జామీను పావురం

2
690

ట్రింగ్గ్గ్గ్గ్గ్గ్
భోజనం గంట అది
జైల్లోని ఖైదీలందరు పళ్లాలు పట్టుకొని లైన్లో నుంచోడానికి పరుగులు తీస్తున్నారు.
కొంత మంది ఖైదీలు వడ్డించడానికి సిద్దపడుతున్నారు.అంత అన్నం ముద్ద, రుచిలేని సాంబార్ అందులో దొరికే మిరపకాయల కోసం ఆరాటం.
చుట్టూ గోడలు బయట ప్రపంచంలోవి వీరికి కనపడేవి పక్షులు మాత్రమే..
రోజూ ఎగిరే జాతీయ జెండా కాస్త కొత్తగా కనిపిస్తుంది.
పళ్లెంలో ఒక లడ్డు పడ్డాక కానీ గుర్తు రాలేదు కొంతమందికి ఆ రోజు ఆగష్టు15 అని.
పొద్దుటెవరో జడ్జిగారు వచ్చారు, గాంధీ గారు చెప్పిన మంచి మాటలు కొన్ని చెప్పి, ఒక పావురాన్ని గాల్లోకి ఎగరేసారు.
ఆ ఎగిరిన పావురం కూడా బంధీ చేయబడే కదా మళ్లీ ఎగిరింది!
జైలు గోడల్ని తాకకుండా ఎంత వేగంతో వెళ్లి పోయిందో..
అది చేసిన తప్పు,ఒప్పు రెండూ లేవు.
తీసుకొచ్చారు,ఎగరేసారు!
దాన్ని చూసి కొంత మంది ఖైదీల నిర్వేదం ఇది.
తప్పు చేయకున్నా ఖైదులో ఉన్న వారు కొందరైతే, తప్పు చేసి కూడా స్వేచ్చగా బయట తిరిగే వారు కొందరు.
అయినా ఇప్పుడా పావురానికొచ్చింది స్వేచ్చా? మరొకడి చేతికి దొరికేవరుకు జామీనా!!
ఆలోచిస్తూ అన్నాన్ని పక్కన పెట్టిన జీవా కి దూరం నుంచి విన్న పిలుపుతో ఈలోకానికి వచ్చాడు.
జైలర్ గారు చెప్పండి అంటూ పిలుపుకి స్పందించి వెళ్లాడు..
ఇవ్వాళ్ల సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలున్నాయ్. బయట నుంచి వచ్చే కళాకారుల చేత ఎప్పటిలానే ఆ స్టేజీ డెకరేషన్ పనులు నువ్వే చూస్తున్నావ్ గా అయినా ప్రత్యేకంగా చెప్పాలా ఏమి? అని మీసాలు సవరించుకుంటూ వెళ్లిపోయాడు.
జీవా కి మంచి పేరుంది జైల్లో. పని చెయ్యడం, పుస్తకాలు చదవడం తోటి ఖైదీలకు కాస్త ఇళ్లకి ఉత్తరాలు రాయడంలో సాయపడటం.
స్టేజి డెకరేషన్ పూర్తయ్యింది, దేశభక్తి నాటికలు, ప్రసంగాలు, సత్ప్రవర్తన సందేశాలు ఇలా ఎప్పటిలానే కాస్త విసుగ్గానే సాగుతుంది.
స్టేజి వెనకున్న జీవా ఒక్కసారిగా ఉలిక్కిపడి, పరుగున వచ్చి స్టేజి ముందు కూర్చున్నాడు.
ఒక మంచి గొంతు, శ్రావ్యమైన రాగంతో లలిత గానం!
విన్నాడు!
ఎదో తెలియని బంధం సంగీతంతో తనకి,
కళ్లు కాస్త తేలికపడినట్లున్నాయ్ కన్నీరు బయటకొచ్చేయగానే!!
ఆ రోజు జీవా కి నైట్ డ్యూటీ జైల్లో
ఖైదీలున్న బ్యారక్ లో ఏ గొడవ జరక్కుండా!
