కట్టు తెంచిన కథ

0
401

మెరుగయిన కథ – వయస్సు 25-45


కట్టు తెంచిన కథ


కల్లాకపటం ఎరుగని, అన్నెం పున్నెం తెలియని పసిప్రాయంలో అల్లుకున్న అనుబంధం మా ఇద్దరిదీ….బుద్దీ జ్ఞానం నేర్పిన బడి నీడలో విరిసిన స్నేహబంధం మాది…. విభిన్న కుటుంబాల నేపథ్యమే అయినా రెండున్నర దశాబ్దాలుగా ఇరిగిపోని  ఆత్మీయ బంధమది…. వాడేమో ఆనంద్ పల్లెలో మట్టి వాసనల మధ్య పుట్టాడు. నేను ప్రశాంత్ అనే నామధేయున్ని పట్టణ మధ్యతరగతి ఇరుకు శ్వాసల మధ్య కన్ను తెరిచాను. వాడి నాన్న పాతిక ఎకరాల వ్యవసాయం చేసే కష్టజీవి. ఆయన నే పడే కష్టం నా కొడుక్కి రాకూడదని హైస్కూల్ చదువుకు ఆనంద్ ను పట్నం పంపాడు. ఏంఆర్ఓ ఆఫీసులో కాళ్లుకదపని, చల్లకదలని గుమాస్తా గిరి మా నాన్నది. ఒక్కగానొక్క కుమారున్ని పెద్ద కుర్చీలో చూడాలనే ఆశ ఆయనది. ఈ విధమైన వేర్వేరు కుటుంబ వాతావరణం, తల్లిదండ్రుల ఆకాంక్షలు మా మిత్రద్వయానికి ఏనాడూ అడ్డు రాలేదు. పదవ తరగతి వరకు కలసి చదువుకున్నాం, ఆడుకున్నాం. తర్వాత మా మధ్య దూరాలు పెరిగాయి, దారులు వేరయ్యాయి. కానీ మనసులు మధ్య కాదుసుమా! వాడేమో మరో రెండేళ్ళు అదే ఊళ్ళో ఇంటర్ చదివాడు. తండ్రి అనారోగ్యానికి గురై, హఠాత్తుగా చనిపోతే కుటుంబానికి అండగా బ్రతుకు తెరువుకు అదే మట్టితో మమేకమయ్యాడు. నేనేమో, కాదు మా నాన్నమో భేషుగ్గా మహానగరంలో మంచి కాలేజీని వెతుక్కొని వచ్చి హాస్టల్ లో చేర్చి భద్రంగా, బుద్దిగా చదువుకోమన్నాడు. మా నాన్న కలలు కన్నంత కాకపోయిన ఓ మాదిరి ఉద్యోగంలో గుంజం చుట్టూ గిరగిర తిరిగే వేతన శర్మనయ్యాను. అడపా దడపా అదీ ఇదీ రాస్తూ, చిన్నపాటి రచయితననిపించుకున్నాను. మా రెండు జీవన వైవిధ్యాల మధ్య దూరం కొన్ని వందల కిలోమీటర్లు…. అయినా ఆనాడు ఆరో తరగతిలో వికసించిన స్నేహ పరిమళం నేటికీ తాజాగానే ఉందంటే మీరు నమ్మక పోవచ్చు. ఆనంద్ అప్పట్లో పల్లెల్లో ఫోన్ సౌకర్యం లేనప్పుడు పనిగట్టుకొని పట్నానికివచ్చి మా ఆఫీసు ఫోన్ కు ట్రంక్ కాల్ చేసేవాడు. ఆ తర్వాత నాతో మాట్లాడడానికే ఇంట్లో ఫోన్ పెట్టించుకున్నాడు. ఇక మొబైల్స్ వచ్చిన తరువాత వాడి కాల్ తోనే నాకు రోజు శుభోదయమయ్యేది.  వాళ్ళ ఊళ్ళో సెల్ టవర్ ఏర్పాటు చేసినప్పుడు వీక్ నెట్ వర్క్, వాయస్ కట్, కాల్ డ్రాప్ తలనొప్పులు ఉండవని ఎగిరి గంతేశాడు. ఇంత వరకు బాగానే ఉంది. ఈ మధ్యనే వాడి పోరు పడలేకపోతున్నానంటే నమ్మండి. నేను, ప్రమీ ఇద్దరం వాళ్ళ ఊరికి రావాలని ఒకటే పట్టుబట్టాడు. మీరు రాకపోతే నేను మాట్లాడడం మానేస్తానని నిష్టూరమాడాడు. అవును! చెప్పడం మరిచా!… ప్రమీ అంటే నా అర్ధాంగి… మీరా. శరీరంలో సగం….స్వప్నంలో సంపూర్ణం… మా ఇద్దరి పేర్ల మొదటి అక్షరాలు కలసి నా మనో వల్మీకంలో  ప్రమీ అయ్యింది. ` బాబ్బాబు! నేను ఆ విలేజ్ లకు రాలేను…నన్ను వదిలెయ్ ప్లీజ్!` అంటూ ట్రయిన్ దగ్గరికి వచ్చి బై చెప్పింది. ‘ఏక్ నిరంజన్’ అంటూ గానిగెద్దు కొలువుకు వారం సెలవు పడేసి పల్లీయులతో గడపడానికి ప్రస్తుతం పయనమయ్యాను.

