దీపం జ్యోతీ..! ప్రధమస్థానం పొందిన కథ

0
487

దీపం జ్యోతీ..!


వరండాలో మంచం మీద కూర్చుని సూపర్ వైజర్ వెంకటేశ్వరరావు తో ఆ మర్నాటి వంటల
గురించి మాట్లాడుతున్న భగీరధమ్మ.. దొడ్డి తలుపు తోసుకుని లోపలికొచ్చి “ అమ్మమ్మా ..! “ అంటూ
చనువుగా దగ్గరకంటా కూర్చున్న ఆ కుర్రాణ్ని తేరిపార చూసింది. ఎంతకీ గుర్తు రాలేదు..ఎక్కడ చూసిందో..!

భగీరధమ్మ ఇదివరకంతా పట్నంలో ఉన్న చిన్న కొడుకు దగ్గరకెళ్ళి ఉండి వస్తూండేది. మొదట్లో
రెండు,మూడ్నెల్లు ఉండి వచ్చేసేదల్లా ఈ మధ్యకాలంలో వయసు కూడా సహకరించకపోవటంతో పద్దాకా తిరగలేక వెళ్ళినప్పుడల్లా అయిదార్నెల్లు తక్కువ కాకుండా ఉండి వస్తూంది. అయితే..

పెద్దకొడుకు ఊరి బాధ్యత భుజాలనేసుకునే సరికి ఇక్కడే ఉండిపోసాగిందేమో..ఆమె దగ్గరకి రోజూ ఎవరో
ఒకరు వస్తూనే ఉంటారు సలహా కోసమో, సహాయం కోసమో ఎందుకో ఒకందుకు. అలా వస్తూ వస్తూ ఏ అరటి పళ్లత్తమో, మామిడి పళ్లో, గేదె ఈనిందని వండేసిన జున్నో, జున్ను పాలో ఏవో ఒకటి పెద్దావిడని తెస్తూనే ఉంటారు. కొన్ని కొన్నిసార్లు ఆ వచ్చేవాళ్ల కూడా పిల్లలూ వస్తూనే ఉన్నా, పెద్దాళ్ళెవరూ లేకుండా ఇలా విడిగా వచ్చినప్పుడు ఎవరెవరో తెలిసేలోగానే తుర్రుమంటారేమో..పిల్లల్ని పెద్దగా గుర్తుపట్తలేకపోతూంది భగీరధమ్మ.

దానికి తోడు ఇట్టి చూసినోళ్ళు అట్టే ఎదిగిపోవటంతో..ఒకసారి చూసినప్పుడు మోకాళ్లకాడికి ఉండే పిల్లలు మళ్ళీ చూసేసరికి భుజాలు దాటేసి ఏ ఇంటరో, ఇంజనీరింగో చదువుతున్నామంటున్నారు. ఆడపిల్లలూ అంతే.

ఎంతలో ఎదుగుతారు పిల్లలు..అని మనసులో అనుకుంటూ..
“ ఎవరబ్బాయివోగానీ… తెలీటం లేదయ్యా..! ఇంతకు ముందెప్పుడైనా వచ్చేవా మా ఇంటికి? “ ఆ కుర్రాడి
భుజం మీద చెయ్యేసి ప్రేమగా నిమురుతూ అంది.. “అమ్మమ్మా..” అన్న పిలుపుకి మనసులోనే తెగ
సంబరపడిపోతూ

అక్కడే ఉన్న సూపర్వైజర్ వెంకటేశ్వర్రావు ఏదో చెప్పబోయాడు.
“నువాగయ్యా..వాణ్ని చెప్పనియ్..“ అన్నట్టుగా చేత్తో అతన్ని వారించింది వాడేదో చెప్పబోతుంటే ఆలకిస్తూ..

“ మా నాన్నున్నప్పుడు ..అప్పుడెప్పుడో వచ్చానోసారి..అప్పుడు బాగా చిన్నోణ్ణి..” వాడి మాటలకి
ముచ్చటేసింది భగీరధమ్మకి.
“ ఓసోసి..! ఇప్పుడు బాగా పెద్దాడివైపోయావా?” భుజం మీద నిమురుతూనే వెంకటేశ్వర్రావుకేసి చూసి
నవ్వి..అంతలోనే మళ్ళీ ఆ కుర్రాడికేసి చూస్తూ.. “ ఎవర్రా మీ నాన్నా..?” అంది ప్రేమగా..
“ ప్రభాకర్రావుగారబ్బాయిని ….అమ్మమ్మా..” అని మళ్ళీ తనే.. “ ..ఎక్కడికో పారిపోయేడు..సూడు ..అదే
అమ్మమ్మా..ప్రభయ్యంటారు …..”
“ ఆ..ఆ.. ప్రభయ్య కొడుకువా? ఓరి ముండగే..! నువ్వట్రా..! ఏం చదూతున్నా..?” అంది జాలిగా వాణ్ణే
చూస్తూ..
“ ఏడమ్మమ్మా..” తలొంచుకునే బదులిచ్చాడు.
“ ఏడా? బాగానే ఉంది. ఎక్కడ చదూతున్నా? మనూళ్ళోనేనా..?”
“ ఆ..! మనూళ్ళోనే ..అమ్మమ్మా..! గవర్నమెంటు స్కూల్లో. ఇలాగే ఎల్తా రోజూ..”

