ఆనందోబ్రహ్మ

0
434

ప్రత్యేకబహుమతి – వయస్సు 45 పైన


ఆనందోబ్రహ్మ 


ఆదరాబాదరగా బ్రేక్ ఫాస్ట్ ని  తినేసి , ఒక చేత్తో  మూడేళ్ళ కూతురు అక్షర నీ, మరో చేత్తో డే కేర్ బాస్కెట్ నీ పట్టుకుని , స్కూల్ బ్యాగుని  భుజానికి తగిలించుకుని  క్రిందకి వచ్చిన ప్రణవి అపార్ట్ మెంట్ పార్కింగ్ స్థలం నుండి స్కూటీ ని బయటకి తీసింది.

అదే సమయానికి మనవరాలిని చంకలో వేసుకుని కారిడార్ లోకి వచ్చిన సరోజిని ప్రణవి ని చూసి పలకరింపుగా నవ్వింది.

ప్రణవి వాళ్ళ ఫ్లాట్ కి ఎదురుగా వుండే ఫ్లాట్ లో ఈ మధ్యే వచ్చి చేరిన మదన్ అమ్మగారు సరోజిని. మదన్ స్వంతంగా చార్టర్ అకౌంటెంట్ ప్రాక్టీసు చేస్తుండగా,  అతని భార్య రశ్మి ఒక అడ్వర్టైజ్ మెంట్ కంపెనీ లో క్రియేటివ్ హెడ్ గా పని చేస్తోంది. మదన్ తండ్రి శేషావతారం ఆంధ్రా యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పని చేసి రిటైర్ అయిన తరువాత స్వంత ఊర్లో పెద్ద యిల్లు కట్టుకుని  అక్కడికే మకాం మార్చేసాడు. అతనికి పుస్తకాలంటే ప్రాణం. హిస్టరీ మొదలుకుని, ఆధ్యాత్మకం, సైన్సు, గణితం , లేటెస్ట్ టెక్నాలజీ వరకూ అన్ని రకాల పుస్తకాలతో అతని యింట్లో ఏకంగా పెద్ద లైబ్రరీ నే వుంది.

మదన్ తల్లి సరోజిని బాగా చదువుకుంది.  ప్రత్యేకంగా ఉద్యోగం అంటూ చేయడం లేదు కానీ ఊళ్ళో గుడిసెల్లో వుండే పేద పిల్లలకి ఉచితంగా చదువు చెబుతుంది. చదువు రానివాళ్లకి  దగ్గరుండి ఫారమ్స్ నింపి పెడుతుంది. వాళ్లకి ఉత్తరాలు వ్రాసి పెట్టడం, చదివి పెట్టడం లాంటివి కూడా చేసిపెడుతుంది. తనకి చేతనైనంతలో చుట్టుప్రక్కల అందరికీ సాయపడుతుంది. అందుకే చుట్టాలకి గానీ , చుట్టుప్రక్కల వాళ్లకి గానీ  ఏ అవసరం కలిగినా ముందుగా ఆమె దగ్గరికే వస్తారు.

“ అమ్మా , రశ్మి ఎక్కువగా టూర్స్ కి వెళ్ళవలసి రావడంతో పని పిల్ల వున్నా కూడా పాపని చూసుకోవడం కష్టంగా ఉంటోంది“ అంటూ కొడుకు ఫోన్ లో చెప్పిన వెంటనే సరోజిని భర్తని సంప్రదించింది.

“ ఏమండీ , మన మనవరాలు కొంచెం పెద్దయేదాకా , మనం వెళ్లి వాళ్ళకి సాయంగా  వుంటే బావుంటుంది “

“ సొంత ఇంటినీ , నా పుస్తకాలనీ  వదులుకుని ఆ చిన్న చిన్న  ఫ్లాట్ లలో నేను యిమడలేను సరోజా.  కావాలంటే  పాపని యిక్కడ వదలమని చెప్పు మదన్ కి  “

“ అయ్యో అది యింకా పసిపిల్లండి . తల్లి నుండి పసిదాన్ని దూరం చేయడం భావ్యం కాదు. పోనీ , కొన్నాళ్ళపాటు నేనొక్కదాన్నే అక్కడికి వెళ్లి వచ్చేదా? మీకు భోజనానికి ఏర్పాట్లవీ చేసి వెళ్తాను “ అని సరోజిని అన్నదానికి ఒప్పుకున్నాడు శేషావతారం.

***

ప్రతీ రోజూ తను ఆఫీస్ కి బయలుదేరే సమయానికి నవ్వుతూ ఎదురొచ్చే సరోజిని అంటే ప్రణవి కి చాలా యిష్టం. ప్రశాంతమైన ఆమె వదనాన్నీ, పెదవులపై ఎన్నడూ చెరగని ఆమె చిరునవ్వునీ  చూస్తే చాలు మనసుకి హాయి కలుగుతుంది ఎవరికైనా. మనవరాలిని చూసుకునేందుకుగానూ భర్తని ఒప్పించి  కొడుకు దగ్గరకి వచ్చి ఉంటున్న ఆవిడ ని చూస్తే చాలా అభిమానంగా అనిపిస్తుంది ప్రణవి కి.  అందుకే స్కూటీ ని స్టార్ట్ చేయబోతున్నదల్లా ఒక్క క్షణం ఆగి “  బ్రేక్ ఫాస్ట్ అయిందా ఆంటీ “ అంటూ సరోజినిని పలకరించింది.

