచదు ఆమెకు .
పరమేశంగారు పదవీ విరమణలోగా పెద్ద కూతురు రాధికకి పెళ్లిచేద్దామని సంబంధాలు చూడసాగారు.
కానీ ఈలోగానే హఠాత్తుగా గుండెపోటు రావడంతో స్వర్గస్థులయ్యారు పరమేశంగారు. సంసార బాధ్యత రాధిక భుజస్కంధాలపై పడింది .

పదవిలో ఉండగానే పరమేశంగారి మరణం సంభవించినందువలన ఆ ఉద్యోగం రాధికకు ఇస్తామని బ్యాంకువారు తెలిపారు. కానీ అప్పటికే రాధిక ఉద్యోగం చేస్తున్నందున పరమేశంగారి తరఫున నళిని బ్యాంకులో క్లర్కుగా వరంగల్ శాఖలో చేరింది.


సెలవు కావడంతో తోటలో మొక్కలకు పాదులు తవ్వుతోంది రాధిక.
ఇంతలో “రాధికా!” అంటూ తల్లి పిలుపు వినిపించింది.
“వస్తున్నానమ్మా” అంటూ చేస్తున్న పని ఆపి ఇంట్లోకి వచ్చింది రాధిక.
“ఏమిటమ్మా?”
“హైదరాబాదునుండి ఫోన్ వచ్చింది. మన సంబంధం చేసుకుంటారట నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించి తెలియజేయమన్నారు”
“ఓహో!”
“పురోహితులు శాస్త్రిగారికి ఒకసారి రమ్మని ఫోన్ చెయ్యి”
శాస్త్రిగారి నెంబరు డయల్ చేసి ఫోన్ తల్లి చేతికి ఇచ్చింది.
“హలో శాస్త్రిగారూ నమస్కారం . నేను శారదను?”
“అమ్మా! మీరా, నమస్కారం. చెప్పండమ్మా?”
“మీరు ఒకసారి వీలుచూసుకుని మాఇంటికి రావాలి”
“అలాగేనమ్మా తప్పక వస్తాను”
“సంతోషం శాస్త్రిగారు” అని ఫోన్ రాధిక చేతికి ఇచ్చేశారు శారద.
ఇంకా అక్కడే నిలబడి ఉన్న కూతురిని చూసి
ఏదో చెప్దామని సందేహిస్తున్న కూతుర్ని చూసి “ఏమిటి రాధికా?” అన్నారు శారద
“ఈ నిశ్చితార్థం అవసరం అంటావా? ఏకంగా పెళ్లికే ముహూర్తము పెట్టించేస్తే ఖర్చు తగ్గుతుందిగా?”
“అబ్బాయి తరఫు వాళ్ళకి నిశ్చితార్థం ఆచారం ఉందిట అందుకని తప్పనిసరిగా జరిపించవలసినదే అని గట్టిగా పట్టుబట్టారు”
“ఓహ్! అలాగా” అని ‘ఏమిటో ఈ చాదస్తాలు, అనవసరపు ఖర్చులు. కాలం మారినా కొన్ని కొన్ని మారటంలేదు’ అనుకుంటూ తిరిగి తోటలోకి వచ్చింది.
తోటపని చేస్తుండగానే ఒక్కసారిగా విపరీతమైన కడుపునెప్పి రావడంతో తల్లికి చెప్పి గదిలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లిపోయింది.
కొంతసేపటికి రాధికకి ఎలా ఉందో కనుక్కుందామని వచ్చి ఆమె ముడుచుకుని పడుకుని ఉండటం చూసి
‘ఏమిటో ఈ నెప్పి వచ్చినప్పుడల్లా మెలికలు తిరిగి పోతుంది. రాధికకి ఈ బాధ ఎప్పుడు తగ్గుతుందో’’ అనుకుని బాధగా నిట్టూర్చి తలుపు దగ్గరగా లాగి వెళ్ళిపోయారు శారద.
నాలుగు రోజుల తరువాత వచ్చారు శాస్త్రిగారు. పంచాంగం చూసి రాధిక నిశ్చితార్థానికి ముహూర్తం నిశ్చయించారు.
ఈ సంతోషకరమైన విషయం వెంటనే ఫోన్ చేసి చెప్పింది విజయకి.
రాధిక కాబోయే భర్త పేరు గోపాల్. అతడి తండ్రి బ్రహ్మంగారు కోటీశ్వరులు. ఆయన ఈ మధ్యనే పదవీ విరమణ చేశారు. తల్లి సరస్వతి గృహిణి .
గోపాల్ కు ఒక సవితి అక్క. ఆమె వివాహానంతరం అమెరికాలో స్థిరపడింది.
ఇరువైపుల ఖర్చు భరించి నిశ్చితార్థం చాలా అట్టహాసంగా చేశారు బ్రహ్మంగారు.
రాబోయే నెలలో రాధికా గోపాల్ వివాహానికి ముహూర్తం నిశ్చయించబడింది.


“మాతృక” కాలేజీలో విజయ తెలుగు విభాగంలో ప్రొఫెసర్. అదే కాలేజీలో రాధిక జీవశాస్త్రంలో ప్రొఫెసర్. విభాగాలు వేరైనప్పటికీ, వయోభేదం ఐదేళ్ళు ఉన్నప్పటికీ ఇరువురి మధ్య అనతికాలంలోనే గాఢమైన స్నేహబంధం ఏర్పడింది.
సన్నిహితురాలైన విజయకి తన వివాహం నిశ్చయమైన వార్త ముఖస్తూ చెప్దామని కాలేజీకి ఆ రోజు గంట ముందుగానే వచ్చింది రాధిక.
“హాయ్! రాధిక ఏమిటి ఇవాళ తొందరగా వచ్చేశావు?”
“మీకో మంచి వార్త చెప్దామని!”
“ఓహో! చెప్పు.. చెప్పు”
“నా వివాహం నిశ్చయమైంది. అతని పేరు గోపాల్ , ఎం . బి.ఎ . చేశారు. హైదరాబాదులో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. వచ్చే నెలలోనే పెళ్ళి”
“అయితే అమ్మాయిగారు త్వరలో హైదరాబాదు చెక్కేస్తారన్నమాట!”
విజయ మాటలకి సిగ్గుగా నవ్వింది రాధిక.


నెల రోజులలో వార్షిక పరీక్షలు ఉండటంవలన పనిఒత్తిడిలో కొన్నిరోజులై రాధికని పలకరించటానికే వీలుపడలేదు విజయకి.
మధ్యాహ్నం భోజన సమయమప్పుడు రాధిక నీరసంగా ఉండటం గమనించి “ఏమైంది రాధికా?” అని అడిగింది
“పొత్తికడుపులో చాలా నొప్పిగా ఉంది, నెలసరి మొదలైతే 15 – 20 రోజులదాకా తగ్గటంలేదు. ఒక్కొక్కసారి పదిహేను రోజులకే మళ్ళీ మొదలవుతుంది , ఒక్కొక్క సారి కొన్ని నెలల దాకా మళ్ళీ రాదు”
“ఎప్పటినించి ఇలా?”
“చాలా కాలంనించీ ఉంది కానీ ఈ మధ్యన ఇంకా ఎక్కువైంది”
“అయితే మరి డాక్టరుకి చూపించుకోలేదా?”
“చూపించుకున్నాను కానీ ……”
రాధిక సమస్య అర్థమైంది విజయకి. తనకు బాగా తెలిసిన మంచి గైనకాలజిష్టు పేరు చెప్పి, సంప్రదించమని సలహా ఇచ్చింది . డాక్టర్ వివరాలు వ్రాసుకుంది రాధిక.


నిశ్చితార్థం తరువాత గోపాల్ విశాఖపట్నం ఏదో ఒక పని కల్పించుకుని రాధికని తరచూ కలవడానికి వస్తుండేవాడు. అలాంటిది ఒక నెలరోజులై పని వత్తిడి మీద హైదరాబాదు నుండి కదలడానికే వీలుపడలేదు.
“రాధికా!” ఫోన్ లో గోపాల్ స్వరంలో అపరిమితమైన ప్రేమ.
“ఊ……”
“ఎలా ఉన్నావు?”
“బాగానే ఉన్నాను”
“నెల రోజులైంది నిన్ను కలవక. చూడాలని ఉంది”
“నాకూ మిమ్మల్ని చూడాలని ఉంది”
“అయితే ఇంకేం వచ్చేయ్!”
“మరి ఉద్యోగమో?”
“ఇంక మానేయవచ్చుగా?”
“పరీక్షలు దగ్గరలో ఉన్నాయి. సిలబస్ పూర్తిచేయకుండా ఇప్పుడే మానేస్తే పాపం స్టూడెంట్స్ కి ఇబ్బంది అవుతుంది”
“పోనీ! నేను ఉద్యోగం మానేసి వచ్చేయనా?”
“అమ్మో! అంతపని చేయకండి గోపాల్ . అయినా ఇంకా కొన్ని రోజులేగా!”
“అదే కదా బాధ ! ఇప్పటికే రోజొక యుగంలా గడుస్తుంటే నాకు”
“అబ్బాయిగారికి మరీ అంత తొందరైతే ఎలా?”
“ఆహా…..!” అన్న గోపాల్ పలుకులకి
“ఊహూ…”! చిలిపిగా సమాధానమిచ్చింది రాధిక .
హాయిగా నవ్వుకుంటూ చాలా సేపటివరకు సరససల్లాపాలాడుకుంటూ కాలాన్ని మర్చిపోయారు ఇరువురూ!!


ఇంకో రెండు రోజులలో కాలేజీలో పరీక్షలు అయిపోతాయనగా ఒకనాడు “డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నావా?” రాధికని అడిగింది విజయ.
“వెళ్ళాను”
“ఏమన్నారు?”
“ఆందోళన చెందవలసిన అవసరంలేదని, ఇప్పుడు ఈ సమస్య చాలా మందికి ఉంటోందని, క్రమం తప్పకుండా మందులు వాడితే ఫలితం ఉండవచ్చన్నారు”
“అవునా సరే అయితే జాగ్రత్తగా మందులు వాడు మరి”
“సరే” అన్నట్లు తలూపి బ్యాగులోంచి శుభలేఖ తీసి విజయకి ఇస్తూ “మీరు కుటుంబ సమేతంగా తప్పక రావాలి” అని పెళ్ళికి ఆహ్వానించింది రాధిక .
“నీ పెళ్ళికి నేను రాకుండా ఉంటానా! పిల్లలు కూడా నీ పెళ్ళి వార్త విన్నప్పటినుండి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. మరొకసారి అభినందనలు అందుకో” నవ్వుతూ రాధిక చేయిపట్టి ఊపేసింది విజయ.