ఇవ్వాళ్ల జీవా వంతు.
రాత్రి సుమారు 11 గం.
అందరూ నిద్రపోతున్నారు.
చేతి వేళ్లతో ఊసలని నిమురుతూ ఎవో ఊసులు చెప్తున్నట్లు శబ్ధం చేస్తున్నాడు.
.
.
చిన్నప్పుడే అనాధ జీవా!
మేనమామ దగ్గర ఆ పనులు ఈ పనులు చేస్తూ డిగ్రీ వరకు చదువుకున్నాడు.
మేనమామ కూడా కాలం చెయ్యడంతో మేనత్త వేధింపులు,చీత్కారల్ని తట్టుకుంటూ ఊరిలో పిల్లలకి చదువు చెప్తూ, ఒక చిన్న మాస్టారిగా తయారవుతున్న రోజులవి.
గుడిలోనే బడి.
అదే గుడిలో ఒక్కోసారి రాత్రి నిద్ర.
అప్పుడప్పుడూ దర్శనానికొచ్చే తన సీనియర్ లలిత దేవుడి ముందు చేసే గానానికి ముగ్దులవ్వని వారెవరున్నారంటే లేరనే చెప్పాలి.
లలిత గుడికొచ్చిన ప్రతిసారీ ఆ అరగంట క్లాస్కి సెలవు. పిల్లల ఆటపాట మధ్య కూడా అమృతమంటి గానానికి చెవులే కాదు మనసప్పగించి తన్మయం పొందే వాడు.
కొన్నాళ్లకి తనకి లలితకు మధ్య ఉన్న అలౌకిక సంబంధాన్ని, అనుబంధాన్ని తన కళ్లలో గమనించాడు జీవా.
బహూశా కనుల భాషంటే అదేనేమో..
ఆ భాషలో చెప్పలేనన్ని ఊసులు,కధలు.
అది ప్రేమేనని ఇద్దరికి తెలుసు.
ఒకరికొకరు చెప్పుకోలేదంతే.
కాస్త నల్లగా ఉన్నా కళ గలిగిన మోము లలిత ది.
పెళ్లి సంబంధాలు కూడా వచ్చిపోతున్నాయ్.
డబ్బు కూడా ఉండాలిగా మరి ఆ చిన్న వ్యవసాయ కుటుంబానికి .
జీవా ఇప్పుడు అనాధ కాదనే భావనలో ఆనందపడుతున్నాడు.
గానమాగింది ఒకరోజు మధ్యలో..
గుడి ధర్మకర్త వచ్చి అంచనాలు ఎవో వేస్తున్నాడు బిగ్గరగా..
గుడికి వేసే సున్నాల గురించి, పల్లకీకి చెద పట్టకుండా వేసే పేయింటింగ్ గురించని రంగుల రాజయ్య చెప్పాక తెల్సింది.
వెళ్తూ వెళ్తూ ఏరా జీవా ఎలా ఉంది నీ బడి?
మీ మేనత్త గురించి కాస్త చెడ్డ మాటలు వింటున్నారా..
పిల్లలు లేరు, ఏం చేసుకుంటుంది రా ఆ ఆస్తి?
అయినా నువ్వేం చేస్తావ్లే, బొడ్రాయ్ పక్కనున్న నా పాత గేదెల దొడ్డిని శుభ్రం చేయించి పాక వేయిస్తా అందులో నడుపుకుందువు లేరా బడి.
దసరాకి చేయిస్తా దిగులు పడకు అని చెప్పాడు ధర్మకర్త.
ఎదో కొత్త జీవితం కనిపించింది జీవాకి!
సరే గుడికి రంగులేయిస్తున్నా రా.. రాజయ్యకి కాస్త తోడుగా ఉండు.
ఎదో ఆడి పిల్ల పెళ్లంట,
అందుకే ఆడికీ కాంట్రాక్టు.
ఇంద ఉంచు అని రాజయ్యకి ఒక వెయ్యి, జీవాకి ఒక 500 చేతిలో పెట్టి వెళ్లాడు ధర్మకర్త.