“ అట్టాగూ…” అని అంతలోనే తల పైకెత్తి అక్కడే నిలబడ్ద వెంకటేశ్వర్రావు వైపు చూస్తూ..”నువ్వెళ్ళయ్యా….రేపు
వంటకి కావాల్సినయ్యన్నీ తీసుకున్నావు కదా..”
“ఆ తీసుకున్నానండి..”

“ అయితే ..ఎల్లిరామరి. తలుపులు దగ్గరకేసి వెళ్ళు. ఆ గోంగూర ఆకులు కోసేటప్పుడు పురుగులేవైనా
ఉన్నాయేమో చూసి కొయ్యమను. గోంగూరనేసరికి ఉట్టినే పట్టి చస్తయ్ ఎదవ పురుగులని ఎదవ పురుగులు.
కాస్త చూస్తా ఉండయ్యా నువ్వు కూడాను. పెట్టేదేదో శుభ్రంగా పెట్టాలి..”

అలాగేనన్నట్టుగా తలూపి గుమ్మంకేసి నడిచాడు వెంకటేశ్వర్రావు. తలుపులు వేస్తున్నాడో లేదోనని
అతనెల్లేదాకా అటే చూసిన భగీరధమ్మ, “గేటు తీసుంటే చాలు.ఒకటే కుక్కలు. ముండా కుక్కలని..” తనలో తాననుకుంటూ ఆ కుర్రాడి వైపు తిరిగి ఇంకా ఏదో అనబోతుంటే..

“ నల్లకుక్కోటుంది అమ్మమ్మా..మనూళ్ళో. అది మీ ఇంటికొచ్చుద్దా? మా ఇంటిక్కూడా వచ్చుద్ది. మా చెల్లికి
భయం..అదంటే.. “
“ నల్లదో, తెల్లదో..! గేటు తీసుందంటే చాలు ..ఇట్తే దూరతాయ్ లోనికి. ఓ పట్తాన పోవు..సర్లేగానీ
మీ అమ్మేన్జేత్తంది..? బాగుందా? కారాలయ్యీ కొడతందా? ఎవరో అన్నారు పచ్చళ్ళూ, కారాలు టైములో
మీయమ్మసలు నిమిషం ఖాళీగా ఉండదని..”
“ఇదివరక్కొట్తేదమ్మమ్మా..! ఇప్పుడందరూ మిల్లే..గదా..! ఎవరూ పిలుత్తుల్లేదు. ఇళ్ళయ్యీ
దులుపుతుంది. అందుకే పడింది..నిచ్చెనమీంచి”
“ నిచ్చెన మీంచి పడిందా..? అయ్యో..రామా..! కరువులో అధికమాసమంటారు దీన్నే..! అసలే మొగుడు
దేశాలట్టిపోయి ..పిల్లల్తో ఇదవుతుందనుకుంటే మళ్ళీ ఇదొకటా..సరిపోయింది..!” బుగ్గల్నొక్కుకుంది భగీరధమ్మ.
“ నడుం ఇరిగింది..! గోగినేనోరి బజార్లో..రామరావు మాస్టారు ఉంటారు చూడు. ఆళ్లింట్లో ఇల్లు దులపటానికెల్లి నిచ్చెన జారి కిందపడి నడుం ఇరగ్గొట్టుకుంది ..”
“కావాలని పడుద్దా ఏటి నడుం ఇరగ్గొట్టుకుంటాకి. ఇప్పుడెలాగుంది పాపం? లేచి తిరుగుతుందా?”
“ లేదు. మంచం మీదే పడుకునుంటంది..లెగలేదు కదా..”
“పోనీ వైజ్జగమన్నా చేయించేరా ఆళ్ళు?”
“ఏమో నాకు తెలవదు అమ్మమ్మా..అయ్యన్నీ “
“ నాకు తెల్సీ ఆళ్లింట్లో పడితే ఆళ్లే చేయించాలి మరి వైజ్జగం . లేదంటే ఎంతో కొంత ఇచ్చి ఊరుకుంటారు.
తమామూ ఇవ్వకుండా అయితే ఉండరనుకో..! అయినా ఎంకటేశ్వర్రావు రోజూ వత్తానే ఉంటాడు దేనికో దానికి.
ఒక్క ఆయబ్బాయే అనేముంది ఎవరో ఒకళ్ళు వస్తానే ఉంటన్నారు తెల్లారి లేస్తే దొడ్లోకి. ఎవరూ అన్లేదేటి? పాలోసే సూరేకాంతం కూడా అన్లేదు ఇలాగని. పొద్దున్నా, సాయంత్రం కూడా వత్తది మళ్ళీని. ఒక్క మాటనద్దా? ఇంతకీ ఎన్నాళ్లయ్యింది పాపం? మీ నాన్నలా దేశాలట్తేడంటే మళ్ళీ ఇదొకటా మీయమ్మకి ? సరిపోయిందిలే!
ఇప్పుడెలాగుంది? కాత్తంత మెరడేనా?”
“ పడ్డప్పుడు ఎలాగుందో ఇప్పుడూ అలాగే ఉంది. అప్పుడప్పుడూ ఏడ్సుద్ది.”
“ ఏడుపే గదా మరి పాపం. మీకు అన్నవదీ ఎవరొండి పెడుతున్నారు? నీకో సెల్లెలుండాలేమో..?”
“ఉందమ్మమ్మా..! అదీ నా స్కూలే..నాతో పాటే వచ్చుద్ది. “

