చిగురిస్తున్న జీవితం – తృతీయస్థానం పొందిన కధ

0
695

చిగురిస్తున్న జీవితం


ఒకప్పటి రాజమహేంద్రవరం రూపాంతరాలు చెందాక రాజమండ్రిగా మారి మళ్ళీ రాజమహేంద్రవరంగా రూపెత్తింది.. ఈ లోపున సమైక్యంగా ఉన్న తెలుగు ప్రజలు, రెండు సరిహద్దులను ఏర్పరుచుకుని కొత్త రాష్ట్రాల్లా మారడంతో నగరీకరణ పెరిగింది. రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతూ వస్తుంది. త్వరలోనే హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నంల సరసన చేరిపోతుంది. పాఠశాలలు తెరిచే సమయంలోనూ, ఆఫీసులకు వెళ్ళే సమయంలోనూ ఎంత రద్దీ ఉంటుందో, అవి వదిలేసే సమయంలోనూ అంతే రద్దీ ఉండడం సహజమైపోయింది.

సాయంత్రంపూట బజాజ్ బండిపై కళ్ళజోడు పెట్టుకున్న, తెల్ల పైజమా తొడుక్కున్న అరవై సంవత్సరాలకు దగ్గరపడుతున్న గోపాల్ రావు, ఎక్కడ ఏ ఆక్సిడెంట్ జరుగుతుందోనని జాగ్రత్తగా బండిని నడుపుకుంటూ వస్తున్నాడు. కోటగుమ్మం సెంటర్ దాటితే ట్రాఫిక్ సమస్యలను దాటుకుని ఊపిరి పీల్చుకోవచ్చు. రెడ్ సిగ్నల్ వలన బండికి బ్రేకులు పడ్డాయి. గ్రీన్ సిగ్నల్ పడడంతో, ఆలోచనలు గతంలోకి మళ్ళిన వాటిని వెనక్కి తెచ్చుకుని కోటగుమ్మం సెంటర్ను దాటేశాడు గోపాల్ రావు.

ఒక పనైపోయిందన్న మీమాంసలో వెనక్కి తిరిగి చూశాడు. కంగారు మొదలైంది. బండిపైన ఒక్కడే ఉన్నాడు. తననే అంటిపెట్టుకుని కూర్చోవాల్సిన తన భార్య మాణిక్యం లేదు. గుండె బద్ధలైనంత పనైంది. కంగారుగా బండిని పక్కకి తీయబోతుండగా వెనుకనుండి వస్తున్న బండి, డీ కోట్టింది. ఆ వ్యక్తి వేగంగా కొట్టడంతో దెబ్బలు బాగానే తగిలాయి. గోపాల్ రావు పక్కకి వాలిపోయి దెబ్బలనుండి తప్పించుకున్నాడు.
భార్య ఎక్కడ తప్పిపోతుందోనని భయం. డీ కొట్టిన వ్యక్తికీ దెబ్బలు తగిలిన వైనం – రెండూ అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. కాళ్ళూ చేతులు ఆడడం లేదతనికి. జనమంతా గుంపుగా మూగిపోయారు.

ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. ఎవ్వరి మాటలకు సమాధానమిచ్చే స్థితిలో లేడతను. కాసేపు రోడ్డుకిరువైపులా చూడడం, మరికాసేపు ఆ వ్యక్తిని చూడడం క్షణకాలంలో జరిగిపోతున్నాయి. మాట్లాడేవారేగాని ముందడుగు వేసే వారెవ్వరూ కన్పించలేదు. తన తప్పు లేకపోయినా గోపాల్ రావుదే తప్పయింది. ఒక్కసారి ఉశ్చ్వాస నిశ్వాసాలను తీసుకుని పయనమయ్యాడు. రెండు బండ్లను పక్కనే లాక్ చేసి, పక్కనే పడి కొద్దిగా పగిలిన ఫోన్ తీసుకొని, అతన్ని ఆటోలో పక్కనున్న ‘మృణాలిని నర్సింగ్ హోమ్’కు తీసుకెళ్ళాడు.

ముందే డబ్బులు కట్టమనడంతో జేబులో ఉన్న క్రెడిట్ కార్డు తీసి వాడాడు. పేషెంట్ డిటైల్స్ కావాలంటే అతని జేబుని శోధించి, వివరాలు కనుక్కొని ‘శ్రీను’ అని చెప్పి రిజిస్టర్ చేయించాడు. పూర్తిగా ఏం జరుగుతుందో తెలుసుకునే స్థితిలో లేకపోయినా గోపాల్ రావు మొహాన్ని, అక్కడేమేమి జరిగిందో కళ్ళముందు కదిలెళ్ళిన క్షణాల్ని మాత్రం గుర్తుపెట్టుకున్నాడు శ్రీను. ఏనస్తీషియా మందు ఇవ్వడంతో అప్పుడప్పుడే గమనిస్తున్న సంఘటనలు ఆయన మస్తిష్కంలోకి చేరిపోతూ, కళ్ళు మెల్లిగా మూసుకున్నాడు.