“ ఈ వేళ ఏకాదశి కదమ్మా. పాలూ , పళ్ళూ తప్ప మరేమీ తీసుకోను ”

“ అయ్యో ఈ వయసులో అభోజనంగా ఉంటూ మనవరాలిని కనిపెట్టుకుని వుండడం కష్టం కదా ఆంటీ. ఈ వేళ్టికి మీ కోడలు రశ్మి ని ఆఫీస్ కి  సెలవు పెట్టమనవలసింది”

“యిది నాకు అలవాటేనమ్మా. యాభై ఏళ్లు దాటిన తరువాత తిండి ఎంత తక్కువగా తింటే ఒంటికి అంత మంచిది.  ఆ తినేదేదో సాత్వికమైన ఆహారాన్నే తీసుకుంటే మరీ మంచిది. రశ్మి ఆఫీస్ పని మీద టూర్ కి వెళ్ళిందమ్మా. తనది మార్కెటింగ్ జాబ్ కదా , ఎక్కువ సెలవులు దొరకవు. అయినా రోజూ యిలా నా మనవరాలి ని స్వయంగా చూసుకుంటూ దాంతో ఆడుకుంటుంటే నాకు పోయిన శక్తి తిరిగి వచ్చినట్లుగా వుంటుంది తల్లీ “  మనవరాలిని మురిపెంగా చూసుకుంటూ చెప్పింది సరోజిని.

“మీ కోడలూ,  మనవరాలూ  కూడా  నిజంగా చాలా అదృష్టవంతులు ఆంటీ. యింక నాకు ఆఫీస్ కి ఆలస్యమవుతోంది. వెళ్ళొస్తాను ” అంటూ స్కూటీ ని స్టార్ట్ చేసుకుని వెళ్ళింది ప్రణవి.

రెండు కిలో మీటర్ల దూరం లో వున్న ప్లే స్కూల్ లో కూతురిని డ్రాప్ చేసి తను ఆఫీస్ కి బయలుదేరింది. దారి పొడుగూతా ఎడతెగని ఆలోచనలు ఆమెని చుట్టుముట్టాయి.

***

ప్రణవి , ఆమె భర్త మనోహర్ యిద్దరూ కూడా  సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. మనోహర్ కి రెండు సంవత్సరాల వయసులోనే  తండ్రి మల్లిఖార్జున్రావ్ ఒక ట్రైన్  ఆక్సిడెంట్ లో చనిపోతే,   తల్లి భ్రమరాంబ పెద్దగా చదువుకోకపోయినా కూడా వాళ్ళ పొలాలని తనే దగ్గరుండి చూసుకుంటూ ఎన్నో కష్టాలకోర్చి కొడుకుని బాగా చదివించి ఈ స్థాయికి తీసుకుని వచ్చింది. అందుకే మనోహర్  కి తల్లంటే ప్రాణం. తల్లి మాటకి ఏనాడు ఎదురు చెప్పడతను.

పెళ్ళైన రెండేళ్ళకి పుట్టిన పాపకి “ అక్షర “ అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా చూసుకోసాగారు ప్రణవి, మనోహర్ లు. పాప పుట్టిన తరువాత ప్రణవి కి కంపెనీ యిచ్చిన మెటర్నటి లీవ్ అంతా అయిపోయిన మీదట మూడు నెలల పాటు జీతం నష్టం మీద సెలవుని పొడిగించింది. ఆ పైన కంపెనీ నుండి పర్మిషన్ తీసుకుని రెండునెలల పాటు యింటి నుండే పని చేసింది. మరో పది రోజుల్లో ఆమె ఆఫీస్ లో జాయిన్ అవాలి.

ఆ రోజు మద్యాహ్నం పాపని నిద్రబుచ్చి , ఆ పైన తమ భోజనాలని ముగించిన తరువాత ప్రణవి అత్తగారితో చెప్పింది.

“ అత్తయ్యగారూ, నేను ఈ నెల ఫస్ట్ నుండీ ఆఫీస్ లో జాయిన్ అవ్వవలసి వుంటుంది.  అక్షర కొద్దిగా ఎదిగింది కదా. ఇప్పుడిక  సెరిలాక్ , మెత్తటి అన్నం లాంటి ఘన పదార్ధాలకి కూడా అలవాటు పడింది కాబట్టి నేను ఆఫీస్ కి వెళ్ళే ముందు ఒక్కసారి పాపకి పాలు త్రాగించి మరొక్క బాటిల్ నిండా పాలని నింపి ఫ్రిజ్ లో పెట్టి వెళ్తాను. పాపకి మధ్యాహ్నం సెరిలాక్ తినిపించి , సాయంత్రం పాలని త్రాగిస్తే సరిపోతుంది… “ అంటూ చెబుతుండగానే మధ్యలోనే  ఆపి “ ఈ వయసులో యింకా పసిపిల్లలని చూసేంత ఓపిక నాకు లేదమ్మా “  మొహాన కొట్టినట్లుగా నిరసనగా చెప్పింది భ్రమరాంబ.

అత్తగారి మాట తీరు కి ఎప్పటినుండో అలవాటు పడిన ప్రణవ పెద్దగా నొచ్చుకోలేదు.

“ నేను ఆఫీస్ కి వెళ్ళే ముందే ప్రక్కింట్లో పని చేసే చంద్రమ్మ కూతురు మల్లిక మనింటికి  వచ్చి,  ఆఫీస్ నుండి నేను ఇంటికి తిరిగి వచ్చేవరకూ యిక్కడే వుండి పాపని చూసుకుంటుంది అత్తయ్యా. మీరు కాస్త పై పైన చూసుకుంటే చాలు “ చెప్పింది ప్రణవి.

ఆ మాటకి యింక భ్రమరాంబ ఏమీ అనకపోయినా ఆవిడ మొహం మాత్రం యింకా అప్రసన్నంగానే ఉండడం ప్రణవి దృష్టి ని దాటిపోలేదు.

***

ఫస్ట్ తారీఖున ఆఫీస్ కి వెళ్లేముందు అత్తగారికీ, పనిపిల్లకీ కూడా  ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది ప్రణవి.

వారం రోజులు గడిచిన తరువాత, ఒక రోజు   “ మల్లిక కి జ్వరం గా వుందమ్మా. ఈ దినం అది  పనికి రాదు “ అని చెప్పేసి వెళ్ళింది మల్లిక తల్లి చంద్రమ్మ.