సమయం వేగంగా పరుగుపెట్టి రాధిక పెళ్లిని ఇంకో పది రోజుల్లోకి తెచ్చింది.
పెళ్లి బట్టలు కొనడానికి బజారుకి వెళ్ళి అప్పుడే వచ్చారు రాధిక, శారద.
ఇంతలో సెల్ మ్రోగుతున్నట్లనిపిస్తే ‘నా ఫోన్ కాదే? అమ్మకి వేరే ఫోన్ లేదు! మరి ఇంకెక్కడినించి వస్తోంది ఆ శబ్దం?’ ఆలోచిస్తుంటే జ్ఞాపకం వచ్చింది ‘బహుశః గోపాల్ కొనిచ్చిన కొత్త ఫోన్ అయుంటుంది” అనుకుంటూ గదిలోకి పరుగెత్తి టేబుల్ పైనున్న సెల్ తీసి చూడగా 5 మిస్డ్ కాల్స్ ఉన్నాయి.
‘అయ్యో! పాపం ఎంత సేపటినించి చేస్తున్నారో?’ అనుకుంటూ వెంటనే కాల్ చేసింది.
“హలో!”
“హలో! రాధిక ఏమైపోయావు? ఎంత కంగారుపడుతున్నానో తెలుసా?”
“సారీ!…సారీ! అమ్మతో బజారుకి వెళ్ళాను. ఈ కొత్త ఫోన్ ఇంట్లోనే ఉంది. ఇంట్లో అడుగుపెట్టగానే మళ్ళీ ఫోన్ మ్రోగడంతో ఇప్పుడే చూశాను”
“నాకు ఇప్పుడే నీ దగ్గర వాలిపోవాలని ఉంది”
“మరైతే వచ్చేయండి”
“ఆ మాట నీ నుండి వినాలనే ఎదురుచూస్తున్నాను ఇప్పుడే ఈ ఉద్యోగం మానేసి నీ దగ్గరికి వచ్చేస్తాను”
“ఇలా గోపాల్ ఉద్యోగం మానేస్తాను అనడం ఇది రెండోసారి” అనుకుని ఆ మాటలని బట్టి అతని మనస్తత్వం అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ మౌనంగా ఉండిపోయిన రాధిక “మాట్లాడవేం?” అన్న గోపాల్ స్వరానికి బదులిస్తూ “తొందరలోనే మీ దగ్గర ఉంటానుగా. కొంచం ఓపిక పట్టండి” అంది
“ఐ.లవ్.యు. రాధికా”
“ఐ.లవ్.యు. టూ గోపాల్” అని ఫోన్ పెట్టేసి హాలులోకి వెళ్ళింది.
మధ్యాహ్నం గోపాల్ తో జరిపిన సంభాషణే మనసులో పదే పదే మెదలుతుండగా ఆ రాత్రి చాలా సేపటివరకు నిద్ర పట్టలేదు రాధికకు.
‘గోపాల్ మనిషి చాలా మంచివారే కానీ బాధ్యతలంటే అంతగా ఇష్టం ఉన్నట్లు అనిపించడం లేదు. కాకపోతే పదే పదే ఉద్యోగం మానేస్తానని ఎందుకు అనవలసి వస్తోంది? పైగా తరచూ తాము చాలా ధనవంతులమనే దర్పాన్ని మాటలలో ప్రదర్శించడం కూడా తను గమనించింది. ఏమో అతనితో జీవితం ఎలా ఉండబోతోందో?” అని పరిపరి విధాల ఆలోచిస్తూ ఉండిపోయింది.


కుటుంబ సమేతంగా రాధిక పెళ్ళికి వెళ్లింది విజయ. భర్త గోపాల్ ని పరిచయం చేసింది రాధిక. అతని మాట తీరు మర్యాదస్తుడని తెలుపుతోంది. మనిషి చాలా డాబుగా కనిపిస్తున్నాడు.
రాధిక అత్తమామలు చాలా సౌమ్యులుగా అనిపించారు. అత్తారింటి వారు రాధికని బంగారు నగలతో ముంచెత్తారు.
ఒకవైపు గోపాల్ తో ఇంకోవైపు అత్తగారితో కబుర్లలో పడిన రాధికని చూసి ఆమె ఎంతో అదృష్టవంతురాలు అనుకుంది విజయ.
కూతురి పెళ్లి ఉన్నంతలో బాగానే జరిపించిన శారదకి ఆ సమయంలో భర్తలేని లోటు స్పష్టంగా కనిపించింది. మనసులో బాధపడినా భర్త తనకు అప్పజెప్పివెళ్ళిన బాధ్యతను దిగ్విజయంగా నిర్వర్తించగలిగానని తృప్తిచెందారు.
కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నానన్న ఆనందం రాధిక ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆమె జీవితం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లాలని మనసారా ఆశీర్వదించింది విజయ…..
రాధిక ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోతున్న సందర్భంగా ఆమెకు పార్టీ ఇద్దామని దగ్గరలోనే ఉన్న హోటలుకి తీసుకునివచ్చింది విజయ.
“వైజాగ్ వచ్చినప్పుడు వీలుచేసుకుని కలిసి వెళ్ళు”
“తప్పకుండా”
“అన్నట్లు నీ ఒంట్లో ఇప్పుడు ఎలా ఉంటోంది?”
“మునుపటి కంటే ఇప్పుడు చాలా నయం. గైనకాలజిష్టుని నిన్న మళ్ళీ వెళ్ళి కలిసాను. వివాహమైందని హైదరాబాదు కాపురం వెళుతున్నానని చెప్పాను. కొన్ని మందులు వ్రాసి ఇచ్చి వాడుతుండమని అంతా సరి అవ్వడానికి కొంత సమయం పడుతుందని, కలత చెందవలసిన పని లేదని చెప్పారు . అక్కడ ఆమె స్నేహితురాలు, ఒక గైనకాలజిష్ట్ నంబరు ఇచ్చి అవసరమైతే ఆవిడని సంప్రదించమని చెప్పారు.”
“అవునా? చాలా సంతోషం”
“మీకు చాలా చాలా థ్యాంక్స్”
“ఇందులో నేను చేసిందేముంది . ఆవిడ వైద్యం నీకు పని చేసి నీ సమస్య తీరితే నాకంతే చాలు”
“ఎల్లుండి గోపాల్ వస్తున్నారు హైదరాబాదు తీసుకెళ్ళడానికి”
“మీ దాంపత్యజీవితం ఆనందంగా జరగాలని కోరుకుంటున్నాను”
“థ్యాంక్స్ విజయ!”
రాధికకి వీడ్కోలు చెప్పి వచ్చేసింది విజయ.


రాధిక కాపరానికి వెళ్ళి ఆరునెలలైంది. ఇద్దరూ కనీసం వారానికి ఒకసారైనా ఫోనులో మాట్లాడుకుంటూనే ఉన్నారు.
ఒకనాడు విజయ లంచ్ టైమ్ లో స్టాఫ్ రూంలో కూర్చుని ‘రాధిక లేకపోతే ఏమి తోచటం లేదు . అంతటి మంచి స్నేహితురాలు దొరకడం నిజంగా నా అదృష్టం’ అనుకుంటుండగానే “మేడమ్ మీకు ఫోన్” అంటూ వచ్చాడు బంట్రోతు ధర్మయ్య.
“ప్రొద్దున్న హడావిడిలో సెల్ ఫోన్ మర్చిపోయాను, ఎవరు చేశారో?’ అనుకుంటూ ధర్మయ్య వెనకాలే వెళ్లింది.
“హలో! ఎవరు?”
“ నేను రాధికని. బాగున్నారా?”
“హాయ్! ఎలా వున్నావు?ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను ఇంతలో నీ ఫోన్”
“నేను బాగానే ఉన్నాను”
“ఏమిటి విశేషం ఈ వేళప్పుడు చేసావు?”
“నాకు ఇక్కడ ఒక కాలేజీలో ప్రొఫెసర్ గా ఉద్యోగం వచ్చింది. ముందుగా మీకు చేప్దామని”
“అబ్బ! ఎంత మంచి వార్త! హృదయపూర్వక అభినందనలు”
“ధన్యవాదములు అధ్యాపికగారు” అంటూ రాధిక కూడా అచ్చ తెలుగులో చెప్పి నవ్వి “సరే ఇంక ఉండనా?”
“అలాగే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో” అని ఫోన్ పెట్టేసింది విజయ.
కాలగమనంలో మరో పదేళ్ళు గడిచిపోయాయి.


గడచిన పదేళ్ళ కాలంలో విజయ జీవితంలో పెద్దగా మార్పులు రాకపోయినా రాధిక జీవితం మాత్రం కలతల కావిడి అయ్యింది….
వైద్యం చేయించుకున్నప్పటికీ ఎంతకాలమైనా సంతానం కలుగలేదు రాధిక గోపాల్ దంపతులకు.
కొంతమందికి ఆలస్యంగా పిల్లలు పుడతారని, నిరాశకు లోను కావొద్దని విజయ కూడా ఎంతో ధైర్యం చెప్పింది. తాను ఎప్పటికైనా తల్లిని అవుతానని విశ్వాసంతో రోజులు గడిపింది రాధిక.
కానీ లోకం మాత్రం ఆమెపై గొడ్రాలనే ముద్రవేసింది!
ఒకసారి పిన్నత్తగారి మనవడి నామకరణ మహోత్సవానికి అత్తగారితో కలిసి విజయవాడ వెళ్ళింది రాధిక.
పిల్లలంటే అమితమైన ప్రేమ ఉన్న రాధిక ముద్దులు మూటగారే పిల్లవాడిని ఎత్తుకుంది.
అంతే పిన్నత్తగారు గబగబా వచ్చి రాధిక చేతులలోంచి పిల్లవాడిని తటాలున లాక్కుని ‘నీకెన్ని సార్లు చెప్పాను పిల్లవాడిని అలా ఎవరుపడితేవాళ్ళ చేతులకు ఇవ్వద్దని? కాస్త గమనించుకోవక్ఖరలేదా?’ అంటూ కోడలిని చీవాట్లు పెట్టింది.
రాధిక చేష్టలుడిగి నిల్చుండిపోయింది.
‘ఏమనుకోకూ.. గొడ్రాలు పిల్లల్ని ఎత్తుకుంటే చేటు అందుకని…….’ అన్న పిన్నత్తగారి అగ్నిలాంటి మాటలకి ఆజ్యం పోస్తున్నట్లుగా అత్తగారు తనవైపు అదోలా చూడడంతో రాధిక మనసు దెబ్బతింది.
‘కాలం ఎంతో మారిందని అంటున్నా ఇటువంటి విషయాలలో ఇంకా వెనుకబడే ఉన్నాము. నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని ఎవరూ చెప్పలేదుగా? అసలు ఇందులో నా తప్పేంటి?
నన్ను గొడ్రాలినని అవమానించే హక్కు వీళ్లకెవరిచ్చారు? నాకు మాత్రం తల్లి కావాలని ఉండదా? ఒక చిన్న పాపాయిని ఒడిలో ఆడించాలని నేనెంత తపిస్తున్నానో ఎవరికి తెలుస్తుంది?’ అంటూ రోజూ రాత్రుళ్లు తలగడ తడిసేలా ఏడవటం పరిపాటి అయిపోయింది రాధికకి.
అత్తమామలు, ఆడపడుచు సూటిపోటి మాటలతో బాధించడం, చుట్టుపక్కల వాళ్ళు శుభకార్యాలకి పిలవకపోవడం…..లాంటివి జరగడంతో చేయని తప్పుకి శిక్షి అనుభవిస్తూ రాధిక మానసికంగా బాగా కృంగిపోయింది.
అన్నీ భరిస్తూ తనని తాను ఓదార్చుకుంటున్నప్పటికీ, మనవలతో ఆడుకుందామని అత్తమామలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలిసి ‘ఎంత దురదృష్టవంతురాలిని ఈ ఇంటి కోడలిగా వీళ్లకి ఒక వంశాంకురాన్నిఇవ్వలేకపోయాను’ అనుకుని దుఃఖించింది.
‘అన్నింటికీ ఆ దైవమే ఉన్నాడు’ అని నమ్మి కాలం వెళ్ళదీసింది రాధిక.