గోపాల్ రావు మొహంలో చెమటలు. ఫోన్ పాడవ్వడంతో సిగ్నల్స్ దెబ్బతిన్నాయి. ఆసుపత్రంతా కలియ తిరుగుతూ టెన్షన్ పడుతున్నాడు. అదెప్పుడు పనిచేస్తదో అనుకుంటూ అదే పనిగా ఫోన్ వంకే చూస్తున్నాడు. మనస్సులో భార్య గురించి ఆలోచన. అతనితోపాటు ఎవ్వరూ లేకపోవడంతో వెంటనే బయటకు వెళ్లోద్దని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని అయోమయో స్థితిలో గోపాల్ రావు గుండెవేగం పెరిగింది. ఈ వయసులో అది తట్టుకోవడం కష్టమవుతుంది. ఏం చేస్తాం..! కాలం పెట్టె పరీక్షలో తప్పక పోల్గోనాల్సిందే.! అరగంట తర్వాత కట్లు కట్టి, బెడ్ రెస్ట్ అని చెప్పి పడుకోబెట్టడంతో, ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నాడు గోపాల్ రావు.

ఎట్టకేలకు ఫోన్ పని చేయడంతో శ్రీను కుటుంబ సభ్యులకు జరిగిన విషయం తెలియజేశాడు. గంట తర్వాత శ్రీను భార్య విశాలి, ఆమె తండ్రి ఆసుపత్రికి చేరుకున్నారు. భార్తనా పరిస్థితిలో చూసిన ఆమె బాధ మరింత పెరిగింది. ఆమె కర్చీఫ్ క్కూడా పని పెరిగింది. బాధేక్కువైతే ఆవేశం పెరిగి, ఆలోచన తగ్గి, వివేకం కోల్పోవడం సహజం. కూతుర్ని ఓదార్చి, విషయం తెలుసుకున్నాడు ఆమె తండ్రి. గోపాల్ రావుతోపాటు కోటగుమ్మం సెంటర్ కెళ్ళి, అల్లుడి బండిని తీసుకుని వచ్చాడు. తప్పు చేసి బాధపడుతున్నాడు అనుకుంటున్నారే కాని, ఆయన అంతరంగం మరోకరికై పరితపిస్తుందని ఆ పరమేశ్వరుడికే తెలుసు. బాధనంతా దిగమింగుకోవడం అలవాటైన గోపాల్ రావు మొహంలో ఒక్కసారిగా వెలుగు కనిపించింది – ఫోన్ రావడంతో..!


ఒక చపాతి ప్యాకెట్, రెండు కూరలు తీసుకొని ఇంటికి చేరుకునేసరికి రాత్రి తొమ్మిదయింది. గేటు తీసుకుని బండిని తోసుకుంటూ లోపలికెళ్ళి వరండాలో పెట్టి లోపలికి చూశాడు. టీవీకి ఎదురుగా మాణిక్యం. పక్కనే ప్రణతి. కన్నీళ్లు ఆగలేదు గోపాల్ రావుకు. కాస్త తేరుకొని
“చాలా థాంక్సమ్మా! ఇంతసేపు ఇక్కడే ఉంటే మీ అమ్మకు అనుమానం వస్తుంది. నువ్వు త్వరగా వెళ్ళమ్మా” అన్నాడు గోపాల్ రావు.
“అమ్మ అలాగే అంటుందిలే పెదనాన్న.! అయినా అమ్మకెలా తెలుస్తుంది.? నేను చెప్పను, మీరు చెప్పరు, పెద్దమ్మ ఎలాగూ చెప్పలేదు” అని ఒక్కసారిగా నాలుక కరుచుకొని తలొంచుకుని వంటిట్లోకి వెళ్ళింది ప్రణతి.

వస్తున్న కన్నీటిని తుడుచుకొని మాణిక్యం వంక చూసి, ఊరుకున్నాడు. తనకేం సంబంధం లేనట్లు చేతిలో రిమోట్ పట్టుకొని ఛానల్స్ మారుస్తూ బిజిబిజీగా గడిపేస్తుంది మాణిక్యం. ప్రణతికి కనిపించకుండా మేనేజ్ చేశాడు కాని భార్యకు కనిపించకుండా మేనేజ్ చేయలేకపోయాడు. తనేమంటుందోనని ఆమెకు ఎదురుగా కనిపించేలా నిల్చున్నాడు. భర్తకు దెబ్బలు తగిలి, ఒకపక్క మట్టి అంటుకుని, చొక్కా కొద్దిగా చిరిగి ఉన్నా, అవన్నీ మాణిక్యం చూస్తున్నా కూడా నోరు మెదపలేదు. తనకి కనిపించేలా ఏం చేసినా వ్యర్ధమేనని తెలుసు. కాని పిచ్చి మనస్సు ఇంకేదో కోరుకోవడం సహజమే కదా.! ఈసారి కూడా ఆమెలో ఎటువంటి ప్రతిస్పందనలు లేవు. అదామెకు దేవుడిచ్చిన వరమో, శాపమో అర్ధం కానట్లయ్యింది పరిస్థితి.


