గెలుపు మనదే!

3
812

రెండవ బహుమతి  – వయస్సు 25 లోపు


గెలుపు మనదే!


”అరే విశ్వం, ఏమిట్రా అలా ఢీలా పడిపోయావు?” అని అడిగాడు చంద్ర స్నేహితుడి వైపు అభిమానంగా చూస్తూ.

”ఢీలా కాక ఏముంది చెప్పరా … ఈసారి కూడా నాకు వీసా రాలేదు, రిజెక్టు అయింది” అన్నాడు విశ్వం దిగులుగా.

”అంత మాత్రానికే ఇంత నీరసపడిపోతే ఎలారా … మరోసారి ప్రయత్నం చేద్దువుగానిలే!” అన్నాడు చంద్ర ఓదార్పుగా.

”లాభం లేదురా, నా వల్ల కాదింక … యు.ఎస్‌ మీద ఆశలు వదిలేసుకున్నాను. మా కజిన్‌ చెప్పినట్లు లండన్‌ వెళ్లిపోతాను. దానికింత బాధ ఉండదట కదా!” అన్నాడు విశ్వం.

ఆ మాట విని అతడి వంక ఆలోచనగా చూస్తూ ”అరే విశ్వం, నువ్వేమీ అనుకోనంటే నేనొక మాట చెప్తాను. అసలు నువ్వెందుకురా, అమెరికా, లండన్‌ వెళ్లాలనుకుంటున్నావు?” అనడిగాడు చంద్ర.

”నేనని ఏముందిరా … మన శరత్‌, నవీన్‌ కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నారు కదా!” అన్నాడు విశ్వం.

”వాళ్ల సంగతి వదిలెయ్యి … ముందు నువ్వు ఎందుకు వెళ్లాలనుకుంటున్నావో చెప్పు!” అనడిగాడు చంద్ర.

”ఎందుకేంట్రా, బాగా సంపాదించుకోవాలి. దర్జాగా బ్రతకాలి” అన్నాడు కలల్లో తేలిపోతూ.
”అయితే అలాంటి జీవితం ఇక్కడ చూపిస్తే వెళ్లకుండా ఉండిపోతావా?” అని అడిగాడు చంద్ర స్నేహితుడి వైపు అభిమానంగా చూస్తూ.

”ఇక్కడా, అలాంటి జీవితమా? నో వే! చూస్తున్నాం గదా, మన ముందు బేచ్‌ వాళ్లు అటు కేంపస్‌ సెలక్షన్‌ రాక, ఇటు వేరే ఉద్యోగాలు ఏమీ దొరక్క నానా బాధలూ పడుతున్నారు. కొందరు బేంక్‌ టెస్టులు రాసి బేంక్‌ ఉద్యోగులుగా సెటిల్‌ అవుతున్నారు. అలాంటి గానుగెద్దు జీవితం నాకు వద్దురా!” అన్నాడు విశ్వం నిరాసక్తంగా.

”అలాంటిది కాదులేరా, నీవు కోరుకున్న దర్జా జీవితమే … కాకపోతే దాని కోసం కొంచెం కష్టపడాలి. కొంతకాలం వేచి ఉండాలి. విత్తు నాటిన వెంటనే ఫలాలను ఇవ్వదు కదా … అలాగే మనం ప్రయత్నం మొదలు పెట్టిన వెంటనే ఫలితాల కోసం ఆశించకూడదు” అన్నాడు చంద్ర.

”ఏంట్రా, వేదాంతం మాట్లాడుతున్నావు … ఇదేమన్నా కాశీ మజిలీ కథా, జీవితంరా బాబూ, జీవితం … విత్తంటావు, ఫలాలంటావు. కొంపదీసి చెట్లు నాటే కార్యక్రమం కాదు కదా!” అన్నాడు విశ్వం స్నేహితుని మాటలు పరిహాసంగా కొట్టి పడేస్తూ.