ఏం చేయాలో తోచక అత్తగారి వైపు తిరిగిన ప్రణవి కి “ నేను ముందే చెప్పానుగా. పాపని చూడడం నా వల్ల కాదని “  అన్నట్లుగా ఆవిడ చూసిన చూపుని బట్టే పాపని చూసుకోవడం పట్ల ఆవిడకున్న అసహనం అర్థమయింది. భర్త మనోహర్ ఆఫీస్ పని మీద టూర్ కి వెళ్ళాడు. యిక విధి లేక అత్తగారితోనే చెప్పింది.

“ అత్తయ్యా , ఈ రోజు ఉదయం పది గంటలకి ఆఫీస్ లో ఒక యింపార్టెంట్ మీటింగ్ ఉంది. అది ఒక్కటీ అటెండ్ అయిన తరువాత  వెంటనే యింటికి వచ్చేస్తాను “

అయిష్టంగానే సరేనంటూ తలాడించింది భ్రమరాంబ.

పన్నెండు గంటల కల్లా ఆఫీస్ లో మీటింగ్ ని ముగించుకుని యింటికి వచ్చిన ప్రణవి కి పాప ఏడుపు పెద్దగా యింటి బైటవరకూ  వినిపించడంతో “ అరే ఏమైంది దీనికీరోజు. ఈ పాటికల్లా సెరిలాక్ తిని హాయిగా పడుకోవాలే “ అనుకుంటూ గబగబా యింట్లో కి వెళ్ళింది. కోడలు రావడంతోనే  పాపని ఆమెకి అప్పగించేసి తన రూం లోకి వెళ్ళిపోయింది భ్రమరాంబ.

ఏడుస్తున్న పాపని ఎత్తుకున్న ప్రణవికి అంటుకుపోయిన పాప పొట్టని చూస్తూనే అర్థమై పోయింది అది ఆకలి కే  ఏడుస్తోందని.  వెంటనే ఫ్రిజ్ తెరిచి చూస్తే తను పెట్టిన పాలసీసాలో పాలూ , యింకా సెరిలాక్ గిన్నె అలాగే వున్నాయి.  ప్రాణం ఉసూరుమనగా గబగబా సెరిలాక్ ని తినిపిస్తే ఆవురావురుమంటూ తినేసి నిద్రపోయింది అక్షర.

నెలలో రెండు మూడు మార్లు పనిపిల్ల చంద్రిక ఇలా పనికి నాగాలు పెడుతుండడంతో చచ్చేంత చావుగా ఉంటోంది ప్రణవి కి . ఆ టైం కి మనోహర్ ఊళ్లోనే వుంటే పాపని మేనేజ్ చేసుకుంటాడు. కానీ అతను ఎక్కువగా మీటింగ్ లకని వేరే ఊళ్ళో వున్న హెడ్ ఆఫీస్ కి  వెళ్ళవలసి వుంటుంది. దాంతో పనిపిల్ల రానప్పుడల్లా ప్రణవి  ఆఫీస్ కి సెలవు పెట్టవలసి రావడంతో ఆఫీస్ లో బాస్ తో చీవాట్లని తినవలసివస్తోంది.

విసిగిపోయిన ప్రణవి ఏం చేయాలో తోచక ఒక రోజు లంచ్ టైం లో కొలీగ్ సబిత దగ్గర తన గోడంతా వెళ్ళబోసుకుంది.

“ ఒక పని చేయి ప్రణవీ. పాపని మీ యింటికి దగ్గరలోనే వున్న ఏదైనా మంచి క్రెచ్ లో జాయిన్ చేయి. వాళ్ళైతే వారంలో అన్ని రోజులూ పిల్లలని చూస్తారు  కాబట్టి యిలా మధ్య మధ్య లో పనికి ఎగ్గొట్టడం లాంటి యిబ్బందులు వుండవు “ అంటూ సలహా యిచ్చింది సబిత.

సబిత తో కలిసి తమ ఏరియా లో వున్న డే కేర్ సెంటర్ లన్నీ స్వయంగా వాకబు చేసి , అన్ని విధాలా  బావుంది అనుకున్న క్రెచ్ లో అక్షర ని జాయిన్ చేసింది ప్రణవి.

పాపని తయారు చేసి క్రెచ్ బాస్కెట్ ని సర్ది పాపని క్రెచ్ లో డ్రాప్ చేసి , ఆ తరువాత ఆఫీస్ కి వెళ్ళాల్సి రావడంతో ప్రతీ రోజు అరగంట ముందుగానే నిద్రలేవవలసి వచ్చినా కూడా ‘ ఎప్పుడు పనిపిల్ల మానేస్తుందో , సెలవు పెట్టాలేమో ‘  అనేటటువంటి టెన్సన్స్ లేకపోవడంతో ప్రాణానికి హాయిగా వుంది ప్రణవి కి. మొదటి రెండు మూడు రోజులూ  క్రెచ్ కి వెళ్ళడానికి పాప మారాం చేసినా , ఆ తరువాత అక్కడ వున్న తన ఈడు పిల్లలతో బాగా కలిసిపోవడంతో రిలీఫ్ గా ఫీల్ అయింది ప్రణవి.

పాపకి మూడేళ్ళు వచ్చాక క్రెచ్ కి నాలుగడుగుల దూరంలోనే వున్న ప్లే స్కూల్ లో వేసారు. స్కూల్ అయిన తరువాత క్రెచ్ లోని ఆయా పాపని స్కూల్ నుండి క్రెచ్ కి తెచ్చుకుంటుంది.