“మన ఆఫీసే కదండీ! తొందరెందుకు? పూర్తిగా తగ్గాకే వెళ్ళొచ్చు కదా” భర్త అతని తల దువ్వుతూ విశాలి.
“సొంతది కాబట్టే భయం. నేను కూడా ఎంప్లాయ్ అయుంటే ఈ వంకతో నెల రోజులు శెలవు పెట్టేవాడినే. మనది కాబట్టి వెళ్ళాలి. లేకపోతే వాళ్ళు వంకలు పెట్టుకుని వర్క్ చేయరు. నరేష్ లేకపోతే ఎంత ఇబ్బంది.?” అంటూ ఏదో పరధ్యానంలో ఆగిపోయాడు శ్రీను.

“ఎవరి గురించండి అంతలా ఆలోచిస్తున్నారు.?” అడిగింది భార్య.
“ఆ రోజు ఆక్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశాడే అతని గురించే. డీటెయిల్స్ కావాలి. హాస్పిటల్ వాళ్ళను అడిగితే డిటైల్స్ చెప్తారంటావా.? అతన్నోకసారి కలవాలి రా.!” బాధగా అన్నాడు భర్త.
“నన్ను అడిగితే నేను చెప్తానుగా” అంది.
“అవునా? నీకెలా తెలుసు?” అడిగాడు.

“అదేంటి అలా అంటారు? మీకిలా జరిగిందని అతను ఫోన్ చేయడంతో హాస్పిటల్ కు వచ్చాం. మేం వచ్చేంతవరకు అతను అక్కడే ఉన్నాడు పాపం.. చాలా బెజారిపోయి ఉన్నట్లు కనిపించింది అతని మొహం. బాగా బయపడినట్లున్నారు. మీకు ఎలా ఉందని రెండు మూడు సార్లు ఫోన్ చేసి ఆరాలు తీశాడు కూడా.! ఆయన పేరు గోపాల్ రావు అంట..!” అందామె.!

“ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు మరి..?” కాస్త కోపంగా అడిగాడు శ్రీను.
“అంటే… చెప్తే, మీరు ఆ రోజు జరిగింది తలుచుకుని బాధపడతారని…” అంటూ నసిగింది విశాలి.
“బుద్ధుందా… అసలు..? నేనెంత ట్రై చేస్తున్నానో తెలుసా..?” సీరియస్ అయ్యాడు శ్రీను.

“సారీ అండి..!” అంటూ బుంగమూతి పెట్టుకుని అలిగింది విశాలి. ఒక్కసారిగా గ్రహించాడు శ్రీను.
“సారీరా…! కోపంలో ఏదో అనేశాను. ఫీల్ అవ్వకు… మా బంగారం కాదు… ఆ ఫోన్ నెంబర్ ఇలా ఇవ్వు..” అంటూ బుజ్జగించి, ఫోన్ నెంబర్ తీసుకుని గోపాల్ రావు కు ఫోన్ కలిపాడు. అతను ఫోన్ అందుకోగానే
“నమస్తే అండి..! మొన్నా రోజు ఆక్సిడెంట్లో దెబ్బ తగిలితే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు కదండీ! అతన్నే మాట్లాడుతున్నానండి.. శ్రీనును.. “..! ..! ..!” మిమ్మల్ని ఒకసారి కలిసి తీరాల్సిందే! కాదనకండి. ప్లీజ్ సార్ అడ్రస్ చెప్పండి. నేనే వచ్చి కలుస్తాను” అంటూ బాగా ఇబ్బంది పెట్టేశాక ఒప్పుకోక తప్పలేదు.


కాలింగ్ బెల్ మ్రోగింది. తలుపు తీశాడు గోపాల్ రావు. ఎదురుగా శ్రీను. కృత్రిమ వెలుగుల వెలుతురిలో ఇద్దరూ చూసుకున్నారు. అయితేనేం ఒకర్నొకరు గుర్తుపట్టగలిగారు. అదే ప్రకృతి గొప్పదనం. అది కాలంతో కలిసి ఎటువంటి వారినైనా కలిపేస్తుంది, కావాలనుకుంటే విడదీసేస్తుంది.
“రా బాబు… లోపలికి రా.. దెబ్బలు తగ్గినట్లే కన్పిస్తున్నాయి. ఇప్పుడెలా ఉంది?” కుశల ప్రశ్నలు అడిగాడు గోపాల్ రావు.