“““““““`

“ఏమిట్రా! ప్రశాంత్! ట్రైన్ బాగా లేటైనట్లుంది.“ ముఖంలో పట్టరాని ఆనందంతో నేను బస్ దిగుతుంటే వచ్చి లాగేజీ బ్యాగ్ ను అందుకుంటూ అడిగాడు ఆనంద్.

నేను నేలమీద అడుగుపెట్టి అటూ ఇటూ గమనిస్తుండగా ఆనంద్ నావైపు పరికించిచూస్తూ మూడొంతులకు పైగా వ్రెంటుకలు గల్లంతైన నా తలపై దృష్టి నిలిపి చిలిపిగా నవ్వుకున్నాడు. చిన్నప్పుడు వాడు నా రింగుల జుట్టుచూసి ఈర్ష్య చెందేవాడు. ఇప్పుడు వాని జుట్టుచూసి ఈర్ష్య చెందడం నా వంతైంది. అయినా ఈర్ష్య చెందడానికి మనదేముంది. జననీజనకుల వారసత్వం మినహా అని మనసులోనే అనుకుని నేనూ నవ్వుకలుపుతూ

“అవును తెల్లవారి ఐదుకు చేరాల్సిన ట్రైన్ రెండుగంటలు లేటు. మీ ఊరికి బస్ పట్టుకొనివచ్చేసరికి ఇదిగో ఎనిమిదిన్నర అయ్యింది“ అని నేనంటుండగా ఆనంద్ మోటర్ బైక్ నా పక్కన నిలిపి

“ఈ క్రాస్ నుండి మా ఊరు జస్ట్ రెండు కిలోమీటర్లు. 15 నిమిషాల్లో చేరుకుంటాం“ బ్యాగ్ ను తనముందున్న పెట్రోల్ ట్యాంక్ పై ఉంచి వెనక ఎక్కమని సైగచేస్తూ స్టార్ట్ చేశాడు.

“ఆనంద్! మీ ఊరు పరిసరాలన్నీ చాలా మారిపోయాయి. నీకు గుర్తుందా! బహుశా టెన్ ఇయర్స్ బ్యాక్…మీ చెల్లి పెళ్ళికి వచ్చాను.“

“ఏం మారాయి రా! ఈ ఊళ్ళన్నిటికీ ఇప్పటికీ మట్టి రోడ్లే… వంద సార్లు హామీలిచ్చారు“ అంటున్న వాడి మాటల్లో డెబ్బైఏళ్ళ స్వాతంత్ర్య వైరాగ్యం కనిపించింది.

“ ఇంతకీ అడగడం మరిచా. మీ చెల్లి వాళ్లెలా ఉన్నారు? ఏవో గొడవలు జరుగుతున్నట్లు చెప్పావు ఓసారి. ఏమైంది? ఇప్పుడు బాగానే ఉన్నారా!“

నా ప్రశ్నలకు ఆనంద్ నుండి సమాధానమేమీ రాలేదు. కేవలం పైకి కిందకు తల ఊపడం మాత్రం గమనించాను. బైక్ వెనక ఉండడంవల్ల వాడి ముఖంలోని భావాలేమీ కనిపించక దాని అర్థమేమితో బోధపడలేదు. ఇంతలో బైక్ ఆ ఊరు వీధిలోకి ప్రవేశించింది. చాలావరకు గొడుగు బోర్లించినట్లుండే తాటాకు పూరిపాకలే. కొన్ని మట్టి ఇళ్ళున్నాయి. పక్కా ఇళ్ళను వేళ్ళమీద లెక్కించవచ్చు. ఆ ఊరి సెంటర్ అనుకుంటాను. అక్కడ చిన్న పిల్లల పెద్ద గుంపోకటి రంగురంగుల యూనిఫామ్ లో ఏదో స్కూల్ వ్యాన్ ఎక్కుతూ కనిపించింది.