“ మరి మీయమ్మకలాగుంటే ఏంజేత్తన్నార్రా తిండదీని? తెల్లారిలేత్తే ఎన్నికావాలి..ముండా పొట్తకి..”
“ మా సెల్లే వండుద్దమ్మమ్మా..”
“ ఏదీ ..ఆ పిల్లముండే..! నిన్నగాక మొన్న పుట్టిందది. అప్పుడే వండుతుం వచ్చిందా దానికి..”
“ నేనే చెప్పేనమ్మమ్మా..ఎలాగొండాలో..! ఒకోసారి కూరొండుద్ది. ఒకోసారి పచ్చడీ, మజ్జిగీ ఏసుకుని తినేత్తాం..”
“ఎందుకు ..మన మావయ్య పెట్టేదాన్లో తినకపొయ్యారా? “
“..అయ్యి పెద్దోళ్లక్కదా ..అమ్మమ్మా..! అంతుకే..తిన్లేదు..!”
“ అవున్లే..! అయినా మీ నాన్నెక్కడున్నాడో ఏవైనా ఆచూకీ చిక్కిందా?..”
“ లేదమ్మమ్మా..! అసలున్నాడో లేదో కూడా తెలుత్తుల్లేదు. ఒక్కొక్కళ్ళేమో..ఈ సరికి సచ్చిపోయే ఉంటాడ్రా
అంటారమ్మమ్మా..! ఒక్కొక్కళ్లేమో..మీ నాన్న బాగా సంపాయిచ్చాకా వత్తాడంటారు. ఏమో..!”
చెప్తూనే తలొంచుకున్నాడు. జాలిగా చూసింది భగీరధమ్మ వాడి వైపు.

పొలాలు పండక, అప్పులపాలై, తీర్చలేక, అలాగని ఊరోళ్లకి మొకం చూపించలేక చెప్పా,పెట్టకుండా పెళ్ళాం పిల్లల్నొదిలేసి తెల్లారేపాటికి ఎక్కడికో పోయేడు ప్రభాకరరావు. ఊళ్ల మీదపడి వెతకాలన్నా ఎవరికీ ఏ విధంగానూ ఓపికల్లేక మాట్టాడకూరుకున్నారు. అప్పిచ్చినోడే బాకీ వసూళ్లకని ప్రభయ్యింటికి అయిదారు సార్లు తిరిగి, తిట్టడానిక్కూడా ఇంకేం మిగలక వదిలేసి ఊరుకున్నాడు పెద్దమనుషుల్లో పెట్టినా స్కూటరు చక్రాల్లో గాలికొట్టిచ్చటం కూడా దండగని. అతనెళ్ళిన కొత్తల్లో ఊర్నిండా ఇవే ఊసులు..అవన్నీ గుర్తుతెచ్చుకుంటూ ..

“ ఎక్కడున్నాడో ఏమో..” అని మనసులో అనుకోబోయి పైకే అనేసి.. మళ్ళీ వాడి వైపుచూసి..
“ ఇయ్యాల బళ్ళోకెల్లేవా? “ అంది కొనసాగింపుగా..
“ ఎల్లా అమ్మమ్మా..! బేగిని వచ్చేసేను నీ దగ్గరకొద్దామని..”
“ నాదగ్గరకా? మీయమ్మ మంచం మీదుండి తీసుకుంటా కూడా నన్ను చూసిరమ్మందా నిన్నెల్లి.?”
“ కాదమ్మమ్మా..! నేనే వచ్చేను. ఇదివరకంతా బడొదిలే టైముకి ఇంటికి రాకపోతే ఆ ఈధిలో అక్కడక్కడే ఎతికేది నా కోసం. ఇప్పుడు నడుం ఇరిగిపోయింది కదా .లెగలేపోతంది..మంచంమీంచి. అంతుకని ఎతుకుతుల్లేదు
నాకోసం..”
“పాపం..! మీ నాన్నలా సేసేడంటే..మళ్ళీ ఇదోటొచ్చి పడింది ఆవిడి పేనానికి. ఎంత సురుగ్గా
ఉండేదో..మీయమ్మ..?”
అవునన్నట్టు పల కిందకీ పైకీ ఊపుతా ..“ ఎప్పుడు తగ్గుద్దో ఏమో.. అంతమానూ ఏడుత్తుంది..పడుకునే..”
“ మరంతేగందా..! ఇంతకీ నువ్వెందుకిలా వచ్చేవ్? మీయమ్మకి చెప్పే వచ్చావా? ఆవిడికేంపనుందో
..ఏమో..”
“ నీతో మాట్టాడేకా… చెప్దామని ఇక్కడికి వత్తన్నట్టు మాయమ్మతో చెప్పలేదు. “
ఆ మాటలకి కాసేపు పడీ పడీ నవ్విన భగీరధమ్మ..నవ్వాపి..
“బానే ఉంది. నాతో ఏమ్మాట్టాడతావ్రా..?” అంది నుదురు చిట్లించి వాడి వైపే చూస్తూ.. నవ్వు ముఖంతో..
“ ఎందుకొచ్చేనంటే..మరీ..మరీ ..శివరామ్మావయ్య మనూళ్ళో తాతలకీ, మామ్మలకీ పెద్దోళ్ళు అయిపోయేరని టిపిన్లూ, అన్నాలెడతన్నాడు కదా రోజూను. మా బళ్లోకెళ్లే దార్లోనే. రోజూ చూత్తన్నాను బళ్ళోకెల్లేటప్పుడు. అక్కడ ఏదైనా పనుంటే ఇప్పిచ్చమని మావయ్యతో చెప్తావా అమ్మమ్మా..”

