ఆదర్శయువకుడు

1
636

ప్రత్యేకబహుమతి  – వయస్సు 25 లోపు


ఆదర్శయువకుడు 


అది స్వర్ణాపురం మండలంలోని ఓ మారుమూల గ్రామం. పేరు చక్రాయపాలెం. మండల కేంద్రానికి ఓ 12 కి.మీ.ల దూరంలో ఉంటుంది. మారుమూల గ్రామమైనా అక్కడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలతో పాటు, ఉన్నత పాఠశాల కూడా ఉంది. బడియీడు పిల్లలంతా బడిలోనే. ‘పెద్దలు పనికి-పిల్లలు బడికి’ అక్కడి గ్రామస్తుల నినాదం.
ఆ ఉన్నత పాఠశాలకు హెడ్‌మాస్టర్‌ కొండలరావు గారు బదిలీపై వచ్చారు. వృత్తికి అంకితమై పని చేసే మనస్తత్వమున్నవాడు. అనుభవజ్ఞుడు. అధికారులలో మంచి పేరున్న వాడూనూ. ఆయన ఆ రోజు విధులలో చేరారు. ఉపాధ్యాయులందరినీ పరిచయం చేసుకున్నారు.

***

ఓ వారం రోజుల తర్వాత, ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు . వారినుద్దేశించి మాట్లాడుతూ,”మిత్రులందరికీ నమస్కారం. వారం రోజుల నుండి పాఠశాల పరిస్థితులను గమనించాను.ఈ పాఠశాల పరిసరాలన్నీ చూడముచ్చటగా ఉన్నాయి. మొక్కలు, చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు, మంచి బోధన అందిస్తున్నారు. మీ కృషి అభినందనీయం.మంచి అభివృద్ధి సాధిస్తున్నారు.” అనగానే,
ఇన్‌ఛార్జి హెడ్‌మాస్టర్‌ రమేష్‌ మాష్టారు,” థ్యాంక్యూ సార్‌. అంతేకాదు. గ్రామంలోని ‘సుబ్బారావు యూత్‌’ సహకారం కూడా అభివృద్ధిలో ఒక భాగం సార్‌” అన్నారు.
” సుబ్బారావు యూతా?”, అర్థంకాక అడిగారు హెడ్‌ మాస్టర్‌.
” అవున్‌ సార్‌. ఈ గ్రామంలోని కొందరు కుర్రోళ్ళు కలిసి ఏర్పాటు ఒక గ్రూపు చేశారట. అప్పుడప్పుడూ వస్తుంటారు. ఏదన్నా సమస్య ఉంటే, వెంటనే తీర్చేస్తుంటారు”
” ఓ.. చాలా గ్రేట్‌. ఒకసారి వాళ్ళని కలుసుకోవాలే. ఇంతకూ వాళ్ళకు ఇవన్నీ చేయడానికి ఆర్థిక సహకారం ఎక్కడిదట?” అడిగారు కొండలరావు గారు.
” తెలియదు సార్‌”.. రమేష్‌ గారి సమాధానం.
”విద్యాకమిటీ ఛైర్మన్‌ గారు వస్తుంటారా!?” హెచ్‌.ఎం. మళ్ళీ అడిగారు.
” అప్పుడప్పుడూ వస్తార్‌ సార్‌. ఏదైనా అవసరం వస్తే పిలిపించండని చెప్పి వెళుతుంటారు”
” ఓకే..ఓకే.. ఎనీ హౌ. ఇంత మంచి పాఠశాలకు రావడం, ఇంత చక్కటి సేవలను అందిస్తున్న మీతో పనిచేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్‌. కీపిటప్‌.” అంటూ సమావేశం ముగించారు.

***

మరో రోజు పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు.
వారిని ఉద్దేశించి,” సమావేశానికి హాజరైన విద్యాకమిటీ ఛైర్మన్‌ గారికి, సభ్యులకు నమస్కారం. నా పేరు కొండలరావు. బదిలీపై కొత్తగా వచ్చాను. ఈ పాఠశాల గురించి మా ఉపాధ్యాయులు కొన్ని విషయాలు చెప్పారు. మీరంతా చక్కని సహకారం అందిస్తున్నారని కూడా చెప్పారు. చాలా సంతోషం. మీరంతా చాలా గ్రేట్‌ .” అన్నాడు.
” ఆ…గేటేముందిలెండి. అంతా ఆ సుబ్బిగాడి పుణ్యమే!”, పుల్లయ్య అన్నాడు.
‘గేటేముందిలెండి’అని వినగానే,మొదట అర్థంకాలేదు హెడ్‌మాస్టర్‌ గారికి. అర్థమయ్యాక, వారి మాటలు కాస్త తమాషాగా అనిపించాయి. ‘ఓహో…గ్రేటుకు వచ్చిన తిప్పలా’,అనుకుని వెంటనే, ”సుబ్బిగాడి పుణ్యమా?! అంటే” అని ముఖంలో ప్రశ్న గుర్తు పెట్టాడు.
ఇంతలో మరో పెద్దాయన సుబ్బయ్య ,” అవును సారూ…మా ఊళ్ళో సుబ్బారావు అని ఒకడుండేవాడు. ఇదంతా వాడి సలవేలెండి….” అన్నాడు.
” ఆ… సుబ్బారావంటే గుర్తుకొచ్చింది. మా ఉపాధ్యాయులు ‘ సుబ్బారావు యూత్‌’ అన్నారు. ఇంతకీ ఈ యూత్‌ ఎలా ఏర్పడింది?ఆ సుబ్బారావు గురించేనా? మీరు చెప్పేది?” సందేహం వెలిబుచ్చారు.
అవునండీ, ఆ సుబ్బారావే. కానీ, యివరాలన్నీ సెప్పాలంటే, మా సుందయ్యన్నే సెప్పాల.” పుల్లయ్య సమాధానం.
”ఏమండీ. సుందయ్య గారూ…ఆ వివరాలు చెప్తారా?!” ఆతృతగా అడిగారు కొండలరావు.
” అబ్బో .. అది శానా పేద్ద కథేలెండి.. సెప్పాలంటే శాన్సేపు బడ్తది” అన్నాడు సుందయ్య.
” ఎంతసేపయినా ఫరవా లేదు చెప్పండి. ఇంతగా సహకారం అందిస్తున్న వారి గురించి తెలుసుకోవాలి గదా!” అన్నారు.
” కరెట్టే మరి., ఇదిగో సుందన్నా, సారుకు ఆ యివరాలు సెప్పు” అన్నాడు సుబ్బయ్య.
” ఇయన్నీ చెప్పడం ఆడికిట్టంలేదు గదా?” సుందయ్య సందేహం?
”హెడ్‌మాస్టర్‌ గారేగా! సెప్పొచ్చులే.” సుబ్బయ్య భరోసా ఇచ్చాడు.
” అంతేనంటావా?…. సరే అయితే… ” అంటూ సెప్పడం మొదలు పెట్టాడు సుందయ్య.