“రేయ్!  ఆనంద్! కాన్వెంట్ చదువులు మీ ఊరికి కూడా వచ్చేసినట్లున్నాయే!“

“ ఆ ఆ! పక్క టౌన్ లో ఒక పెద్ద ప్రైవేట్ స్కూల్ కు  వెళ్తారు వీరంతా.“

“ మీ ఊళ్ళో స్కూల్ ఉందని చెప్తుండేవాడివి. అక్కడేగా నువ్ చదివింది. ఆదేమైంది.“

“ఓ అదా! గౌర్నమెంట్ స్కూల్….రెండేళ్ల క్రితం మూసేశారు.“

“ హా! మూసేశారా! అదేమిటీ….“

“తక్కువమంది పిల్లలున్నారని మూసేసి, ఉన్న పిల్లలను పక్కూరి గౌర్నమెంట్ స్కూల్ కు వెళ్ళమన్నారు.“

“అదేంట్రా! ఇంతమంది పిల్లలు కనిపిస్తుంటే తక్కువ మందంటావు….“  అని నా సందేహాన్ని వ్యక్తం చేస్తుండగానే ఆనంద్ బైక్ ను వాళ్ళింటిముందు అపాడు. కుటుంబ సభ్యులంతా ఇంటి బయటకు వచ్చి ఎంతో ఆదరంగా ఆహ్వానం పలికారు. ఆనంద్ వాళ్ళ అమ్మ అయితే పరమపదించిన మా అమ్మను మరపించింది. ముద్దపప్పు, గోంగూర, ఆవకాయ పచ్చడి, నెయ్యి, గడ్డ పెరుగు….అబ్బో! మరోవైపు తొలి కోడి కొక్కరోకొలు, కోయిల గీతాలు, పచ్చనిచెట్లు మనోహర దృశ్యాలు….ఆహా! నా పట్నంతో పోల్చితే ఈ పల్లె ఎంతో హాయనిపించింది. ఇక్కడే ఉండిపోతే మరో స్వర్గం అక్కరలేదనిపిస్తుంది. కానీ ఉండలేము. మన జీవితం మన చేతుల్లో లేదుగా….ఇలా వెల్లువెత్తాయి నా ఆలోచనా తరంగాలు ఆ ఊళ్ళోనున్న రోజుల్లో…..

ఆ ఊరు వచ్చిన మూడవ రోజనుకుంటాను. ఆనంద్ వాళ్ళ పొలాన్ని చూపిస్తానని సాయంత్రం నన్ను వెంట తీసుకెళ్ళాడు. పల్లెటూల్లో చూడడానికి ఇంకేముంటాయి! ఆ ఊరి వీధిగుండా మేమిద్దరం కలసి వెళ్తుంటే నేనెవరని అభిమానంతో ఆనంద్ ను అడిగినవారెంత మందో!  మేం పొలానికి వెళ్ళే దారిలో చాలామంది స్త్రీలు ప్లాసిక్ బిందెలతో నీటిని చాలా దూరంనుండి తీసుకవస్తున్న దృశ్యం కనిపించింది. అవీ ఇవీ ముచ్చటిస్తూ పొలం చుట్టూ కలియతిరిగాము. తర్వాత పొలం గట్టుపై పచ్చ గడ్డిపై ఓ చోట ఇద్దరం కూర్చున్నాము.  నేను వ్యవసాయం, పండే పంటల గూర్చి ఆనంద్ ను అడిగి తెలుసుకున్నాను. వాడు నేనుండే నగరం గురించి అడిగాడు. మా మాటల మధ్యలో  ఆ ఊరి మనుష్యులు, మనసుల  ప్రస్తావన వచ్చింది. ఆ సందర్భంలో ఆనంద్ ను ఓ మాటడిగాను.

“ ఎందుకురా! మీ ఊళ్ళో నుదుట బొట్టూ, మెళ్ళో పుస్తెలు లేని చిన్నమ్మాయిలు చాలామంది కనిపిస్తున్నారు. ఈ ఊళ్ళో బాల్య వివాహాలు జరుగుతున్నాయా! లేక వాళ్ళంతా కన్వర్టెడా!“

నా సందేహాలు ఆనంద్ ముఖంలో రంగులు మార్చేశాయి. చిరకాల స్నేహితుని సమక్షంలో అంతవరకున్న సంతోషం మాయమై విచారం కమ్ముకుంది.

“ వారు బాల్య వివాహాల విధవలు కారు, మతం మార్చుకున్న క్రైస్తవులూ కారు..కాలం చిమ్మిన విషానికి బలియైన విధి వంచితులు“ అని పలికిన ఆనంద్ మాటల్లో ఆవేదనతో పాటుగా ఆగ్రహం ధ్వనించింది.