“ ఎవరికిరా?” ఒకింత ఆశ్చర్యంగా వాడ్నే చూస్తూ అంది.. భగీరధమ్మ.
“ నాకే..! ‘’
“నీకా? నువ్వేన్జేత్తావక్కడ..?”
“ ఏదైనా చేత్తా అమ్మమ్మా..! మాయమ్మ లెగాపోతే మా చెల్లీ, నేనేగదా చేత్తన్నాం..మా ఇంటికాడ. పొద్దున్నే
ఎల్లిపోయి బళ్ళోకెల్లేదాకా ఎంతపనుంటే అంతా చేసేసి..మళ్లా మజ్జానం వత్తాను.పళ్లాలయ్యీ కడగ్గల్ను అమ్మమ్మా.!
సాయంత్రం బడైపోయాకా మళ్ళీ ఎల్లి అందరూ అన్నాలు తినేదాకా అక్కడే ఉండి పళ్లాలయ్యీ తీసేసి..ఎంగిళ్లయ్యీ ఊడిసేసి ఎల్లిపోతాను అమ్మమ్మా..! కూరగాయలయ్యీ కూడా కోసిత్తాను కోసిమ్మంటే. మావయ్యతో సెప్తావా?
కొంచెం చెప్పమ్మమ్మా..! ”దీనంగా అంటున్న వాడి గొంతు వింటూనే ప్రాణం నీరైపోయిందావిడికి..
ఆ అడగటంలో ఏదో బరువును మొయ్యలేకపోతున్నానన్న భావన. ఈ బరువును నువ్వే దింపగలవ్ అన్న
ధైర్యం, ధైన్యం. కొడుకు కళ్ళ ముందు మెదిలాడు.

భగీరధమ్మ పెద్ద కొడుకు శివరాం. వ్యాపారాల్లో బాగానే సంపాదించేడతను. ఒక స్ధాయికి చేరే వరకే ఎవరైనా
పరుగులు పెడతారు. శివరాం ఎప్పుడో ఆ మార్కుని దాటేసాడు. దాంతో అతన్లో ఊరు గురించిన ఆలోచనలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా చిన్నప్పట్నించీ అక్కడే పెరగటం , చదవటం వల్ల, చుట్టాలూ, స్నేహితులూ ఎక్కువేమో ఊరితో బాగా అనుబంధం అతనికి.

ఊళ్ళో చాలా వరకూ ఉద్యోగాల కోసమో, వ్యాపారాల నిమిత్తమో..పట్నాల్లోనో, పరాయి దేశాల్లోనో
సెటిలైపోవటంతో.. బాగా వయసై పోయిన ముసిలోళ్ళు తప్ప ఊళ్లో ఉండేవాళ్లే తక్కువైపోయారేమో ఎప్పుడు చూసినా నిస్తేజంగా, నిర్వికారంగా ఉండే కళాకాంతుల్లేని ఊరిని చూసి కాయలు కోసేసిన చెట్టుని చూస్తున్నట్టు ఉస్సూరనిపించేది శివరాంకి. పిల్లలంతా రెక్కలొచ్చిన పిట్తల్లా ఎక్కడెక్కడికో ఎగిరిపోవటంతో..ఇటు ఇక్కడే ఉండి నడాలు వంగిపోయి వండుకోనూ లేక, అటు ఊర్నొదిలి పిల్లల దగ్గరకి వెళ్ళి, అక్కడ కొత్త వాతావర్ణంలో ఇమడనూ లేక కేలండర్ కాయితాలు చించుతున్నారు తేదీల్లెక్కేస్తూ..చాల వరకూ.

దాంతో ఊరంతా తుఫానుకి వంగిన కరెంటు స్ధంభాల్లా భార్యపోయి భర్తొక్కడే ఉండటమో, భర్తపోయి భార్యొక్కతే మిగిలి అటూ పోనూ లేక ఇటు బతకా లేక జీవచ్చవాలల్లే వీధుల్లోనూ, అరుగుల మీద పడి దేకుతున్న ముసలాళ్లంటే శివరాంకి జాలి. అందుకే వ్యాపారం పనుల మీద దూరప్రాంతాలకి వెళ్ళొచ్చినప్పుడల్లా, పళ్ళో, సోంపాపిడి వంటి నోట్లో వేసుకుంటె కరిగిపోయే స్వీట్లో , మెత్తగా ఉండే జిలేబీల్లాంటి ఏవో ఒకటి తెచ్చి వాళ్లకి పంచుతా ఉంటాడు. కానీ అలా ఎన్నిసార్లిచ్చినా అదేమంత సంతృప్తినిచ్చేది కాదతనికి.

అందుకే వాళ్లందరికీ సంతోషం కలిగించేలా పర్మినెంటుగా ఏదైనా చెయ్యాలనే దృఢ సంకల్పంతో..బాగా
ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాడు శివరాం. దాని ప్రకారం..
ఆ పేటని లేదు, ఈ పేటని లేదు, ఆడ లేదు మగలేదు, ఆ కులమని లేదు ఈ కులమని లేదు.. ఊరోళ్లంతా మనవాళ్లే అన్నట్టు ఊరి పొలిమేరల్లోపలున్న ముసలోళ్లందరికీ “ గ్రామ వంటిల్లు “ పేరుతో ఎంత ఖర్చైనా సరేనని భోజనాలు పెట్టడం మొదలెట్టాడు.