***

ఒకప్పుడు ఈ ఊర్లో శంకరయ్య అని ఉండేవోడు.ఆ…శంకరయ్య కున్న ఒక్కగానొక్క కొడుకే మా సుబ్బిగాడు,పేరు సుబ్బారావైతే, మేమంతా ‘సుబ్బిగాడంటుంటాం లెండి’ ఎంతైనా కావాల్సినోల్లం గదా!
కొడుకుని శానా బాగా సూసుకునేవోళ్లు. వోడికి గూత తల్లి, తండ్రి అంటే ఎంత గౌరవమో?! సదువంటే కూడా అం…..తిట్టం. భలే చదివేటోడు. ఊళ్ళో ఉన్న ఐత్తరగతులూ పూర్తి సదినాక బడి మానేసిండు.
” అదేంటి?” కొండలరావు ప్రశ్న.
” ఏంతంటే ఆళ్లయ్యకి ఇట్టం లేదు.”
” ఎందుకని?”
” ఎందుకంటే, సదుకుంటే ఏమొత్తాదని తనతోపాటు, కూలి పనులకు తీసుకెళ్లేవోడు.”
” మరి ఇష్టం లేకుంటే ఐదు వరకు ఎలా చదివించారూ?” నవ్వుతూ అన్నారు. ”ఊళ్ళో బడిగాబట్టీ…. పైగా సంటి పిల్లోడు గదా! పనులేం జేయలేడు. అందుకే, ఆ అయిద్దాకైనా పంపిండు.”
” ఆహా…అలాగా… ఆ తర్వాత..”
” తర్వాతేముంది. నాలుగైదేల్లు కూలి పనులకు అలవాటు చేశాక, పట్నంలో పనులున్నా, ఆడొక్కడే ఎల్లి సేసుకునేట్టు నేర్పిచ్చిండు. ఇంగప్పట్నుండి వోడు ఆల్లయ్యను పనులకు వొద్దన్నడు. ఇంగన్నీ ఆడే జూసుకోబట్టిండు. బో ఉసారున్న మనిసిలెండి”
ఈడికి సదువంటే బాగిట్టమని సెప్పాగా! ఎంతిట్టమంటే, పనిమీంద సన్నాపురం ఎల్లినప్పుడల్లా, గంథాలంలో బొక్కులు జదివి వత్తడంట.
” గంథాలమా?..ఓహో.. గ్రంథాలయమా…” వెంటనే అర్థమయ్యి,” ఆ..ఆ..” అన్నాడు.
” ఆ…ఇంగో యిసయమేందంటే, ఆడు సదివింది ఐత్తరగతైనా బెమ్మాండంగా సదివేవోడండీ బాబూ… ఆడు ఏదన్నా సదితే, పెద్ద పెద్ద సదువులు సదినోళ్ళు కూడా నోరెళ్లబెట్టాల్సిందే..ఆ!
” ఆహా…” అంటూ ఊ…కొట్టాడు హెచ్‌.ఎం.
” ఓ మూడేల్లలోనే ఎకరా పొలం గొన్నడు. ఇంగప్పుటాలమించి కూలి కెల్లడం మాని, సొంతంగా పొలమేశాడు. అదేంటోనండీ, వాడు ఏ పంటేసినా బో కాపొచ్చేదండీ… మేము ఆచ్చరపోయేటోల్లం. మల్లా ఏ పంటేసినా మందులు గూడా ఏసేటోడు గాదు. అయేందో రైతుల బొక్కులుంటయంటగా.. వాటిని జదివి, దాని పెకారం పంటలేత్తానని జెప్తుండేవోడు. ”
అది దెల్సి, ఊల్లోల్లంతా గూడా ఓన్నే సలహా అడిగి పంటలేయడం మొదలుబెట్టిండ్రు. మంచి లాబాలు గూడా దెచ్చుకున్నరు. దాంతో సుబ్బడికి ఊల్లో మంచి పేరొచ్చింది.
మేమంతా సాయంతరం ఎప్పుడన్న, రచ్చబండ దగ్గర కూకుంటుంటంలేండి. ఒకసారి ఏమయ్యిందంటే., సుబ్బిగాడు ఏదో సిల్మా జూసొచ్చిండంట. దాంటో ఈరో, వోల్లూరికి కట్టాలొత్తయంట! అప్పుడు ఊరోల్లంత గల్సి తలా ఇంత డబ్బులేస్కొని, ఊరిని బాగు జేసుకున్నరంట. అజ్జూసి, మనం గూడా తలా ఇంత డబ్బులేసుకుని అట్టా మనూరు బాగుజేసుకుందాం అంటడే.
మా పెసిడెంటు మామేమో, ”ఒరే సుబ్బిగా! మింగ మెతుకు లేదు గానీ, మీసాలకు సంపెంగనూనె గావాలన్నడంట, ఎనకటికి నీలాంటోడొకడు. అట్టాగుంది నూసెప్పేది. అది సిల్మారా! మంది జీయితం. అయన్నీ సూట్టానికే గాని, సెయ్యటానికి గుదిరేయి గాదు.” అన్నడు. ఇంగ ఆడేం మాట్టాల్లా.
హెడ్‌మాష్టర్‌కు వారి యాస బాగా సరదాగా అనిపిస్తున్నది. అందుకే శ్రద్ధగా వింటున్నారు.
ఇట్టా అప్పుడప్పుడూ ఊరి బాగ్గురించి శానా జెప్పెటోడు. కానీ, మేం బట్టించుకోలే. ఇంగప్పటి సంది మేం కలుసుకున్నా మాట్టాడకుండా ఇంటూ కూసుండేటోడు. కానీ, ఏదో ఆలోచిత్తా ఉంటాడు. ఏమాలోచిత్తన్నావురా? అంటే, ఏం సెప్పేవోడు గాదు.”ఏంలేదులే” అంటాడు.
వోడికి ఇరవై యేల్లోచ్చినంక పెలై ్లంది. అప్పుడొక పారి రచ్చబండ కాడ గూకున్నపుడు ” ఏరా! కొత్త పెల్లికొడకా! ఓ ముగ్గురు, నలుగురినన్నా కంటావా?” అని తమాషాకడిగినం.
” ఎందుకూ? ఇద్దరు ముగ్గురు. అగసాట్లు బడ్డానికా? పిల్లయినా, పిల్లోడయినా ఒక్కరు సాలు. గవరమెంటోల్లు జెప్పేది ఇండంలా.” అన్నడు.
మేమంతా నవ్వుకుని ”మాటలు అందరు జెప్తరులేరా… సేతలకాడికొత్తే తెలుచ్చది ” అన్నాం.
కానీ, వోడు మాత్తరం అన్నట్టే, ఒక పిల్ల బుట్టగానే ఇంటోగూడా దెలియకుండా, సన్నాపురమెల్లి, పిల్లలు బుట్టకుండా ఆపిరేషన్‌ జేయించుకొచ్చిండు! మేమంత బిత్తరపోయినం!!
” అరె.,అవునా! వాళ్లమ్మ, అయ్య ఏమనలేదా?” హెడ్‌మాస్టర్‌ ప్రశ్న.
” ఎందుకన్లా! అసలు బుద్ధి, గ్యానం ఉందట్రా నీకు. ఒక్క పిల్లకు ఆపిరేసినేందిరా? అదీ మగ బిడ్డ కూడా కాదు. ఛీ..ఛీ..నా కడుపున సెడబుట్నవు కదరా! వంశం లేకుండా జేసి” అంటూ తిట్టిన దిట్టు దిట్టకుండా దిట్టిండు… సిన్నంగ గూడ దిట్లా.
ఆల్లమ్మనేమో ” ఒరే! సుబ్బడూ, మీ అయ్యతో ఒక్క ముక్కన్నా జెప్పకుండా అట్టా ఎందుకు జేసినావుర?” అని ఆ ఒక్క మాటంది.అంతే. ఈడేం మాట్టాల్లా. ఓడి భార్య అసలేమండ్లా.
ఆడెప్పుడూ ఎవరినీ ఏమీ అనేవోడు గాదు. అయినా, ఈ యిసయం దెల్సినాక, ఊల్లోలందరికీ గూడా ఆచ్చరమేసింది. ‘ వామ్మో! మన సుబ్బిగాడు.. మామూలోడు గాదురోయ్‌! అన్న మాట పెకారం, ఒక్క పిల్లకే ఆప్పిరిసను సేయించుకుని వచ్చిండంటా..” అనీ,
” ఇంత తెలివి తక్కోడిని ఎక్కడా జూల్లేదమ్మా,” అనీ,
”ఈడికేం పోయేకాలంమొచ్చిందమ్మా. ఇట్టా జేసిండనీ,
”ఎక్కడన్నా ఉందా యీ యిడ్డూరం?” అని, రకరకాలుగా సెవులు గొరుక్కున్నోల్లే.
ఎవురేమన్నా ఆడు మాత్తరం ఇవేమీ పట్టించుకోలా.