వాడినుండి వచ్చిన ఇంత తీవ్ర ప్రతి స్పందనకు నేను ఆశ్చర్య చకితుడనయ్యాను. విషయం ఏమిటని నేను అడగడానికి ముందే వాడే

“ నీవు మా ఊరొచ్చిన రోజు బైక్ మీద వస్తున్నప్పుడు మా చెల్లెలు అరుణ ఎలావుందని అడిగావు. అప్పుడు నేనేమీ చెప్పలేదు. ఎందుకో తెలుసా!“ అని చెప్పి చూపులు నేలపై ఉంచి గడ్డి మొక్కలు చేత్తో లాగుతూ మౌనం వహించాడు.  ఎలాంటి అరమరికలు లేని స్నేహంలో ఒకరినొకరు ఏది మనసులో దాచుకున్న సందర్భమేలేదు. తన చెల్లెలు గురించి ఏదో గోప్యంగా ఉంచుతున్నాడెందుకు? నేనుకూడా అరుణ గురించి మళ్ళీ విచారించలేదు. ఏదో చాలా గంభీరమైన విషయమేదో దీంతో ముడిపడి ఉన్నట్లు నా కనిపించింది. అందువల్ల వెంటనే చెప్పమని బలవంతం చేయడం సంస్కారం కాదనిపించింది. కాసేపటి తరువాత మా ఇద్దరి మధ్య నెలకొన్న మౌనాన్ని భంగ్నంచేస్తూ వాడే విషణ్ణ వదనంతో

“ చెల్లి నిన్ను చూడ్డానికి రేపు వస్తోంది. నీ సందేహాలకు నాకన్నా తనే బాగా చెప్పగలదు. చాలా ఏళ్ళ తరువాత మావూరొచ్చావు. ఈ పల్లె జీవితాలు ఎలా అఘోరిస్తున్నాయో నీక్కూడా తెలిస్తే మంచిది“ అని మాత్రం పలికి తలెత్తి నా కళ్ళలోకి చూశాడు.

ఆనంద్ మాటలు పూర్తిగా అవగతం కాకపోయినప్పటికీ పల్లెలు విధ్వంసం అవుతున్న సంగతి నాకు ఎరుకే. అయితే నాది చాలా పరిమితమైన జ్ఞానమని కూడా తెలియకపోలేదు. నాకు తెలియని పరిణామాలు ఎన్నో చోటుచేసుకొనివుండవచ్చు. వాటిని తెలుకోవాలన్న ఆసక్తి మరింత కలిగింది. ఆ సమయానికి వెలుతురు క్షీణిస్తూ చీకటి కమ్ముకోసాగింది.  శీతాకాలం కావడంవల్లా గడ్డిపై కురిసిన మంచు బిందువుల తడి చేతికి తగులుతోంది. `ఇక ఇంటికి తిరిగి పోదామా` అన్నట్లుగా ఆనంద్ నావైపు చూశాడు. ఇద్దరం లేచి ఎవరి ఆలోచనల్లో వారు మునిగి పోయి నెమ్మదిగా అడుగులు వేయసాగాము.

““““““““““

“ ప్రశాంతన్నయ్యా! ఏంచేస్తున్నారు? నిద్రలేచారా! కాఫీతీసుకొచ్చా!“ ఆ ఇంటి ఆత్మీయ అతిథిగా డాబాపై నే నుంటున్నగది గడపముందు నిలబడి అరుణ అడిగింది. మధ్యాహ్నం భోజనం తరువాత కాసేపు కునుకుతీసి మేల్కోని పుస్తకం చదువుతున్నాను.

“ ఎవరు …..అరుణేనా!…..రామ్మా! లోపలికిరా!“  అని  ప్రత్యుత్తరమిచ్చాను.

ఆనంద్ నాతో చెప్పిన మరునాడే అరుణ తనుంటున్న ఊరు నుండి వచ్చింది. గలగలా మాట్లాడుతోంది. చాలా చొరవగల అమ్మాయే. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అట్టే కలిసిపోతుంది. పెళ్ళికాక మునుపు ఒకటి, రెండు సార్లు నన్ను చూసింది. అంతే! నాతో అంత పరిచయం లేకపోయినా చాలా చనువుగా చాలా విషయాలు అడిగింది. వచ్చినప్పటినుండి నన్నుకుడా `అన్నయ్యా` అని సంబోధిస్తూ నా ఏర్పాట్లన్నీ చూడసాగింది. ముఖ్యంగా మీరా గురించి తెలుసుకోడానికి చాలా ఆసక్తి చూపి `చూడ్డానికి ఎలావుంటుంది` అని విచారించింది. నా సెల్ లోని ఫోటోను  తదేకంగా చూస్తూ `ఎంత అందం` అంటూ ` మీది ప్రేమ వివాహమా!` అనికూడా అరా తీసింది. ఈసారి ఆమెను నాకు మొదట కనిపించినప్పుడే ఆనంద్ ఆరోజు పొలంలో ఎందుకలా విచారంగా చెప్పాడో కొంత గ్రహించగలిగాను. అయినా ఈ అమ్మాయికి కూడా వైధవ్యం సంభవించడానికి కారణమేమిటో సరిగ్గా బోధపడలేదు. ప్రస్తుతం తన మనసులోని మాటేదో నాతో చెప్పటానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించింది. ఎంతో నమ్మకం, మరెంతో సాన్నిహిత్యం లేకుండా మహిళలు పరపురుషుల ముందు మనసువిప్పి మాట్లాడుతారా! అనే సంకోచం నాకుంది. అందుకే స్వయానా ఆమె ఏమైనా చెబితే విందామని ఊరుకున్నాను. మంచం మీదనుంచి లేచి షర్ట్ తొడుక్కున్నాను. అరుణ లోపలికివచ్చి కాఫీ గ్లాసందించి గది మూలనున్న చిన్న స్టూల్ ను దగ్గరకు లాక్కొని నాకు ఎదురుగా కూర్చుంది.