పూజలు, నోములు ఫలించి పెళ్ళైన పదకొండు సంవత్సరాల తరువాత నెల తప్పింది రాధిక.
ఈ సంతోషవార్త విజయతో పంచుకుందామని ఫోన్ చేస్తే ‘ఈ నంబరు మనుగడలో లేదు’ అని వచ్చింది అటు విజయ భర్తకి ఆఫీసు పనిపై అమెరికా వెళ్లవలసి రావడంతో కుటుంబ సమేతంగా అమెరికాకు తరలి వెళ్ళిపోయారు ఆ దంపతులు.
వెళ్ళేముందు రాధికకి ఫోన్ చేసి చెప్దామని ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమైంది విజయ కూడా.
రాధిక అమ్మగారింటికి కూడా తాళం పెట్టి ఉండటం చూసి ‘ఏమై ఉంటుందో?’ అనుకుంది.
ఆ తర్వాత ప్రయాణం హడావిడిలో మరి ఆ విషయమై వాకబు చేయడం కుదరలేదు.
అమెరికా వెళ్ళాక కూడా ఎప్పుడు రాధికకి ఫోన్ చేసి మాట్లాడదామని ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమైంది. ఇక చేసేదేమీలేక ఆ ప్రయత్నమే విరమించుకుంది విజయ.


నెలలు నిండిన రాధిక పండంటి కూతురుని ప్రసవించింది. పాప చూడటానికి బొద్దుగా ముద్దుగా ఉంది.
మనవరాలిని చూసుకున్న అత్తామామల ఆనందానికి అవధులు లేవు. ఒకప్పుడు గొడ్రాలివని దెప్పి పొడిచిన ఆడపడుచు కూడా రాధికకు మనఃస్ఫూర్తిగా క్షమార్పణలు తెలిపి మేనకోడలుకి అమూల్యమైన కానుకలు పంపించింది అమెరికా నుండి.

కుందనపు బొమ్మలా ఉన్న కూతురుని చూసుకుని మురిసిపోతూ “అందాల పాపని కానుకగా ఇచ్చినందుకు థ్యాంక్స్ !” ప్రేమగా రాధిక తల నిమిరాడు గోపాల్.
“మనలో మనకి థ్యాంక్స్ అనేది ఉండకూడదు కానీ ఇప్పటికి స్వీకరిస్తున్నాను”
“పాపకి ఏం పేరు పెడదాము?”
“మీరే చెప్పండి”
“చందమామను పోలిఉండి మన జీవితాలలో చల్లటి వెలుగు నింపింది ఈ పాపాయి కనుక చంద్రిక అని పెడదాము నువ్వేమంటావు?”
గోపాల్ మాటలు, ‘మా జీవితాలకి నువ్వే వెలుగమ్మా’ అని ఎప్పుడూ తండ్రి తనతో అనడం జ్ఞప్తికి వచ్చి ఉద్వేగానికి లోనైంది రాధిక.
ఏదో అనబోయి గోపాల్ వైపు చూసిన రాధిక కూతురుని చేతులలో ఎత్తుకుని అపురూపంగా చూసుకుంటున్న గోపాల్ ని చూసి మౌనంగా ఆ మనోహరమైన దృశ్యాన్ని తనివితీరా చూస్తూ ఉండిపోయింది.
ఆస్పత్రినించి ఇంటికి వచ్చాక కూతురు పుట్టిందనే కబురు విజయకి చెప్దామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ‘ఈ నంబరు మనుగడలో లేదు’ అనే సమాధానమే వినవచ్చింది.
తదుపరి కూతురి ఆలనా పాలనలో ఆ విషయమే మర్చిపోయింది. చంద్రిక పుట్టాక ఇంట్లోను బయటా నిర్వహించుకోవడం కష్టంగా అనిపించి ఉద్యోగానికి రాజీనామా చేసింది రాధిక.
రాధిక గోపాల్ చంద్రిక ముద్దు ముచ్చట్లలో మునిగి తేలుతున్నారు. గోపాల్ పాపతోనే లోకంగా ఉండడం తనని అసలు పట్టించుకోకపోవడం గమనించి మురిపెంగా నవ్వుకుంది రాధిక.


గోపాల్ వాళ్ళది విశాలమైన రెండు అంతస్తుల మేడ . క్రింది భాగంలో అత్తామామలు ఉంటే పైన భాగంలో రాధిక గోపాల్ తమ కూతురితో సహా ఉంటున్నారు.
తల్లిదండ్రులిద్దరిని తన చిలిపి చేష్టలతో మురిపిస్తోంది చంద్రిక. కూతురి ఆటలలో మైమరస్తూ ఆఫీసుకి తరచూ సెలవు పెట్టి గోపాల్ ఇంట్లోనే ఉండిపోవడం రాధిక దృష్టిని దాటిపోలేదు.
‘పోనిలే లేక లేక పుట్టిన కూతుర్ని వదిలి వెళ్ళాలనిపించడంలేదేమో, నేనే అనవసరంగా ఆలోచిస్తున్నానేమో?’ అనుకుంది .
ఆడపడుచు వద్ద కొన్నాళ్ళు ఉండి వద్దామని అమెరికా వెళ్లారు రాధిక అత్తామామలు .
“నువ్వు రాధికా కూడా పాపని తీసుకుని వస్తే అందరమూ కొన్నాళ్లు సరదాగా గడపవచ్చు” అంటూ తోబుట్టువు ఫోన్ చేయడంతో గోపాల్ దంపతులు కూడా అమెరికా వెళ్ళారు.
అక్కడే పాప మొదటి పుట్టిన రోజు ఎంతో ఆడంబరంగా జరిపి నెల రోజుల తరువాత భారతదేశం వచ్చారు.
అప్పటినుండి పాపలో చిన్న చిన్న మార్పులు- చూపు సరిగా నిలపలేక ఎటో చూస్తుండటం, కీచుగా అరవడం …ఇత్యాదివి గమనించింది రాధిక.
గోపాల్ దగ్గర ఈ ప్రస్తావన తెచ్చినప్పుడు “నీదంతా అనుమానం నా పాప బంగారు బొమ్మ” అంటూ ఆమె మాటలని తేలికగా కొట్టి పడేశాడు…..
తరువాత నాలుగు నెలలకి రాధిక అత్తమామలు భారతదేశం తిరిగి వచ్చారు. కొన్ని నెలలు గడిచాయి…..


‘రాధికా’ అని వినిపించిన అత్తగారిపిలుపుతో ఆలోచనలలోంచి బయటపడి ‘వస్తున్నా అత్తయ్యా’ అంటూ బదులిచ్చింది.
తండ్రి కసురుకి అర్థం తెలియక ఏడ్చి ఏడ్చి అలసిపోయి సొమ్మసిల్లి ఒడిలో అమాయకంగా నిద్రిస్తున్న చంద్రికని గదిలో మంచంపై పరుండచేసి ‘ఈ సమస్యకి కాలమే సమాధానం చెప్పాలి’ అని నిట్టూర్చి వంటగదివైపు అడుగులు వేసింది రాధిక.
భర్త పాప పట్ల చూపుతున్న నిరాదరణ, అతను ప్రవర్తిస్తున్న తీరు రాధికని ఎంతో మానసిక వ్యధకి గురిచేయసాగాయి.
‘నాకు మాత్రం పాప గురించిన దిగులు ఉండదా? ఇలాంటి సమయంలోనే నాకు అండగా ఉండవలసిన గోపాల్ ఎందుకిలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారో?’
‘ఇందులో చంద్రిక తప్పేమున్నదని కసురుకోవడానికి?’ ఎంత ఆలోచించినా కారణం అంతుబట్టటంలేదు. పైగా పాపని చీటికి మాటికి చీదరించుకోవడం ఆమెను మరింత మనస్థాపానికి గురిచేస్తోంది.
కసురుకున్నాడేకానీ మరుక్షణం చంద్రిక హృదయవిదారకమైన ఏడుపు గోపాల్ మనసుని కలచివేసింది. తరచూ అసంకల్పితంగా జరుగుతున్న ఈ చర్య అతడిని ఎంతో వ్యధకు గురిచేస్తోంది.
‘నా కూతురు మామూలు పాప కాదు, బుద్ధిమాంద్యత ఉన్న పాప’ అనే ఆలోచనే గోపాల్ ని విపరీతమైన నిస్పృహకు లోనుచేస్తూ పాపని చూస్తేనే చిరాకు కలుగచేస్తోంది.
అత్తమామలు కూడా తెలియనితనంతో చంద్రిక చేస్తున్న అల్లరికి విసుక్కోవడం రాధిక మనోవేదనని ఇంకా పెంచుతోంది.
ఇదిలా ఉండగా ఇంకో కొత్త సమస్య వచ్చిపడింది రాధిక నెత్తిమీద.
ఒకనాడు గోపాల్ ఉదయం పదకొండు గంటలైనా నిద్ర లేవలేదు
“ఇవాళ ఆఫీసుకి సెలవు పెట్టారా?” లేపి అడిగింది రాధిక.
“లేదు”
“మరి ఇంకా లేవలేదేం , టైమవుతోందిగా?”
“ఆఫీసుకి వెళ్ళఖ్ఖరలేదు”
“అదేం?”
“ఉద్యోగానికి రాజీనామా చేశాను?
“ఏమిటీ?” నెత్తిమీద పిడుగు పడినట్లుగా గావుకేకే పెట్టింది రాధిక.
“ఎందుకలా అరుస్తావు నేనేదో హత్య చేసినట్లు? అమ్మా నాన్నా వింటారు” చిరాగ్గా అన్నాడు గోపాల్ .
‘ఒకవైపు చేస్తో-చేస్తోన్న ఉద్యోగం మానేసింది చాలక అడిగితే అరుస్తున్నవంటారే? ఏమిటి ఈయన మనస్తత్వం? పైగా అమ్మా నాన్నా వింటారుట!’ అనుకుని
“అదేమిటి నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఎందుకలా చేశారు? ఇప్పుడు చంద్రిక వైద్యానికి కూడా డబ్బులు కావాలి కదా. ఇలాంటప్పుడు మీరు ఉద్యోగం కూడా మానేస్తే మనకు గడిచేదేలా?”
“అదే గడుస్తుంది, అసలు నాకు ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు. ఏదో అమ్మా నాన్నా బలవంతం మీద చేరాను అది కూడా ఉద్యోగం లేకపోతే ఎవరు పిల్లనివ్వర్రా అంటే”
చటుక్కున రాధికకి పెళ్ళికి ముందు ఒకటి రెండుసార్లు గోపాల్ ఉద్యోగం మానేస్తాను అనడం గుర్తుకువచ్చింది.
‘అసలు సంగతి ఇదన్నమాట! అప్పుడేదో నా మీద ప్రేమతో సరదాకి అన్నారనుకున్నాను కానీ నిజంగా ఇలా చేస్తారనుకోలేదు! ఇప్పుడు నేనేం చేయాలి?’ అని గొణుక్కుంది
“సర్లే, ఊరికే గింజుకోకు ఇంట్లోనే ఉండి ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను” అనేసి విసురుగా వెళ్లిపోయాడు .
“పోన్లే ఏదో ఒకటి చేస్తానంటున్నారుగా” అనుకుని తేలికగా ఊపిరిపీల్చుకుంది.
కానీ అవన్నీ ఉట్టి మాటలేనని కొన్ని రోజులలోనే అర్థమైపోయింది రాధికకు.
ప్రొద్దునే లేవడం టిఫిన్ చేయడం, టి.వి.చూడటం, పేపరు చదవడం, భోజనం చేయడం, పడుకుని నిద్రపోవడం, మళ్ళీ సాయంత్రం అదే తంతు పునరావృత్తం చేయడం …………. ఇదీ గోపాల్ దినచర్య .
కొన్నాళ్ళ తరువాతైనా అందులో మార్పు వస్తుందేమోనని ఆశగా చూసిన రాధికకు నిరాశే ఎదురైంది.
ఒకనాడు ఏదో అవసరమై “కొంచం డబ్బులు కావాలి” అడిగింది గోపాల్ ని
“నాన్నని అడిగి తీసుకో”
“మామయ్యని అడగడం నాకు ఇష్టం లేదు”
“ఎందుకని? నేను ఆయనని అడిగే తీసుకుంటున్నానుగా!”
“మీరు అడగడం వేరు, నేను అడగడం వేరు”
“ఎందుకు వేరు?”
“అది మీకు చెప్పినా అర్థంకాదు , నేను మాత్రం మామయ్యని అడగలేను”
“సరే ఉండు నేనే అడిగి తెచ్చిస్తాను”
“వద్దు, మీవద్ద ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు”
“నా దగ్గరెక్కడ ఉంటాయి?”
“అందుకే మీకంటూ సంపాదన ఉండాలి అన్నాను”
“ఓహో! అయితే ఈ ఏడుపంతా అందుకన్నమాట. సరే చివరిసారిగ చెప్తున్నా విను.. నాకు సంపాదించవలసిన అవసరంలేదు. మేము కోటీశ్వరులం తెలుసా?” గొప్పగా అన్నాడు .
“కానీ ఆ ఆస్తి మీ తల్లిదండ్రులది”
“అయితే? నాన్న ఆస్తి నాది కాదా? నేనెంతైనా ఖర్చుపెట్టుకోవచ్చు. ఆ విషయం ఆయనే చెప్పారు నాకు ఎప్పుడో! నీకు తెలియదేమో?” మూర్ఖంగా వాదిస్తున్న గోపాల్ వైపు నిశ్చేష్టురాలై చూస్తుండిపోయింది రాధిక .
‘భర్త కష్టపడి సంపాదించి ఇచ్చిన రూపాయి పైనే భార్యకి స్వతంత్రం ఉంటుందనీ, అత్తమామల ముందు ప్రతి పైసాకి చేయిచాపడం మర్యాదకాదని, ఆ పని తాను చేయలేనని గోపాల్ కి ఎలా చెప్పడం? చెపితే విని అర్థంచేసుకునే స్థితిలో అతను ఇప్పుడు లేరు’ అనుకుని దుఃఖం ముంచుకురాగా ఏడుస్తూ ఉండిపోయింది రాధిక .