***

ఆఫీస్ రావడంతో ఆలోచనల నుండి బయటపడిన ప్రణవి స్కూటీ ని పార్క్ చేసి తన క్యాబిన్ లోకి వెళ్ళి పని లో పడిపోయింది. సాయంత్రం ఆరు గంటలు కాగానే డెస్క్ ని సర్దేసి యింటికి బయలుదేరింది.  పాపని క్రెచ్ నుండీ తీసుకుని యింటికి వచ్చాక , పాలు కాచి పాపకిచ్చి , అత్తయ్యగారి చేతికి కాఫీ ఇచ్చి , తనూ సోఫా లో కూర్చుని కాఫీ త్రాగుతూ “ రేపు , ఎల్లుండి శని ఆదివారాలే కాబట్టి కాస్త రెస్ట్ తీసుకోవచ్చు “ అనుకుంది స్వగతంగా.

పాపకి రెండు రోజుల నుండి స్వల్పంగా జలుబు , దగ్గు ఉండడంతో ఉదయానికల్లా ఒళ్ళు కాస్త వెచ్చబడింది. దాంతో ఎత్తుకోమని ఒకటే మారాం చేస్తుండడంతో ప్రణవి కి ఆ రోజంతా పాపతోనే సరిపోయింది.

ఆదివారం మధ్యాహ్నానికి పాపకి  జ్వరం కాస్త త్రగ్గుముఖం పట్టింది. ఆ సాయంత్రం వాళ్ళ అపార్ట్ మెంట్ లోని క్లబ్ హౌస్ లో గెట్ టు గెదర్ పార్టీ ఉండడంతో ప్రణవి కుటుంబమంతా రాత్రి ఏడు గంటల కల్లా క్లబ్ హౌస్ కి వెళ్ళారు. పిల్లలు , పెద్దలూ కూడా కొద్దిసేపు  ఫన్ గేమ్స్ ఆడిన తరువాత అందరూ డిన్నర్ మొదలుపెట్టారు. అంతలో ఒక యింపార్టెంట్ క్లయింట్ నుండి ఫోన్ రావడంతో ఆదరా బాదరాగా తినేసి బైటకి వెళ్ళిపోయాడు మనోహర్.  పాపకి ఒంట్లో యింకా కొంత నలతగానే వుండడంతో ప్రణవి వెంటే వుంటూ మారాం చేస్తుండడంతో ప్రణవికి డిన్నర్ చేయడం వీలుపడడం లేదు. అదంతా దూరం నుండే  గమనించిన సరోజిని “ అక్షరా , యిలా రామ్మా , మనం అపూర్వతో ఆడుకుందాం “ అంటూ ప్రణవి చేతుల్లో నుండి పాపని తీసుకుంది.

“ పాపని నేను చూసుకుంటాను గానీ , నువ్వు ప్రశాంతంగా భోంచేయమ్మా “ అన్న సరోజిని వంక కృతజ్ఞతగా చూసింది ప్రణవి.

పాపకి అయిదారు నెలల వయసున్నప్పుడు అనుకుంటా  తాము చుట్టాల  పెళ్ళికి వెళ్ళినప్పుడు జరిగిన యిటువంటి సంఘటనే ఒకటి  ప్రణవి మనసులో మెదిలింది.

***

మనోహర్ ఊర్లో లేకపోవడం వలన పాపని తీసుకుని ప్రణవి, ఆమె అత్తగారు మనోహర్ కి దగ్గర కజిన్ పెళ్లికి వెళ్ళారు. చిన్నారి అక్షరని పెళ్ళిలో అందరూ ఎత్తుకుని ముద్దాడారు. భోజనం చేసిన తరువాత చుట్టాలతో మాటల్లో పడిపోయిన భ్రమరాంబ వద్దకి వచ్చింది ప్రణవి.

“ అత్తయ్యా, పాపని కాస్త ఎత్తుకోండి. నేను కూడా తినేసి వచ్చిన తరువాత మనం బయలుదేరుదాం “ అంటూ పాపని ఆవిడకి ఇచ్చేలోపే “ పెళ్లి తతంగం అంతా అయేవరకు రెండు గంటలపాటు అలా కూర్చునే ఉండడంతో నా కాళ్ళు బాగా పట్టేసాయి. పాపని ఎత్తుకోలేను. అయినా అది యింకా చంటిదేగా , ఫర్లేదు  చంకలో వేసుకుని ఎలాగోలా తినేసేయ్ “ అనేసి బంధువులతో మళ్ళీ కబుర్లలో పడిపోయింది భ్రమరాంబ.

అత్తగారి మాటలతో ప్రణవి కి అప్పటి వరకూ ఉన్న ఆకలి చచ్చిపోయింది .

ఈలోగా  దూరం నుండి మనోహర్ కజిన్ రేవతి వచ్చి  “ వదినా , పాపని నేను చూసుకుంటాను గానీ ,  నువ్వు తినేసి రా “ అంటూ   పాపని తీసుకోవడంతో యిక తప్పనిసరై ఏదో నాలుగు మెతుకులు కెలికి భోజనం అయిందనిపించింది ప్రణవి.

***

“ అత్తయ్య గారికి, సరోజిని ఆంటీ కి ఎంత తేడానో . యిద్దరిదీ దాదాపు ఒకే వయసైనా సరే సరోజిని ఆంటీ ఎంత చురుకుగా ఉంటారో. కోడలికి ఎంత సహాయం గా ఉంటారో  “ అనుకోకుండా ఉండలేకపోయింది ప్రణవి.

డిన్నర్ చేసి చేతులు కడుక్కున్న తరువాత , పార్క్ లోని ఉయ్యాల లో ప్రణవి ని కూర్చోబెట్టి ఆడిస్తున్న సరోజినితో “థాంక్స్ ఆంటీ“ అంటూ పాపని ఎత్తుకుంది ప్రణవి.  ఈలోగా అటువేపు వచ్చిన రశ్మి తో “ మీరు చాలా లక్కీ రశ్మి. యింత ప్రేమగా చూసుకునే అత్తగారు ఎంత మందికి దొరుకుతారు. ఈ వయసులో కూడా మనవరాలిని బరువు అనుకోకుండా ఎత్తుకుని తిరుగుతుంటారు  “ అంది ప్రణవి.