“అన్నయ్యా! మీరు కథలు రాస్తారటగా. అప్పుడోసారి ఆనంద్ అన్నయ్య మావూరొచ్చినప్పుడు ఏదో పత్రికలో మీ కథ పడిందని చూపించాడు.“

“ ఆ! ఏదో అప్పుడప్పుడు సరదాకు“ చిరునవ్వు ముఖంతో కాఫీ సిప్ చేస్తూ

“ మరి నా కథ చెబుతాను, మీరు రాస్తారా! ఏం…“ అని అంటుండగానే ఆమె కళ్ళ వెంట నీళ్ళు జలజలా రాలిపడ్డాయి. తత్తర పడ్డాను. అనునయ స్వరంతో

“ ఎమ్మా! ఏమైంది… ఎందుకేడుస్తున్నావు“ అని అడిగాను.

అందుకామె సిగ్గుపడింది. వెంటనే చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంది.

“సారీ అన్నయ్యా!…. కథలన్నపుడు నా వ్యథ గుర్తొచ్చి బాధేసింది.“

ఆ క్షణంలో నేనుకూడా ఉద్వేగానికి గురయ్యాను. సానుభూతిని వ్యక్తం చేస్తూ

“ ఏమ్మా! ఎలా చనిపోయాడు నీ భర్త?…..అనారోగ్యంతోనా!….నీకు చాలా అన్యాయమే జరిగింది“ అని పలికాను. కానీ నా మాటలకు అరుణ భిన్నంగా ప్రతి స్పందించింది. దుఃఖిత స్వరం మారిపోయి

“అన్యాయమా! నాకా! లేదే! ఇలానే జరగాలని నేను కోరుకున్నాను. అలానే జరిగింది…అందుకే నేనెవరి సానుభూతిని ఆశించను కూడా. నేను కోరుకునేది నా కథ నలుగురికి తెలియాలని. అందుకే అడుగుతున్నాను నా కథ రాస్తారా అని“ సమాధానమిచ్చింది.

ఆమె ఇలా అనేసరికి నేను నిర్ఘాంతపోయాను. ఒక గ్రామీణ యువతి అందులోనూ ఒక విధవ మాటలు నాకు వింతగా అనిపించాయి. ఏం మాట్లాడాలో తెలియని సందిగ్దం లో పడిపోయాను. నా అయోమయాన్ని ఆమె గమనించలేదు. భారీ వర్షంతో వచ్చిన వరద నీటి ప్రవాహంలా చెప్పుకుపోయింది.

“ పెళ్ళైన మొదటి ఆరునెలలే అన్నయ్యా! అంతో ఇంతో ఆనందంగా ఉన్నాం. నా భర్త కారు డ్రైవరని మీకు తెలిసేవుంటుంది. తాగడం చిన్నప్పటి నుండే అలవాటట. ఆ ఆరునెలలు కొంత కంట్రోల్ లో ఉంటూ బాగానే ఉండేవాడు. ఆ తర్వాత మొదలైంది నరకం“ అంటూ చెప్పడం ఆపి మళ్ళీ కన్నీళ్ళు తుడుచుకుంది. తలవంచుకొని నేలపై చూపుడు వేలుతో ఏవో గీతలు గీస్తూ

“ ఓ రోజు బాగా తప్పతాగి యాక్సిడెంట్ చేశాడు. అదృష్టం కొద్ది ప్రాణాలు పోలేదు. బాగా దెబ్బలు తగిలాయి. నాలుగు నెలలు మంచం మీదనే అన్ని సేవలు చేయాల్సివచ్చింది. డ్రైవర్ ఉద్యోగం పోయింది. తిండికికూడ కష్టమై పోయింది. ఆనంద్ అన్నయ్య కొండంత అండగా ఉండడం వల్ల నిలదొక్కుకోగలిగాను. అయినా ఎంతకాలమని పుట్టింటి వాళ్ళు సహాయం చేస్తారు. పెళ్ళికి ముందు ఇంటర్ బైపీసీ చేశాను. దానివల్ల ఆషా వర్కర్ గా చేరగలిగాను. పూట గడవడానికి  ఇబ్బంది తీరినప్పటికీ భరించలేని హింస మాత్రం తప్పలేదు. మరే పనీపాటా లేక ఆంబోతులా తిరుగుతూ తాగుడుకు డబ్బులిమ్మని తిట్టడం, కొట్టడం నిత్యమైపోయింది. నా ముక్కు ఈ ఎడమవైపు ఎందుకు చీలిపోయి ఉందో మీరు అర్థం చేసుకోగలరు. శరీరంపైనున్న మిగతా గాయాలు మీకు కనిపించవు. దీనికి తోడు అనుమానం… ఎవరితోనో తిరుగుతున్నానని అపవాదు… మానసికంగా క్రుంగిపోని రోజులేదు. మనసులోనేకాక శరీరాన్ని కూడా తాకకుండా దూరం చేశాను. అప్పటినుండి పిచ్చెత్తిన వాడిలా ప్రవర్తించడం ప్రారంభించాడు. నాకు చిన్న వయసునుండి ఇంటా-బయటా పనులు చేయడం బాగా అలవాటు. నా వంట్లో సత్తువ ఎక్కువే. గట్టిగా నిర్ణయించుకుంటే ఒక్కసారి తన్ని బయటకు తగలేయగలిగే దాన్ని. నా బ్రతుకు నేను చూసుకోగలిగి ఉండేదాన్ని. కానీ చేయలేని నిస్సహాయత…..లోకం ఏమంటుందోననే భయం…“అంటూ తల పైకెత్తి చూసింది. చెమర్చిన నా కళ్ళను గమనించి