పెద్ద చెయ్యి మరి.
ఊరి పెద్ద!
మంచోడు.
రావ్ గోపాల్రావ్ లా కనిపించినా ఎస్వీవోడి మనసు రా అబ్బాయా.. కొత్త బడి వస్తంది అన్న మాట! శుభ్రంగా సేస్కో రా అయ్యా అంటూ.. రాజయ్య తన అన్న కూతురు లలితని తీస్కోని వెళ్లి పోయాడు.
రాజయ్య
జీవా నాన్నకి అత్యంత స్నేహితుడు చిన్నప్పట్నించి తల్లోనాలుక గా ఉండే వాడు.
బాగా బతికి చెడ్డ కుటుంబం.
లలితకు బాబాయ్ కూడా.
పిల్ల పెళ్లి గవర్నమెంట్ ఆఫీస్లో గుమస్తా తో వచ్చే నెల.
పెళ్లి ఖర్చులకి అప్పుకోసం తిరుగుతూ ఉన్నాడు స్దలానికున్న బి.ఫారం పట్టాతో!
.
.
గరగరగర మని శబ్దాలు
పొద్దుటే మొదలెట్టాడు రాజయ్య గుడిలో పేయింటింగ్ పని.
లలిత కూడా గానం మొదలెట్టింది.
బడికి 3 రోజులు సెలవని పంపించేసాడు పిల్లల్ని.
రాజయ్యకి సాయమ్ చేస్తున్నాడు పొద్దుపోయిన దాకా!
రాత్రికి నిద్దరోతున్నాడు గుడిలోనే జీవా!
పొద్దుట చెప్పిన రాజయ్య మాటల్ని గుర్తుచేస్కుంటూ.
ఎల్లుండికి డబ్బివ్వాలని పెళ్లి వాళ్లకి.
స్దలం ఎమో ఎదో లిటిగేషన్లు గట్రా అని పని కావట్లేదురా అని!
మంచి నిద్రపట్టింది, లేచి చూసే సరికి గగ్గోలు గుడిలో, దేవుడి నగలు పోయాయని.
ధర్మకర్త, పోలీసోళ్లు,కుక్కలు అందరూ జీవా చుట్టూ ఉన్నారు.
.
.
అసలేం జరిగిందో తెలియకుండానే జీవా అరెస్టు.
ఏం జరుగుతుందో అర్దం కావట్లేదు.
మూడు రోజులు ఊర్లోని పోలిస్ స్టేషన్లోనే ఉంచి విచారిస్తున్నారు జీవాని!
సమాధానం ఒకటే నాకేం తెలియదని.
ఆ రోజే కోర్టుకి పెడతారు జీవాని జీపు ఎక్కుతుండగా నిశ్చితార్దానికి రాజయ్య ఇంటికొచ్చారు పెళ్లి వాళ్లు.
పెళ్లి కూతుర్ని ,రాజయ్య ని చూసి జీపు ఎక్కాడు జీవా.
అర్దమయ్యింది జీవాకి!
ఏం జరిగిందో..
ఏమి తెలియనట్టు జీవాని చూసి చూడనట్లు పెళ్లి వాళ్లకి ఎదురేగి ఆహ్వానమిచ్చాడు రాజయ్య.
నిజం చెప్తే ఏం జరుగుద్దో మోనంగా ఉన్న జీవాకి,
బోసి పోయి చూస్తున్న దేవుడికి మాత్రమే తెల్సు.
ఒంటి నిండుగా ఉన్న దెబ్బల్లోనే దేవుడి నగల దొంగతనపు నిందని మోస్తూ వెళ్తున్నాడు ఖైదుకి.
లలితకి ఏలా చెప్పాలి?
కంటి కి కన్నీటికి ఉన్న దూరంలోనే లలితకు తెలియకుండా పయనిస్తున్నాడు.
జైల్లోకి!
.
.
తెల్లారిపోయింది
జైలు ఊసలతో ఈ జ్ఞాపకాల్ని పంచుకున్న జీవా కళ్లకిప్పుడు లలిత కావాలి!
