స్వైపింగ్

0
463

ఒకటో తారీఖు. ఉదయమే పాలవాడు కాలింగ్‌బెల్ కొట్టగానే మెలుకువ వచ్చి తలుపులు తెరిచాను. “అమ్మా! పాల బిల్ ” అంటూ స్వైప్ మెషిన్ ముందు పెట్టాడు. ఒక్క క్షణం అవాక్కయి వెంటనే మావారి పర్సులో ఉన్న కార్డు గీసి పిన్ టైప్ చేసాను. అకౌంట్ లో పడింది అని ఒక స్లిప్ ఇచ్చి పాలు పోసి వెళ్ళిపోయాడు పాలవాడు.

ఇలా తలుపు వేసి పాలగిన్నె స్టౌ మీద పెట్టానో, లేదో పేపర్ బిల్ అంటూ రెడీ అయ్యాడు తొమ్మిది చదివే రాము. వాడంటే ఎందుకో ఒకింత వాత్సల్యం. మా పిల్లలు అన్నీ నోటికందించి చదువుకోమంటే మా కోసమే చదువుతున్నంత బిల్టప్ ఇచ్చి మరీ స్కూలుకి వెళ్తారు. వాడు ఎప్పుడో నాలుగింటికి లేచి రెడీ అయ్యి పేపర్ అందరికీ వేసి స్కూలుకి వెళ్తున్నాడు. వాడికి చదువు రేపటి తన భవిష్యత్తు అని తెలుసు. సరే రెండొందలూ పట్టుకొని వచ్చాను బిల్ కట్టాలని. తీరా చూస్తే వాడి చేతిలోనూ స్వైప్ మెషిన్. ఏమిటిరా ఇదీ అంటే అమ్మా మా సారు బిల్లు ఆన్ లైన్ లో కట్టించుకోమన్నారని సర్ మని స్వైప్ చేయించుకొని వెళ్ళాడు.

అయోమయంలోనే కాఫీ కలిపి మావారికి ఇచ్చి నేను తాగి టిఫిన్ మొదలు పెట్టాను. ఆదివారం కావడంవల్ల పిల్లలు కాస్త ఆలస్యంగా లేస్తారు. వంట నిదానంగా చేయొచ్చు చికెన్ తేవాలిగా తను లేచి అనుకుంటూ గందరగోళంగా ఉన్న ఇల్లు సర్దడంలో మునిగిపోయాను.

అపార్ట్‌మెంట్ రూల్స్‌ ప్రకారం గ్యాస్, మెయింటెనెన్స్, కేబుల్, నెట్, కరెంటు అన్నీ మొదటి ఆదివారమే కట్టాలి. అప్పుడు అయితే అందరూ ఉంటారు అని అలా రూల్ పెట్టారు. వాళ్ళు కూడా స్టాఫ్‌ కి జీతాలు ఇవ్వాలి కదా. మా వారు లేచి స్నానం చేస్తుండగా సెక్యూరిటీ స్టాఫ్‌లో కుర్రాడు ” మెయింటెనెన్స్” అంటూ వచ్చి బెల్ కొట్టాడు.

అప్పటికే రెండు అనుభవం అవడంతో కార్డు తీసుకొని వెళ్ళి పే చేసి లోపలికి వచ్చాను. పనిమనిషి లక్ష్మి వచ్చి ఇంటిపనిని అరగంటలో గిరగిరా త్రిప్పింది. పూర్తయిందమ్మా అంటూ జీతంకోసం నిలబడింది. జీతం తెచ్చి చేతికివ్వగానే అమ్మా ఇకనుంచి ఎకౌంట్‌కి ట్రాన్సఫర్ చేయండమ్మా ఇదిగో నా అకౌంటు నంబరు అంటూ ఒక కాగితం ముక్క చేతిలో పెట్టింది. నీకెందుకే అకౌంటులో హాయిగా చేతితో వాడుకోవచ్చు కదా అంటే అమ్మగారూ! నేను కట్టే బిల్లులన్నిటికీ లెక్క చెప్పాలి కదమ్మా గవర్నమెంటుకి. మళ్ళీ ఎప్పుడు వచ్చి నీకా ఆదాయం ఎక్కడిది అంటే ఋజువులుండాలి కదా! అని చెప్పి చక్కా పోయింది.