”కాదులేరా, ఇన్నాళ్లూ నేను సిస్టం ముందు కూర్చుని వర్క్‌ చేస్తూ, నోట్సు రాసుకుంటూ ఉంటే … పరీక్షలు అయ్యాక సరదాగా ఎంజాయ్‌ చెయ్యకుండా ఇంకా ఈ బ్రహ్మరాతలేంట్రా బాబూ అని మీ ముగ్గురూ నన్ను వేళాకోళం చేసేవారు అవునా?” అనడిగాడు చంద్ర.

”అవును … ఏదో సరదాకి అలా అన్నాము” అన్నాడు విశ్వం.

”సరదాకే అన్నారులే … నేనేం సీరియస్‌గా తీసుకోలేదు. ఇంతకీ నేను ఇన్నాళ్లూ చేసిన వర్క్‌ ఏమిటో చూస్తావా?” అంటూ తన బేగ్‌ లోని లేప్‌టాప్‌ తీసి ఓపెన్‌ చేసి పెట్టాడు చంద్ర.

ఇంతలో నవీన్‌, శరత్‌లు వచ్చారక్కడికి ముఖాలు వేలాడేసుకుని.

వాళ్లని చూడడంతోనే ”రండ్రా, సమయానికి వచ్చారు. ఇదిగో మన వీరుడు ఏదో ఇన్‌వెంట్‌ చేశాడట … చూద్దాం!” అన్నాడు విశ్వం జోక్‌ చేస్తున్నట్లుగా.

చంద్ర అదేం పట్టించుకోకుండా లేప్‌టాప్‌ ఓపెన్‌ చేస్తూ ”ఏరా మీరు వెళ్లిన పని ఏమయిందిరా?” అనడిగాడు.

”ఏమవుతుంది, మేమెక్కడికి పోయినా మా దురదృష్టం మా కంటే రెండడుగులు ముందే ఉంటోంది. చేతికి చిక్కినట్లే చిక్కి అన్నీ జారిపోతున్నాయి. ఇటు ఉద్యోగమూ రాలేదు, అటు వీసా రాలేదు!” అన్నాడు నవీన్‌ నిరాశగా.

”అవునురా చంద్రా, మేము పరీక్షలు అయిన దగ్గర నుండీ ఫ్యూచర్‌ కోసం ఇంత వర్రీ అవుతున్నాము. ఉద్యోగాల వేటలో తల మునకలై ఉన్నాము. కానీ నువ్వేంట్రా ఏ ప్రయత్నమూ లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు నిమ్మళంగా కూర్చుని ఈ లేప్‌టాప్‌తో కుస్తీలు పడుతున్నావు” అన్నాడు శరత్‌ ఆశ్చర్యంగా చూస్తూ.

”అసలీ బాధలెందుకు గానీ, చిన్నప్పటి నుండీ మనం నలుగురం కలిసి చదువుకున్నాము. బిటెక్‌ లో కూడా ఒకే బ్రాంచి మనది. విశ్వం గాడితో పాటు మనం కూడా హాయిగా లండన్‌ వెళ్లిపోదామురా!” అన్నాడు నవీన్‌ ఆశగా.

”అవునవును, మన కోసమే అక్కడ ప్లేకార్డులు పట్టుకొని స్వాగత సత్కారాలతో ఎదురు చూస్తూన్నారు … దానికి మాత్రం వీసా రావద్దూ?” అన్నాడు శరత్‌.

”దానికి యు.ఎస్‌ అంత తతంగం లేదట లేరా!” అన్నాడు విశ్వం.

”ఒరే బాబుల్లారా, కాస్త ఆగండిరా … ముందు నేను చెప్పేది వినండి. ఆ తరువాత ఏం చేయాలో నిర్ణయించుకుందురు గానీ … ఇటు చూడండి ఒక్కసారి. మనం ఎక్కడికీ పోకుండా ఎవరి కాళ్లూ చేతులు పట్టుకొని ప్రాధేయపడకుండా … మనమే స్వంతంగా ఒక ఇండస్ట్రీ పెడదాం! మనం వేరొక దగ్గరికి ఉద్యోగాలుకు వెళ్లడం కాదు. మనమే పదిమందికి ఉపాధి కల్పిద్దాం!