“ ఆ మాట అక్షరాలా నిజం ప్రణవీ.  నిజానికి అపూర్వ ని కన్నది నేనైనా , దాన్ని ప్రాణంలా  చూసుకుంటూ పెంచుతున్నది మాత్రం మా అత్తయ్యే. ఆవిడ మాకు అంత హెల్పింగ్ గా వున్నారు కాబట్టే నేను ఏ టెన్సన్స్ లేకుండా ఉద్యోగం చేసుకోగలుగుతున్నాను. స్వభావరీత్యా మా అత్తయ్య గారు చాలా మంచివారు. ప్రతీ ఒక్కరికీ తన చేతిలో వున్న సాయాన్ని కాదనకుండా చేస్తారావిడ “ అంది రశ్మి.

***

ఆ రోజు ఆదివారం. ఉదయం నుండీ ఒకటే మారాం చేస్తుండడంతో మనవరాలు అపూర్వని తీసుకుని ప్రణవి ఫ్లాట్ కి వచ్చింది సరోజిని.

“ రండి ఆంటీ “ అంటూ సాదరంగా ఆహ్వానించింది ప్రణవి.

అపూర్వ ని చూస్తూనే “ అప్పూ, మనం బొమ్మలతో ఆడుకుందాం రా  “ అంటూ అపూర్వ ని తన రూమ్ కి తీసుకుని వెళ్ళింది అక్షర.

అప్పటి వరకూ తన రూమ్ లో కునుకు తీసి అప్పుడే హాల్లో కి వచ్చిన భ్రమరాంబ,  సరోజిని ని చూస్తూనే పలకరింపుగా నవ్వి ఆమె ప్రక్కనే సోఫా లో కూర్చుంది.  కాఫీ తయారు చేయడం కోసమని వంటింట్లోకి వెళ్ళిన ప్రణవి కి వారి మాటలు వినిపిస్తున్నాయి.

“యిందాకటినుండి అక్షరతో ఆడుకోవాలని మా అపూర్వ తెగ మారాం చేస్తుంటే ఇక తప్పదని తీసుకుని వచ్చానండి “

“ హాయిగా కృష్ణా రామా అనుకుంటూ కాలం గడపకుండా ఈ వయసులో మనకీ జంఝాటాలన్నీ దేనికండీ “

“ అయ్యో అలాగనకండి. మనకేమంత వయసయిందని ? యింకా అరవై కూడా నిండలేదు. మన కాలం లో లాగా కాకుండా,  ఈ కాలంలో ఆడపిల్లలు  చక్కగా చదువుకుని, మంచి ఉద్యోగాలని  చేసుకుంటున్నారు. అలాంటప్పుడు మనకి చేతనైనంత  సాయాన్ని వాళ్ళకి అందిస్తూ వాళ్ళని ప్రోత్సాహించడం మన ధర్మం కదండీ. నాలుగేళ్ల క్రిందట మా అమ్మాయి ఎంఎస్  చేయడం కోసమని కేంబ్రిడ్జి యూనివర్సిటీ లో చేరినప్పుడు కూడా , లండన్ లో  మనవడిని చూసుకుంటూ దానికి తోడుగా వుండి వచ్చాను. అప్పటికి అపూర్వ యింకా పుట్టలేదులెండి. అయినా మన పిల్లలకి మనం కాకపొతే మరెవరు సాయం చేస్తారు చెప్పండి? ” అన్న సరోజిని మాటలు భ్రమరాంబకి పెద్దగా రుచించినట్లు లేవని ఆవిడ ముఖ కవళికలని బట్టి గమనించిన సరోజిని ఆ తరువాత టాపిక్ ని మార్చింది.

***

ఆ వేళ ఉదయం బాత్ రూమ్ కి వెళ్ళడానికని ప్రక్క మీద నుండీ లేవబోతుంటే  కాళ్ళు గట్టిగా బిగుసుకున్నట్లుగా అవడంతో లేవలేకపోయింది భ్రమరాంబ. అతి ప్రయత్నం మీద లేచినా ఒక్క క్షణం కూడా నిలబడలేక  మూలుగుతూ ప్రక్క మీద పడిపోయింది.  అత్తగారి రూమ్ నుండి ఏదో మూలుగు లాగా వినబడడంతో వచ్చిన ప్రణవి , అత్తగారి పరిస్థితిని చూసి కంగారుపడుతూ భర్తని పిలిచింది.

తల్లిని అలా కదలలేని స్థితిలో చూసిన మనోహర్ పరుగున వెళ్లి ప్రక్క వీధి లోనే వుండే డాక్టర్ విశ్వనాథం ని వెంటబెట్టుకుని వచ్చాడు. భ్రమరాంబ ని పరీక్ష చేసిన తరువాత మనోహర్ నీ  , ప్రణవి నీ  అడిగి ఆవిడ ఆహారపు అలవాట్లనీ, రోజు వారీ ఆవిడ చేసే పనులనీ కూడా తెలుసుకున్నాడు డాక్టర్ విశ్వనాథం.

“ చూడండి మనోహర్ గారూ, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే  మీ అమ్మగారి శరీరానికి ఏమాత్రం  ఫిజికల్ ఎక్సరసైజూ లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.  దాని వల్ల ఆవిడ ఒంట్లో కొవ్వు చేరడమే కాకుండా ,  ఒంట్లోని కండరాలు, కీళ్ళు కూడా బిగుసుకుపోయాయి . మరి కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కనక కొనసాగితే యిక జీవితాంతం ఆవిడ మంచానికే పరిమితమయ్యే ప్రమాదముంది. అందుచేత ప్రస్తుతానికి ఆవిడ లేచి తిరగటానికి గానూ మందులని వ్రాస్తున్నాను. కానీ యికపై ఆవిడ ప్రతీ రోజు చురుకుగా వుండి తగినంత ఎక్సరసైజు ని  చేస్తేనే గానీ బిగుసుకుపోయిన జాయింట్లన్నీ సరి కావు “ అని చెప్పి మందులని వ్రాసిచ్చి వెళ్ళాడు డాక్టర్.