శ్రీవారికి టిఫిన్ వడ్డించి ఆ వారానికి సరిపడా కూరగాయలు, చికెన్, కిరాణా కొట్లో ఇవ్వాల్సిన సరుకుల లిస్ట్ ఇచ్చి పంపించాను. మావారి సంగతి తెలిసిన కూరగాయల కొట్టు వాడు, కిరాణా వ్యాపారి లిస్ట్ తీసుకొని చకచకా సర్ది ఇచ్చేసారు. ఉదయం నుండి జరిగిన భాగోతం తెలియని మావారు జేబులోంచి డబ్బులు తీస్తుంటే వాళ్ళు మెషీన్ ముందుపెట్టారట కార్డ్ తీయమంటూ. బిక్కమొహం వేసిన మావారు సర్ అనిపించి చికెన్ కోసం వెళ్తే అక్కడా ఇదే తంతు. రేపు ఒకటో తారీఖు అని మావారు నిన్నే ఏటిఎమ్ లో డ్రా చేసుకొచ్చిన డబ్బులు మావారిని వెక్కిరిస్తూ బరువుగా అలా పర్సులోనే మిగిలిపోయాయి. క్రెడిట్ కార్డు కావడంతో బాలెన్స్ లేదేమో అన్న భయం లేకుండా ఇంటికి చేరుకున్నారు ఉసూరుమంటూ.

ఆదివారం కదా మనం మూవీకి వెళ్ళాల్సిందే అని పిల్లలు గోల పెడుతుంటే రెడీ అయ్యి ప్లాస్టిక్ మనీతో ఎంజాయ్ చేసి ఇల్లు చేరుకున్నాము. ఎలా అయినా కొంత ఖర్చవుతుందని ఎప్పుడూ కార్డ్ గీసే పెట్రోల్ బంక్ లో పర్సులో మనీ ఇవ్వబోతే ఎంట్రీలో బోర్డు చూడలేదా సర్! ‘ఓన్లీ కార్డ్ టూ పే’ అని బోర్డు వైపు చూపించాడు. తెల్లమొహం వేసిన శ్రీవారు మారు మాటలేకుండా సర్ మనిపించి వచ్చేశారు

. తెల్లవారగానే వర్కింగ్ డే కావడంతో ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు. వెళ్తూ తను తెచ్చిన డబ్బును మళ్ళీ బ్యాంకులో వేయమని పని నాకప్పచెప్పి వెళ్ళారు. పని త్వరగా తెముల్చుకొని బ్యాంకుకి బయలుదేరుతూండగా కాలింగ్‌బెల్ మోగింది. ఎవరా అనుకుంటూ తలుపు తీసిన నేను ఎదురుగా పై ఫ్లాట్ పిన్నిగారిని చూడగానే నవ్వుతూ లోపలికి ఆహ్వానించాను.

ఎటో బయలుదేరినట్లున్న నన్ను చూసి అడగనా, వద్దా అన్న మీమాంసలో నిలిచిపోయారు పిన్నిగారు. భార్యాభర్తలు ఇద్దరూ చాలా కలుపుగోలు వ్యక్తులు. కొడుకు ఇక్కడ అపార్ట్‌మెంట్ కొనుక్కొని వాళ్ళను తీసుకొచ్చాడు. కొడుకు, కోడలు ఇద్దరూ ఉద్యోగస్తులే. మొన్నీమధ్యనే కంపెనీ తరుపున ఇద్దరూ కలిసి విదేశాలకు వెళ్ళారు. పెద్దవారని వారికి ఏ ఇబ్బంది రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మా కుటుంబంతో చనువు ఉండటంతో మమ్మల్ని కాస్త కనిపెట్టుకొని ఉండమని పదే పదే చెప్పి, వారికి ఏ అత్యవసరం వస్తుందో అని మాకు కొంత డబ్బు ఇచ్చి వెళ్ళారు. పిన్నిగారేమీ మాట్లాడకపోవడం చూసి నేనే అడిగాను. “ఏమైంది ? బాబాయి గారికి ఏమైనా బాలేదా. రమ్మంటారా ” అని.