ఉదయం టిఫిన్ల దగ్గర్నించి మధ్యాన్నం భోజనం, సాయంత్రం టీతో పాటు పండో, ఫలమో ఇస్తూ రాత్రి
ఏడయ్యేసరికి భోజనాలు పెట్టేసే ఏర్పాట్లు పకడ్భందీగా చేసేసాడు. శివరాం అనుకున్నాడంటే చేసి తీరతాడు అనుకున్నారు అతను చేసిన ఏర్పాట్లను చూసి అతని గురించి తెల్సినవాళ్లంతా.

మొదట్లో ఎంతమంది వస్తారో ఏంటో అనుకున్నది కాస్తా వారం తిరిగే సరికి కళకళ్ళాడిపోసాగింది గ్రామ
వంటిల్లు. పైగా పెద్దాళ్లు నమలలేరేమోనని కారాలు బాగా తక్కువ వేయించి మెత్తగా వండిస్తున్నాడేమో
తొందరగా నములడిపోయి కడుపునిండా కావాల్సినంత తింటున్నారంతా.

అయితే ..దేశవిదేశాల్లో ఎక్కడెక్కడో స్ధిరపడి అప్పటిదాకా ఊరినో అవశేషంగా చూసిన వాళ్లందరూ
శివరాం చేస్తున్న ఈ పనికి ఉలిక్కిపడ్దారు. దాంతో..వలసపోయినాళ్లందరూ ఆలోచనలో పడ్డారు తమకెందుకు రాలేదా ఈ ఐడియా అని. ఆలోచనలు చాలామంది చేస్తారు. సమయానుకూలంగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకుని అమలు చేసేవాడే నాయకుడు. . అలా ఆ చుట్టుపక్కలంతా హీరోనే అయ్యాడు శివరాం.

ఊళ్ళో పెనుమార్పులు మొదలయ్యాయ్.
అప్పటిదాకా ఊరో అవశేషంగా భావించిన వాళ్లల్లో పశ్చాత్తాపం మొదలై మెల్లమెల్లగా ఊరుబాట పట్టారు.
మరీ తమని తాము క్షమించుకోలేని వాళ్లు గ్రామ వంటిల్లులో భాగస్వాములయ్యారు. అక్కడితో ఆగిందా..
.. క్రమేణా ఈ వార్త ఆ చుట్టుపక్కలా అన్ని ఊళ్లకీ పాకిపోయింది. దాంతో..

ఈ గ్రామవంటిల్లు బాగా నచ్చిన ఇరుగూ పొరుగు ఊళ్ళ వాళ్ళు వాళ్ల ఊళ్ళోని వృద్ధుల్ని ఆదుకోవటం కోసంశివరాం అంత భరించే శక్తి లేక కుటుంబానికింతని వేసుకుని తమ తమ గ్రామాల్లో “గ్రామవంటిళ్ళు “
మొదలెట్టారేమో అనతికాలంలోనే అంతింతై, ఇంతింతై అన్నట్టు..ఆ ఊరు అనేక ఊళ్లకి ఆదర్శమైంది.
అలా..ఒక సేవ, ఆలోచనా అనేక సేవలకి ఆధారమైంది.

“ ఈరోజు మా నాన్న పోయిన రోజు .ఈ రోజు గ్రామవంటిల్లు భోజనాల ఖర్చు నాది “ అనేవాళ్ళు కొందరైతే,
”మా పిల్లాడి పుట్టిన్రోజు..ఇవ్వాల్టికి భోజనాల ఖర్చు మాది” అనే వాళ్ళు మరికొందరు. అలా ఎవరింట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా ఊళ్ళో పండగ మాదిరైపోయి ఊరంతా కళకళ్ళాడిపోయేది.
అలా, బియ్యం, పప్పులూ, కూరగాయలు, పాలూ, పెరుగూ, వెన్నా, నెయ్యీ పుణ్యం పెంచే వనరయ్యేసరికి
గ్రామవంటిళ్లకి చందాలుగా రావటం ఆనవాయితీగా మారిపోయిందేమో..ఒక్క ఈ ఊర్లోనే అని కాదు.. ఆ చుట్టు పక్కలా ఏ ఊర్లో చూసినా అంతకు ముందంతా ఎప్పుడూ నిస్తేజంగా, నీర్సంగా ఉండే వీధులన్నీ కర్ర చప్పుళ్లతో, కిర్రు చెప్పుల శబ్ధాలతో..తీర్తాలని తలపిస్తుంటే శివరాం ఆనందానికి పట్తపగ్గాలేకపోయాయి. దాంతో..మరి కొంచెం ముందుకెల్లి నాల్గయిదు వార్తా పత్రికలు, పెద్ద టీవీ కూడా ఏర్పాటు చేశాడు శివరాం.
అతన్నే ఫాలో అయ్యాయి చుట్టుపక్కలా గ్రామాలన్నీ..