***

భ్రమరాంబ కి ఒంట్లో బాగోలేదన్న విషయం తెలిసి చూడడానికి వచ్చిన సరోజినితో తన బాధలని చెప్పుకుంది భ్రమరాంబ.

“ ఈ వయసులో నాకు ఫిజికల్ ఎక్సరసైజు లు ఏమిటి చెప్పండి? తోచీ తోచని ఆ డాక్టర్ ఏదో చెప్పడమూ , మా వాడు ఆ మాటలని పట్టుకుని వాకింగ్ చేయమంటూ నన్ను ప్రతీ రోజు సతాయించడమూ.  ఛస్తున్నాననుకోండి “

“ అయ్యయ్యో , డాక్టర్లు చెప్పిన మాటలని అలా తేలిగ్గా తీసేయకండి భ్రమరాంబ గారూ. నాకంటే మూడేళ్ళు చిన్నవారు మీరు. మీకు వయసైపోవడం ఏమిటండీ ? ఈ మాత్రం దానికి మీరలా డీలా పడవద్దు. నేను ప్రతీ రోజు ఉదయం ఆరు గంటలకి మనకి నాలుగు సందుల అవతల వున్న సహజానంద యోగాశ్రమం కి వెళ్తాను. అక్కడి గురువు గారు చెప్పిన పద్ధతిలో తూచా తప్పకుండా యోగ, ధ్యానం చేస్తే అన్ని రకాల జబ్బులూ త్రగ్గిపోయి హాయిగా వుంటారు. నాతో పాటు ఒక్కసారి వచ్చి చూడండి “ అని చెప్పిన సరోజిని మాటలని ఎప్పటిలా తీసేయలేకపోయింది భ్రమరాంబ.

***

సరోజిని ప్రోత్సాహంతో ఆ మరుసటి రోజు ఉదయమే ఆమె తో కలిసి యోగాశ్రమం కి వెళ్లి గంటన్నర పాటు యోగా, ధ్యానం చేసి వచ్చిన భ్రమరాంబ కి ఒళ్ళంతా నొప్పులుగా అనిపించినా మనసుకి మాత్రం హాయిగా , తేటగా అనిపించింది.

“ మొదట్లో కొద్ది రోజులు మాత్రమె ఈ ఒళ్ళు నొప్పులవీ ఉంటాయి. రెగ్యులర్ గా చేస్తుంటే ఆ నొప్పులన్నీ త్వరలోనే మాయమవుతాయి “ అని   గురువు గారు చెప్పిన మాటలని పూర్తిగా విశ్వసించిన భ్రమరాంబ ,  ఆయన చెప్పినట్లుగానే ప్రతీ రోజు  యోగా, ధ్యానమూ  చేయడమే కాకుండా  ఆయన చెప్పిన  ఆహార నియమాలని కూడా తూచా తప్పకుండా పాటించింది.  దాంతో నెల రోజుల్లోనే ఆమె ఒంట్లో కొవ్వంతా కరిగిపోయి, ఒళ్ళంతా తేలిగ్గా హాయిగా అనిపించసాగింది.  ఒంట్లోకి ఏదో కొత్త శక్తి వచ్చి చేరినట్లుగా వుంది.

***

“ ఈ ఆదివారం ఉదయం పదిగంటలకి  హిమాలయాల నుండి వచ్చిన సిద్ధానంద స్వామి వారు మన యోగాశ్రమంలో ప్రవచనాలని చెబుతారు. ఆయన ప్రవచనాలని బోధించే పధ్ధతి , ఆయన వ్యాఖ్యానమూ చాలా బావుంటాయండి  “ అని చెప్పిన సరోజిని మాటలని గుర్తు పెట్టుకుని ఆ ఆదివారం త్వరగా తయారై ఉదయం తొమ్మిది గంటలకల్లా సరోజిని ఫ్లాట్ కి వెళ్ళింది భ్రమరాంబ.

భ్రమరాంబ వెళ్ళిన సమయానికి అప్పుడే అపూర్వకి వాళ్ళ పని పిల్ల స్నానం చేయించినట్లుంది,  పౌడర్ పూసి గౌను తొడిగి పాపని తయారు చేస్తోంది సరోజిని. మనవరాలు  మారాం చేస్తూ దువ్వెనని , పౌడర్ డబ్బాని కింద పడేస్తూ అల్లరి చేస్తుంటే , వాటిని తిరిగి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెడుతూ పాప చేసే అల్లరిని నవ్వుతూ ఎంజాయ్ చేస్తోంది సరోజిని. ఆ తరువాత పాపని పని పిల్ల ఎత్తుకోగా,  పాప వెనకే వెళ్తూ అన్నాన్ని  చిన్న చిన్న ముద్దలుగా చేసి పాప నోట్లో పెడుతోంది సరోజిని.

“ ఈ వయసులో అలా అన్ని సార్లు వంగి వస్తువులని తీయడమూ , పాప వెనకే ఇలా పరుగులు తీయడమూ  కష్టంగా అనిపించదా మీకు “ అన్న భ్రమరాంబతో  “ అదేం లేదండీ . నిజానికి యిలాంటి చిన్న చిన్న పనులని స్వయంగా చేయడం వలన పిల్లలతో మనకి అనుబంధం పెరగడమే కాకుండా మన శరీరానికి తగినంత ఎక్సరసైజు కూడా దొరుకుతుంది. అప్పుడింక మనం ప్రత్యేకంగా ఏ యోగా లూ చేయవలసిన అవసరం కూడా వుండదు. అయినా యిప్పుడు మనకేమంత వయసైందని ? కాళ్ళు చేతులూ సరిగా ఆడుతున్నంతకాలమూ ఏదో ఒక పని చేస్తూ ఉండడమే మనకీ , మన చుట్టూరా వున్న వాళ్ల కీ కూడా మంచిదండీ ”

మొదటిసారిగా సరోజిని మాటలతో ఏకీభవించిన భ్రమరాంబ మనసుకి “ నిజమేనేమో “ అనిపించాయి ఆ మాటలు.