ఆ నిజాన్ని చెప్పకపోయినా ఒక్క సారి తన చేతుల్లో వాలిపోవాలి.
రేయ్ జీవా..
సత్ప్రవర్తన కల్గిన ఖైదీల్లో నీ పేరు వచ్చింది.
ఇవ్వాళ్లే నువ్ రిలీజ్.
పద ఫార్మాలీటిస్ పూర్తి చేస్కో అని జైలర్ వాయిస్.
తేరుకునేంతలోనే బయటకి 5 సంవత్సరాల తర్వాత!
బయటకొచ్చాడు
ఎక్కడికెళ్లాలి?
అనుకుంటూనే ఊరి పొలిమేరకొచ్చాడు.
పెళ్లి చేసిన కొన్నాళ్లకి మరణించిన రాజయ్య సమాధిపై తల వాల్చి చెప్పాడు.
“రాజయ్య విధి ఆటలో గెల్చింది ఎవరు? తప్పు చేసింది నువ్వు, నేను కాదు! విధి ఆటలో చిక్కించిన దేవుడు!
అని లేవబోతుండగా ఊరిలో వాళ్ల చీత్కారాలు ఎదురయ్యాయి.
రాళ్ల దెబ్బలు కొన్ని అందులో రక్త మోడుతున్న కాలితో గుడిలోకి వెళ్లి దేవుడ్ని చూసి నవ్వుకున్నాడు.
పాఠాలు చెప్పిన బండపై కూలబడి, ఈ లోకంలో లేనట్లు గా ఉన్నాయ్ ఆ కళ్లు.
.
.
అదే గొంతు
వినపడింది జీవా కి.
చెవులు రిక్కించి గుడిలోకి వెళ్లబోతుండగా ఎవరో చెయ్యి పట్టుకొని లాగినట్లుగా అనిపించింది.
ధర్మకర్త..
గుడి వెనక్కి తీసుకెళ్లి రాజయ్య చనిపోయే ముందు చెప్పిన నిజాన్ని తెలియపరిచాడు.
కాళ్ల మీద పడేలోపు ధర్మకర్తని వారించాడు.
ఈ నిజం ఇంతటితోనే సమాధి కావాలన్న ఒట్టుని ధర్మకర్త నుంచి తీసుకొని,
అయ్యా
ఆకలి గా ఉంది..
ఎమైనా తినడానికి…. అనే లోపు
లోపలికెళ్లి తీసుకొచ్చాడు.
.
.
.
నిజం తెల్సిన లలితని.
అవును తన లలితని.
మౌనమొక్కటే లోకం లో ఉంది ఆ కాసేపు.
కన్నీటి విడుదల చప్పుడు ఎంత బిగ్గరగ ఉందంటే , ఒకరికొకరి మనసులు విడదీయలేనంతగా!
కళ్లు తుడుచుకున్న ధర్మకర్త ఒక్క ఉదుటున ఇద్దర్ని లాక్కోని జీపులోకి ఎక్కించుకోని ఊరికి దూరంగా ఉన్న బస్టాప్ లో దించి పాత దొడ్డిని అమ్మిన డబ్బు చేతిలో పెట్టి పంపించి వేసాడు.
.
.
.
వారిద్దరికి అప్పుడు కన్పించింది ఆ జామీను పావురం.
స్వేచ్చగా తన జతతో హాయిగా ఎగురుతూ.
గుండెలకు హత్తుకున్న తన జీవా తల నిమురుతూ లలిత!
లలిత ప్రేమలో సేద తీరుతున్న జీవా!!
.
.
కొన్నాళ్లకి కొత్త జైలర్ వచ్చాడు
జీవా,లలిత కాపురంలోకి
బుడ్డి జైలర్
వారిరువుర్ని ఒకే చోట ప్రేమతో కట్టిపడేసే
వాళ్ల కొడుకు ‘సత్య’ అని పేరుపెట్టుకున్న జైలర్!!!!!!


Raghu Alla.

2 COMMENTS

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.