***

కాలం గడిచింది. ఆపిల్ల , అదే మా సుబ్బిగాడి కూతురండీ,… పేరూ.. రాధలే. ఐదేండ్లు నిండినయనీ బల్లో ఏసిండు. ఏసిన కాన్నుండీ పిల్ల బో ఉసారుగా ఉండుద్దనీ, బాగా సదిద్దనీ సారోల్లంతా మెచ్చుకునేవోల్లు. అందుకే సుబ్బిగాడు ఆ పిల్లను ఐదై పోగానే పట్నంలో జేరుత్తనన్నడంట. అపుడు ఆళ్ళయ్యకు కోపమొచ్చి, ఆడపిల్లకు పెద్ద సదులేందిరా!? ఊల్లో సదేదే ఎక్కువా! అని అర్సిండంట.
యిసిత్రమేందంటే, ఎప్పుడూ ఆల్లయ్య దగ్గిర ఏమీ మాట్టాడనోడు, ఆరోజు ఆల్లయ్య ఆ మాటనగానే, ” సూడయ్యా! నాకెట్టాగూ సదువు లేకుండా జేసినవు. సిన్నప్పుడు నేను బాగా సదుతున్నా బడి మాన్పిచ్చినవ్‌. నీప్పుడు సదిలువ దెలీదాయె. నేనా సిన్నోన్ని. నాకేం దెలీకపాయె! ఇప్పుడట్టాగాదు. నాకు సదు యిలువ దెల్సింది. ఎంత కర్సయినా నా బిడ్డని సదియ్యాల్సిందే! పెద్ద ఉజ్జోగం జెయ్యించాల్సిందే! అని గట్టిగా మాట్టాడిండంట. శంకరయ్య ఇంగేం మాట్టాల్లేక పోయిండు.
ఇంగేంది? ఐదయ్యాక వోడనుకున్నట్టే, ‘రాద’ను సన్నాపురం ఐస్కూల్లో ఆరో క్లాసుకు జేర్పిచ్చిండు. రోజూ ఆటోకు బంపబట్టిండు. ఆరోజుటి సంది…ఇంగెవురూ గూడా సుబ్బిగాడి మాటకు ఇంటో ఎదురు జెప్పింది లేదు. మా రాద ఆ బల్లో గూడా మంచి పేరు దెచ్చుకునేది.