“అరే! ఏంటన్నయ్యా! మీ కళ్ళలో నీళ్ళొస్తున్నాయి….నా కథకే మీరు కంట నీరెడితే ఈ చుట్టుపక్కల గ్రామాలలోని ఆడాళ్ళ గుండె రోదనలు వినగలిగితే కన్నీరు కారి కారి చివరకు మీ వంట్లో వున్న నీరింకిపోతుంది.“

ఇంత దుఃఖమయమైన తన గాధను చెబుతూనే ఆమె ఇలా చమత్కరించడం నాకు చాలా ఆశ్చర్యమేసింది. నేనుకూడా అప్రయత్నపూర్వకంగా కళ్ళు తుడుచుకొని

“ తర్వాత” అంటూ ఉత్సుకత చూపాను.

“ ఆ రోజు జరిగిన సంఘటనతో నా మనసు పూర్తిగా విరిగి పోయింది. ఓసారి నాతోపాటు పనిచేసే ఒకమ్మాయి మా ఇంటికి వచ్చింది. ఇద్దరం కలసి మా మండలంలోని మహిళల ఆరోగ్యం గురించి ఒక సర్వే రిపోర్టును తయారుచేసేసరికి రాత్రయింది.  నా బలవంతమ్మీద ఆ రాత్రికి మా ఇంట్లోనే ఉండిపోయింది. నా భర్త అర్ధరాత్రి ఎప్పుడో వచ్చి ఆ అమ్మాయిపై పడి అత్యాచారం చేయబోయాడు. భయంతో చిగురుటాకులా వణికిపోతూ గట్టిగా అరుస్తూ బయటకు పరుగులు పెట్టింది. తెల్లవారే వరకు ఆ అమ్మాయితోపాటు మా ఊరి శివాలయాలో జాగారం చేశాము. ఊళ్ళో వాళ్ళకు తెలియకూడదని పొద్దు పొడవక మునుపే మసక చీకట్లో `కేసేమీ పెట్టనులే అక్కా!` అని నాకు చెప్పి వాళ్ళ ఊరెళ్ళిపోయింది“ అంటూ చెప్పడం మధ్యలో అపి

“ అన్నయ్యా! ఒక్క నిమిషం. సాయంత్రమవుతోంది. ఈ ఊళ్ళో దోమలెక్కువ. ఇప్పుడే గదిలోకి వస్తాయి“ అని పలికి లేచివెళ్ళి కిటికీ తలుపులు మూసి వచ్చి మళ్ళీ చెప్పడం కొనసాగించింది.

“ అలా జరిగిన రెండవరోజే తెగతెంపులు చేసుకొని ఈ ఉరోచ్చేశాను. ఆనంద్ అన్నయ్య చాలా కాలంనుండే వదిలేసి వచ్చేయమని చెబుతుండేవాడు. ధైర్యం చాలక రాలేకపోయాను. నేనున్న పరిస్థితుల్లో పిల్లలు పుట్టక పోవడం మంచిదైంది. నేను వదిలేసి వచ్చిన తరువాత పెద్దల పంచాయితీ జరిగింది. భర్త దగ్గరికే వెళ్లాలని నిర్ణయంచేశారు. అదే న్యాయమన్నారు….“ అంటూ ఆమె ఇంకా చెప్పబోతుంటే నేనే అడ్డుపడి

“అదెలా న్యాయమవుతుంది. నీవు తిరిగి వెళ్ళావా ఏమిటి“ అడిగాను ఆందోళనా స్వరంతో

“ వెళ్ళక తప్పలేదు. ఒక స్త్రీ లోకాన్ని కాదని నిలబడగలుగుతుందా! అది సాధ్యమా! చెప్పండి!“ ఆ మాటల్లో తరతరాలుగా న్యాయమని లోకం చెబుతున్నదాన్ని ఆమె ప్రశ్నస్తున్నట్లుగా అనిపించింది.