రాధిక పెళ్ళైన ఏడాదికే నళిని పెళ్ళికూడా చేసి అత్తవారింటికి పంపించేశాక ఒంటరిగానే ఉంటున్నారు శారద.
తల్లికి అనారోగ్యం చేసిందని తెలిసి చంద్రికతో పుట్టింటికి వచ్చింది రాధిక . రెండునెలలు ఆమె చేసిన సేవలతో శారద బాగా కోలుకున్నారు.
ఈలోగా గోపాల్ ఒకసారి వచ్చి చూసి వెళ్ళాడు. కానీ మూడు నెలలైనా కూతురు హైదరాబాదు తిరిగివెళ్లే ఆలోచన చేయకపోవడం గమనించారు ఆవిడ.
“రాధికా నేనిప్పుడు కోలుకున్నానుగా, నువ్వింక వెళ్ళమ్మా, అక్కడ అల్లుడు ఏమి ఇబ్బంది పడుతున్నాడో ఏమిటో?”
“అలాగేలేమ్మా, చూద్దాంలే !”
“చూద్దామంటే కాదు, నువ్వు వెంటనే బయలుదేరు” అంటూ తల్లి గట్టిగా ఒత్తిడి చేయడంతో ఇంక దాచి లాభంలేదని “నేనింక అక్కడికి వెళ్ళనమ్మా!” అంది నెమ్మదిగా
“అదేమిటీ ఎందుకు వెళ్ళవు?” కంగారూ పడుతూ అడిగారు .
అత్తవారింట్లో పరిస్థితులు, గోపాల్ ప్రవర్తన, పాప పట్ల అతని విముఖత………ఇవన్నీ విపులంగా చెప్పి
“గోపాల్ పాపని తరచూ విసుక్కుంటున్నారు, దానిని స్వీకరించలేక పోతున్నారు, మామగారు వాళ్ళుకూడా పసిదానిపైన అకారణంగా కోపం చూపిస్తున్నారు.
దానికి తోడు గోపాల్ ఉద్యోగం కూడా మానేయడంతో ప్రతిదానికి పెద్దవాళ్ళమీద ఆధారపడమంటే నాకు ప్రాణసంకటంగా ఉంది . అందుకనే ఈ నిర్ణయానికి వచ్చాను” అంటూ తల్లితో గోడు వెళ్లబోసుకుంది రాధిక.
రాధిక చెప్పింది సాంతం విన్నాక, ఆమధ్య అల్లుడు వచ్చినప్పుడు కూతురు ముభావంగా ఉండటం, చంద్రిక దగ్గరకి కూడా వెళ్ళకపోవడం జ్ఞప్తికి వచ్చాయి ఆవిడకి. కాకపోతే అప్పుడు చంద్రిక నిద్రపోతుండటంతో అదంత పెద్ద విషయంగా ఆవిడకి అనిపించలేదు కానీ ఇప్పుడు రాధిక చెప్పాక అతని ప్రవర్తనకి అర్థం తెలిసింది.
‘ఏమని చెప్తుంది కూతురుకి? రాధిక సంగతి తెలుసు. ఎంతో అభిమానం గలది. ఎంతో అవసరమైతే తప్ప తండ్రిని కూడా ఎప్పుడూ చేయిజాపి అడగని రాధికకి అత్తమామల మీద ఆధారపడి ఉండటమంటే ఎంత కష్టంగా ఉంటుందో అర్థంచేసుకోగలదు. పోనీ అదేదో సర్దుకోమని చెప్దామంటే గోపాల్ చంద్రికను స్వీకరించకుండా ఉంటే ఇంకే ఆశతో కూతుర్ని అక్కడికి వెళ్ళి ఉండమని అనగలదు?’
“మరి నీ జీవితం ఎలా గడుస్తుందమ్మా?” అడిగారు శారద దిగులుగా .
“నువ్వేం దిగులుపడకమ్మా . అదంతా నేను చూసుకుంటానులే. అసలే నీ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే సర్దుకుంటోంది”
“ఇంక జీవితమంతా ఇలానే ఒంటరిగానే ఉండిపోతావా?”
“ఏమ్మా, నేనిక్కడ ఉంటే నీకేమైనా ఇబ్బందా?”
కూతురు తన మాటలని అపార్థం చేసుకుంటోందని గ్రహించి “అహ, అది కాదు నా ఉద్దేశ్యం , పాప పోషణ ఎలాగడుస్తుంది “ అన్నారు అవేదనగా
“నేను ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను. నన్ను నా బిడ్డని నేను పోషించుకోగలను, నిన్ను కూడా!” అంటుండగానే గొంతు గద్గదమై మాటలు రాక అక్కడనించి వెళ్ళిపోయింది రాధిక.
కూతురు వెళ్ళినవైపే బాధగా చూస్తుండిపోయారు శారద.


సూపర్ మార్కెట్ లో సరుకులుకొంటున్న రాధిక ఎవరో పిలిచినట్లై వెనక్కి తిరిగిచూసింది
ఎదురుగా విజయ!!!!
“హేయ్! విజయా! ఇదేమిటి మీరిక్కడ, ఇండియా ఎప్పుడు తిరిగి వచ్చారు?” అంటూ ఆనందంగా ఆమెని చుట్టేసింది.
“ఒక వారమైంది. నేనే మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. అది సరే కాని ముందిది చెప్పు నేను ఇండియాలో లేనని నీకెలా తెలుసు?”
“ఓహ్! అదా, మీకోసం ముందు మీ ఇంటికి వెళ్ళాను. తాళం పెట్టి ఉంది. ఆ తరువాత ఒకసారి మనం పనిచేసిన కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు” అని “అన్నట్లు మీకు తెలియదు కదూ! నాకు ఒక పాప, పేరు చంద్రిక. ఈ విషయం మీకు చెప్దామని ఎన్నోసార్లు విఫల ప్రయత్నం చేసాను” అంది మళ్ళీ తానే
“ఓహో ! ఎంత మంచి వార్త! పాప పుట్టిందా. ‘చంద్రిక’ పేరు కూడా బాగుంది. మొత్తానికి నీ పూజలు ఫలించాయన్నమాట. నేను కూడా అమెరికా వెళ్ళే ముందర నిన్ను కలుద్దామని, నీకు చెపుదామని ఎన్నోసార్ల్ ప్రయత్నించాను”
“అవును ఆ సమయంలో అమ్మ చెల్లెలు దగ్గరకి వెళ్ళింది. గోపాల్ నెలరోజులు సెలవుపెట్టడంతో మేము కూడా అమెరికా వెళ్లాము. బహుశః అప్పుడే మీరు కూడా చేసి ఉంటారు. అదీగాక నా నంబరు మారిందనే విషయం కూడా చెప్దామని ఎంతో ప్రయత్నించాను. అంటే ఇద్దరము ఒకసారే ప్రయత్నించి ఉంటాము”
“అదన్నమాట సంగతి! అది సరే గాని నువ్వేమిటీ, ఇక్కడ?”
“అమ్మని చూసి వెళదామని వచ్చాను”
“ఓహో! పాప ఎలా ఉంది, అమ్మ ఎలా ఉన్నారు?”
“పాప బాగుంది, అమ్మ కూడా కులాసాగానే ఉంది”
“పాప బడిలో చేర్చావా , ఏ స్కూలు?తిరిగి హైదరాబాదు ఎప్పుడు వెళుతున్నావు?”
విజయ ప్రశ్నలకి సమాధానం దాటవేసి “మీరు రండి మాయింటికి ఒకసారి. మరి నేను వెళతాను” అంది రాధిక .
“సరే! తప్పక వీలుచూసుకుని వస్తాను. అమ్మని అడిగానని చెప్పు. ఆ ఇంట్లోనే ఉంటున్నారుగా?”
“అవును” అని హడావిడిగా వెళ్ళిపోతున్న రాధికని కనుమరుగయ్యేదాకా చూస్తుండిపోయింది విజయ. ఇంటికి వెళ్ళాక కూడా రాధిక గురించిన ఆలోచనలే చుట్టుముట్టాయి విజయని .
‘రాధికలో ఎంతో మార్పు వచ్చింది. నవ్వుతూ మాట్లాడినా ఆ నవ్వు వెనకాల ఏదో తెలియని వేదన కనిపిస్తోంది. బాగా చిక్కిపోయింది. మునుపటి చలాకీతనం లేదు. నేనడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు. ఎందుకనో?’ అనుకుంది…….
“అమ్మా! ఇవాళ మార్కెట్లో విజయ కనిపించారు” అంది ఇంటికి వస్తూనే తల్లికి చెప్పింది.
“అవునా మరి ఇంటికి తీసుకుని రాకపోయావా?”
“రమ్మని పిలిచాను వస్తానన్నారు”
“చాలా సంతోషం. చాలారోజులైంది ఆమెని చూసి” అన్నారు శారద
‘విజయలో వయసుతో వచ్చిన సహజమైన మార్పు తప్ప అంతా అలానే ఉన్నారు. ఎందుకో విజయని కలిసాక కొండంత బలం వచ్చినట్లు అనిపిస్తోంది. అమ్మకి కూడా విజయ అంటే చాలా ఇష్టం’ అనుకుంది రాధిక.
అటు శారద కూడా అదే ఆలోచిస్తున్నారు. విజయ ఒక కూతురిలాగా అనిపిస్తుంది ఆవిడకి. రాధిక గురించిన తన దిగులుని విజయతో చెప్పుకుని సాంత్వన పొందాలని ఉంది ఆవిడకి.