***

 ఇట్టాగుంటే, ఓసారి ఎండాకాలమప్పుడు, ఊల్లో సెరువు, రెండు బాయిలూ, ఎండిపోయినయ్‌. కరువొచ్చే పరిచ్చితొచ్చింది. ఏంజేయాల్నో ఎవురికీ అంతుజిక్కల. గవర్మెంటు ఆపీసుల చుట్టూ దిరిగినం. ఊహు. లాబం లేక, ఇంగందరం రచ్చబండ దగ్గర మీటింగెట్టుకున్నం. చర్చిత్తన్నం. ఈ సుబ్బడేమో అన్నీ యింటన్నడు గానీ, ఏం మాట్టాడ్తలేడు. ఇంగప్పుడు మా పెసిడెంటు,” ఏందిరా సుబ్బిగా. అలిగినవా? మాట్టాడవేంది?” అనడిగిండు.
” అలిగేదేముంది. నేనేం జెప్పినా మీకు నచ్చదుగా!” ఎట్టకేలకి నోరు దెర్సిండండీ.
” అట్టాగంటెట్టరా. ఇది ఊరి సమస్య. నల్గురు మాట్టాడ్తె గదా!సమస్సె తేలేది. నువు బాగా ఆలోసిత్తవూ, కరెష్టుగా మాట్టాడ్తవని గదా! అడిగేది.ఏంజేద్దమంటవ్‌? సెప్పరా!” అనగానే;
”నేం జెప్పేదొకటే, మనమే ఇంటికింతని ఏసుకుని ఊరు మద్దెలో రాములోరి గుడికాడ, ఒక బోరు ఏయించినమనుకో. సమస్సె బాయె. ఇంగంతకంటె మాగ్గం లేదు.” అన్నడు.
” ఆ యిసయం మాకు దెల్సు. కాని,బోరెయ్యాలంటే సామాన్నెమా?ఏల రూపాయల గావాలె” అన్నడు పెసిడెంటే.
” నీల్లు దిక్కులేక రేపు మడిసికైనా, గొడ్డుకైన పానాల మీదకొత్తే యేలు బోవా? అదేందో, పానాల మీదికి రాకముందే చేత్తె పోలా! మీరు ఊ…అంటే, నేను రెండేలిత్తా ” అని, బో తెంపుగన్నడు.
” ఆడు రెండేలనేసరికి మేమంతా నోరెల్లబెట్టినం. మా పెసిడెంటు గూడ ఇంగేమాట్టాల్లె. ఎంటనే, నాది ఐదేలు అన్నడు. ఇంగట్టా ఆడున్నోల్లంత, తలాయింత పోటీమీంద డబ్బులేసినం . బోరేయుచ్చుకున్నం. కరువు దీరింది. ఊరంతా సుబ్బిగాన్ని తెగ మెచ్చుకున్నరు. అదీ మా సుబ్బిగాడంటే..” ఠపీమని రెండు చేతుల్తో చప్పట్లు కొట్టాడు సుందయ్య.
” ఇంతకీ నేనడిగిన యూత్‌ గురించి చెప్పనే లేదు.” గుర్తు చేశాడు హెడ్‌మాస్టర్‌.
”సెప్తా.. సారు. నేనేదైనా మద్దెలో సెప్పలేను” అన్నడు సుందయ్య.
” సరే సరే, చెప్పండి,చెప్పండి” అన్నాడు కొండలరావు గారు. సుందయ్య కొనసాగించాడు.
” ఇంగోసారేమో, వర్సాకాలం. పెద్ద గాలివానొచ్చి ఊల్లో శానామందికి గుడిసెలన్ని పాడైపోయినయి. అప్పుడు గూడ యింతే. తలా ఇంతేసుకుని సాయం జేద్దామన్నడు. యీసారి ఎంగెవురూ , ఏం మాట్టాడకుండానే శానామంది డబ్బులిచ్చిండ్రు. ఆటితో నట్టపోయిన పేదోల్లకి సాయం జేసినం. ఎప్పుడైనా కట్టాల్లో ఉన్నపుడు ఒకల్లకొకల్లం జూసుకోకుంటే, మనం మడుసులమైతమా? ఇది ఊరవుద్దా? అనేవోడు. అట్టుంటయండీ వోడి మాటలు, సేతలు.
మంచి పనంటే సాలు ముందుంటడు. అందరూ బాగుండాలనుకుంటడు. ఏదైనా కరెస్టుగా మాట్టాడ్తాడు. కట్టాల్లో ఉంటే ఆడికీలయినంత సాయం జేత్తడు.

