అంతరాత్మ

0
424

మహా మూర్ఖురాలివే నీవు
మనసన్నదే లేదనుకుంటా నీలో
పుట్టినప్పటినుండీ చూస్తున్నా
ఎక్కడైనా కాస్త లొంగుతావని!

ఎందుకో అందరికీ నువ్వంటే అంతటి ఆపేక్ష
ఒక్కరినైనా కలకాలం తోడుగా నిలుపుకున్నావా? లేదే
పసితనమంతా మోసిన ఆప్తులున్నారు,
ఙ్ఞాపకాలలో ఇప్పటికీ నిన్ను మోస్తున్నారు,
కనీసం ఓమారు తలుచుకుంటావా
కనిపించినపుడు ఆత్మీయంగా ఓ చిరునవ్వు విసరడం తప్ప!
దానికే ఉబ్బితబ్బిబ్బవుతారదేమిటో నాకర్ధం కాదు!

బాల్యమిత్రులంటే కడదాకా తీయని బంధాలే కదూ!
ఉన్న ఒకరిద్దరినైనా విడిచాక మరలిచూసావా!
ఉహూ! మరెందుకో వారికి నిన్ను చూడగానే
కళ్ళు మతాబులవుతాయి ఙ్ఞాపకాలకాంతులు జిమ్ముతూ..
ఆ చెలిమి తాలూకు పరిమళమింకా చెదిరిపోలేదేమో!
ఆ రోజే దూరమైనంత దగ్గరగా మసలుతారు!

పెళ్ళంటూ మరో గడపలో దింపేసి కళ్ళొత్తుకున్న ఇంటికేం తెలుసు
నువ్వెంత కఠినాత్మురాలివో.
కన్నవారున్నారని, తిరిగి చూడాలని మనసు లాగినా దాని నోరు నొక్కేసి నవ్వుతూ తిరిగేస్తావు!
పాపం వారికేం తెలుసు నీ మనసో ఙ్ఞాపకాలనిధని
పోగేయడమే తప్ప తిరిగి పంచదని!
ఇంతా చేసినా ఇప్పటికీ నా బిడ్డనే అపోహెలా మిగిలిందో
బదులిచ్చిన క్షణమైనా నేనున్నాననే భరోసా చేరవేస్తావే, ఏం మాయవే నీవు.!

పరిసరాలు క్రొత్తవైనా పరిచయమవుతావుగా ఓ చిరునవ్వులా
మభ్యపెడతావుగా అన్నిటా నీవేనన్నట్లుగా.!

ఎన్నిసార్లు ఓడిందో కష్టం నీపై యుద్ధం ప్రకటించి
కన్నీటి వరదలొచ్చిన ప్రతిసారీ
ప్రవాహంలో కొట్టుకుపోక గడ్డిపోచలా నిలబడతావేం.!

నిస్తేజమవుతుందా గుండె నిబ్బరమని,
కుదేలవుతుందా ఆత్మాభిమానమని ఎన్నిసార్లు కలగన్నానో..
దూరమైందనే అనుకున్నా నీ చిరునవ్వు, నిరాశే ఎదురైంది నాకు.
కడగండ్ల ఆటుపోట్లెన్ని తాకినా
సడలని ఆత్మస్థైర్యపు తీరమే నీవు కదూ!

నిలిచిపోయావుగా శిఖరమై అందరి మదిలో
ఎన్నటికీ మరవలేని ఙ్ఞాపకానివై..
ఆజన్మాంతం నీ ఓటమికై ఎదురుచూసా..
నీ మైత్రికై చేయి చాపితే
నాకూ మరువలేని నేస్తానివయ్యేదానివేమో!

అదేముందిలే గిల్లికజ్జాలతో యుద్ధాలెన్నున్నా
ఏనాడూ వీడని నేస్తాన్నేగా నేను!
నిన్ను నిన్నుగా చదివిన నీ ప్రాణాన్నే కదూ!
కదిలే గూడులో జీవమనే పిట్ట ఉన్నంతవరకూ
ఆత్మని వీడని అంతరాత్మనే నేను!


Sarala Uppaluri

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.