కోడలిని మనవరాలిని చూసి వెళదామని హైదరాబాదునించి వచ్చిన అత్తమామలను సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించింది రాధిక .
“ఎలా ఉన్నావమ్మా?” ఆప్యాయంగా అడిగారు
“బాగానే ఉన్నానండీ”
“చంద్రిక ఎక్కడ?”
“ఇప్పుడే స్కూలులో దింపి వచ్చాను అత్తయ్యా”
“పాప ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?”
“ఫరవాలేదు . కొంత సమయం పట్టీనా అన్నీ తెలుసుకుంటుందని చెప్పారు డాక్టర్”
కోడలు మనుమరాలు అంటే అభిమానమే వాళ్ళకి. ఆమె ఇలా ఇల్లు వదిలి వచ్చేయడానికి తాము కూడా కొంత కారణమేమోననే బాధ కూడా వారికి ఉంది.
చంద్రిక పట్ల గోపాల్ ప్రవర్తిస్తున్న తీరు సరైనది కాదని ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది. అందుకే అమెరికా వెళ్ళేముందు ఒక సారి రాధికను చూసి వెళదామని వచ్చారు .
భోజనాలయ్యాక వెళ్ళి చంద్రికని స్కూలునుండి తీసుకుని వచ్చింది రాధిక.
మనుమరాలిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు పెద్దవాళ్ళిద్దరు.
కొత్తదనంవల్ల తాతయ్య నాన్నమ్మ దగ్గరికి వెళ్ళడానికి జంకింది చంద్రిక.
కొంతసేపు కూర్చున్నాక “ఇంక బయలుదేరుతామమ్మా!” అంటున్న మామగారితో
“అప్పుడేనా? రెండురోజులుండి వెళ్ళండి మామయ్యా” అంది
“లేదు తల్లీ! నిన్ను పాపని చూసాము . అది చాలు. మళ్ళీ ఎల్లుండే ప్రయాణం” అంటూ బ్యాగులోంచి ఒక కవరు తీసి రాధికకు ఇవ్వబోయారు.
“ఇదేమిటి మామయ్యా?”
“ఈ డబ్బు ఉంచమ్మా”
“నన్ను క్షమించండి మామయ్యా! నేను ఈ డబ్బు తీసుకోలేను”
“తీసుకోమ్మా! ఇది చంద్రిక వైద్యానికి , నీ అవసరాలకి పనికివస్తుంది”
“మీ మాట కాదంటున్నందుకు నన్ను మన్నించండి . నా బిడ్డని నేను పోషించుకోగలను . పాప వైద్యానికి ఖర్చులకి నా జీతం సరిపోతోంది. ఇంక నాకంటూ ప్రత్యేకమైన కోరికలు అవసరాలు లేనేలేవు” అంది దుఃఖంతో గొంతు పూడుకుపోతుంటే .
ఆమె అభిమానం తెలిసిన పెద్దవాళ్ళిద్దరు మారుమాటాడలేకపోయారు. కోడలిని మనుమరాలిని ఆశీర్వదించి బాధాతప్త హృదయాలతో తిరుగు ప్రయాణమయ్యారు…..


తల్లిదండ్రులను విమానాశ్రయంలో దింపడానికి వచ్చాడు గోపాల్ .
“బాబు గోపాల్ , ఒక మాట చెప్తాను వింటావా?”
తల్లి ఏం చెప్పబోతోందో అతనికి తెలుసు అయినా “చెప్పమ్మా!” అన్నాడు.
“రాధికని చంద్రికని ఇంటికి తీసుకునిరా”
“అమ్మా!రాధిక అంటే నాకు ప్రేమ లేక కాదు. కానీ పాపని దగ్గరకి తీసుకోవాలంటేనే భయంగా ఉంది”
“ఇందులో ఆ పసిదాని తప్పేముంది ? అన్నీ తెలిసిన నువ్వే ఇలా చేయకూడదు”
“…………………………….”
“ఈ సమయంలో అందరికంటే ఎక్కువగా నీ తోడే రాధికకి కావాలి”
“………………………..”
అన్ని ప్రశ్నలకీ కొడుకునించి మౌనమే సమాధానమవటంతో నిస్సహాయంగా భర్తకేసి చూశారు సరస్వతి . ఇంకేమీ మాట్లాడద్దని ఆయన సైగ చేయటంతో ఆ సంభాషణ అక్కడితో ఆగిపోయింది.
తల్లిదండ్రులని దింపి భారమైన హృదయంతో ఇంటికి తిరిగి వచ్చాడు గోపాల్ . ఇంట్లోకి అడుగుపెట్టగానే ఒంటరితనం అతనిని చుట్టుముట్టి భయపెట్టింది.
‘క్రితంసారి అమ్మానాన్న విదేశాలకు వెళ్ళినప్పుడు రాధిక ఇంట్లో ఉంది . పాప అప్పుడు బాగానే ఉంది . నేనేం పాపం చేశాను? నా కూతురే ఎందుకిలా అవ్వాలి? నా చుట్టుపక్కల అందరి పిల్లలు ఎంతో బాగున్నారు. వాళ్ళందరూ తమ తమ పిల్లలతో సరదాగా ఆడుకుంటుంటే నా బిడ్డ కూడా ఇలా ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. ప్చ్! నేనెంత దురదృష్టవంతుడిని?’ అనుకుని తలనొప్పిగా అనిపించి గట్టిగా కణతలు రుద్దుకున్నాడు గోపాల్ .