***

ఊరి సంగతి యిట్టాగుంటే, మా రాదమ్మ మాత్తరం పదిలో పట్టొచ్చింది. ఇంజీరు సీటు గొట్టింది. అదీ గవరమెంటు సీటు. సీటైతే ప్రీగొచ్చింది గాని, కర్సులుండ్లా. అందుకోసం, వోడు తన పొలం పనులతో పాటు, కరువు పనులు, మిద్దెపనులగ్గూడా పోబట్టిండు.
మల్లోసారి, రచ్చబండ దగ్గర మాటల్లో రాద సదు గురించి, బడి గురించి మాటలొచ్చినయ్‌. వోడేమో, ”పిల్లోల్లను అందరూ సదియ్యండి. రేప్పొద్దున ఆల్ల బతుకులు బాగుండాలంటే సదువొకటే మార్గం,” అన్నడు.
” నీకంటే ఒక్క పిల్లరా! ఊల్లో శానామంది ఇద్దరు ముగ్గురు పిల్లలు గలోల్లు. ఆల్లందరికీ ఏడగుదురిద్ది సదియ్యడానకి. అయినా సదుకోని ఏంజేత్తర్రా? ఎంత జదుకున్నా మొగోడికి కూలి దప్పదు. ఆడపిల్లకి పెల్లి దప్పదాయె!” అన్నాం.
ఎంటనే,” మీరింగ మార్రా. ఇన్నాల్లూ అట్టనుకోబట్టే, ఊల్లో ఒక్కడూ పెద్ద సదువు సదుకున్నోడు లేకుండా బోయిండు.మా రాదను జూడుండ్రి. ఇంజనీరు సదిత్తన్నా. రేపుజ్జోగమొచ్చది. సుకపడుద్ది. మన పిల్లల బవిసెత్తు గురించి మనకే ఆలోసెన లేకుంటెట్టా? మనం మడుసులం గాదా?” అన్నడు.
” మనకేడియిరా ఉజ్జోగాలూ, సజ్జోగాలూ..నీ బెమ గాపోతే” అనంటే,
”మీరు గూడ మా అయ్యలాగే ఆలోసిత్తన్నరు. సదుయిలువ మీకు దెలియట్లా. మనూల్లో గవరమెంటు ఐస్కూలొత్తే, మన పిల్లోలంతా ప్రీగా సదుకోవచ్చు. అప్పుడు కట్టమేముంది? ఆల్లకు మేలు జరుగుద్ది” అన్నడు.
”సరెరా. నువుసెప్పింది కరెస్టే. కూలీనాలీ జేసుకునేవోల్లం. ఇంతింత పెద్ద పెద్ద పనులు మంతో ఎట్టయితయ్‌ జెప్పు. ఇయన్నీ గవర్‌మెంటోల్లు జెయ్యాల్సినయ్‌” పెసిడెంటన్నడు.
” పెతిదానికి గవరమెంటోల్లు జేత్తర్‌లెమ్మని గూకోగూడ్దు. మనం జేయాల్సినయ్‌ జేత్తుండాలె. ఎట్టాటి పెద్ద పనులైనా తలోక సెయ్యేత్తే కాని పనులు ఏమున్నయ్‌? . అట్టాగని అన్నీ ఒకేసారి జరగవ్‌. ఒక్కోటి నిదానంగా అయితయ్‌” అన్నడు.
” అయితిప్పుడు ఏం జేద్దమంటవ్‌రా ?” మా ఈరి మామడిగిండు.
” ముందు మనూరి బల్లోకెల్లి సారోల్లను గలుద్దం. పిల్లోల్లతో, పోగ్రాము పంచను పెట్టియ్యమందం. కర్సు మనమే తలా ఇంత ఏసుకుంటమని సెప్దం.” అన్నడు.
” నీకేమన్నా ఎర్రారా? ఆడ పంచనుకు కర్సు పెడితే ఐస్కూలు ఎట్టొచ్చుద్దీ?” గట్టిగడిగినం.
” ముందు జెప్పేదినండి. ఆ పోగ్రాంబెట్టి ఎమ్మేలేను పిల్సినమనుకో. ఒత్తరు. అప్పుడడుగుదం.”
”సరెరా. నువు సెప్పినట్టే ఎమ్మెలే వత్తడనుకుందం. వత్తేగాంగ, ఆల్లెందుకు బలుకుతర్రా?”
” సూద్దం..ఒకపాలి..” అన్నడు. సర్లెమ్మని ఆడి మాటపెకారమే బల్లో సారోల్లతో మాట్టాడి పంచను జేసినం.ఎమ్మేలే వచ్చిండు. సిన్న బడైనా పంచను బాగా చేసిండ్రన్నడు. మీరు గోరినట్టే ఐస్కూలు దెప్పిత్తనన్నడు. కానీ, పంచను జరిగి ఆర్నెల్లయినా, ఆయన గాలే లేదు.
అప్పుడు కొందరన్నరూ….” మేం జెప్తే యిన్నవారా?… పెద్దోల్లు ఎందుకు పలుకుతర్రా?…అని. ఇప్పుడు జూడు. పాతికేలు పైనే బోయినయ్‌. కానీ, ఏంలాబం?” అని.
” అట్టా… నిరుచ్చామెందుకు? జీవితమంటే కట్టనట్టాలు రెండూ ఉంటయ్‌. బరించాల. కట్టాల్లేకుండనే జీయితముంటదా?” అన్నడు. మేమూ ఇంగేం మాట్టాల్ల. ఇల్లకు బోయినం.

