బోయ కొట్టములు పండ్రెండు

0
732

అసలు యుద్దం అంటే ఏంటి ?? ఒక రాజు గెవలవటమా ?? ఒక రాజు ఓడిపోవటమా ?? రాజుల గెలుపోటముల ఆట మధ్య సామాన్యుడు బలి కావటమా ?? ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా యుద్దంలో మొదటి నష్టం మాత్రం సామాన్యుడిదే. ఓడిపోయిన రాజు మహా అయితే గెలిచిన రాజుకు బందీ గా చిక్కుతాడు, ఒక్కోసారి కేవలం సామంత రాజుగా రూపాంతరం చెంది, పన్నులు పెంచి , అదే అధికారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తాడు. దండయాత్ర దుర్గం మీద సాగితేనే దాన్ని యుద్దం అంటారు, మరి దండయాత్ర సాగిన మేర నష్టపోయే ఊర్లు, ఆ ఊర్లలో ఉండే సామాన్యుల పరిస్థితి ఏంటి ? కనీసం వీర గాధల్లో కూడా చోటు దొరకదే.

అటు వేంగీ చాళుక్యులు.. ఇటు పల్లవుల మధ్య నలిగిపొయినా ఒక చిన్న ఊర్ల సముదాయం బోయకోట్టములు . నెల్లూరు అవతల పల్లవ రాజ్యం ఇటు వైపుదంతా చాళుక్య రాజ్యం అని చాళుక్యులు. వినుకొండ వరకు పల్లవ సామ్రాజ్యం, దానికిటువైపుదంతా పల్లవ రాజ్యం అని పల్లవులు. మరి నెల్లూరు కి వినుకొండ కి మధ్య ఉన్న రాజ్యం ఎవరిది ??

క్రీ.శ 624 నుండి 848 వరకు త్రిపురాంతకం నుండి వలస వచ్చి గుండ్లకమ్మ, ముస్సి ల మధ్య పండ్రెండు స్థిరనివాసములు ఏర్పరుచుకొన్న బోయ దొరలు, క్రమక్రమంగా ఆ ప్రాంతం పై ఎలాంటి పట్టు సాధించారు, దానికి దారి తీసిన పరిస్థితులు అన్నిటినీ విపులీకరించిన చారిత్రక నవల .అమాయకపు బోయదొరల మీద నాగరికపు రాజుల ప్రభావం, వారి రాజకీయపుటెత్తులు . వారి రాజ్యకాంక్ష. వీటన్నిటిని కాచుకుంటూ దాదాపు 200 సంవత్సరాల పాటు తమను తాము స్వయం సమృద్దిగా పరిపాలించుకున్న బోయదొరల గాధ.

చివరకు చాళుక్యుల చేతిలో నాశనం అయిన కట్టెపు దుర్గం ( పండ్రెండు బోయకొట్టముల ముఖ్యపట్టణం ) మట్టి పరిమళాలో ఇప్పటికీ వీస్తున్న అమాయకపు గాలి . కథ కల్పితం కావచ్చు, కానీ ‘బోయ కొట్టములు పండ్రెండు ” నిజం అది చాళుక్యుల చేతిలో నాశనం అయ్యిన మాట నిజం. దినికి అద్దంకి లొ ఉన్న పండరంగని శాసనమే నిదర్శనం .

ఏది ఏమైనా ఇరు రాజ్యాల సరిహద్దులో , ఇద్దరి దాడులకు గురి అయిన , ఇరు రాజ్యాల నిరాదారణ కు గురైన ప్రాంతం . విచిత్రం ఏమిటంటే ఇప్పటికి కూడా ఈ ప్రాంతం, అటు రాయలసీమ కు నోచుకోక, ఇటు కోస్తాకు నోచుకోక, ఇరు వైపుల నాయకుల నిరాదరణకు గురి కావటం బహుశా విధి లిఖితమేమో.


Mohan Ravipati 

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.