చీకటిలో కూర్చుని ఆ చీకటిని తిట్టుకోకుండా ఒక చిరు దీపాన్ని వెలిగించి ఆ చీకట్లను తరిమి కొడదాం!” అన్నాడు చంద్ర ఆత్మ విశ్వాసం నిండిన కంఠంతో.

”ఏమి ఇండస్ట్రీరా?” అనడిగాడు విశ్వం ఆసక్తిగా. మిత్రుని మాటలు అతడిలో ఉత్సాహాన్ని నింపాయి.

”ఒక మోటారు సైకిల్‌ తయారు కావాలంటే వందలాది విడి భాగాలు తయారు చేసి అసెంబుల్‌ చేయాలి. అదే కారుకైతే వేయి పైగా విడి భాగాలు కావాలి … అక్కడే మనం చదివిన మెకానికల్‌ ఇంజనీరింగ్‌ని ఉపయోగించుకొని పరిశ్రమని స్థాపిద్దాం! ముందు అటువంటి భాగాలను మిల్లింగ్‌ మెషిన్స్‌ ద్వారా మనమే చిన్న చిన్న కంపొనెంట్స్‌ తయారు చేద్దాం … అది సక్సెస్‌ అయితే నానో బోరింగ్‌ ద్వారా బ్లాగ్స్‌ సిస్టమ్‌ చేద్దాం … సక్సెస్‌ రేట్‌ను బట్టి మన ఉత్పత్తులను పెంచుకుంటూ పోదాం!” అంటూ ఎవరెవరు అలా చేసి

ఎంత సక్సెస్‌ సాధించారో ప్రాంతాల వారీ వివరిస్తూ … వీడియో క్లిప్పింగ్స్‌ చూపించసాగాడు.
”చూశారా వీళ్లు, మన ఆంధ్రాలోనే మనం అనుకున్నట్లే చిన్నగా మొదలు పెట్టి స్ట్రింగింగ్‌ తయారీలో మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తరువాత కంప్యూటర్‌ ద్వారా 2డి, 3డి ఆపరేషన్స్‌ ద్వారా మూస తయారీ కటింగ్స్‌ అన్నీ ప్రోగ్రామింగ్‌ ద్వారా చేసుకుపోతున్నారు. వాళ్లు మోటార్‌ సైకిల్‌ విభాగాలు చేస్తున్నారు …

మనం కార్ల విభాగాలు తయారు చేద్దాం!” అన్నాడు చంద్ర ఉత్సాహంగా.

”మరి మార్కెటింగ్‌ ఎలాగరా … ఇదంతా చాలా కష్టం కదూ?” అన్నాడు శరత్‌.

”ఏమీ కష్టం ఉండదు. మనం తయారు చేసిన పార్టులను ఆటోమొబైల్‌ కంపెనీల వాళ్లే ఆర్డరు మీద తీసుకుపోతారు. ఇవాళ, రేపూ కార్లకు ఎంత డిమాండ్‌ ఉందో తెలుసు గదా! ప్రతి ఒక్కరూ కార్‌ మెయిన్‌టైన్‌ చేసే స్థాయి ఉంది కదా! మోడరన్‌ ఫీచర్స్‌తో కాంపొనెంట్స్‌ తయారు చేస్తే హాట్‌ కేక్స్‌లా వెళ్లిపోతాయి” అన్నాడు చంద్ర ఉత్సాహంగా.

”అరే చంద్రా, దానికి కేపిటల్‌ చాలా కావాలేమో కదరా!” అని అడిగాడు నవీన్‌.

”అవును, ఎంత తక్కువలో తక్కువ చూసుకున్నా దాదాపు కోటి రూపాయలు కావలసి ఉంటుంది. మనం ఇనీషియల్‌గా కొంత పెట్టి మిగతాది బేంక్‌ లోన్‌ పెడదాం!” అన్నాడు చంద్ర.