క్రమంగా ..ఆనోటా ఈనోటా ఈ వార్త ఎల్లలు దాటేసరికి తెల్సిన వాళ్లంతా మేమంటే మేమంటూ
ముందుకొచ్చారు. అదిగో అలా “ఓల్డేజ్ ఫండ్ “ పేరుతో నిధి ఏర్పాటయ్యింది అత్యవసర సమయాల్లో అయినవాళ్లు అందుబాట్లో లేకపోతే వాళ్ల ఆరోగ్యానికో..ఇంకా లేనోళ్లైతే పోయినప్పుడు దహన ఖర్చులకో అన్నట్టుగా పకడ్భందీ ఏర్పాట్లు చేసేసేడు..శివరాం. దాంతో ఊరోళ్లందరికీ ఒకలాంటి ధీమా వచ్చేసి..ఇక ఏమైనా ఫర్వాలేదు చూసుకోవటానికి ఊరుంది అనే భావం వయసు మళ్లిన వాళ్లల్లో కొత్త ఉత్సాహాన్నె నింపిందేమో..ఊరంతా ఒకటే సందడి సందడి. ఆ సందడిలో తరతమ భేధాల్లేవక్కడ.

కొడుకు చేసిన పనితో ఊరంతా పండుగ వాతావర్ణం నెలకొందేమో….భగీరధమ్మకీ గొప్ప సరదాగా ఉండి,
ఊరు వంటింటికి స్టోర్ రూము ఇంచార్జి అయ్యింది. ఏ పూటకాపూట ఏమేమీ వండాలో ముందు రోజే

నిర్ణయించేసి సూపర్ వైజర్ వెంకటేశ్వర్రావు ని పిలిచి లిస్ట్ ఇచ్చేసి దాని ప్రకారం సరుకులు కూడా ఇచ్చేస్తుంది భగీరధమ్మ .

ఆ ఇంచార్జితనం బోలెడంత చార్జి చేస్తుంది రోజూ ఆమెని. విసుగులేని,రాని కాలక్షేపం. పైగా చేస్తున్న
పనిలో చెప్పలేనంత సంతోషం. అయితే కుండెడు పాలల్లో గుల్లంత ఉప్పురవ్వలా భగీరధమ్మ మనసులో చిన్నపాటి అసంతృప్తి.
అదేమంటే..
“ కొంతమంది బాగా పెద్దాళ్లైపోయిన వాళ్లు మోకాళ్ల నొప్పుల్తో తినటానికి గ్రామ వంటింటి వరకూ
నడుచుకుంటూ రాలేకపోతున్నారని..మరి కొందరు ఇంత బతుకీ బతికి అన్న రీతిలో వంటింటి ముఖం కూడా చూడటం లేదని..” ఆ నోటా, ఈ నోటా వింది.

అది విన్నప్పట్నించీ ఆవిడ మనసు మనసులో లేదు ఎలా వాళ్లతో కూడా తినిపించాలా అని.
అదేదో ఎక్కువై పోయో లేదంటే ఊళ్ళో తామే గొప్పవాళ్లమనీ కాదు గదా ఇలా పెట్టేది. ఊళ్ళోవాళ్లకి కాస్తంత
వెలుసుబాటనో, వయసెల్లే కొద్దీ రకరకాల రుచులు వాళ్లకి తినాలని ఉంటుందనో, చేసుకోలేక పోతారనోనే కదా..!

అయినా ఎవరిష్టం వాళ్లది. ఆత్మాభిమానం తప్పేం లేదు. కానీ ..
అటు చేసుకోనూలేక, ఇటు నడుచుకుంటూ వచ్చి తినాలేక ఏం చెయ్యి కాల్చుకుంటున్నారో
ఏమో..అనే బాధ. అయితే ఈ బాధంతా కొడుకుతో పంచుకుని “ ఏదైనా చెయ్యాల్రా..!” అంది.
“ అవునమ్మా..! “ అన్నాడు కొడుకు శివరాం.

ఇంతలోనే కోడలి తండ్రి పోవటం, అత్తగారికీ, మావగారికీ కూతురు తప్ప మరెవ్వరూ లేకపోవటంతో అన్నీ
శివరాం ఒక్కడే చెయ్యాల్సి వచ్చేసరికి , కొడుకూ, కోడలూ, పిల్లలూ అంతా అక్కడే ఉండేసరికి..సర్లే ..ఇక
కొడుకొచ్చాకా గట్టిగా ఏదన్నా చెయ్యాలని ఆలోచిస్తూ అతనికోసం ఎదురుచూస్తుందేమో, ఇంతలో ఈ
కుర్రాడు..ఏదైనా పనుంటే ఇవ్వమని..
ఆలోచిస్తున్న భగీరధమ్మకి ఉన్నట్టుండి మనసులో ఒక ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవు.. ఆ
కుర్రాడికేసి చూస్తా..
“ ఒరేయ్ అబ్బాయ్..! రోజూ బళ్లోంచి ఎన్నింటికి ఇంటికొస్తా?”
“ ఎందుకమ్మమ్మా..? బడయ్యేసరికి ..అయిదవ్వుద్ది..”
“ సర్లే..అలాగైతే..! బళ్లోంచి వచ్చాకా రేపు సాయంత్రం నాకోసారి కనపడు. సరేనా?”
“ సరే అమ్మమ్మా..! ” అంటూ ఉన్నట్టుండి లేచి ఒక్కంగలో గుమ్మం దాటి దొడ్డి తలుపు చేరేసి
తుర్రుమన్నాడు.

ఆ మర్నాడు సాయంత్రం స్కూలైపోగానే..పుస్తకాలు ఇంట్లో పడేసి తూనీగలా పరిగెత్తుకొచ్చేసేడు వాడు
భగీరధమ్మ దగ్గరకి. అయితే, ఎప్పుడెప్పుడు వస్తాడా అని అప్పటికే వాడి కోసం ఎదురు చూస్తుందేమో
భగీరధమ్మ, వాడ్ని చూడగానే కళ్ళు ఇంతింతయ్యాయి ఆమెకి.
ఇంత ఆనందంతో.. వాడ్నే చూస్తూ..
“ వచ్చావా? ..బడైపోయిందా? “
“ ఆ ..అయిపోయిందమ్మమ్మా..” రొప్పుతూ అన్నాడు వాడు.