“బాగానే ఉందండి. కొంచం నొప్పి పెడుతుంది.. అంతే!” కుర్చీలో కూర్చుంటూ అన్నాడు శ్రీను. ఏం మాట్లాడుకోవాలో తెలీక వాళ్ళిద్దరి మధ్య కాసేపు మౌనం రాజ్యమేలింది.

“నన్ను క్షమించండి సార్.! తప్పంతా నాదే! ఆ సంగతి తెలుసుకోకుండా అందరూ మీపై కోప్పడ్డారు. ఇదంతా మనస్సులో పెట్టుకోకండీ. వాళ్ళ తరుపున నేను క్షమాపణలు కోరుతున్నాను. మీరిచ్చిన డబ్బును చెక్ రూపంలో ఇవ్వగలిగినా మీరు పడిన బాధను నేను తగ్గించలేను. కాదనకుండా ఈ చెక్ ను తీసుకోండి ప్లీజ్…” అంటూ చెక్ ను చేతికి అందివ్వబోయాడు శ్రీను. కుర్చీలో కొంచం వెనక్కి జరిగి చెక్ ను అందుకోలేదు గోపాల్ రావు.

“ఎందుకులేవయ్యా! అందులో నా తప్పు కూడా ఉందిలే” వెనక్కి తగ్గాడు గోపాల్ రావు.
“పూర్వం తప్పుకు, ఒప్పుకు బేధం ఉండేది సార్. తప్పంటే తప్పే, ఒప్పంటే ఒప్పే. ఈరోజుల్లో ఎటువైపు మద్దతేక్కువుంటే అదే ఒప్పు. ఎటువైపు తక్కువుంటే అదే తప్పు. అక్కడేం జరిగిందో కరేక్టగా ఎవ్వరూ చూడలేదు. దెబ్బలు నాకే తగలడంతో తప్పంతా మీదేనన్నారు. అసలు తప్పు నాది సార్. సిగ్నల్ లైట్లు వేసినా, నేనేదో హడావుడిగా వెళ్ళాల్సి వచ్చి, ఆ కంగారులో బండి డ్రైవ్ చేస్తూ మిమ్మల్ని గమనించకుండా డీ కొట్టేశాను. ఇందులో మీ తప్పేం లేదు సార్” తన పరిస్థితిని వివరించాడు శ్రీను.

“అయ్యిందేదో అయ్యిందిలే.., వదిలేయ్ బాబు” అన్నాడు గోపాల్ రావు.

“మీరు మంచోళ్ళు కాబట్టి సింపుల్ గా తీసుకున్నారు. మరొకళ్ళయితే ఎంత రాద్దాంతం చేసేవారండి. మీ మంచితనానికి అవార్డెంటో తెలుసా సార్ – డబ్బులు పోగొట్టుకోవడం, టెన్షన్ పడడం. నేనంతా ఓ పక్క గమనిస్తూనే ఉన్నాను సార్. మీరు చాలా కంగారుగా ఉన్నారోజు. పదే పదే ఫోన్ చూసుకుంటున్నారు.. డబ్బులు ముందే కడితే కాని హాస్పిటల్ వాళ్ళు జాయిన్ చేసుకోలేదు. ఆమాత్రం కూడా తిరిగివ్వకపోతే నన్ను నేను క్షమించుకోలేను. ప్లీజ్ సార్ తీసుకోండి” అభ్యర్ధించాడు శ్రీను.

“మంచోడిని నేను కాదయ్యా.. నువ్వే…! గుర్తుపెట్టుకుని, మా ఇంటికొచ్చి, క్షమాపణలు చెప్పి, సంజాయిషీ ఇస్తున్నావ్. ఇంకొకళ్ళు అయితే ఉడాయించేవాళ్ళే. మీ పెద్దవాళ్ళ పెంపకం వలన నీకా మంచి అలవాట్లు ఏర్పడ్డాయ్. ఈ వయస్సులో కూడా నీ తప్పును నువ్వు గ్రహించుకోవడమే కాకుండా, ఎదుటివాళ్ళను క్షమించమని అడుగుతున్నావ్ చూడు అందుకు ముచ్చటేస్తుంది” ఆనందంతో చెప్పాడు గోపాల్ రావు.
“థాంక్స్ అండి! మీరు ఆనందపడుతున్నారంటే మమ్మల్ని క్షమించేసినట్లేగా! ఈ చెక్ ను కూడా తీసుకొని అది కన్ఫర్మ్ చేయండి ప్లీజ్..! ఇంకా మనం ఫ్రెండ్స్ అయినట్లే! ఆంటిగారిని కూడా పిలవండి. ఆమెను కూడా కలిసి బయలుదేరతాను” అన్నాడు శ్రీను.

మాణిక్యం ప్రస్తావన రాగానే గోపాల్ రావు మొహంలో బాధ అలుముకుంది. శ్రీనుకు కనిపించకుండా చేయడానికి ప్రయత్నిసున్నాడు కాని కుదరడం లేదు.