”అదేరా, ఇనీషియల్‌ ఎంత పడుతుంది?” అని అడిగాడు నవీన్‌ ఆత్రంగా.

”మనం తలొకరం పది లక్షలయినా పెట్టాల్సి ఉంటుంది” అన్నాడు చంద్ర.

”ఓస్‌ ఇంతేనా … నాకు ఓకెరా .., మా నాన్న నన్ను లండన్‌ పంపేందుకు పది లక్షల ఖర్చుకు రెడీగా ఉన్నారు!” అన్నాడు విశ్వం.

”నాకు కూడా ఓకెరా … మా మావయ్య కూతుర్నే కదా నేను పెళ్లి చేసుకోబోయేది. అడ్వాన్సుగా కట్నం ఇమ్మని అడుగుతాను” అన్నాడు నవీన్‌.

”నాకు డబల్‌ ఓకెరా బాబూ … నువ్వు చెప్తూంటేనే నాకు ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించింది” అన్నాడు శరత్‌ ఉత్సాహంతో.

”మరి నీ సంగతిరా చంద్రా … మీ తాతగారు అంత ఎమౌంట్‌ సర్దగలరా?” అన్నాడు విశ్వం జాలిగా చూస్తూ. చంద్రా చదువుకోసం మామూలు స్కూలు మాష్టరుగా చేసి రిటైర్‌ అయిన ఆయన ఎంత కష్టపడ్డారో విశ్వానికి తెలియనిది కాదు. అందుకే అలా అడిగాడు.

”చూడాలిరా … అసలు మీరంతా నా ప్రపోజల్‌కి ఒప్పుకుంటారో లేదో అని నేనీ విషయం బయట పెట్టలేదు. మీరు ఒప్పుకోకపోతే నా వర్కంతా పేపర్లకే పరిమితం అయ్యేది” అన్నాడు చంద్ర నెమ్మదిగా.
”అలా ఎప్పటికీ కాదు గానీ చంద్రా, నేనొక మాట చెప్తాను విను … తాతగారిని ఈ వయసులో ఇబ్బంది పెట్టడం సరిగాదు. నీ వంతు కూడా మేము ముగ్గురం తలో కాస్త వేసుకుంటాం, కాదనకు!” అన్నాడు విశ్వం నచ్చజెప్తున్నట్లుగా.

”వద్దురా, స్నేహం మధ్య డబ్బు చోటు చేసుకుంటే బంధాలు బలహీనపడిపోతాయి. నాకది ఇష్టం లేదు” అన్నాడు ఖచ్చితమైన స్వరంతో.

”ఎందుకు చెడిపోతుందిరా మన స్నేహం? అంత బలహీనమైనదా మన బంధం … ఈ ప్రాజెక్టు కోసం రాత్రీ, పగలూ కష్టపడి ప్రోగ్రామును తయారు చేసింది నువ్వు. ఆ పైన ఎంతో మెటీరియల్‌ సేకరించావు. నీవు చేసిన కృషికి ఎవరు ఖరీదు కడతారు. దాని ముందు మేము పెట్టే డబ్బు ఏపాటిది?” అన్నాడు నవీన్‌ ఉద్రేకంగా. మిగతా ఇద్దరూ అదే భావంతో అతడి వంక చూశారు.

”వద్దురా … నన్ను ఇబ్బంది పెట్టకండి. మీరు అలా చేస్తే ఇకముందు నేను మీతో ఫ్రీగా ఉండలేను” అన్నాడు చంద్ర.

ఆ మాటతో ముగ్గురు మిత్రుల నోటికీ తాళం పడింది.

ఇంటికి వచ్చాక తాతగారితో ఆ విషయం ఎలా ప్రస్తావించాలో బోదపడలేదు చంద్రాకి.