“ మీ చెల్లెలేది…?”
“ ఇంటి దగ్గర వదిలేసొచ్చా అమ్మమ్మా..! అమ్మకి టీ పెట్టాలి కదా? అమ్మకి సాయంత్రం టీ తాక్కపోతే
తలపోటు”
“ ఆరి పిడుగా..! నువ్వురా పిల్లాడివంటేనీ. నీలాటోడే నాక్కావాలి. అదిగో ..అటు చూడు..” అంది అదే
వరండాలో ఒక మూలగా ఉన్న భోషాణం పక్కగా వేలెట్టి చూపిస్తూ..
ఏంటా అని అటు చూశాడు..ఏదో దుప్పటి కప్పి ఉంది. అదేంటో అర్ధం కాక..ఒక్క క్షణం
అయోమయంగా అటే చూస్తూండిపోయాడు. వాణ్నే గమనిస్తూందేమో…
“ఎల్లు..! దగ్గరకెల్లి ఆ దుప్పటి తీసి చూడు..దానికిందేవుందో ..!” అంది మళ్ళీ తనే..
ఒక్కంగలో వెళ్ళి దుప్పటి తొలగించాడేమో..తళతళ్లాడే కొత్త సైకిల్. కళ్ళు రెపరెపలాడాయి వాడికి దాన్ని
చూడగానే. కానీ అంతలోనే…
“ వంటింట్లో పనిమ్మంటే ..దీన్ని చూడమంటుందేంటి అమ్మమ్మ?” ఎగాదిగా దాన్నే చూస్తూ మనసులో
అనుకుంటుంటే భగీరధమ్మే అంది
“ కొత్త సైకిల్రా..! నీకే. “
“ నాకా..? ఇంత కొత్తదా? ” తెల్లబోయాడు ఆవిడ మాటలకి.

“ నీకే..! నీకేరా ఆ..సైకిలూ..! మనూళ్ళో తాతలూ, మామ్మలూ ఎవరెవరైతే నడవలేక మన
వంటిల్లుదాకా వచ్చి తిన్లేకపోతున్నారో.. ఆళ్లందరూ టిఫిన్ల కాడ్నించి కడుపు నిండా తినాల్రా అబ్బాయ్
రేపటేల్నించీ. నీ తెలివితేటల్తో నువ్వాళ్లని తినేట్టుగా చెయ్యాలి. మనింట్లో ఎవరైనా ఆకలితో పడుకుంటే మనకెంత బాధ. మన ఊరూ మనిల్లే గదా..! కాబట్టి నువ్వా పని చెయ్యాలి.. “ అని ..కొంచెం సేపాగి..
“..మీ శివరాం మావయ్య ఊరికి కొడుకైతే నువ్వు మనవడివి. మీరే వాళ్ల కన్నోళ్ళు. వాళ్లే మీ కన్నోళ్ళు.
అంతే..అర్ధమైందా?”
అర్ధమైందన్నట్టు తలూపాడు కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. ఆ కళ్లల్లో ఏదో కొత్త మెరుపు..
ఉప్పొంగిన ఉత్సాహంతో బరువైన కొత్త సైకిల్ని స్టాండ్ తీసి మెల్లగా నడిపిస్తా వరండా మీదనుంచి కిందకి
దింపబోతుంటే..అప్పుడే ఆ మర్నాటి వంటల లిస్టు పట్టుకుని సరుకుల కోసం లోపలికొచ్చిన వెంకటేశ్వరరావు ఓ చెయ్యేసాడు.
“ ఒరేయ్ అబ్బాయ్.! నీ పేరేంటోగానీ సైకిల్ మళ్ళీ నువ్విక్కడికి తేవక్కల్లేదు. మీ ఇంట్లోనే పెట్టుకుని
వాడుకో. మీ చెల్లిని కూడా ఎక్కిచ్చుకుని బళ్ళోకి తీసుకెళ్ళు. నేను వెంకటేశ్వర్రావుతో చెప్పేను. నీకేం కావాలన్నా అతన్నడుగు. సదువు బద్ధకిచ్చేవంటే మాత్రం ఊరుకోను..”
“ అలాగే అమ్మమ్మా..సదువుకుంటా..” వెనక్కి తిరక్కుండా అన్నాడు..
“ పైగా .. ఇంకోమాట.. ఇలాగిను. మీయమ్మకి తగ్గి.. ఆవిడ పన్లు ఆవిడ చేసుకునేదాకా నువ్వక్కడే తినేసి
మీయమ్మకీ, చెల్లిక్కూడా కేరియర్ పట్టుకెళ్తూండు..”
గట్టిగా అరిచింది భగీరధమ్మ , సైకిల్ని జాగ్రత్తగా గుమ్మం దాటించి బయట సైకిల్ స్టాండ్ వేసి తలుపులు
దగ్గరకేస్తున్న ఆ కుర్రాడ్నే చూస్తూ..
“ అలాగే అమ్మమ్మా..! అమ్మకి చూపించొస్తా..”