మనవరాలి పనులన్నీ పూర్తి చేసుకుని సరోజిని కూడా తయారై వచ్చిన తరువాత యిద్దరూ కలిసి యోగాశ్రమానికి వెళ్ళారు. సిద్ధానంద స్వామి వారి ప్రసంగం వినడంలో లీనమై పోయారు ఇద్దరూను.

“ మనుష్యులు సాధారణంగా యాభై , అరవై ఏళ్ల వయసొచ్చేటప్పటికి  యింక తమ ఒంట్లో శక్తి అంతా అయిపోయిందనీ , యిక పై కృష్ణా రామా అనుకుంటూ కాలం గడిపేస్తూ భగవంతుడి పిలుపు కోసం ఎదురు చూస్తూ కాటికి కాళ్ళు చాపుకుని ఉండడమే తాము చేయవలసిన పని‘  అనీ అనుకుంటారు. కానీ ఆ ఆలోచన సరి కాదు.

‘ పనిలేని వాడి మెదడు దయ్యాల కార్ఖానా ‘ అన్నది అందరికీ తెలిసిన విషయమేగా. మనిషి ఏ మాత్రం ఖాళీగా కూర్చున్నా , లెక్కకి మించిన అనవసరపు ఆలోచనలు పుట్టగొడుగుల్లాగా అతని మనసులోనుండి పుట్టుకు వచ్చి  మనసుని కల్లోలపరుస్తాయి. అలాగే శరీరానికి తగినంత పని కల్పించకపోవడం వలన శరీరంలోని భాగాలన్నీ ఎక్కడివక్కడే బిగుసుకుపోతాయి. అలా పని చేయకుండా ఖాళీగా వుండే మనిషి మానసికంగానూ , శారీరకంగానూ ఒక రోగి లా మారి సమాజానికీ , కుటుంబానికీ కూడా భారంలా మారుతాడు. అందుచేత ప్రతీ మనిషీ తనలో జవసత్వాలున్నంత కాలం ఏదో ఒక సత్ వ్యాపకాన్ని పెట్టుకుని తనకి చేతనైనంత పని ని  చేస్తూ నలుగురికీ ఉపయోగపడేటట్లుగా జీవించాలి. నలుగురికి కాకపోయినా,  కనీసం తమ యింట్లో వారికైనా భారంగా మారకుండా,  వారికి సాయంగా ఉండడాన్ని అలవరుచుకుంటే మంచిది. పనితోనే ఆనందాన్ని పొందుతాడట బ్రహ్మ. ‘ ఆనందో బ్రహ్మ ‘ అంటే అదేనని మన ఉపనిషత్తుల్లో ఏనాడో చెప్పారు. పనిలోనే పరమాత్మని దర్శించుకోమంటూ భగవద్గీత లో  కృష్ణపరమాత్మ  చెప్పినదీ అదే ”

స్వామీజీ చెపుతున్న ప్రసంగాన్ని శ్రద్ధగా వింటున్న భ్రమరాంబ కి ఇంతకాలం తన కళ్ళకి కట్టిన మాయతెరలు ఒకటొకటిగా విడిపోతున్నట్లుగా  అనిపించింది.  ఇన్నేళ్ళ నుండీ  తానెంత  అజ్ఞానం లో ఉండిపోయిందో కూడా తెలిసొచ్చింది. పొరబాటునైనా మాట తూలని సౌమ్యురాలైన తన కోడలికి తాను ఏవిధమైన సహాయమూ చేయకపోగా ,  ఎన్నో మార్లు పరుషమైన పదజాలంతో ఆమెని తాను బాధ పెట్టిన విషయం కూడా జ్ఞప్తి కి వచ్చి సిగ్గుగా అనిపించింది.

“ నానమ్మా “ అంటూ తన మనవరాలు అక్షర తన వద్దకి పరిగెత్తుకుని వచ్చి ఎత్తుకోమన్నట్లుగా ప్రేమగా చేతులు చాపినా కూడా “ఆ పిల్ల కనక తనకి బాగా మాలిమి అయిపోయిందంటే,  యింక పిల్లని తనకి అంటగట్టేసి కోడలు ఆఫీస్ కి వెళ్లి పోతుందేమో “ అన్న దురాలోచనతో స్వంత మనవరాలిని కూడా  దూరంగా పెట్టేసిన తన సంకుచిత మనస్తత్వానికి తన మీద తనకే అసహ్యంగా అనిపించింది.

తను చేసిన పొరపాటులన్నీ ఒకటొకటిగా ఎదుట నిలబడి తనని నిలదీస్తుంటే , యింక ఆగలేనట్లుగా సరోజిని తో ఒక మాటైనా చెప్పాలన్న ధ్యాస కూడా లేకుండా అక్కడి నుండి లేచి వడి వడిగా యింటికి వచ్చేసింది భ్రమరాంబ.

***

కాలింగ్ బెల్ సౌండ్ ని వినగానే కూతురిని చంకలో ఎత్తుకునే తలుపులు తెరిచింది ప్రణవి.  అప్పుడే స్నానం చేయించిందేమో పాప వంటి మీద కేవలం డ్రాయర్ మాత్రమే వేసుకుని వుండడంతో,  భ్రమరాంబ కళ్ళకి  చిన్ని కృష్ణుడిలాగే గోచరించింది. వెంటనే కోడలు చేతుల నుండి పాపని  ఎత్తుకుని  బుగ్గల మీద  ముద్దులు పెడుతున్న నానమ్మని కొత్తగా చూసింది అక్షర.