“ఏంటంకుల్? అలా అయిపోయారు? ఎనీ థింగ్ హప్పెన్స్?” కంగారుగా అడిగాడు శ్రీను.
మౌనం వహించాడు గోపాల్ రావు. ‘ఆకలి… ఆకలి…’ అనే అరుపులు లోపలినుండి వినిపించేసరికి శ్రినుని

అక్కడే ఉండమని గోపాల్ రావు లోపలికెళ్ళాడు. అతనికి తెలియకుండానే శ్రీనూ అనుసరించాడు.
పెద్ద షాక్..!! చిన్నపిల్లల మనస్థత్వంతో, మాణిక్యం టీవీ చూస్తూ అరవడం శ్రీను కంటపడింది. తనకి ప్లేట్లో భోజనం పెట్టి వెనక్కి తిరిగే సరికి శ్రీను ఎదురుగా కనిపించాడు. ఏదైతే ఇతరులకు తెలియకుండా దాచాలనుకున్నాడో అది బహిర్గతం అయిపొయింది. బాధను ఆహ్వానించక తప్పలేదతనికి. మనస్సులో బాధను కొంతమందికైనా చెప్పుకుంటే తగ్గుతుందని, కళ్ళజోడు తీసి కన్నీళ్లు తుడుచుకుంటూ, గతాన్ని గుర్తు చేసుకున్నాడు.

“తను మాతో ఉంటుంది కాని మా ప్రపంచంలో ఉండదు. ప్రపంచంలో ఉంటుంది కాని మమ్మల్ని అందులో ఉండనివ్వదు. ఒకప్పుడు నన్ను జాగ్రత్తగా చూచేది. అందులో ప్రేమానురాగాలకు తోడుగా ఆనందాలూ ఉండేవి. ఇప్పుడు తనను నేనే చూసుకోవాలి. ఇందులోనూ ప్రేమానురాగాలు ఉంటాయి కాని ఆనందాలుండవు. ఏమని చెప్తే తగ్గుతుంది.? ఏమి చేస్తే నయమవుతుంది. నన్నే నమ్ముకుని, నాతో జీవితం పంచుకోవడానికి వచ్చినామె, ఇప్పుడు ఒక ప్రపంచాన్ని వదిలి మరో ప్రపంచంలో బ్రతుకుతుంది బాబు. అదే పెద్ద బాధ” చెప్పి నిట్టూర్చాడు గోపాల్ రావు.

“సృష్టిలో ప్రతి దానికీ ఒక కారణముంటుంది కదాంకుల్! తనిలా బిహేవ్ చేయడానికి కారణమేంటో తెలుసుకోవచ్చా ప్లీజ్..” అడిగాడు శ్రీను. శ్రీను వంక అదోలా చూశాడు గోపాల్ రావు. అందులో బాధే కన్పిస్తుంది.

“మేం దురదృష్టవంతులం నాయన. పెళ్ళయిన కొన్నాళ్ళకు పిల్లలు పుట్టారు. బాలారిష్టాలేమో త్వరగా కాలం చేశారు. ఇద్దరు పుట్టి, చనిపోయాక మాకు భయం పట్టుకుని సీతమ్మపేట, కృష్ణా నగర్లోనున్న శాస్త్రిగారిని కలిశాం. ఎవరైనా తెలిసిన వాళ్ళ పిల్లలోకళ్ళని తెచ్చుకుని పెంచుకోమని చెప్పారు. దాంతో గ్రహాల సర్దుబాటు జరిగి సంతానం కలిగే అవకాశముందని చెప్తే రంజనిని తెచ్చుకున్నాం. చుట్టుపక్కల వాళ్ళ సలహాలు, రంజని బంధువుల పోరు కారణంచేత మేజరవ్వగానే పెళ్లి చేశాం. సంవత్సరం పాటు బాగానే ఉంది. తర్వాత అల్లుడు మంచోడు కాదని తెలిసింది. అప్పుడేం చేయగలం..? అమ్మాయి జీవితం తొందరపడి నాశనం చేశామని అందరం బాధపడ్డాం. మనోళ్ళకు ప్రేమాభిమానాలు, మమకారాలు ఎక్కువే కదా! ఎన్ని జరిగినా బంధాలు తెంచుకోరు. అమ్మాయి కూడా వాడిని భరిస్తూనే ఉంది. ఇన్ని బాధల్లో ఉండగా మాణిక్యం నెల తప్పడం మాలో ఆనందాన్ని తెచ్చింది. ఈ వయసులో ఇదేంటని కొంతమంది విడ్డూరంగా చూసినా, శాస్త్రిగారి మాట నిజమవుతున్నందుకు అదృష్టవంతులమని పొంగిపోయాం.