మనవడు ఎందుకు అలా ఉన్నాడో అర్ధం కాక ”ఏమిటి సావిత్రీ, మన చంద్రా ఉదయం నుండీ అలా ఉన్నాడు?” అనడిగారు భార్యని.

”నాకూ అదే అర్ధం కావడం లేదండీ … ఒకవేళ వాళ్ల అక్కను చూడాలని ఉందేమో కనుక్కుంటాను ఉండండి” అంది సావిత్రమ్మ.

చంద్రా వంటింట్లో పనిచేసుకుంటున్న సావిత్రమ్మ దగ్గరకు వెళ్లి ఏదో చెప్పబోయి తటపటాయింపుగా ఆగిపోయాడు.

అతడి వైఖరి గమనించి ”ఏమిట్రా కన్నా, ఏం కావాలి … అక్కని చూడాలని ఉంటే చెప్పు, వెళదాం!” అంది సావిత్రమ్మ మృదువుగా.

”అదేం కాదు నానమ్మా, నేనూ విశ్వం, నవీన్‌, శరత్‌లు కలిసి ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాము. దానికి చాలా డబ్బు కావాలి …” అంటూ ఆగాడు.

”ఇండస్ట్రీనా … దానికి మన వాటా ఎంత కావాలిరా … ఓ యాభైవేలయితే సరిపోతాయా?” అనడిగింది సావిత్రమ్మ మనవడి వంక అమాయకంగా చూస్తూ.

”యాభైవేలా … అది కోటి రూపాయల ప్రాజెక్టు నానమ్మా!” అంటూ నీరసంగా నవ్వాడు చంద్రా.

”కోటి రూపాయలే … అంటే మన వాటాకి పాతిక లక్షలా?” అంటూ ఆశ్చర్యంగా నోరు తెరిచేసింది సావిత్రి.

”ఏమంటున్నాడు నీ మనవడు?” అంటూ అక్కడికి వచ్చారు మాధవరావు గారు.

”నాకేగానీ నీకు కాడా ఏమిటి మనవడు … వాడు ఏదో ఇండస్ట్రీ పెడతాడట. దానికి కోటి రూపాయలు

అవుతుందట” అంది సావిత్రమ్మ ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే.

”ఏమిట్రా అది?” అనడిగాడు ఆయన చంద్రా వంక చూస్తూ.

ఆయనకు కూడా ఆశ్చర్యంగానే ఉంది కోటి రూపాయల ప్రాజెక్టు అనేసరికి.

”అవును తాతయ్యా … విశ్వం, నేను, శరత్‌, నవీన్‌ కలిసి ఇండస్ట్రీ పెడదామనుకుంటున్నాము …” అంటూ వివరంగా అంతా చెప్పాడు చంద్రా.

మనవడు చెప్పింది విని విస్మయపడుతున్నట్లుగా చూశారాయన. సాదాసీదాగా కనపడే చంద్రాలో ఇంత ఆలోచనాశక్తి దాగి ఉందా? సందేహం లేదు వీడు చాలా ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు అనుకున్నారు మాధవరావుగారు.

తాను చెప్పింది విని మౌనంగా ఉన్న తాతగారి వైపు ఆరాటంగా చూస్తూ ”ఏమిటి తాతయ్యా, ఏమీ మాట్లాడరు … అంత డబ్బు ఎలా సమకూరుస్తామనా? అంతా మనం పెట్టక్కర లేదు. తలా కొంచెం వేసుకొని మిగతాది బేంకు లోను తీసుకుంటాము. నా వాటా పదిలక్షలయితే సరిపోతుంది అనుకుంటున్నాను” అన్నాడు చంద్రా.

”డబ్బుదేముందిరా, ఎలాగోలాగ సంపాదిద్దాము. కానీ నీ ఆలోచన మాత్రం చాలా గొప్పగా ఉందిరా! రియల్లీ ఐ యామ్‌ ప్రౌడ్‌ ఆఫ్‌ యూ!” అన్నారు గర్వంగా మనవడి వంక చూస్తూ.