***

ఆర్నెల్లు తరువోత ఎలచ్చన్లొచ్చినయ్‌. ఓటేయడం గురించి మీటింగెట్టుకున్నం. మా ఓట్లు ఎవురికెయ్యాలా? మేమందరం ఓటుకు ఎంత అడగాలనేది మాట్టాడుకుంటన్నం. అప్పుడు గూడా ఆడేం మాట్టాడట్లా. ఆడెప్పుడంతే., మేమేదన్నా అడిగితే దప్ప వోడి ఆలోసెన చెప్పడు. ఏందిరా మాట్టాడవ్‌? అనంటే,
” ఏంది మాట్టాడేది? డబ్బులు దీస్కొని ఓటు ఏసేదేంది? అదెంత తప్పో మీకు దెల్సా.?అని, మొకం సిరాగ్గా పెట్టి, వోడామాట అన్నడో లేదో, ఓటుకు డబ్బులు అడగొద్దనే సరికి,
” ఏందిరా నువు మాట్టాడేది? లేకపోతే ఊరికెనే ఓటేత్తరా ఏంది? ఎలచ్చన్లయితే ఆల్లేమన్నా బలుకుతండరా?ఒక్క రూపాయిత్తరా? ఇంతెందుకు, మొన్న ఆ మద్దెన ఏమయ్యింది? ఎమ్మేల్లేను బిల్సినం. బడిదెత్తనన్నడు. ఏదీ? పోనీ, ఊరికింకేమన్నా జేసిండాంటే అదీ లేదు?” దీపెముండగానే ఇల్లు సక్కదిద్దుకోమన్నరు పెద్దోల్లు” అని,తలో పక్క దగుల్కున్నరు.
ఇట్టా అందరూ మాట్టాడ్తా ఉన్నా, ఈడు మాత్తరం నిమ్మకు నీరెత్తినట్టు మెదలకుండా గూకున్నడు. అందరేమో, కేకలు కేకలు బెట్టి అలిసిపోయిండ్రు. ఓడేం మాట్టాడకుండా ఉంటే, కోపంగా సూత్తన్నరు ఆడైపే..
పెసిడెంటు గూడా కాచ్చ కోపంగా ,” సెప్పరా! వోల్లారకంగా కరెంటు సాగ్గొట్టిన కాకుల్లాగా అట్టా అరుత్తంటే మాట్టాడవే. సెప్పు. వోల్ల పెస్నలకు జవాబు జెప్పు?” అని దబాయించుండు.
ఇంగపుడు సూడాల. ఓడికి మండినట్టుంది. గబాల్న లేసి, ” దీన్ని, దీపెముంటే సక్కదిద్దుకోడం అన్రు. ఉన్న దీపేన్ని ఆర్పేసుకోడం అంతరు. ఒక్క మాటడుగుత సెప్పండి. ఓటెయ్యాలంటే డబ్బులు దేనికి? సారాయి దాగి, తందనాలాడ్డానికా? ప్రీగా ఒత్తే పినాలైనా దాగుతర్రా! మీరు. సివరకు తాగి, తాగి పానాలు బోగొట్టుకుని, పెల్లాం బిడ్డల్ని నడీదిలో ఎయ్యడం. ఇదేనా బతుకంటే?
సరే!మీరన్నట్టే, ఓటుకు డబ్బు దీస్కుంటం. మరి, అప్పుడు ఆల్లు ఎమ్మెల్లే అయినాంక, మనకెందుకు బలకాల? పనులెందుకు జెయ్యాల? ఏమ్మాట్టాత్తన్నరు?మీ సొమ్మైతే ఒకటి, ఎదుటోడిదైతే ఒకటా? ఎప్పుడూ మనమేమో బాగుండాల. ఎదుటోడు మాత్తరం ఏమైనా పర్లేదా? తలకాయుండాల. ఇంత స్వాద్దమైతే ఎట్టా. మడిసన్నాక కాచ్చ మానత్తం గూడా ఉండాలె. ఛీ ఛీ..” అని విసుక్కున్నడు.
వోడి మాటలు యీటెల్లాగున్నయ్‌! ఈల్లంతా ఏంమనాలో దెలియక ఆలోసెనల్లో బన్నరు.
ఇంతలోనే మళ్ళీ ఓడు ”పోనీ, ఆల్లిచ్చే రెండు మూడొందలతో మనమేమన్నా, జీయితాంతం బతుకుతమా? ఎప్పుడూ ఎదుటోది మీద ఏలు జూపిచ్చడం గాదూ..మనేపుండే మూడేల్లు గూడా జూసుకోవాల. ఎదుటోడి తానంలో ఉండి ఆలోసించాల.” బుజం మీంద కండవ దీసి యిదిలించి, పెద్దగా కేకలేస్తూ ఊగిపోయిండనుకో. అక్కడింటున్నోల్లలో ఒక్కనికీ మొకంలో రత్తపు సుక్కలేదు.
అప్పుడు పెసిడెంటు,” ఒరేయ్‌! కూకోరా, కూకో. కోప్పడమాకురా.” అని సల్లగ గూకోపెట్టిండు.
వాడెప్పుడూ అంతే సారూ.. ఎవుర్నైనా ముక్కుమీంద గుద్దినట్టు మాట్టాడతంటడు. కానీ, ఆడి మాటల్లో నిజముంటది. అందుకేనేమో? ముందందరూ వోనిమీంద కేకలేత్తరు. వోడిట్టా మంచి కోసం మాట్టాడేసరికి, ఎవుడూ మాట్టాడ్డు.హ..హ..హ.. నిజం నిప్పు లాంటిదంటండ్లా. అది ఇదేనేమో? సారూ… వోడు కల్మసం లేనోడండీ. అంత పెద్ద మనుసు వోనికి ఆ దేవుడిచ్చిండు.
మల్లా మా యిరి మామ, ”అదె సరేరా! డబ్బులు దీస్కోము. పోనీ అప్పుడేమన్నా ఊరు బాగు పడుద్దా? సెప్పు.
” అప్పుడే బాగుపడుద్ది!….. మనం డబ్బులు దీసుకోకుండ ఓటేత్తే. ఎమ్మేల్లేను రేపేదన్నా ఊరికోసం అడిగేదానికికుంటది. ఆల్లు గూడా ఆలోసిత్తరు. మంచి జేత్తరు.
అందుకని, ముందు మనూల్లో అందరం రేపు రాత్రికి మీటింగెట్టుకుందం. యిసయం అందరికీ సెబుదం. యిని, అందరమొక మాట మీదుందం. అప్పుడు మనూరికి రోడ్డూ,పెద్ద బడి ఇప్పియ్యమందం” అన్నడు.
ఓ పక్క ఓటుకు డబ్బులు రావట్టేదన్న బాదున్నా, గత్తెంతరం లేక సరేనన్నరు.
ఆరోజుటి సంది, మా సుబ్బిగాడి మాటే ఏదం. ఇంగెప్పుడు ఓటెప్పుడెయ్యాలన్నా, మా ఊల్లో ఎవుడూ ఒక్క రూపాయ ముట్టుకోడంటే నమ్మండి. అంతైకమత్తెం ఉంది ఇప్పటికీ.,
ఇంగో ముక్కిసయమేందంటే, ఆ మద్దెనొకపారి, మా ఊల్లో సారాయి దాగెటోల్లని గూడా ఓరోజు గూచ్చపెట్టిండు. ఏం మాటలు జెప్పిండో? ఏమో?ఓని మంచితనమో?వోడి మీంద గౌరమో? ఏందో దెలియదు గానీ, వోల్లంతా సారాయి దాగడం మానుకున్నరు. ఇప్పుడు మా ఊల్లో ఆ ఓసనే ఉండదు.ఆ…
” ఓహో!అర్థమయ్యింది. అంటే ఆ ఎమ్మెల్లే గారు, సుబ్బారావు మంచితనం జూసి, ఆయన పేరున, ఈ యూత్‌ను బెట్టి, డబ్బులు ఇస్తున్నాడన్నమాట” హెచ్‌.ఎం.అన్నారు అర్థమైన భావనతో.
” ఆ… కాదు కాదు. సెప్తా. సెప్తా…యినండి సారూ” సుందయ్య అంటుంటే,
అప్పటివరకూ సీరియస్‌ గా వింటున్న వారు, సుందయ్య మాటలకు ముసిముసి నవ్వులు నవ్వారు. హెడ్‌మాస్టర్‌ కూడా. సుందయ్య అవేం పట్టించుకోకుండా కొనసాగించాడు.
ఈ ఎవ్వారాలు ఇట్టాగుంటే, మా రాదమ్మ ఇంజీరు సదువు పూర్తి జేసింది. పరీచ్చల్లో పట్టు మార్కులొచ్చినయ్‌.
” ఆహా. .. ఓకే..ఓకే…వెరీ గుడ్‌”
మావోడు అన్నట్టే, అదేందో, కంపెనీలో రాదమ్మకు మంచి ఉజ్జోగం గూడా వచ్చింది. నెలకు ముప్పై ఏల పైనే జీతమంటా. ఓడి కట్టమూరికే బోలేదని. మా అందరికీ బో సంతోసమైందండీ.
” ఆహా… ఇంతకూ ఆ ఎమ్మెల్యే ఏమన్నా చేశాడా మీ ఊరికి”హెడ్‌మాస్టర్‌ ప్రశ్న.
” ఆ…సన్నాపురం నుండి ఇక్కడికి తార్రోడ్డు దెచ్చిండు. ఊల్లో సిమెంటు రోడ్డేపిచ్చిండు.”
” మరి…”.. అంటూ, హెడ్‌మాస్టర్‌ ఇంకా ఏదో అడగబోతుంటే…
” సారూ! ముందిది పూత్తిగా ఇనండి.”అనేసరికి,
కొండలరావు గారు సారు నవ్వుకుంటూ ”సరే సరే.. చెప్పండి.” అన్నాడు.