ఆరోజు సెలవు కావడంతో ఆలస్యంగా లేచింది రాధిక. చంద్రిక ఇంకా నిద్రపోతోంది. పాప లేచేలోగానే అన్ని పనులు ముగించుకుందామని గబగబా మొదలుపెట్టింది.
పనిపూర్తి చేసుకుని రాధిక టి.వి., చూస్తూ కూర్చుంది.
కాలింగ్ బెల్ మ్రోగటంతో తలుపు తీసిన రాధికని “హలో!” అని పలకరిస్తూ లోపలికి వచ్చింది విజయ .
పూజ ముగించుకుని ఇవతలికి వచ్చి “ఏమ్మా! బాగున్నావా?” అంటూ పలకరించారు శారద.
“నమస్కారం ఆంటీ. బాగున్నాను. మీ ఆరోగ్యం ఎలా ఉంటోంది?”
“ఫరవాలేదమ్మా! నా బెంగంతా ఇదిగో ఈ రాధిక గురించే” అన్నారు నిట్టూరుస్తూ.
ఆవిడ ఇంకేదో అనబోతుంటే రాధిక “కూర్చోండి. టీ కలిపి తెస్తాను” అని వంటింటివైపు కదిలింది.
సోఫాలో కూర్చుని హాలంతా పరికించి చూస్తున్న విజయ, లోపలినించి కీచు.. కీచు మంటూ చిన్న పాప అరుపులు వినిపించడంతో, ఒక్కసారి ఉలిక్కిపడింది.
“చంద్రిక లేచినట్లుంది” అన్నారు శారద
“ఎందుకలా అరుస్తోంది?”
“కావలసినదేదో ఇవ్వలేదనుకుంటాను వాళ్ళమ్మ , చూసి వస్తానుండు” అంటూ లోనికి వెళ్లారు .
పాపని సముదాయించలేక రాధిక నానా అవస్థలు పడటం తెలుస్తోంది విజయకి .
‘చంద్రిక అరుపులు పేచీ పెడుతున్నట్లుగా లేవు. అరుస్తోందే తప్ప మాట్లాడటం లేదేందుకనో?’ అనుకుంది విజయ.
ఇంతలో చంద్రికను ఎత్తుకుని బుజ్జగిస్తూ ఇవతలికి వచ్చింది రాధిక. వెనకాలే శారద ట్రే లో టీ బిస్కట్లు తెచ్చి టేబుల్ పైన పెట్టారు.
చంద్రిక ఒక్కసారిగా చేతుల్లోంచి జారి వాటిని అందుకోబోతుండగా రాధిక గబుక్కున పాపని వెనక్కి తీయడంతో దాని అరుపులు ఇంకా ఎక్కువైపోయాయి.
రాధిక లోపలికి వెళ్ళి వేరే బిస్కట్లు తెచ్చి పాప చేతిలో పెట్టి, ఆడుకోవడానికి బొమ్మలు ముందు పెట్టాక కొంత శాంతించింది కానీ ఇంకా పిల్లి కూతల శబ్దాలు చేస్తూనే ఉంది .
విజయ దగ్గరికి వచ్చి కూర్చుని ఆమెకు ఒక టీ కప్పు ఇచ్చి తను ఒకటి తీసుకుంది రాధిక. కాసేపు ఇద్దరు ఏమి మాట్లాడుకోలేదు.
“రాధికా ! చంద్రిక …..” అంటూ అర్ఠోక్తిలో ఆపేసింది విజయ.
మౌనంగా టీ కప్పు కేసి చూస్తూ ఉండిపోయిన రాధిక కళ్లలోచి రెండు కన్నీటి చుక్కలు జారి కప్పులో పడ్డాయి.
“ఏమైంది? ఎందుకేడుస్తున్నావు?” కంగారుగా అడిగింది విజయ గబుక్కున తన చేతిలోని కప్పు క్రింద పెడుతూ
ఎన్నాళ్లనించో గుండెల్లో గూడుకట్టుకుని ఉన్న బాధ, ఆప్యాయపూరితమైన విజయ పలుకులకి ఒక్కసారిగా కట్టలు తెంచుకోవడంతో వెక్కి వెక్కి ఏడవసాగింది రాధిక .
కాసేపటికి సంబాళించుకుని “అవును, మీ సందేహం సరైనదే చంద్రిక ఎదుగుదల వయసుకి తగ్గట్లుగా లేదు”
“అలా అని ఎవరు చెప్పారు?”
“డాక్టర్”
చంద్రిక పుట్టినప్పటినుండి జరిగినదంతా చెప్పుకొచ్చింది రాధిక.
“మరి ఈ పరిస్థితులలో నువ్వు గోపాల్ తో కలిసి ఉండకుండా ఇక్కడ ఉంటున్నావెందుకు, ఒక్కర్తివి పాపని చూసుకోవడం కష్టం కదా ?”
“గోపాల్ పాపని స్వీకరించటంలేదు”
“అంటే?”
“చంద్రికకి ఇలా అయినప్పటినించి పాప అంటేనే చిరాకు పడుతున్నారు . పాప పట్ల అతని విముఖత నాకు స్పష్టంగా కనిపిస్తోంది.”
“అదేమిటి? ఇందులో పాప తప్పేముంది?”
“అదే నాకూ అర్థంకావటంలేదు”
“మరి మీ అత్తమామలు ఏమి చెప్పలేదా అతనికి?”
“చెప్పారు. కానీ వాళ్ళు కూడా చంద్రిక మీద విసుక్కునేవారు. పోనిలే వాళ్ళు పెద్ద వాళ్ళు ..అని సరిపెట్టుకుందామన్నా గోపాల్ ప్రవర్తనే నాకు ఎంతో బాధగా అనిపించింది”
“పోనీ మీరిద్దరు కొన్నాళ్లు ఆ వాతావరణం నించి దూరంగా ఉంటే గోపాల్ లో మార్పు రావచ్చేమో?”
“ఆ ఆలోచన నాకూ వచ్చింది. కానీ గోపాల్ ఆ అవకాశం కూడా లేకుండా చేశారు”
“ఏం? ఎందుకని?”
“చేస్తో-చేస్తోన్న ఉద్యోగం మానేసారు. ఇంట్లోనించే ఏదైనా వ్యాపారం చేస్తానన్నారు. పోనిలే అనుకున్నాను కానీ ఎన్నాళ్ళైనా ఖాళీగానే ఉండటంతో చిన్న చిన్న ఖర్చులకి కూడా పెద్దవాళ్ళ మీద ఆధారపడటం నాకు ఎంతో ఇబ్బందిగా తయారైంది. గోపాల్ కి ఈ విషయంలో ఎంతో చెప్పాలని చూసినా అర్థంచేసుకోకపోగా నేనే గొడవపెట్టుకుంటున్నాని దెప్పారు”
“నువ్విలా వచ్చేస్తుంటే గోపాల్ వద్దని అనలేదా?”
“అన్నారు. నేనంటే ప్రేమ ఉంది కానీ చంద్రికని మనసుతో స్వీకరించట్లేదు. ఒక తండ్రిగా పాప పట్ల ప్రేమ , బాధ్యత ఉండాలిగా. అవి బలవంతంగా ఆపాదించేవి కాదు. అతనంతట అతనికే తెలిసిరావాలి. అందుకే పాపని తీసుకుని ఇక్కడికి వచ్చేశాను”
రాధిక చెప్పింది ఎంతో సమంజసంగా అనిపించింది విజయకి.
“మరి నీకు ఎలా గడుస్తోంది?”
“ప్రస్తుతం తాత్కాలికంగా చిన్న చిన్న ఉద్యోగాలు ఉద్యోగం చేస్తున్నాను”
“చంద్రిక సంరక్షణ కోసం ఖర్చవుతుందికదా, మీ అత్తవారు ఏమి సహాయం చేయటంలేదా?”
“చేస్తామన్నారు కాని నేనే వద్దన్నాను”
“ఎందుకని? ముందు ముందు ఖర్చులు పెరిగితే నీకు కష్టమవుతుందేమో ఆలోచించావా?”
మామగారు తమ పోషణార్థమై డబ్బు ఇవ్వజూపడం అందుకు తను నిరాకరించడం అన్నీ విశదంగా చెప్పుకొచ్చింది రాధిక.
“నీ నిర్ణయం సరైనదేనా? ఇంకొక్కసారి ఆలోచించు రాధికా”
“బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను”
“మరి గోపాల్? ……”
“మీ సందేహం నాకు తెలుసు . అతను కొత్త జీవితం మొదలు పెట్టుకోవాలంటే నాకేమీ అభ్యంతరం లేదని ఎప్పుడు కావాలంటే అప్పుడు విడాకుపత్రాల పైన సంతకం పెడతానని గోపాల్ కి చెప్పాను!”
“ఏమన్నారు”?
“ససేమిరా ఒప్పుకోలేదు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి నన్ను చూసి వెళుతుంటారు. కానీ చంద్రిక ఎదురుగా ఉన్నంతసేపు ముళ్ళ మీద ఉన్నట్లుంటారు. అదిచూస్తే మనసునెవరో పిండినట్లనిపిస్తుంది”
“మరి నీ సంగతేమిటీ?”
విజయ మాటలలో భావం గ్రహించినట్లుగా పేలవంగా ఒక నవ్వు నవ్వి “ఇంక చంద్రికే నా జీవితం. నాకింక వేరే ఆశలు లేవు” దృఢంగా అంది రాధిక.
రాధిక పలుకులలో ఎంతో ఆత్మ విశ్వాసం , చంద్రిక పట్ల అపరిమితమైన అనురాగం ధ్వనించాయి విజయకి.
‘రాధిక జీవితం ఎందుకిలా అయ్యింది? ఎంతో మంచి వ్యక్తి అంతకంటే మంచి మనసు. భగవంతుడి నిర్ణయాలు ఒక్కొక్కసారి ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు’ ఇంటికి వచ్చినా ఆమె గురించిన ఆలోచనలే వెంటాడాయి విజయని .


అమెరికా నించి వైజాగ్ తిరిగి వచ్చాక ఇంటికి దగ్గరగా ఉన్న ఒక కాలేజీలో తెలుగు ప్రొఫెసర్ గా చేరింది విజయ.
ఒకనాడు కాలేజీలో ప్రపంచ మానసిక వైద్యుల సదస్సు జరుగుతుంటే వెళ్లింది. ఆ సదస్సు ఎంతో ఉపయోగకరంగా అనిపించింది విజయకి. అప్పుడే ఒక ఆలోచన కూడా వచ్చింది.
‘అవును, అలా ఎందుకు చేయకూడదు? ప్రయత్నించడంలో తప్పులేదుగా! రాధికతో మాట్లాడి చూస్తాను’ అనుకుంది.
ఆ తరువాతి ఆదివారమే రాధికని కలిసి సదస్సు గురించి చెప్పింది.
“గోపాల్ కి ఒకప్పుడు పాపపై చాలా ప్రేమ ఉండేదనీ కానీ పరిస్థితి మారాక అతని మనసు ఆ నిజం అంగీకరించడానికి ఎంతమాత్రము సిద్ధపడటంలేదని ….. నువ్వే అన్నావు కదా! అంటే అతను ప్రస్తుతం ఒక రకమైన మానసిక సంఘర్షణకి లోనవుతున్నాడు. ఇది తాత్కాలికమే కావచ్చును. ఈ సారి అతను వచ్చినప్పుడు ఎలాగైనా నచ్చచెప్పి చూడు”
“ఏమని?”
“ఫ్యామిలీ కౌన్సిలర్ వద్దకు వెళదామని”
“ఒప్పుకోకపోతే?”
“అతనికి నువ్వంటే చాలా ప్రేమ ఉంది అందుకే నువ్వు విడాకులు ఇస్తానన్నా ఒప్పుకోలేదు. ఇప్పటికీ వచ్చి మిమ్మల్ని చూసివెళుతున్నారంటేనే అర్థమవుతుంది అతనికి మీరిద్దరు కావాలని. అందుకే తప్పక ఒప్పుకుంటారని నాకు అనిపిస్తోంది”
“ఈ ప్రయత్నం ఫలిస్తుందంటారా?”
“ప్రయత్నించి చూస్తే నష్టమేమీ లేదుగా ?”
“సరే! మీరు చెప్పినట్లే చేస్తాను” అని రాధిక మాట ఇచ్చాక ఎవరిని కలవాలి , చిరునామా …….అన్ని వివరాలు ఇచ్చి వెళ్లిపోయింది విజయ.
ఆ తరువాత ఒకసారి గోపాల్ వచ్చినప్పుడు రాధిక కౌన్సిలింగ్ గురించి ప్రస్తావించగా ఏ కళనున్నాడో గాని ఒప్పుకున్నాడు.
ఆ మరునాడు విజయ ఇచ్చిన నంబరుకి ఫోన్ చేసి సైకాలజిష్టు వద్ద అపాయింట్మెంట్ తీసుకున్నారు.