”కానీ తాతయ్యా, పది లక్షలు అంటే మాటలా … ఎలా సమకూరుస్తాము అని నేను కూడా ఆలోచిస్తున్నాను. మీకు తెలిసినవారినెవరినైనా అప్పు అడగండి తాతయ్యా … రెండు సంవత్సరాల్లో మొత్తం వడ్డీతో సహా తీర్చేద్దాం!” అన్నాడు చంద్రా మెరిసే కళ్లతో చూస్తూ.

”అంత సొమ్ము మనకు అప్పెవరు ఇస్తారు చంద్రా, ఒక్క రాజయ్య తప్ప … అతడి ఆశ నీకు తెలుసు కదా … వాళ్లమ్మాయిని చేసుకుంటే అప్పుగా కాదు, ఎంతయినా ఊరికే ఇచ్చేస్తాడు. కానీ మనకది ఇష్టం లేదు కదా! అయినా కాకపోయినా అటు బేంకు లోను పెట్టి దానికి ఇంట్రెస్టు కడుతూ మళ్లీ ఇటు ప్రైవేటుగా అప్పు చేస్తే నువ్వు చాలా ట్రబుల్స్‌లో పడతావురా! అందుకని మన పొలం బేరం పెడదాం … లోగడ వెంకట్రామయ్యగారు అడిగారు, మన చేను వాళ్ల చేను పక్కనే ఉంది కలిసి వస్తుంది గదా అని. అతడ్ని అడిగి చూస్తాను” అన్నారు మాధవరావుగారు.

ఆ మాట వింటూనే కంగారుగా చూస్తూ ”పొలం అమ్ముతారా తాతయ్యా, వద్దు. ఉన్న ఆ ఒక్క ఎకరం అమ్మితే ఎలా? మనకి ఉన్న ఆ కాస్త ఆధారమూ పోతుంది” అన్నాడు బాధగా చూస్తూ.

”కాదురా, నేను బాగా ఆలోచించే చెప్తున్నాను … ఇంకేం మాట్లాడకు!” అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్లిపోయారాయన.

తాతగారు వెళ్లిన వైపే బాధగా చూస్తూ ”ఏమిటి నానమ్మా, తాతయ్య ఇలా అంటున్నారు … ఆ మాత్రం అప్పు పుట్టదా మనకి? అప్పు చేస్తే మాత్రం ఎంతలో తీరుస్తాము?” అన్నాడు చంద్రా ఆరాటంగా.
”అరే చంద్రా, మీ తాతగారు ఏమి చేసినా బాగా ఆలోచించే చేస్తారు. నువ్వింకేం మాట్లాడకు!” అంది సావిత్రమ్మ.

దాంతో ఇంకేమీ అనలేక అక్కడ నుండి వచ్చేశాడు ముందు గదిలోకి. కానీ ఎంత ఆలోచించినా అతడికి పొలం అమ్మటం అనే మాటే మనసుకు నచ్చలేదు … అలా అని తాను రాత్రీ పగలూ కష్టపడి తయారు చేసిన ప్రాజెక్టునీ వదులుకోవాలనిపించలేదు. ఆ రాత్రి పడుకున్నా కంటి మీదకు కునుకన్నదే రాలేదు. చివరికి రాజయ్య కూతుర్ని పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలూ పరిష్కారమైపోతాయి అనే నిశ్చయానికి వచ్చేశాడు.

ఆ మాటే మర్నాడు ఉదయం మాధవరావుగారితో చెప్పాడు.
అది విని ”నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా చంద్రా? మనకి ఇష్టం లేని కూరతో ఒక్క పూట భోజనం చేయడానికే ఎంతో ఇబ్బంది పడతాము. అలాంటిది ఇష్టంలేని అమ్మాయితో జీవితాంతం ఎలా కాపురం చేస్తావురా? నీ ప్రాజెక్టు కోసమని నిన్ను నువ్వు తాకట్టు పెట్టేసుకుంటావా? అది నేను చూస్తూ ఊరుకోనా? వద్దు నాన్నా, అలా చేస్తే ఈ ముసలి ప్రాణం తట్టుకోలేదు” అన్నారు బాధగా.