అప్పటిదాకా ఎంత ఉగ్గబట్టుకున్నారో చిన్నపిల్లలా ఏడ్చేశారు. నిన్నటినుంచి బాబాయి గారికి జ్వరమట. మేము సాయంత్రం బయటకు వెళ్ళాక హాస్పిటల్ కి వెళ్దామని బయలుదేరి ఆటో ఎక్కితే పాత ఐదువందలనోటు చెల్లదని నానా యాగీ చేశాడట. నిన్న ఉదయం ఇంట్లో ఉన్న వందలన్నీ బిల్లులు కట్టడానికి సరిపోయాయట. ఏ ఒక్కరూ ఐదు వందలు, వేయి తీసుకోలేదట. ఎవరో మహానుభావులు పెద్ద వారిని అలా విసిగిస్తావా అని ఆటోవాడిని కేకలు వేస్తే ఏం అనలేక తీసుకుని వెళ్ళిపోయాడట. హాస్పిటల్ లోకి వెళ్ళి పేషెంటు కార్డు రాయించుకోవడానికి ఆటోవాడి చిల్లర సరిపెట్టారట. డాక్టరుగారు టెస్టులు రాస్తే అక్కడ మళ్లీ ఇదే గొడవ. సరే రేపు మేము మరల వచ్చినప్పుడు మార్చి ఇస్తామని బ్రతిమాలి టెస్టులు చేపించారట. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి, ఇదే రభస జరుగుతుంది, నా దగ్గర ఏవైనా వందలు ఉన్నాయేమో అని వచ్చారట పిన్నిగారు. పాపం ఆవిడను చూస్తే జాలి వేసింది. ఇంట్లో ఉన్న వందలన్నీ గాలించి ఆవిడ చేతిలో పెట్టాను. అటే వెళ్తున్నా కదా అని నాతోపాటే ఆటో ఎక్కించుకొని హాస్పిటల్లో దింపాను.

డాక్టర్ చెకప్ కి కార్డు పెడుతుంటే క్యాష్ కౌంటర్లో గొడవ. ఒకావిడకు సిజేరియన్ అట. మెడిసిన్ తెమ్మని డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాసి పంపితే మందులషాపులో వారు మేము ఈ నోట్లు తీసుకోము.వందలు కానీ రెండు వేలు నోటు గానీ ఇవ్వండని అడ్డంగా వాదిస్తున్నారు. ప్రాణాపాయ సమయంలో కూడా ఈ కండిషన్లేమిటి అని పేషెంటు తరుపు వారు ఆర్గ్యూ చేస్తున్నారు. గొడవకు మిగతావాళ్లు కూడా చేరి మందులషాపు వారిని మేము ఇస్తుంది దొంగనోట్లు కావు కదా ఇన్నాళ్ళూ వాడినవే. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ప్రజలకెలా తెలుస్తుంది. అత్యవసరమైన మీరు కూడా ఇలా పట్టుబడితే ఎలా. మీరు బ్యాంకులో జమచేసుకోవచ్చు కదా. అక్కడకు వీరు వెళ్ళి వచ్చే సమయం లేకనేగా అంతలా అర్దిస్తున్నారని” గట్టిగా వాదించేసరికి యాజమాన్యం మళ్ళీ ఏమి గోల అవుతుందో అని తీసుకోమని స్టాఫ్ కి చెప్పింది. సరే పిన్నిగారూ వాళ్ళని అక్కడ కూర్చోపెట్టి నేను బ్యాంకుకి బయలుదేరాను.

బ్యాంకుకి చేరిన నేను ఆ క్యూ లైను చూసి ఆశ్చర్యపోయాను. సరే అని ఫామ్ తీసుకొని పూర్తిచేసి లైనులో నిలబడిన నేను కౌంటర్ చేరేసరికి రెండు గంటలు పట్టింది. ఈలోపు ఎందరి ఉపన్యాసాలు విన్నానో లెక్క లేదు. ఒకరి ఫోన్ మ్రోగింది. ఫోన్ఎత్తి మాట్లాడుతూంటే అవతలి వారు ఉప్పు రేటు పెరుగుతుంది అట ఒక ఐదు కేజీల ఉప్పు తెమ్మని చెబుతున్నారు. ఆ లైనులో నిలబడి అసలే చిర్రెత్తుకొచ్చిందేమో ఆ కుర్రాడికి సముద్రం ఏమైనా ఎండిపోయిందా ఉప్పు కరువు రావడానికి. ఎక్కడో జరిగే చిన్న విషయాలు కూడా ఇక్కడ పెద్దవి చేసి గోల చేస్తారు అంటూ అరిచాడు.