” అయిద్రాబాద్‌లో రాదమ్మ ఉజ్జోగంలో జేరింది. అట్టా జేరి నెల దిరక్కుండానే, రాదమ్మతో బేంకులో మూడు లచ్చలు లోన్‌ బెట్టిచ్చిండు. దాంతో ఆరెకరాల సలాన్ని కొన్నడు ఈడు. మేం పొలమెయ్యడానికి అనుకున్నం. కాదు ఈ బడికోసం! అదుగో… ఆ సలమే ఇప్పుడీ బడి ఉంటే సలం. రాదమ్మ జీతంలో సగం పైనే, ఆ లోనుకుబోయేది!!” ఆశ్చర్యంగా చెప్పాడు.
హెడ్‌మాస్టర్‌ గూడా ” ఆ..సో..గ్రేట్‌..!!” అంటూ ఆశ్చర్యపోయారు.
ఆ..ఆ..మాగ్గూడా అట్నే గేటుగ్గనబడ్డడండీ. అప్పుడు ఊల్లో ఒకరిద్దరు పైగ్గనపడకున్నా, వోన్ని పిచ్చోడిలా జూసిండ్రు. అయినా సెప్పిండ్లా. ఆడు ఇట్టాంటియన్నీ, బట్టించుకోడని.
‘గేటు’ పదమిని, మరలా మనసులో నవ్వుకుంటూ,” మంచి ఉన్నచోట చెడు ఎట్లాగూ ఉండేదే!. డబ్బు సంపాయించడం కంటే, మంచికి ఉపయోగించడం గొప్ప” కొండలరావు గారన్నారు.
” మరదే గద. అందుకే, ఎమ్మెల్లేల దగ్గర కూడా మా వోడికి మంచి పేరొచ్చింది. అందుకేనేమో? అప్పుడు గెలిపిచ్చిన ఆ ఎమ్మెల్లేనే ఈ స్కూలుకు పర్మిసెను గూతిప్పిచ్చిండు. మేం డబ్బులు దీస్కోకుండా ఓట్లేసినమనీ మా ఊరంటే గౌరం ఆయనకి. అందుకే, బడి పర్మిసెనుకయ్యే కర్సులో గూత ఎమ్మెల్లేనె కొంత బెట్టిండు. మిగిలింది మావోడే బెట్టుకున్నడు. రాదమ్మ ఉజ్జోగమొచ్చాక ఏదన్నా ఊరికోసం కర్సులు సిన్నా, సితకా ఉన్నా ఆడొక్కడే బరించేవోడు. ఒక్క రూపాయ గూడా ఎవుర్ని అడిగోవోడు గాదు.
”మరి ఇన్ని మంచి పనులు చేస్తున్నపుడు అతన్నే కనీసం సర్పంచిగానైనా ఎన్నుకోలేదా?” కొండలరావు గారి మరో ప్రశ్న.
” ఆ.. ఆ మాటంటే, ఆడేమన్నడో దెల్సా? కుక్క పని కుక్క,గాడిద పని గాడిదే చేయాలి. ” అన్నడండీ. వోనికి అట్టాటోట మీద ఆసెలేదు. అందుకే ఊల్లోల్ల గుండెల్లో నిల్సిండోడు.
” ఆయన గురించి వింటుంటే మనసు పులకరించి పోతున్నది.”హెచ్‌.ఎం.గారి సంతోషం.
అవునండీ. మంచోల్లకి మంచే జరుగుద్దనీ…, మా రాదమ్మకు మంచి అమెరికా సంబందం వొచ్చిందండీ.. పిల్లోడి అమ్మ,అయ్యది పక్కూరే. కాకుంటే ,పిల్లోనికి అక్కడ పెద్ద ఉజ్జోగమంటా. లచ్చల్లో జీతమంటా! ఉజ్జోగం కన్నా, పిల్లా, కుటుంబగౌరం ముక్కెమన్నరు. ఒక్క రూపాయ గూడా కట్నమొద్దన్నరు. పెతి దానిలో మాకు సలహిచ్చే యీడు, పిల్ల పెల్లిసయంలో మాత్తరం మమ్మల్ని అడిగిండు. మంచి సంబందమనీ ఒప్పేసుకోమన్నం.
కాకపోతే సిన్న సిక్కొంచిందోడికి. పెల్లయ్యాక రాదమ్మను అమెరికా తీసప్పోతరనేసరికి ఆలోశన్లో బన్నడు. అక్కడికి రాదను బంపించడమంటే… మన్సొప్పలే. పైగా అప్పటికే సుబ్బిగాని అమ్మా, అయ్య గూడా కాలం జేసున్నరు. ఇక్కడోడి పెల్లాం, వాడూ ఇద్దరే. పిల్లగూడా దూరమైతదని., అని ఆలోచించాడు.
మంచోడి కడుపున మంచోల్లే పుడ్తరనీ అర్దమైందండీ. అప్పుడు మా రాదమ్మ,” నాన్నా! అమెరికాకు బోతే, డబ్బులు బాగొత్తయ్‌. మనూరి బడిని నువ్వనుకున్నట్టు యింకా బాగుసేయొచ్చని జెప్పింది. కానీ, పెలై ్లతే, డబ్బు ఆల్లియ్యనియ్యాల గదమ్మా? అన్నడు. ముందే వోల్లకు యిసయం చెబుదాం నాన్నా? అలా ఒప్పుకుంటేనే, పెల్లికొప్పుకుందం” అంది.
అదే యిసయాన్ని అబ్బాయి గలోల్లతో సెప్పిండ్రు. వోల్లు గూత మంచితనంతో,” మాకు పిల్ల జీతంతో పని లేదూ, పిల్లనిత్తే జాలన్నరు. ఎంత గోప్పోల్లో?!పాపం! ” ఇంత మంచి సంబందం దొరికినందుకు, మావోడికి బో సంతోసమేసింది,
అంతే గాకుండా, బిడ్డ, అల్లుడు ఇద్దరు గూడా ఊరిగురించి ఇంతగా ఆలోచిత్తన్నరని, వోడి కల్లెమ్మట నీల్లు దిరిగినయ్‌. అనుకున్న పెకారం పెల్లి జేసిండు.
రాదమ్మ పెల్లికి ఎమ్మెల్లే గూత పిల్సినం. పిలిత్తే వచ్చిండు. పెల్లికొచ్చినంక , ఐస్కూలు బడికి రూములు శాంచనయినాయనే శుబార్త జెప్పిండు.
పెలై ్లనంక ఏడాది లోపే సుబ్బిగాని, బార్య శాంతమ్మ ఏదో పురుగ్గుట్టి సనిపోయింది. పాపం శానా బాదపడ్డడు. వోని బాజ్జూసి కడుపు తరుక్కుపోయేది. ఎంత బాదున్నా ఊరిబాగ్గురించే ఎప్పుడూ వోడి ఆలోసెన.
ఆ తరాత కొన్నాల్లకి బడి రూములైతే రెడీ అయ్యినయ్‌. కానీ, మంచి కుర్సీ గాని, సోమానుగానీ లేదు. ఎంటనే వారం దిరక్కుండానే, పొలం అమ్మేసిండు. బడికి ముక్కెంగా గావాల్సిన కుర్సీలు, టేబుల్లు , అట్టాంటియన్నీ ఆ డబ్బుతో గొనేసిండంతే! ఒక్క రూపాయగూత్త మిగల్లా. ఇట్ట సేత్తడని మేమస్సలు ఊయించలా!! ఆడి తెంపుకు అంతూ పొంతూ లేకుండా బోయింది!!!
ఇదేందిరా! అన్నీ బోగుట్టుకుంటే, నీ బతుకెట్టాగన్నం. నాకేంది? నేనొక్కన్ని. ఏ కూలో, నాలో జేసుకుంటే, నాలుగు మెతుకులు దొరకవాయేంది?” అన్నడండీ! అంత గొప్పోడు. అని ముగించాడు సుందయ్య.
” ఇంతకీ సుబ్బారావుగారు ఇప్పుడెక్కడుంటున్నారు?..” ఇంకో ప్రశ్న అడిగాడు. హెచ్‌.ఎం.
” అమెరికాలోనే.” ఛైర్మన్‌ చెప్పాడు.
” ఇంతకీ యూత్‌ గురించి చెప్పనేలేదు?” మరలా అడిగారు హెచ్‌.ఎం.
”కూతురు అల్లుడు ఇక్కడ ఒక్కడే ఎందుకని?యీనను గూడా అమెరికా రమ్మన్నారు.కానీ, యీడొప్పుకోలేదు. యిక్కడ పనులెట్టాగన్నడు. అప్పుడు కూతురు, అల్లుల్ల ఆలోశనే ఈ యూత్‌. ఆ యూత్‌ గురించి యివరంగా సెప్పాక, కాస్త మెత్తబన్నడు. మేమంతా వాన్ని ఒప్పించి పంపినం. ఇక్కడ మేం జూసుకుంటమని నమ్మకమిచ్చినం. ఇంగప్పుడెల్లిండు. ఫోన్లో మాట్లాడుతుంటాడు. ఈ సారి స్కూలుకు పంచను బెట్టియ్యాలని వత్తనన్నాడు. యీన అమెరికా ఎల్లాక ఇదే రావడం.” సమాధానం ఇచ్చాడు .
” ఆహా… వెరీ గుడ్‌. ఆ మహానుభావుడిని చూసే అదృష్టం మాకూ దక్కబోతుందన్నమాట. మా టీచర్లను యూత్‌ గురించి అడిగితే వివరాలు పెద్దగా తెలియవన్నారు. ”అనగానే,
” ఆయన గురించి ఎవరికీ చెప్పొద్దంటడండీ. కానీ,పైగా ఇంత గొప్ప పనులు చేసినోని గురించి మా తర్వాత తరాలకి కూడా తెలియాలని? ఇప్పుడు అందరికీ సెప్తనే ఉన్నం. ”
” అవునవును. చెప్పాల్సిందే. ఎంతో మందికి ఆదర్శం కావాల్సిన వ్యక్తి. నిజంగా మీ ఊరికి ఆదర్శ యువకుడండీ!..అలాంటి వ్యక్తి మీ ఊరిలో పుట్టడం మీ అదృష్టం.” అంటూ సమావేశం ముగించారు.