బాబు పుట్టాడు. వాడు కూడా పుత్తిళ్ళలోనే కాలం చేస్తాడేమోనని భయపడిపోయాం తెలుసా..!. మూడేళ్ళు గడిచేసరికి గట్టిపిండమేనని సంబరపడ్డాం. కాని మా అంచనా తప్పయింది. మా ఆనందాలు ఎంతోకాలం నిలవలేదు. మా దురదృష్టం మమ్మల్ని వదల్లేదు. ఫుడ్ పాయిసెన్ వలన చనిపోయాడు. కన్నబిడ్డలు దూరమైతే ఎంత బాధుంటుందో పోగొట్టుకున్నవాళ్ళకే తెలుస్తుంది. ఈసారి మాణిక్యాన్ని ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. సంవత్సరం, రెండు సంవత్సరాల పిల్లలు దూరమైతేనే తను తట్టుకోలేకపోయింది. ఐదేళ్ళ బాబు, వారసుడనుకున్న వాడు దూరమయ్యేసరికి భరించలేకపోయింది. ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది. పిల్లోడి మాటలు తనకి వినిపిస్తున్నట్లు, వాటికి తను స్పందిస్తున్నట్లు, వాడితో గడుపుతున్నట్లు ఊహించుకుంటూ బ్రతికేస్తుంది. ఈ అల్లరి చూశావ్ గా.. అదిదే.. టీవీలో పిల్లల పోగ్రామ్స్ చూస్తుంది. అందులోని పిల్లలను చూస్తూ మా అబ్బాయే అక్కడ ఉన్నాడని చూసి సంబరపడుతుంది. తనేం అయిపోతుందనే భయం వెంటాడుతుంది బాబు..” అంటూ ఆపేశాడు గోపాల్ రావు.

“ఐ యాం వెరీ సారీ అంకుల్! నేనసలు ఊహించలేదు” సానుభూతిని చూపించాడు శ్రీను.
“మా దరిద్రానికి నువ్వేం చేస్తావులే బాబు” సర్దుకున్నాడు గోపాల్ రావు.
“డాక్టర్ గారు ఏమన్నారు?” అడిగాడు శ్రీను.
“చూపిస్తూనే ఉన్నాను. మన ట్రాన్స్ నుండి వేరే ట్రాన్స్ లోకి వెళ్ళడంతో ట్రీట్మెంట్ కష్టమవుతుంది. చిన్నపిల్లలతో ఎక్కువుగా గడిపితే కాస్త కుదుటపడే అవకాశాలున్నాయన్నారు” మంచినీళ్ళు కోసం ఫ్రిజ్ తెరుస్తూ చెప్పాడు గోపాల్ రావు.
“అటువంటి ప్రయత్నమేదీ చేయలేదా?” కుతూహలంగా అడిగాడు శ్రీను.
“తన చేష్టలకు ‘పిచ్చిది…పిచ్చిది..’ అంటూ ముద్రేసి దూరం వెళ్ళేవాళ్ళే కాని దగ్గరకొచ్చి ఆప్యాయంగా పలకరించే వాళ్ళెవరు? కాసేపు కలిసి ఆడేదెవరు? ప్రేమగా స్పర్శించే దెవరు? భలే అడుగుతున్నావే..” మంచినీళ్ళు అందిస్తూ చెప్పాడు గోపాల్ రావు.

“అదేంటండీ అలా అంటారు? మీ అన్నయ్యో, తమ్ముడో, వాళ్ళ పిల్లల్లో ఎవరో ఒకరు ఉంటారు కదా! కుటుంబమంతా కలిసుంటే తనకి మంచి జరగొచ్చు కదాంకుల్.!” మంచినీళ్ళు త్రాగుతూ అన్నాడు శ్రీను.
ఒక్కసారిగా నవ్వాడు గోపాల్ రావు. ఆశ్చర్యపోవడం శ్రీను వంతైంది. గ్లాసుని టేబుల్ పైపెట్టి “ఏమైందంకుల్.? అలా నవ్వుతున్నారు?” అని అడిగాడు.

“బంధువులు అన్నావ్ గా! అందుకే నవ్వోచ్చిందిలే బాబు. ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు – అందరం కలిస్తే పెద్ద ఉమ్మడి కుటుంబమే! నా జీవితంలో ఆనందాల కన్నా, దుఃఖాలనే ఎక్కువుగా వ్రాసాడేమో ఆ దేవుడు” అంటూ నవ్వడం ఆపేశాడు గోపాల్ రావు. ఏం చెప్తారోనని చూస్తూనే ఉన్నాడు శ్రీను.