చంద్రికని స్కూలులో దింపి, ముందుగానే నిర్థారించుకున్న సమయానికి విజయ ఇచ్చిన చిరునామా పట్టూకుని ‘విజేత క్లినిక్’ , డాక్టర్. రాజేంద్ర .. కుటుంబ కౌన్సిలర్ .…అనే బోర్డు చూసి లోపలికి వెళ్ళి రిసెప్షన్ లో పేర్లు చెప్పి కూర్చున్నారు రాధిక గోపాల్ .
“ఇక్కడ గోపాల్ అంటే ఎవరు?” పిలిచింది డాక్టర్ గారి సహాయకురాలు
“నేనే” అంటూ లేచి నిలబడ్డాడు
“మిమ్మల్ని లోపలికి పిలుస్తున్నారు”
“కూర్చోండి” అనగానే కుర్చీలో ఒదిగి ఒదిగి కూర్చున్న గోపాల్ ని నిశితంగా పరిశీలించారు డా. రాజేంద్ర
“మీరు ఎంతవరకు చదువుకున్నారు?
“ఎం .బి.ఎ ., చేశాను”
“ఏం చేస్తుంటారు?”
“వ్యాపారం”
“ఎక్కడ ఉంటారు?”
“హైదరాబాదులో”
“మీ వివాహమై ఎన్ని సంవత్సరాలైంది?”
“అయిదు”
“మీకు పిల్లలున్నారా?”
“………..”
“మీరు ఏదో చెప్పడానికి సందేహిస్తున్నట్లున్నారు….మీరు నేను అడిగేవాటికి సమాధానం చెప్పగలిగితే మీ మనసులో ఏముందో అర్థంచేసుకోగలను… అలాగని మిమ్మల్ని బలవంతపెట్టను….మీకు చెప్పవలసినదేమైనా ఉంటే నిస్సంకోచంగా చెప్పండి, సరేనా?”
“…………………”
“మీకు పిల్లలెంతమంది?”
“ఒక పాప, చంద్రిక”
“మీ పాప గురించి చెప్పండి”
కొంతసేపు మౌనం తరువాత గద్గదమైన గొంతు సవరించుకుని పుట్టినప్పటి నుండి పాపతో గడిపిన మధురక్షణాలని స్మరించుకుంటూ అర్థనిమీలిత నేత్రాలతో తన్మయంగా వివరిస్తున్న గోపాల్ ని కన్నార్పకుండా చూస్తుండిపోయారు డా. రాజేంద్ర……….
గోపాల్ చెప్పడం అయ్యాక “సరే. మీరు కాసేపు బయట కూర్చోండి. మళ్ళీ పిలుస్తాను” అని రాధికను లోపలికి పిలిచారు డాక్టర్.
“నమస్కారం డాక్టర్” లోపలికి వస్తూనే చేతులు జోడించి వినయంగా నమస్కరించింది
“కూర్చోండి”
ఆమె మాటలలో కదలికలో ఒక విధమైన ఆత్మవిశ్వాసం గోచరించింది డాక్టర్ కి
“మీరేం చదువుకున్నారు?”
“ఎం. కాం.”
“ఎక్కడ ఉంటారు?”
“వైజాగ్ లో”
“మీ భర్త హైదరాబాద్ లో ఉంటున్నానని చెప్పారు??”
“మేము కలిసి ఉండడం లేదు”
“కారణం?”
“పాప ప్రత్యేకమైనదని అందుకే స్వీకరిచలేకపోతున్నానని చెప్పారు”
“అలా మీకెందుకు అనిపిస్తోంది?”
“పాప దగ్గరగా వస్తే ఇబ్బందిగా అయిపోతుంటారు, ఎత్తుకుని ముద్దాడరు, చిరాకు పడుతుంటారు”
“…………”
“అలాంటప్పుడు అక్కడే ఉండి అతనిని ఇబ్బంది పెట్టడం అనవసరం అనిపించింది” అంటూ మనసులోని ఆవేదనను డాక్టర్ ముందు పరిచింది రాధిక.
ఊ…..కొడుతూ ఆమె చెప్పినదంతా శ్రద్ధగా విన్నారు రాజేంద్ర.
అనాటి కౌన్సిలింగ్ సమావేశంలోని విషయాల గురించి విచారించుకుని ఏవైనా ఆలోచనలు వచ్చినట్లయితే వాటి గురించి చర్చించేందుకు ముందుగా సమయాన్ని నిర్థారించుకుని రావలసిందిగా తెలిపారు రాధిక గోపాల్ దంపతులకు డాక్టర్ రాజేంద్ర .


ఆ తరువాత తనను పాపను కలుసుకోవడానికి వచ్చిన గోపాల్ అన్యమనస్కంగా ఉండడం గమనించినా కారణం అడగడానికి భయపడింది రాధిక.
‘గోపాల్ ఎందుకు అలా ఉన్నారు? కొంపదీసి ఇంక కౌన్సిలింగ్ కి రానంటారా ఏమిటీ?’ అనుకుని పరిపరివిధాల ఆలోచించసాగింది. కానీ ఆమె ఆలోచనలు తప్పని నిరూపణ అయ్యాయి.
ఒక నెల తరువాత “రాధికా మళ్ళీ కౌన్సిలింగుకి వెళదాము” అన్నాడు గోపాల్.
‘అమ్మయ్య’ తేలికగా ఊపిరి పీల్చుకుని మరి ఆలస్యం చేయకుండా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంది.
ఈసారి రాధికతో మొదట సంభాషణ సాగించారు డాక్టర్ రాజేంద్ర.
“రాధికా, అన్నట్లు మీరేం చేస్తుంటారు?”
“ఉద్యోగం చేస్తున్నాను. నన్ను పాపని పోషించుకోవడానికి”
“ఇందులో మీ భర్త సహాయం………?”
“చేస్తానన్నారు నేనే వద్దన్నాను”
“పాప బాధ్యత అతనికి అవసరం లేనప్పుడు అతని డబ్బు కూడా నాకు అవసరంలేదు”
“రాధికా! మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థమవుతుంది….కానీ పాపకి , ఒక కూతురిగా తన తండ్రి నుండి అన్ని రకాల సహాయం అందుకునే హక్కు ఉంది అని నేనంటాను అందుకు మీరేమంటారు?
“ఉన్నా కూడా అలా నేను డబ్బులు తీసుకుంటే ఇక తమ బాధ్యత అయిపోయినట్టే అని వాళ్ళు చేతులు దులిపి వేసుకునే అవకాశం ఉంది . అది నేను ఇవ్వదలుచుకోలేదు అయినా నా బిడ్డకేం లోటు లేదు. నా శాయశక్తులా పాపని బాగా చూసుకోగలననే నమ్మకం నాకుంది”
ఆనాటి కౌన్సిలింగ్ సెషన్ లో రాధిక చెప్పిన సమాధానాలు ఆమె మనోగతాన్ని ఆత్మవిశ్వాసాన్ని తెలియజేశాయి డాక్టర్ రాజేంద్రకు. ఆమె ఎంతో ఆత్మాభిమానంగల స్త్రీ అని పాప బాధ్యతని స్వీకరించలేని భర్తనించి ఆమె వేరేమీ ఆశించటంలేదని ఆయనకు అర్థమైంది..
తదుపరి గోపాల్ తో మాట్లాడినప్పుడు …….
“గోపాల్ ఎలా ఉన్నారు?”
“బాగున్నాను డాక్టర్”
“మీ అమ్మాయితో మీ అనుబంధం ఎలాంటిది?”
“……………………..”
“మీరు మీ భార్యతో ఎప్పటినుండి కలిసి ఉండటం లేదు?”
“ఒక సంవత్సరంనించి”
“మీరివురు విడాకులు తీసుకున్నారా?”
“కలిసి మాత్రం ఉండటం లేదు”
“………………..”
డాక్టర్ రాజేంద్ర శ్రద్ధగా వింటున్నారు.
“కలిసి ఉండటం లేదంటే విడాకులు తీసుకున్నట్లు కాదుగా?” మళ్ళీ తానే అన్నాడు గోపాల్
“హా….హా….అలా కాదు … కలిసి ఉండటానికి ఇబ్బందులు ఉండబట్టి ఈ నిర్ణయానికి మీరు వచ్చారు అని అర్థమవుతుంది ….దానికి కారణం చెప్పగలరా?”
“…………………………”
“మీ భార్యకు బిడ్డకు దూరంగా ఉండటం మీకు ఎలా అనిపిస్తోంది?”
“…………………..”
“మీరు వారి నుండి విడిపోయి తప్పుచేశానని అనుకుంటున్నారా?”
“అహ.. అలాకాదు…” (అడ్డంగా తల ఊపాడు గోపాల్)
“పాప అందరి పిల్లల్లా ఉండదు” అన్నాడు నెమ్మదిగా
“అందరిలా ఉండటమంటే?”
“ఏడాది నిండే వరకు పాప బాగానే ఉంది . ఆ తరువాతనే…..”
“మిస్టర్ గోపాల్ ఒక తండ్రిగా మీ మానసిక సంఘర్షణను నేను అర్థం చేసుకోగలను. దీని గురించి మీ భార్య మీతో ఎప్పుడైనా ఏమైనా చెప్పుకున్నారా?”
“రాధిక ఏమంటుంది? ఆమెకు పాపతో సమస్యే లేదు.”
“అయితే …. మీ భార్యకు పాపతో ఏమి సమస్యలేదు కానీ మీకు ఉంది కాబట్టి ఆమె మిమ్మల్ని అర్థం చేసుకోవడంలేదని అనుకుంటున్నారు ….అవునా?”
“…అవును…”
“అందువల్లనే మీకు మీ భార్య పట్ల కోపంగా ఉంది”
(ఆవేశంగా) “అవును పాప అందరి లాగా ఉంటే బాగుండేది”
“అయితే అందుకు పాపే కారణమని మీకు ఎందుకో అనిపిస్తోంది అవునా?
“……………..”
“ఇందులో పాప తప్పు ఏముంది?”
“ఏమీలేదు. పాప మీద కోపంకుడా లేదు. కానీ నా కూతురు అందరి పిల్లల్లా ఉంటే బాగుండేది . నాకే ఎందుకు ఇలా జరిగింది అని నిస్పృహగా ఉంటోంది”
“అందువలన పాప అంటే అయిష్టం పెరుగుతోందా మీకు?”
“……………………”
గోపాల్ వద్దనుండి సమాధానం లేదు.
“మీకు ఉన్నట్లే మీ భార్యకు కూడా బాధ ఉండవచ్చేమో కదా….ఆ బాధని దాచుకుని తన బాధ్యతగా పాపకి తోడుగా ఉంటున్నారేమో ”
“అయ్యుండచ్చు …..నేను అలా ఎప్పుడు ఆలోచించలేదు….”
“ఆమెతో కూర్చుని మాట్లాడి , ఆమెకు తోడుగా పాపను చూసుకోవడం చేశారా ఎప్పుడైనా?”
“లేదు….. పాపని దగ్గరికి తీసుకోవాలంటే ఒక విధమైన జంకుగా ఏదో తెలియని భయంగా అనిపిస్తుంది. ఆ వాతావరణం నుంచి పారిపోవాలనిపిస్తుంది”
“దీనికి కారణం మీ భార్య అని మీరు అనుకుంటున్నారా?”
“లేదు”
“మీ భార్య అంటే మీకు ప్రేమ ఉందన్నారు”
“చాలా ప్రేమ, ఆమె నా జీవితం”
“ఇక్కడ మీరు ఆలోచించవలసిన ఒక విషయం. ఒక వైపు ఇందులో మీ భార్య తప్పు లేదంటూనే ఇంకోవైపు ఆమెని వెన్నంటి ఉండాల్సిన ఇటువంటి పరిస్థితిలో ‘నువ్వు కన్నావు కాబట్టి నీదే బాధ్యత’ అనే అర్థం పరోక్షంగా వస్తోంది మీ ప్రవర్తన నుండి…. ఇది మీకు సరైన పనే అనిపిస్తోందా?”
“………”
గోపాల్ నుంచి జవాబు లేదు. కౌన్సిలర్ వైపు ఒకసారి చూసి దీర్ఘాలోచనలో పడిపోయాడు…. ….

ఆనాటి కౌన్సిలింగ్ ముగిసిన తరువాత పాపతో సాధ్యమైనంతవరకూ ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించమని గోపాల్ కి, ఆ సమయంలో వారి వద్దనే ఉండమనీ రాధికకూ చెప్పి మళ్ళీ రెండు నెలల తరువాత కలవమని చెప్పి పంపించారు డా. రాజేంద్ర.


