ఆమె కథ (పార్ట్ 9)

0
427
 కమాల్ నుండి విడాకులు తీసుకోమని స్నేహితులు,బంధువులు,కుటుంబ సభ్యులు ఎంత ఒత్తిడికి గురి చేసినా,మీనా ససేమిరా ఒప్పుకోలేదు.తండ్రికి ఇష్టం లేదని తెలిసినప్పటికీ,బాంబే టాకీస్ లో జరుగుతున్న కమాల్ దర్శకత్వంలో ప్రారంభమైన షూటింగ్ లో పాల్గొని,తండ్రి ఆగ్రహానికి గురై,పుట్టింటినుండి వెళ్ళగొట్టబడింది.గత్యంతరం లేక ,విలపిస్తూ మెట్టినింటి గడప తొక్కింది.
ఆ సమయంలో స్టూడియోలో ఉన్న కమాల్ మీనా రాక తెలిసి ,ఆనందంగా ఇంటికి వచ్చాడు.కొత్త పెళ్ళికూతురికి ఆర్భాటంగా స్వాగతం పలకలేక పోయినందుకు నొచ్చుకున్నాడు.కుటుంబ పోషణకు తగినంత డబ్బు సంపాదించి ఇస్తానని చెప్పినా,తండ్రి అంగీకరించక వెళ్ళగొట్టడం ఆమెకు బాధ కలిగించింది.కనీసం తన బట్టలు,పుస్తకాలన్నా పంపించమని,కమాల్ ను అల్లునిగా అంగీకరించమని అభ్యర్ధిస్తూ తండ్రికి ఉత్తరం వ్రాసింది.వీరి వివాహ విషయం దావానలంలాగా దేశమంతా వ్యాపించింది.
కమాల్ మొదటి భార్య తన ముగ్గురు పిల్లలకు మీనాకుమారిని పిన్నిగా పరిచయం చేసింది.మన కుటుంబాలలో ఇది సాధారణ విషయమని,నాన్నగారు తీసే సినిమాలలో ఆమె పని చేస్తున్నదని,ఆయన అందం,మంచితనమున్న ఆమెను ఇష్టపడ్డారని ,మీరు కూడా ఆమెకు తల్లికిచ్చే గౌరవం ఇవ్వాలని పిల్లలకు నచ్చ చెప్పింది.
మీనా నటించిన  సినిమాలు ఒకదాని వెనుక మరొకటిగా విజయం పొంద సాగాయి.పరిణిత,నౌలఖాహార్,ఫుట్పాత్,దో భీగాజమీన్,దానా పానీ,దాయరా వంటి సినిమాలు ఆమెకు కీర్తినే కాకుండా డబ్బుల వర్షాన్ని కురిపించాయి.రాత్రనక పగలనక షూటింగ్ లు చేస్తూ  విపరీతంగా కష్టపడసాగింది.దూరమైన తండ్రి ఎప్పటిలాగే మళ్ళీ చేరువై ,కమాల్ తో కలసి డబ్బు వ్యవహారాలు చూడసాగాడు.
కమాల్ 1953 లో మీనా హీరోయిన్ గా తమ ప్రేమ కథను దాయిరా పేరుతో సినిమాగా నిర్మించాడు.అది విజయం సాధించింది.Foot path ఆమె కెరీర్ లో మంచి సినిమాగా నిలిచింది.బిమల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన పరిణిత ఆమెకు రెండవ సారి Film fare అవార్డ్ తెచ్చిపెట్టింది.తన భర్త మొదటి భార్యకు పుట్టిన పిల్లలను తన స్వంత బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తూ,ఇల్లాలిగా ఇంటిల్లిపాదికి సంతోషాన్ని పంచుతూ,నటిగా దినదినాభివృద్ధి చెందుతున్న మీనా పైన ఏ దైవానికి ఆగ్రహం కలిగిందో ,ఆమె జీవితం చిన్నాభిన్నం అయింది.ఆ కన్నీటి గాధను త్వరలో తెలుసుకుందాం.

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.