వాడటు వెళ్లాకా ..
“ చాలా చురుగ్గా ఉన్నాడమ్మా..! మంచి పని చేసారు..” అన్న వెంకటేశ్వరరావుతో భగీరధమ్మ అంది.
“ వాడు మంచోడయ్యా వెంకటేశ్వర్రావ్. పైగా చాలా తెలివైనోడు కూడానూ. ఎంత తెలివైన వాడు అంటే నాకే ఆశ్చర్యం వేసింది వాడి తెలివితేటలకి. వాడిలా రావటం కానీ, ఊరి వంటింట్లో ఉజ్జోగం కోసం అడగటం కానీ వాళ్లమ్మకు తెలియనీయలేదు వాడు. తెలిస్తే వెళ్లనీయదని, అడిగేసాకా, పనిస్తే అప్పుడే చెప్పచ్చని వాడి ఆలోచన నేననుకోవటం. మనం ఏ పనీ ఇవ్వకపోతే వాడు వాళ్లమ్మకు చెప్పడు. వాళ్లమ్మ బాధపడుద్దని. ఇచ్చాం కాబట్టి ఇప్పుడు చెబుతాడు. ఆ ఆలోచన వెనక లోలోపల వాడి ఉద్దేశ్యం ఏటంటే వాళ్లమ్మని చూసుకోవటం, కుటుంబం గడవటం వాడిక్కావాలి. అంటే …అంటే … మొహమాటం కూడెట్టదని ఇంత చిన్న వయసులోనే తెల్సన్నమాట వాడికి. లేదంటే ..

తిన్నగా నా దగ్గరకే వచ్చి పెద్దోళ్ల వంటింట్లో పని అడుగుతాడా వాడు? అప్పుడే వాడికున్న చొరవా,
ధైర్యం, పెద్దోళ్ల పట్ల వాడికున్న మర్యాదా నాకర్ధమైందయ్యా..వెంకటేశ్వర్రావ్! అబ్బాయ్ ఊరెళ్ళిన సంగతి వాడికి తెలియదు. నిజానికి అబ్బాయ్ ని అడిగితే చాలు వాడు. అలా వాణ్ణి అడగాలంటే బయట ఎక్కడైనా కనిపిస్తే కలసి అడగచ్చు. కానీ వీడలా చెయ్యలేదు. మన ఇంటికొచ్చి సరాసరి నన్నే అడిగాడు. నేను చెప్తే బాబు వీడికి పని ఇస్తాడని అట. అంటే దానర్ధం.. పిల్లలెంత పెద్దవాళ్లైనా..తల్లుల ముందు చిన్నవాళ్లేనని, తల్లి మాట పిల్లలు వినాలనే కదా..!
చూశావా తిన్నగా వచ్చి నన్నే అడగటంలో ఎంత అంతరార్ధముందో..! పెద్దాళ్ల పట్ల వాడికున్న గౌరవం
అది..”

“ అవునమ్మా..! ఈ కుర్రాడు రోజూ మన వంటిల్లు ముందు నుంచే బడికి వెళతాడమ్మా..! సరిగ్గా అదే
టైముకి టిఫిన్ల కోసమని మన గ్రామ వంటింటికి వస్తా ఉంటారు పెద్దోళ్ళు. వర్షాలు పడ్దప్పుడూ, ఏదైనా బస్సో, కారో వస్తుంటేనో..సాయం చేస్తా ఉంటాడమ్మా..! నిన్న మీకిదే చెప్పబోయానండి..”

“ అదిగో చూసావా..నేను చెప్పానా లేదా..! వాడి మనసే అలాంటిది. పైగా ఇంకోటి. పెద్దాళ్లు అనారోగ్యంగా
ఉన్నప్పుడు వాళ్లకి ఏది చెప్పాలో, ఏది చెప్పకూడదో కూడా వాడికి తెలిసింది. అంతే మరి. ఒకపక్క పెద్దాళ్ల
మాటలు పిల్లలు వినాలనుకోవటమే కాదు పెద్దాళ్లని బాధపెట్టకూడదని కూడా ఆలోచించాడు. తీరా నన్నిలా
అడుగుతున్నానని వాళ్లమ్మకి చెప్పి నా దగ్గరకి వచ్చాడనుకో..నేను ఏ పనీ ఇవ్వకపోతే వాళ్లమ్మ బాధపడుద్ది
కదా..! చూసావా? వాళ్ల మీద వాళ్లకి నమ్మకం ఉన్న వాళ్ళే ఇలా చెయ్యగలరు. ఇలాంటి తెలివితేటలు
అబ్బుతాయనే మీ అయ్యగారు పిల్లల్ని మన ఊరి బళ్లో చేర్చింది.

బడంటే నాలుగ్గోడలని కాదు వెంకటేశ్వర్రావ్ పిల్లలకి తెలియాల్సింది. బడంటే నాలుగు దిక్కులని.
నలుగుర్నీ కలుపుతూ, కలుపుకుంటూ బ్రతకటం నేర్పేది బడి. అప్పుడే కదా మన సంస్కృతీ, సంప్రదాయం తెలిసేది. ఇలాంటోళ్లే కావాలి ఊరికి. తర్వాతి తరం తయారు కావాలి కదా.. “
“ అవునమ్మా..! మీరన్నది నిజం..”
సైకిల్ని మించిన భారాన్ని గుండెల్లో మోస్తూ అప్పుడే వాళ్లమ్మ దగ్గరకి చేరాడు వాడు బాధ్యత తాలూకు
ఆనందం ముఖమంతా ఆవరించగా..


కన్నెగంటి అనసూయ 

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.