”అది కాదు తాతయ్యా, అమ్మా నాన్నా ఎలా ఉంటారో నాకు తెలియదు. వాళ్లు పోయాక అక్కనీ, నన్నూ నానమ్మా, మీరూ కళ్లలో పెట్టుకొని పెంచి ఇంతవాళ్లని చేశారు. మీరు రిటైరైనా కూడా పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేసి నా చదువు కోసం, ఉన్నతి కోసం ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు ఈ వయసులో మీకేమీ చెయ్యకపోగా ఇండస్ట్రీ కోసం ఉన్న పొలం అమ్మేద్దాము అంటున్నారు. ఒకవేళ నేను ఇందులో సక్సెస్‌ కాకపోతే మనందరి పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న నన్ను స్థిమితంగా ఉండనీయడం లేదు” అన్నాడు చంద్ర బేలగా చూస్తూ.

”అరే నాన్నా … ఒక మాట చెప్తాను విను. మనం ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు ఇది అవుతుందా లేదా అని సందేహపడుతూ మొదలు పెట్టకూడదు చంద్రా … గెలుస్తామనే నమ్మకంతో ఆశలను శ్వాసగా చేసుకొని పని మొదలు పెట్టాలి. అప్పుడు విజయం ఖచ్చితంగా నీ స్వంతమై తీరుతుంది.

అదుగో ఆ గులాబీనే చూడు, దాని చుట్టూ ఎన్ని ముళ్లున్నాయో గమనించావా? ఆ పువ్వును కోయాలంటే ఆ ముళ్లు నిన్ను తాకకుండా ఉండాలని ఎంతో జాగ్రత్తగా కోస్తావు. అలాగే విజయాన్ని పొందడానికి కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఒడుపుగా వాటిని అధిగమించి విజయాన్ని నీ చేజిక్కించుకోవాలి” అన్నారు. జీవితాన్ని కాచి ఒడపోసిన అనుభవం ఆ మాటల్లో కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది.

”అది కాదు తాతయ్యా, ఉన్న ఈ ఒక్క ఎకరం అమ్మేస్తానంటున్నారు. రేపు నేను అందులో సక్సెస్‌ కాకపోతే ఆ తరువాత మనందరి పరిస్థితి ఏమిటి అనేదే నా బాధ. అందుకే అసలీ ప్రాజెక్టునే మానుకుందామని ఉంది నాకు” అన్నాడు చంద్రా దీనంగా చూస్తూ.

”వద్దు చంద్రా ఇంకేం మాట్లాడకు … ఎంత చెప్పినా వినకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలతో నిన్నటి నుండీ ఇదే పాట పాడుతున్నావు. చేజేతులా ఇంత మంచి అవకాశాన్ని వదులుకుందామనుకుంటున్నావు. నువ్వు అనుమానిస్తున్నట్లు ఏదీ జరగదు. ఒకవేళ జరిగిందే అనుకో … నా పెన్షన్‌ నాకు వస్తుంది. చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం నీకు దొరక్కపోదు. అయినా నువ్వన్నట్లు మనకి కలిసి రాలేదనుకో అప్పుడయినా చేసిన అప్పు తీర్చేందుకు పొలం అమ్మాలి కదరా … కనుక మరేం ఆలోచించకుండా ప్రొసీడ్‌ అయిపోదాం!” అన్నారాయన హుషారుగా మనవడి భుజం తడుతూ.

తాతగారు ఇచ్చిన భరోసాతో చంద్రా మనసు కొంచెం తేలికపడింది. ”సరే తాతయ్యా, ఈ విషయం మా ఫ్రెండ్స్‌కి చెప్పి వస్తాను. మీరు వెంకట్రామయ్యగారితో మాట్లాడి బేరం సెటిల్‌ చేయండి” అన్నాడు చంద్రా అక్కడి నుండి లేస్తూ.