“ తిరిగి వెళ్ళే ముందు ఒక గట్టి నిర్ణయానికి వచ్చాను“ అని కాసేపు మౌనం వహించింది. ఆమె మాటల్లో ఏదో పరిష్కారం చేయాలన్న మొండి ధైర్యం కనిపించింది.

“ఏం నిర్ణయించుకున్నావు. విడాకులు తీసుకోవాలనా!“

నా సందేహాన్ని ఆమె పట్టించుకోలేదు. తిరిగి తనే నన్ను అడిగింది.

అన్నయ్యా! నాకు అర్థం కావడం లేదు. మనుషులెందుకు ఇంత రాక్షసులుగా మారుతున్నారు?”

ఆమె ప్రశ్నకు చాలానే చెప్పవచ్చు. కానీ నేను

“ లేదమ్మా! రాక్షసులుగా చేయబడుతున్నారు” అని మాత్రమే పలికి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆసక్తిని కనపర్చాను.

“ఏం జరిగిందో ఒక్క ఆనందన్నయ్యకు మాత్రమే తెలుసు…… మేము మా వృత్తిలో భాగంగా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య సలహాలు యిస్తుంటాము. కొద్దిమంది మిస్ క్యారేజ్ వల్ల డిప్రెషన్ కు గురవుతుంటారు. అప్పుడు మేము డాక్టర్లను సంప్రదించి కొన్ని మందులిస్తుంటాము. అందులో నిద్ర మాత్రలు కూడా ఉంటాయి. మావద్ద ఒక్కోసారి పాతిక, ముప్పై వరకు ఉంటాయి. ఓ రోజు రాత్రి ఎప్పటిలాగే వచ్చి ప్లేట్లో పెట్టింది అన్నమో, విషమో ఒళ్ళు తెలియని మత్తులో తిన్నాడు. అదే మత్తులో మరేప్పటికీ లేవకుండా పోయాడు. ఉదయానికి కట్టెగా మారాడు“ అంటూ నా కళ్ళలోకి చూసింది.

`ఈ అమ్మాయి హాస్యమాడుతుందా! లేక నిజంగా జరిగిందా!` ఎందుకంటే ఆమె ఈ విషయం చెబుతున్నప్పుడు ముఖంలో భయంగాని, పశ్చాతాపంగాని కనిపించలేదు. స్వరంలో బ్రతుకు బీభత్సవం ద్యోతకమైంది. అదే నిర్భయంతో మళ్ళీ ఇలా చెప్పింది.

“అప్పుడు ఈ లోకం ఏమందో తెలుసా!“ మరుక్షణం ముఖంలో మందహాసం కనపరుస్తూ

“తాగాడు…చచ్చాడు….అని తిడుతూ…. మరోవైపు ఎంత అన్యాయం చేశాడే పిల్లా నీకు…దురదృష్టవంతురాలివి….అంటూ ఓదార్చారు కూడా. ఎవ్వరికీ ఏ అనుమానం రాలేదు. అన్నీ సజావుగా జరిగిపోయాయి….నేను నా ఉద్యోగాన్ని మరో ఊరికి వేయించుకొని హాయిగా ఉంటున్నాను“ అని పలికి ధీర్ఘంగా శ్వాస తీసుకుంది.

ఆ సమయంలో నేను ధిగ్భ్రమకు గురయ్యాను. నా సర్వాంగాలు పట్టు తప్పాయి. నా ఊహకు కూడా అందని విషయమది. కళ్ళెంలేని గుర్రంలా మనసు పరిపరివిధాల పరుగులు పెట్టింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అంతుపట్టడంలేదు. ఎలా స్పందించాలో కూడా తెలియకుండా పోయింది. ఈ విధమైన నా అయోమయానికి అడ్డుకట్ట వేస్తూ తిరిగి అరుణ మాట్లాడింది.

“ అన్నయ్యా! చివరగా ఒక్క మాట. ఈ కథ విన్న తరువాత నా గురించి ఏమని ఊహించుకుంటావో నాకు తెలియదు. పాపాత్మురాలా! ఎంత ఘోరానికి పాల్పడ్డావని ఛీకొడతావో లేక నా వ్యథను లోకానికి చెప్పి నా దుర్గతి మరో స్త్రీకి రాకూడదని సందేశమిస్తావో నీ ఇష్టం.“ అని దృఢంగా పలికి ఖాళీ కాఫీ గ్లాసును తీసుకొని ఆ గది నుండి బయటకు వెళ్లింది. శూన్య మనస్కుడనై, ఆమె వెళ్ళినవైపే నిరుత్తరుడనై చూస్తూ ఉండిపోయాను. ఈ అమ్మాయికి ఇంత ధైర్యం ఎక్కడినుండి వచ్చింది అనే సందేహం కలిగింది. సైనిక దళాల అకృత్యాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి నగ్న దేహాలతో నిరసన ప్రదర్శన చేసిన మణిపూర్ మహిళల సాహసం, ఆక్రోశం అప్పుడు నా స్మృతి పథంలో మెదిలాయి.