రెండు నెలలు గడిచాయి. తిరిగి డా. రాజేంద్ర వద్దకు వెళ్ళేసమయం వచ్చింది. ఆనాడు గోపాల్ లో ఎప్పుడూ ఉండే నిరాసక్తత స్థానంలో ఏదో నూతన ఉత్సాహం కనిపించి అతడిలోని ఈ చిన్న మార్పుకే ఎంతో సంబరపడింది రాధిక.
డా. రాజేంద్రను కలవగానే “గుడ్ మార్నింగ్ డాక్టర్” అని తనంతట తానే ఆయనను చిరునవ్వుతో పలకరించాడు గోపాల్.
అతడిలోని మార్పు చూసి కౌన్సిలింగ్ వల్ల అతడి స్వభావంలో మార్పువస్తున్నదని ఆయన కూడా సంతోషించారు.
“ఊ…ఎలా ఉన్నారు గోపాల్”
“బాగున్నాను డాక్టర్”
“మీలో కొత్త ఉత్సహం కనిపిస్తోంది”
“అవును డాక్టర్ ఇదంతా మీ చలవవల్లనే”
“అదెలాగ?” ఏమీ తెలియనట్లే అడిగారు
“పాపతో ఎక్కువ సమయం గడపడం వల్ల పాపకు నేనంటే భయం తగ్గినట్లుగా అనిపించింది”
“ఓహ్! ఇది నిజంగా మంచి విషయమే”
“రాధికకి కూడా ఈ విషయం ఎంతో సంతోషం కలిగించింది”
“ఓహో”
“అవును డాక్టర్, చాలా కాలం తరువాత ఆమె మనస్ఫూర్తిగా నవ్వడం చూసాను”
“ఆమె సంతోషించడం చూసి మీకెలా అనిపించింది?”
“చాలా బాగా అనిపించింది డాక్టర్”
“మీరు ఇలాగే ప్రయత్నిస్తే అన్నీ సరవుతాయి” అన్న డాక్టర్ మాటలకి తల ఊపాడు గోపాల్……
తదుపరి రాధికతో జరిపిన సంభాషణలో
“జరుగుతున్న మార్పులు చూస్తుంటే మీకేమనిపిస్తోంది?” ప్రశ్నించారు
“………………..”
రాధిక మౌనం చూసి ఇదే కాకుండా వేరే ఏదో విషయం కూడా ఆమెని బాధిస్తున్నదని డాక్టర్ అర్థం చేసుకున్నారు.
“మీ భర్త నుండి ఎటువంటి సహకారం లేకపోయినా కూడా మీ కూతురికి తోడుగా ఒక తల్లిగా మీరు నిలబడి ఉన్నారు. అది నిజంగా మెచ్చుకోదగిన విషయమే. ఇది మీకు ఒంటరిగా నిర్వహించుకోవడం ఎంత కష్టతరమవుతోందో నేను అర్థం చేసుకోగలను. ఒక బాధ్యతగల వ్యక్తిగా మీ భర్త నుండి మీరు ప్రస్తుతం ఏమి కోరుకుంటున్నారు?”
“గోపాల్ పాపతో సహా మమ్మల్ని స్వీకరించి ఒక తోడుగా మాకు నిలబడాలని పాప పట్ల ఒక తండ్రిగా తన బాధ్యత తను నిర్వర్తించాలని నేను కోరుకుంటున్నాను”
ఆనాటి కౌన్సిలింగ్ తరువాత రాధిక గోపాల్ ఇరువురూ తమ జీవితాలలో మంచి మార్పు రావాలని కోరుకుంటున్నారని డాక్టర్ గ్రహించి వారి జీవితాలలోని ఇతర ముఖ్య అంశాలపై చర్చించే దిశగా దృష్టి సారించారు.


మరో మూడు మాసాల అనంతరం జరిగిన కౌన్సిలింగ్ సమావేశం లో రాధికతో మాట్లాడినప్పుడు డాక్టర్ చెప్పినదేమంటే….
“రాధికా ఇప్పుడు గోపాల్ పాపకు దగ్గరవడానికి చేస్తున్న ప్రయత్నానికి చేయూతనిస్తూ మీరివురూ కలిసి ఒక్కచోటే ఉండడం ఎంతైనా అవసరం. దీనికి మీరేమంటారు?
“అవును డాక్టర్ మీరు చెప్పినది ఎంతైనా నిజం. కానీ…” సందేహిస్తూ ఆగిపోయింది రాధిక….
“కానీ…”
“గోపాల్ ఎటువంటి సంపాదనా లేకుండా ఉన్నప్పుడు నేను కూడా ఉన్న ఉద్యోగం వదులుకుంటే పాప ఖర్చులూ పోషణా కష్టమవుతాయి. అక్కడికి వెళ్ళి మామగారి పై ఆధార పడడం నాకు ఇష్టం లేదు డాక్టర్” తన మనసులోని మాట బయట పెట్టింది రాధిక.
ఈ విషయమై కొంచం గంభీరంగానే స్పందించారు డాక్టర్.
తదుపరి ఆరు నెలలు డాక్టర్ రాజేంద్ర, రాధిక గోపాల్ తో వారి ఆర్థిక పరిస్థితులూ, బాధ్యతలు, భయాలూ, ఆందోళనలూ…అన్నీ కూడా ఒక్కొక్కటే విడివిడి కౌన్సిలింగ్ సమావేశాలలో కూలంకషంగా చర్చించారు.
అలా ఇరువురినీ కలిపి కూర్చుండజేసి వారి మనస్సులలోని సందేహాలను తీరుస్తూ జరిపిన కౌన్సిలింగ్ మంచి ఫలితాలనే ఇచ్చింది…..
కాలచక్రంలో చూస్తుండగానే ఒక సంవత్సరం గిర్రున తిరిగింది.


గడచిన ఏడాదిలో విజయ నాలుగైదుసార్లు మాత్రమే ముఖతః రాధికను కలవటం జరిగింది. చాలా దూరం కావడం వల్ల వాళ్ళింటికి వెళ్లడానికి కూడా కుదిరేది కాదు. సాధ్యమైనప్పుడల్లా ఫోన్ ద్వారా అన్ని విశేషాలూ చెప్తుండేది రాధిక.
క్షేమ సమాచారాలు కనుక్కోవడం, కౌన్సిలింగు ఎలా జరుగుతోందనే విజయ ప్రశ్నలకు ఆశాజనకంగానే ఉందని చెప్తుండేది రాధిక.
ఒకనాడు విజయ భోజనం చేస్తున్న సమయంలో సెల్ మ్రోగినట్లయితే వెళ్ళి చూస్తే ఏదో కొత్త నంబరు ఉంది .
ఫోన్ ఎత్తి “హలో! ఎవరు?” అంది
అవతలినుంచి “విజయా నేను రాధికని”
“హాయ్ రాధికా నువ్వా? ఈ క్రొత్త నంబరు ఎవరిదా అని చూస్తున్నాను”
“అవును నా ఫోన్ పోవడంతో అన్ని నంబర్లూ పోయాయి. ఇది కొత్త ఫోన్ కొత్త సిమ్, నంబరు కూడా మారింది. ఇది నోట్ చేసుకోండి. లక్కీగా మీ నంబరు ఫోన్ పుస్తకంలో వ్రాసి ఉంచాను”
“అందుకా నీ నంబరుకి చేసినా పలకలేదు. సర్లేమని నేనే రేపో ఎల్లుండో నిన్ను కలుసుకోవడానికి వద్దామనుకుంటున్నాను. ఇంతకీ ఏమిటి సంగతి? ఇంటినుండేనా మాట్లాడేది?”
“కాదు హైదరాబాదు నుండి”
“అదేమిటీ అక్కడికెప్పుడు వెళ్ళావు?”
“ఒక వారమైంది. ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాను”
“ఓహో ఎంత మంచి వార్త, అది సరే గాని అక్కడ ఉద్యోగం వచ్చిందా?ఎక్కడుంటున్నావు?”
“ఉద్యోగం కోసం రాలేదు. ఇక్కడే మా ఇంట్లోనే గోపాల్ తో కలిసి ఉంటున్నాను”
“అదేమిటి మరి….?” సంభ్రమంతో మిళితమైన సందేహంతో మాట మధ్యలోనే ఆపేసింది విజయ
“అవును విజయా నిజం . గోపాల్ పాపని మనఃస్ఫూర్తిగా స్వీకరించి దగ్గరికి తీసుకున్నారు. అన్నీ సర్దుకున్నాయి. ఇదంతా మీవల్లనే సాధ్యమైంది. మీరు ఇచ్చిన సలహా ప్రకారమే ఇద్దరము మీరు చెప్పిన
ఫ్యామిలీ కౌన్సిలర్ ను సంప్రదించామని మీకు తెలుసుగా. ఆ కౌన్సిలింగ్ గోపాల్ మనసు మారడానికి ఎంతో దోహదం చేసింది.
అంతే కాదు విజయా మా ఆడపడుచు , అత్త మామలు కూడా పదే పదే గోపాల్ తో పాప పట్ల అతను ప్రవర్తిస్తున్న తీరు సరైనది కాదని, చంద్రిక పరిస్థితికి అది బాధ్యురాలు కాదని ఇలాంటప్పుడే నాకు తోడుగా ఉండాలని నచ్చజెప్పారు.
మాకు దూరంగా ఉండటం వల్ల గోపాల్ కి కూడా అతను కోల్పోతున్నదేమిటో తెలియ వచ్చింది. ఇలాగే ఉంటే నేను ఎప్పటికీ తన దగ్గరికి వెళ్ళనని కూడా అర్థం చేసుకున్నారు. అందుకే పాపను తీసుకుని తనతో రమ్మని బ్రతిమిలాడారు . మమ్మల్ని బాధ్యతగా బాగా చూసుకుంటానని వాగ్దానం చేశారు. ఇక్కడికి వచ్చి అన్నీ కుదుటపడ్డాక మీకు చెప్పవచ్చని ఇప్పుడు చేస్తున్నాను”
“చెప్పలేనంత సంతోషంగా ఉంది రాధికా నాకు. పాప ఎలా ఉంది?”
“పాప పరిస్థితిలో కూడా కొంత మార్పు వచ్చింది. తండ్రి దగ్గిర బాగా మాలిమి అయింది. నేనిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను విజయా. గోపాల్ ఈ మధ్యనే ఉద్యోగంలో కూడా చేరారు.
ఇద్దరం కలిసి చంద్రికని బాగా చూసుకోగలమని నా నమ్మకం. పాపని ఇక్కడే ప్రత్యేకమైన స్కూలులో చేర్పించాము. రోజూ గోపాల్ వెళ్ళి పాపను స్కూలులో దిగబెట్టి మళ్ళీ తానే ఇంటికి తీసుకుని వస్తుంటారు” అంది రాధిక కంఠంలో ఆనందం తొణికిసలాడుతుండగా .
“అభినందనలు రాధికా. ఎలాగైతేనేమీ మీరందరూ మళ్ళీ కలిసి ఆనందంగా ఉన్నారు. నీ జీవితం సుఖంగా గడవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ సారి విశాఖపట్నం వచ్చినప్పుడు తప్పకుండా కలువు. సరేనా?”
“అలాగే తప్పక కలుస్తాను”
“జీవితంలో ఎదురైన ఒడిదుడుకులని అత్యంత ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని విజయం సాధించిన నిన్ను మనఃస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రాధికా”
“థాంక్యూ విజయా. ఇంక ఉంటాను” అంది రాధిక.


దినవహి సత్యవతి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.