కౌంటర్లో అందరికీ నాలుగు వేలు తీసుకొని రెండు రెండు వేల నోట్లు చేతిలో పెడుతుంది క్యాషియర్. వారేమో మాకీ నోటుకి చిల్లర ఎవరిస్తారు అని తిట్టుకుంటూ వెళ్తున్నారు. క్యాషియర్ మా మీద ఎగిరితే మేమేం చేయగలం. మా దగ్గరకు వచ్చిన డబ్బు అదే మీ ఇష్టం అని కోప్పడుతోంది. పాపం వాళ్ళు మనుషులే కదా కూర్చున్న చోటినుండి కదలకుండా సాయంత్రం దాకా ఇస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ డబ్బు ఇవ్వలేదని వీరి మీద ఎగరడం అంతా భరిస్తూ సమాధానం చెప్తూనే ఉన్నారు.

చిన్న చితక వ్యాపారులు, ఏ అవసరానికో ఉన్నదానిని అమ్ముకుని వాటికి గవర్నమెంటు విలువ తెలుపైతే ఎంతో కొంత కొనేవారి నిర్భందమో, వీరి అవసరమో దాచిన డబ్బును లైనులో నిలబడి ఎకౌంట్‌ లో వేసుకుంటూ వారి ఏమి జరుగుతుందో రేపు ఎలా సమాధానం చెప్పాలో అని గడగడలాడుతూ మరోప్రక్క బడాబాబులను తిట్టుకుంటూ కదులుతున్నారు.

ఎన్నో దృశ్యాలు చూస్తుంటే కాలక్షేపం సరిపోయింది. రెండు గంటలు పట్టింది నాటైం వచ్చేసరికి. కౌంటర్ చేరగానే క్యాషియర్ ఎమౌంట్ ఎంత అని అడిగి పాన్ కార్డ్ నంబరు రాయమంది. ఎప్పుడూ ఆ అవసరం రాకపోవడంతో అ నంబరు తేలేదు. శ్రీవారికి కాల్ చేసి ఆ కాలమ్ పూర్తి చేసాను. ఎందుకండీ అంటే ఆవిడ సమాధానం ఇవి టాక్స్ లెక్కలోకి వస్తాయో లేదో అని తెలియాలి అని. నిన్న డ్రా చేసారని చెప్పగానే అది మావారికి నాకు జాయింట్ ఎకౌంట్‌ కావడంతో నిన్నటి ట్రాన్సాక్షన్ చూసుకుని నిన్నటి రిసీట్ జాగ్రత్త చేసుకోమని ఓ సలహా ఇచ్చి డబ్బు జమ చేసుకొని పంపింది.

ఆ గందరగోళం నుండి ఇంటికి చేరేటప్పటికి సాయంత్రం అయిపోయింది. ఒక్కరోజులో ఒక్క నిర్ణయంతో ఒక్కసారిగా మన బ్రతుకుల్లో ఎంత మార్పు వస్తుందో ఒక్కసారిగా పరిచయమయింది ఈ ఒకటో తారీఖుతో. జరగబోయే మార్పు ఏమిటో, దేశం అవినీతి రహితంగా ఎలా మారగలదో తెలియని ఒక మధ్య తరగతి సాధారణ గృహిణిగా ఈ మార్పు ఎవరిని ఉద్దరించబోతోందో తెలియని అయోమయంలో క్రొత్త మార్పుని ఆకళింపు చేసుకుంటూ రేపటికి జరగబోయే మార్పులను ఊహించుకుంటూ మరో పీడకల రాకూడదనుకుంటూ నిద్రకుపక్రమించాను.


Sarala Uppaluri

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.