“““““““`

నేను ఆ ఊరొచ్చి అప్పుడే ఆరు రోజులైంది. నా తిరుగు ప్రయాణానికి సమయమొచ్చింది. ఏడోరోజు ఉదయాన్నే ప్రయాణానికి అన్నీ సర్దుకున్నాను. బస్ కు టైమవుతోందని వెంటనే మెయిన్ క్రాస్ వద్దకు వెళ్లాలని ఆనంద్ తొందర పెడుతున్నాడు. వీడ్కోలు తీసుకోవడానికి ఆనంద్ అమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కరించాను. అరుణ కనిపించలేదు. ఎక్కడుందని అమ్మను అడుగుతుండగానే “ అన్నయ్యా! ఇక్కడ” అంటూ నవ్వుతూ వచ్చి మీరాను అడిగినట్లు చెప్పమంది. “ అరుణా! ఈ బాటిల్ లో మంచినీళ్ళు పట్టివ్వు“ అని ఆమె చేతికిస్తూ బాటిల్ అడుగున మడత పెట్టిన చిన్న కాగితాన్ని ఎవరూ గమనించకుండా అందించాను. అరుణ ముఖంలో మెరుపు మెరిసింది.

ఆ రోజు బస్ రావడం లేటైంది. రోడ్ క్రాస్ వద్ద నిల్చోని మిత్రులమిద్దరం నిరీక్షిస్తున్నాము.  ఆ రోడ్డుకు అటువైపు సమీపంలో ఏదో పెద్ద గోడవున్ నిర్మాణం జరుగుతూ కనిపించింది. తెలుసుకోవాలనిపించి ఆనంద్ ను అడిగాను.

“మా ఊరు ఈ చుట్టు ప్రక్కల ఏడు పల్లెలకు సెంటర్ పాయింట్. ఒక్కొక్క పల్లెలో కనీసం మూడు, నాలుగు లైసెన్సులున్న లిక్కర్ షాపులుంటాయి. లైసస్స్ లేని బెల్టు షాపులు మరో నాలుగుంటాయి. లిక్కర్ సప్లైకి అంతరాయం లేకుండా సరుకును సిద్దంగా ఉంచడానికి ప్రభుత్వం ఈ గోడవున్ ఏర్పాటు చేస్తోంది. అందుకు…..“ వాడింకేదో చెప్పబోతుండగానే మట్టి రోడ్ పై దుమ్మురేపుతూ బస్ వచ్చి ఆగింది. తీపి, చేదులు కలగలిసిన పల్లె వాసుల జీవిత వాస్తవాలను ఎన్నో మూటగట్టుకొని బాల్య మిత్రుని హస్తాన్ని వెచ్చగా తాకి బస్ ఎక్కాను. దూరమవుతున్న ఆ పల్లె, పల్లెతో పాటు అరుణ పదే పదే గుర్తుకువస్తుంటే గుండె బరువెక్కింది. ` అరుణా! నీవు అనుభవించిన అంతులేని ఆవేదనను, అవధులు దాటిన ఆక్రోశాన్ని నీ కథనుండి గ్రహించగలిగాను. నీవెందుకంత తీవ్రంగా వ్యవహరించావోకూడా సహృదయంతో అర్థం చేసుకోగలను. కానీ నీవెన్నుకున్న పరిష్కారమే ఉత్తమమని నా మనసంగీకరించలేదు. దాన్నే స్త్రీజాతికంతా వర్తించనూలేము. అయితే నిన్ను పాతకిగా దూషించే కఠిన హృదయుణ్ణి కాను. అలాగని సానుభూతిచూపి, డబ్బు సహాయం చేసి నీ వ్యక్తిత్వాన్ని కించపర్చలేను. నీకేవసరం వచ్చినా ఆనంద్ ఒక్కడే కాదు నేనున్నానని మర్చిపోవద్దు` అనే భరోసాను అరుణకిచ్చాను. అయితే అది ఒక్క అరుణకు మాత్రమే ఇవ్వగలిగాను. మరి అరుణలాంటి అభాగ్య చెల్లెళ్ళకు  ధైర్యమిచ్చి ఆసరాగా నిలబడేది ఎవరు? ఈ అమానుషత్వం నుండి వారికి విముక్తి ఎప్పుడు? అనే ప్రశ్నలు నన్ను కలవరపెడుతుండగా బస్ సీటుపై తలను వెనక్కు వాల్చి కళ్ళు మూసుకున్నాను.

 


ఎస్. జి. జిజ్ఞాస

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.