“ అమ్మాయ్ ప్రణవీ, కాస్త ఆ పౌడర్ డబ్బా  , పాప  డ్రెస్ అవన్నీ నాకివ్వమ్మా . పాపని నేను తయారు చేస్తాను”  అంటున్న అత్తగారి వైపు నమ్మలేనట్లుగా చూసింది ప్రణవి.

“ అంతే కాదమ్మా , యికపై నా మనవరాలి పనులన్నీ నేనే స్వయంగా చూసుకుంటాను ప్రణవీ. ఆ డే కేర్ సెంటర్ అదీ మాన్పించేసి  స్కూల్ అయిపోగానే పాపని మన యింట్లోనే దింపే ఏర్పాటు చేయమ్మా. నా మనవరాలిని నా చేతులతో తృప్తిగా పెంచుకుంటాను “

అప్పుడే హాల్లోకి వచ్చిన మనోహర్  తన భార్యతో  తల్లి చెబుతున్న మాటలని  విని ఎంతో ఆశ్చర్యపోయాడు.

“ ఉన్నట్లుండి సడెన్ గా నీలో యింత మార్పు ఏమిటమ్మా “ అన్నాడు.

“ ఏమిటోరా మనూ , నేను పెద్దగా చదువుకోలేదు . అందుకే చాలా విషయాల మీద నాకు సరైన అవగాహన లేదు.  పోనీ బాగా చదువుకున్న మీ నాన్న దగ్గరైనా అడిగి తెలుసుకోవడానికి ,  పెళ్లి తరువాత మీ నాన్నతో నేను గడిపిన కాలమూ చాలా తక్కువే. ఆ మహానుభావుడు పోయిన తరువాత వొంటి చేత్తోనే నిన్ను పెంచుకొచ్చాను. నాకు మంచీ చెడు చెప్పే వాళ్ళెవ్వరూ లేకపోవడంతో యింతకాలం నా ఆలోచనా విధానంలో వున్న లోపం నాకు తెలియనేలేదురా.  అదృష్టం కొద్దీ ఈ వేళ సిద్దానంద స్వామి వారి ప్రవచనాలని విన్నాక గానీ  నేనింతకాలంగా చేస్తున్న తప్పు నాకు తెలిసి రాలేదు. ముందుగా నన్ను ఆ సత్సంగానికి తీసుకుని వెళ్ళిన సరోజినికి మనమంతా కృతజ్ఞతలని చెప్పుకోవాలి  “  అంటూనే  “ అయ్యో , హడావిడిలో పడి సరోజిని కి ఒక మాటైనా చెప్పకుండానే యింటికి వచ్చేసానే “ అంది.

అప్పుడే యింటికి వచ్చిన సరోజిని “ హమ్మయ్య , మీరు యింటికి క్షేమంగా చేరారు కదా. స్వామీజీ ప్రసంగంలో లీనమై పోయిన నేను మీరు వెళ్లిపోయిన విషయం గమనించనే లేదు. మీకు స్వామీజీ  చెప్పిన విషయాలు నచ్చలేదేమో, అందుకే మధ్యలోనే వచ్చేసినట్లున్నారు “  అంది.

“ అయ్యయ్యో , ఎంత మాట. స్వామీజీ చెప్పినదాంతో నా మనసుని ఇంతకాలమూ అంటిపెట్టుకున్న కల్మషమంతా  కొట్టుకుపోయి నా మనసిప్పుడు ప్రక్షాళనమైంది. అందుకే యింక అక్కడ ఒక్క క్షణం కూడా కూర్చోలేక వచ్చేసాను. మీతో చెప్పకుండా వచ్చేసినందుకు ఏమీ అనుకోకండి. ఆ క్షణంలో నాకేమీ తోచలేదంటే నమ్మండి“

“ ఫరవాలేదండీ. ఆ స్వామీజీ వారు హిమాలయాలలో తపస్సు చేసుకునే మహిమాన్వితులు. ఎప్పుడో రెండు , మూడు సంవత్సరాలకొక మారు మాత్రమే ఆయన ఈ నాగరిక ప్రపంచానికి వచ్చి సత్సంగాలవీ చేసి వెళుతుంటారు. ఆయన బోధనల వలన  మీ మనసుకి ప్రశాంతత చిక్కిందంటే చాలా సంతోషమండీ  “ అంటున్న సరోజిని రెండు చేతులనీ  పట్టుకుని  “ యిదంతా మీ చలవే సరోజిని గారూ “ అంటూ కృతజ్ఞతలని చెప్పుకుంది భ్రమరాంబ.

“ నాదేముందండీ,  ఇవన్నీ ఆ భగవంతుడి లీలలు. మనం నిమిత్తమాత్రులం.  మా అపూర్వ నిద్ర లేచే వేళ అయింది. నిద్ర లేవగానే నేను కనబడకపోతే మళ్ళీ అది గొడవ చేస్తుంది. వెళ్లొస్తాను “ అంటూ వెళ్ళింది సరోజిని.

“ నానమ్మా , నా రూమ్ కి రా. నీకు నా బొమ్మలన్నీ చూపిస్తా “ అంటూ  ఆవిడ చేతిని పట్టుకుని అక్షర తన రూమ్ కి తీసుకెళ్తుంటే ఆనందంగా మనవరాలి వెంట వెళ్తున్న భ్రమరాంబ ని చూస్తూ , ఒక్కరోజులోనే ఆవిడలో అంతటి మంచి మార్పు రావడానికి కారణమైన ఆ స్వామీజీకి మనసులోనే శతకోటి ప్రణామాలని అర్పించుకుని  “ ఆనందోబ్రహ్మ “  అనుకున్నారు ప్రణవి, మనోహర్ లు.


అప్పరాజు నాగజ్యోతి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.