అమ్మ అబద్దం

0
552

అమ్మ అబద్దం 


గోడకి వేలాడుతున్న అమ్మ ఫోటోకి వేసిన వాడిపోయిన దండను చూస్తున్న ఆరేళ్ల కీర్తి ఎందుకో ఒక్క సారిగా స్విమ్మింగ్ పూల్ వద్దకి వెళ్లి కూర్చుంది.
అమ్మెందుకు అలా వెళ్లి పోయిందో తనని వదలి, కొత్తగా వచ్చిన పిన్నిని చాలా సార్లు అడిగింది.

సంవత్సరం క్రితం చనిపోయిన అమ్మ స్ధానంలోకి ఇంకొక అమ్మని తేవాలనుకొని నాన్న వినయ్ మరొక పెళ్లి చేసుకోని నిర్మల అనే ఆంటీని ఇంటికి తెచ్చాడు.

చాలా రోజులే పట్టింది వినయ్ కి నిర్మలని ఆంటీ అనే పిలుపు మాన్పడానికి, అమ్మ అని పిలిపించ లేక ‘పిన్ని’ తో సరిపెట్టాడు.

వినయ్ చాలా పెద్ద శ్రీమంతుడు
పాప కీర్తిని చూసుకోవడం కోసమే మరో పెళ్లి చేసుకున్నాడనేది ఒక కారణం మాత్రమే.
కీర్తి అంటే వినయ్ కి ప్రాణం
కానీ బిజినెస్ పనుల్లో ఊర్లెక్కువ తిరుగుతూ ఉండటం అతనికలవాటు.

ఏకాంతమంటే తెలియని ఆ పసి పాప తనున్న పరిస్ధితి ఏమిటో తనకే అర్ధం కాక స్విమ్మింగ్ పూల్ లోకి తన ప్లాస్టిక్ స్నేహితులను ఒక్కొక్కటిగా విసురుతూఉంది.
అదే ప్లాస్టిక్ బొమ్మలను….

అవి అలా తేలుతూ అవతలికి రాగానే మళ్లీ ఏరుకుంటూ, మళ్లీ విసిరేస్తూ ఆ పూల్ చుట్టూ తిరుగుతూ ఉంది.

అంతలో వచ్చిన వినయ్ పాప దగ్గరకెళ్తూ రింగ్ అయిన ఫోన్ ని ఎత్తి మాట్లాడసాగాడు.
“హా ఒక అరగంటలో ఎయిర్పోర్ట్ దగ్గరుంటాను, మీరూ వచ్చేయండి.. చాలా ఇంపార్టేంట్ డీల్ కదా..! ”
అని ఫోన్ ని పెట్టేసి..
“కీర్తీ ఇటు రా” అని దగ్గరకి తీసుకోని అడిగాడు..
ఏం తెమ్మంటావ్ ఊరునుంచి అని..!
ఎప్పటిలానే తనకిష్టమైన బొమ్మలు తెమ్మని చెప్పి క్రింద కూర్చుంది.

‘ఒకే బంగారం.. అలానే సరే మరి వెళ్లిరానా..’ అని ఫోన్ మాట్లాడుకుంటూ పది అడుగులు వేసి,
వెనక్కి తిరిగి ఆడుకుంటున్న కీర్తి దగ్గరకెళ్లి ఒక ప్రశ్న అడిగాడు.

“కీర్తీ …
ఆ అమ్మ బావుందా ఈ అమ్మ బావుందా?
ఐ మీన్ ఎవరు నచ్చారు?
ఎవరు మంచిగా చేస్తున్నారు?
ఎవరు మంచిగా చూస్తున్నారు?” అని..

కాసేపటికి తలెత్తిన కీర్తి నీటిలో పడిన ఒక బొమ్మని తీస్కోని తన గౌన్ తో ఆ బొమ్మ తల తుడుస్తూ..
“ఆ అమ్మ అబద్దం నాన్న!
ఈ కొత్త అమ్మ నిజం! అనింది.”

అర్ధం కాని వినయ్ మళ్లీ అడిగాడు “నాకు అర్ధం కాలేదు తల్లీ” అని.

నాన్న దగ్గరకొచ్చిన కీర్తి
నాన్న నడుముని చుట్టేసుకోని..
“మరీ.. నేనూ ఆ అమ్మ ఉన్నప్పుడు ఏదైనా గొడవ చేసాననుకో.. కీర్తీ..నీ అల్లరి బాగా ఎక్కువవుతుంది. ఇలా చేస్తే నీ చాక్లెట్స్ పారేస్తా.. అన్నం కూడా పెట్టను అనేది.
కానీ చాక్లేట్స్ ఇచ్చేది. అన్నం ఇక చాలు వద్దన్నా నోట్లో కుక్కేది”

మరి ఈ అమ్మేమో…అదే.. పిన్నేమో నేను గొడవ చేస్తుంటే సేమ్ అలానే అంటుంది.
చెప్పిన పనే చేస్తుంది. ఆ అమ్మ లా అబద్దాలు చెప్పట్లేదు. నువ్వే చెప్పావ్ గా నాన్నా.. అబద్దాలు అడే వాళ్లు మంచోళ్లు కాదు అని! పిన్ని నిజాలే చెప్తుంది నాన్న.. నే అన్నం తిని కూడా రెండు రోజులు..!
ఆకలేస్తుంది అని అడగాలన్నా భయమేస్తుంది నాన్న…!

అమ్మ అబద్ధం కదా నాన్న!
పిన్నే నిజం!!

కీర్తి మాటలకు కూలబడిపోయిన వినయ్, పాపను హత్తుకోని గుండెల మీదకు తీసుకోని.. అవును తల్లీ అమ్మ అబద్దమే నిజమే అ…మ్మ అబద్దమే అంటూ..
కాల్ వస్తున్న ఫోన్ ని అలా పూల్ లోకి విసిరేసి , ఆగని కన్నీరుతో కిచెన్ వైపు నడవ సాగాడు.

అమ్మ అబద్దమని కీర్తి చెప్పిన నిజాన్ని బరువెక్కిన తన గుండెల్లో అదిమేసుకోని అలా నడుచుకుంటూ నిజంలోకి వెళ్లిపోయాడు వినయ్!!


౼ Raghu Alla

(నే ఓ చోట చదివిన ఒక సున్నిత అంశాన్ని తీసుకోని ఈ చిన్న కధ రాయడం జరిగింది)

 

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.