చంద్రా వెళ్లాక లోపలి నుండి వచ్చింది సావిత్రమ్మ. ”ఏమంటున్నాడు వెర్రినాగన్న … నిన్నటి నుండీ నా దగ్గర ఒకటే పాట, పొలం అమ్మవద్దని. ఆ రాజయ్య కూతుర్ని చేసుకుంటాను … వాళ్లిచ్చే కట్నం నా వాటా కింద పెట్టుబడిగా పెడతానంటాడు. గతంలో ఆ పిల్ల ఊసెత్తితే … పగలు చూస్తే రాత్రి కలలోకి వస్తుంది, దాన్నెవరు చేసుకుంటారు అనేవాడు. ఇప్పుడు మనకి ఆధరువు పోతుందని వాడిని వాడే తాకట్టు పెట్టేసుకుంటానంటున్నాడు. నేనిక్కడికి వస్తే వాడు మరీ బేలగా మాట్లాడుతాడని లోపలే ఉండిపోయాను. వాడి మనసుకు హత్తుకునేలాగా మీరు బాగా చెప్పారండీ!” అంది ప్రశంసగా భర్త వంక చూస్తూ.

”సావిత్రీ, మన చంద్రా హనుమంతుడిలాంటి వాడు … వాడిలో ఉన్న శక్తి వాడికే తెలియదు. వాళ్ల నాన్నలాగే వీడికి కూడా అన్నీ ధర్మసందేహాలే! కానీ, ఈ పిల్లల్ని చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తోంది నాకు. ఈ కాలం పిల్లలందరూ బి.టెక్‌లు, యంబిఏలు చేసి ఆ తరువాత ఏవేవో కంప్యూటర్‌ కోర్సులు చేసి రెక్కలు కట్టుకొని డాలర్ల మోజులో విదేశాలకు ఎగిరిపోతున్నారు. ఇక్కడ నేర్చిన మేధోసంపత్తినంతా అక్కడ ధారపోసి కొత్త కొత్త విషయాలను కనిపెట్టి ఆ దేశాన్ని సుసంపన్నం చేస్తూ … మన దేశంలో ఏముంది ఉత్త మట్టి తప్ప అని అంటూంటే … వీళ్లు మాత్రం మాకింత చేసిన దేశానికి మేము కూడా ఏదో చేయాలనే తపన నాకెంతో నచ్చింది సావిత్రీ!

ఇందాక విశ్వం బజారులో కలిసి అంతా చెప్పాడు. వీళ్లందరికీ ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి గారు ఆదర్శమట … ఏమీ సందేహం లేదు సావిత్రీ, వీళ్లు నలుగురూ ఎవరూ ఊహించలేనంత ఎత్తుకు ఎదుగుతారు” అన్నారు మాధవరావు గారు.

”తెలుసండీ … వాడు నిత్యం నా వెనక వెనక తిరుగుతూ చెప్పే కబుర్లన్నీ ఇవే కదా!” అంది మురిపెంగా.
అనుకున్నట్లే నలుగురు మిత్రులూ కలిసి అన్ని ఫార్మాలిటీస్‌ పూర్తి చేసుకుని ఏడాది తిరిగేసరికి ఇండస్ట్రీని ప్రారంభించారు. చూస్తూండగానే వటుడింతై, అంతై అన్నట్లు అచిరకాలంలోనే ఎన్నో విజయాలను సాధించింది. మిత్రులందరి మనసుల్లోనూ ఆనందపు జల్లులు కురిసేలా చేసింది. తమకి ఇంత అదృష్టాన్ని కలిగించిన చంద్రాకి ఏమిచ్చినా ఋణం తీరదు అనుకున్నారు విశ్వం, శరత్‌, నవీన్‌లు.


పెబ్బిలి హైమవతి

3 COMMENTS

  1. Gelupu manade is excellent. It creates hope in the mind of a person who wish to innovate and do the experitments.

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.