“ఆస్థి తగాదాలు మామూలేగా..! జ్యేష్ట భాగం క్రింద నాన్నగారు ఈ ఇంటిని నాకిచ్చారు. ఉన్న ఐదు ఎకరాల్లో తమ్ముడికి, నాకు చెరో రెండు ఎకరాలు, చెల్లెళ్ళకు చెరో అర్ధ-ఎకరం కట్నంగా ఇచ్చి పెళ్లి చేసి పంపించారు. నాకెక్కువ ముట్టిందని తమ్ముడూ, వాడి భార్య బయటకు కనపడని మౌనయుద్దాన్ని చేస్తుంటే, అమ్మ పేరుమీదున్న ఎకరం పొలం చేరి సగం మాకే ఇచ్చేసిందని, వాళ్ళకేం రాలేదని చెల్లెళ్ళు మా మీద అలిగారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వ్యర్ధమయ్యాయే తప్ప మమ్మల్ని కలపలేకపోయాయి. ప్రపంచానికి మాత్రం ఒకే తల్లి బిడ్డలం. గొడవలు లేకుండా ఎవరికీ వాళ్ళు అన్యోన్యంగా గడుపుతున్న జీవులం. మేమందరం కలిసుంటే నా మాణిక్యం అలా అయ్యేది కాదేమో. కాని కోల్డ్ వార్ నడుస్తోంది నాయన.. కోల్డ్ వార్…! పుడుతూనే నాతోపాటు దరిద్రాన్ని తోడు తెచ్చుకున్నానేమో, అది కూడా నా నీడల్లే వదలకుండా, ఎవరికీ కనపడకుండా వెనకే ఉంటుంది” చిన్నగా నవ్వుతూ అన్నాడు గోపాల్ రావు. ఆ నవ్వులో వెటకారంతోపాటు బాధ కూడా ధ్వనించింది.

“ఆంటీ గారికి తగ్గుతుందని చెప్పారా డాక్టర్స్?” ప్రశ్నించాడు శ్రీను.
“తగ్గుతుందనే అంటున్నారు. ఎప్పుడో తెలీదు. మొన్న కూడా వెళ్లి కలిశాం. అదే రోజు ఆక్సిడెంట్ అయ్యింది కదా! తనని డాక్టర్కు చూపించి ఇంటికొస్తుంటే ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు ఆగితే, నాకు తెలీకుండా బండిపైనుండి దిగి ఏటో వెళ్ళిపోయింది. చూసుకోకుండా సిగ్నల్ దాటేశాను. తను లేదని తెలిశాక బండిని పక్కకు జరుపుతుంటే వెనకనుండి నువ్వొచ్చి డీ కొట్టావ్” అంటూ గతాన్ని గుర్తు చేశాడు గోపాల్ రావు.

“సారీ అంకుల్! మీరలా అటుఇటూ చూస్తుంటే పారిపోవడానికి చూస్తున్నారేమో ననుకున్నాను. తీరా హాస్పిటల్లో జాయిన్ చేశాక కూడా మీ టెన్షన్ చూశాను. అది ఆంటీ గారి కోసమని తెలియదు. ఆ టైములో అంత రిస్కు ఎందుకు చేశారంకుల్?” అడిగాడు శ్రీను.

“ఏం చేయను బాబు! ఆక్సిడెంట్ అని, పోలీస్ కేసని ఎవరికీ వారు కంగారు పడిపోయి ముందుకు రాలేదు. మనుషుల మీద ప్రేముంటుంది కాని కేసులు మీదేసుకొని తిరగలేరు కదా! నావల్లే జరిగింది కాబట్టి బాధ్యుణ్ణి నేనేనని అందరూ నన్నే అన్నారు. రిస్కు ఎదురైనప్పుడు దేనికోదానికి ప్రయారిటీ ఇవ్వాలి కదా! నీకు కాకుండా ఆంటికి ప్రయారిటీ ఇచ్చాననుకో పారిపోతున్నాడని కొట్టేటట్లున్నారు జనం. అదే జరిగితే మాణిక్యాన్ని చూసుకునేదేవరు.? మిమ్మల్ని జాయిన్ చేసాక పోలీస్ కంప్లయింట్ ఇద్దామనుకునేసరికి తనని ఇంటికి తీసుకొచ్చానని మా తమ్ముడి కూతురు ప్రణతి ఫోన్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నాను” అంటూ మాణిక్యం గదివైపు ప్రేమగా చూశాడు గోపాల్ రావు.

“అంతా మంచే జరుగుతుంది. ఆంటీ గారికి నయమవుతుందంకుల్! నేను బయలుదేరతాను. జరిగింది మంచికో చెడుకో తెలియదు కాని దీనివలన నాకో మంచి కుటుంబంతో పరిచయం ఏర్పడింది. మిమ్మల్ని మర్చిపోను. కలుస్తుంటాను. ఏదన్నా సాయం కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి.. ఇది నా కార్డు. మీ దగ్గరుంచండి. ఆంటీ గారు జాగ్రత్తండి.” అంటూ శెలవు తీసుకున్నాడు శ్రీను.


శ్రీను, విశాలిలు పార్వతీ-పరమేశ్వర్లులా ఒకటైన జంట. వారిది చాలా అన్యోన్య మయిన దాంపత్యం. ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ, ఉన్న దాంతో సంసార సాగరాన్ని అవలీలగా దాటేయ గలుగుతున్నారు. ఈ ఆలుమగలను చూసి, ఆశ్చర్యపోని, ఈర్ష్యపడని, ఇది వీరికేలా సాధ్యమయిందని ఆలోచించని వారుండరు. భర్త మాటను జవదాటని భార్య.! భార్య మాటను గౌరవించే భర్త.! ఈరోజుల్లో ఆదర్శమే మరి.! అదెలా కుదిరిందో ఆ లయకారుడికే తెలుసు..!!