***

అనుకున్న ప్రకారం హైస్కూలు వార్షికోత్సవం చాలా ఘనంగా జరిగింది. కొండలరావు గారు సభాముఖంగా సుబ్బారావు గురించీ చెప్పాడు. 44 ఏండ్ల వయసు కూడా నిండక ముందే ఎందరికో ఆదర్శప్రాయుడయ్యాడు. అంటూ కొనియాడాడు. ఆ తర్వాత అందరినోటా సుబ్బారావు పేరే. కలెక్టరు గారు కూడా ” ఇలాంటి సుబ్బారావు ఊరికొక్కడుంటే ఆ ఊరు బాగు పడుతుంది. తద్వారా, దేశం బాగుపడుతుందన్నారు. రాబోయే రిపబ్లిక్‌ డే వేడుకలలో సుబ్బారావును ‘ఆదర్శ యువకుడు’ గా సన్మానిస్తామని” చెప్పారు. సుబ్బారావు కళ్లలో ఆనందభాష్పాలు వెల్లి విరిశాయి.
చివరగా సుబ్బారావును మాట్లాడమన్నారు. మాట్లాడ్డానికి అయితే లేచాడు. కానీ, ఆనందంతో అతనికి నోట మాట రాలేదు. కానీ, రైతన్న దేశానికి వెన్నెముక. యువత భవిష్యత్తుకు పునాది. విద్య కల్పవృక్షమూ, సర్వసంపదలకూ మూలం. అని మూడు ముక్కలు చెప్పి, ఎవరికైనా నేను చెప్పేది ఒక్కటే.. ” ఎదుటి వారి స్థానంలో ఉండి ఏమైనా ఆలోచించండి” అని కూర్చున్నాడు. మీటింగంతా చప్పట్లతో మారు మ్రోగి పోయింది. సుబ్బారావు సన్మానంతో సభ ముగిసింది.


మద్దిరాల శ్రీనివాసులు

1 COMMENT

  1. కథ చాలా బాగుంది. అభినందనలు రచయిత శ్రీనివాసులు గారికి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.