గోపాల్ రావుతో జరిగిన సంభాషణంతా భార్యకు పూసగుచ్చినట్లు చెప్పాడు శ్రీను. ఇద్దరి మధ్యలోకి కాసేపు మౌనం చొరబడింది. పిల్లలోచ్చి దాన్ని చెరిపేశారు. వాళ్ళ అల్లరి ఆనందాల్ని చూసేసరికి ఆమెకో ఉపాయం తట్టింది. ఇద్దరూ ఏకాభిప్రాయానికొచ్చారు. అనుకోకుండా జరిగిన తప్పుకు, ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. తల్లీదండ్రుల మాట జవదాటని సంతానం వారిది. ఎలా మసలుకోవాలో పాపకు, బాబుకి వివరించి చెప్పారు.


కాలింగ్ బెల్ మ్రోగింది. లోపల గోపాల్ రావు. బయట పిల్లలు. ఆశ్చర్యం, అనుమానం, ఆనందం. విభిన్న భావాలకు నిలయమైంది అతని మొహం. దూరంగా గేటు దగ్గర బండిని పార్క్ చేస్తూ శ్రీను దంపతులు కనిపించారు. అనుకోని సంఘటనకు లోపల ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు గోపాల్ రావు.
దంపతులిద్దరూ లోపలికొచ్చి కూర్చున్నారు. పిల్లల వైపు చూస్తున్నాడు గోపాల్ రావు. ఇల్లంతా కలియ చూస్తున్నారు. తండ్రి పిల్లలలకు చెవిలో ఏదో చెప్పగానే, ఎదురుగా కన్పిస్తున్న మాణిక్యం గదిలోకి వెళ్ళారు. ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితుల్లో గోపాల్ రావు అటూ-ఇటూ చూస్తున్నాడు.
తెలుసుకునే ప్రయత్నం చేయబోతుండగానే శ్రీను అందుకొని “అంకుల్..! ఈమె నా భార్య విశాలి. మీరు చూసే ఉంటారు” అంటూ పరిచయం చేశాడు. ఆమెవైపు చూస్తూ నవ్వును తెచ్చుకునే ప్రయత్నం చేశాడు గోపాల్ రావు.

“అంకుల్..! అలా ఆశ్చర్యపడకండి. నా వల్ల కొన్నిరోజులు మనోవేదన పడ్డారు. ఇకనుంచి మీకో మందు తెచ్చాను. చెప్పుకోండి చూద్దాం..” అన్నాడు శ్రీను. అర్ధం కానట్లు చూశాడు గోపాల్ రావు.
“మనోవేదనకు మందే లేదంటారు కదా బాబాయ్ గారు..! ఆంటీ గారి మనోవేదనకు మేం మందును తెచ్చాం. అదేంటో తెలుసా.? ఒక్కసారి మీ చెవులు రిక్కించి వినండి, తెలుస్తుంది. ఎక్కడో నవ్వులు విన్పిస్తున్నాయి కదా? అటు చూడండోకసారి…!” అంది విశాలి.

ఆ మాట అనడం, లీలగా వినడం జరగడంతో ఎదురుగానున్న రూంలోకి వెళ్ళాడు గోపాల్ రావు. తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. మాణిక్యం మనస్పూర్తిగా ఆనందించడాన్ని ఎన్నాళ్ళకో చూస్తున్నాడు. పిల్లలిద్దరితో ఆడుకుంటూ, అల్లరిచేస్తూ, ముగ్గురూ పసిపిల్లలై కొత్త బంగారు లోకాన్ని సృష్టించుకోవడాన్ని చూశాడు. ఈ కొత్తప్రపంచంలో వాళ్ళే విహరిస్తున్నారు. ప్రేమానుబందాలకు, ఆత్మీయ అనురాగాలకు మొహం వాచిపోయిన గోపాల్ రావు, వాళ్ళ ప్రేమకు కరిగిపోయాడు. వాళ్ళనలా చూస్తూ కళ్ళు చెమర్చాడు.
“పుణ్య దంపతులు, ఆ చిరంజీవుల ఆశిస్సులే తనని బ్రతికిస్తాయనిపిస్తుంది బాబు” అంటూ మాణిక్యాన్ని చూస్తున్నాడు గోపాల్ రావు. చిగురిస్తున్న ఆమె జీవితం అతని కళ్ళల్లో కన్పిస్తుంది. ఒకే గూటి పక్షులు ఒకే చోట చేరతాయి. అదే కాలం మహిమ..!!


దొండపాటి కృష్ణ

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.