మలుపు

5
1031

మొదటి బహుమతి – వయస్సు 25 లోపు 


మలుపు 


ప్రతి సూర్యోదయం ఓ కొత్త రోజుకు ఊపిరి పోస్తుంది కాని రేపటి సూర్యోదయం ఈ రోజు నా ఊపిరి తియ్య బోతోంది. తెల్లవారిన దగ్గరనుండి రేపు రాబోయే ఫలితాల గురించే నా ఆలోచనంతా.

రూమ్ లో మూల స్టాండ్ మీద ఉన్న గిటార్, గోడ మీద రేస్ కారు పోస్టర్, టేబుల్ మీద ఉన్న అలారం పీస్ కూడా నా బాధలో భాగం పంచుకున్నట్లు నిశబ్దంగా ఉన్నాయి.

“తెల్లవారితే రిజల్ట్స్ వస్తాయి. వాళ్లకి మొహం ఎలా చూపించాలి? ఏం సమాధానం చెప్పాలి?” వేలసార్లు మెదిలిన ఆ జవాబు లేని ప్రశ్న నన్ను పట్టి పీడిస్తోంద

టెన్త్ లో నేను స్కూల్ ఫస్ట్.ఇంటర్ రిజల్ట్స్ లో రెండు సంవత్సరాలకు కలిపి కాలేజ్ ఫస్ట్ వచ్చాను. కాలేజ్ లో పెట్టిన  మాక్ టెస్ట్ ల్లో నా ఆల్ ఇండియా రాంక్ ఎప్పుడూ అయిడువందలలోపే. అవన్నీ వృధా| కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లోని ఫలితాలే ముఖ్యం. ఐ.ఐ.టి. ప్రేలిమినరీ క్లియర్ చేసిన సంతోషంతో ఫైనల్ కు మరింత ప్రిపేర్ అయ్యాను. ఐ.ఐ.టి. ఫైనల్ రాసిన రోజే నాకు తెలిసిపోయింది నేను ఫిజిక్స్ లో చేసిన తప్పు. మొదట ఓ చిన్న తప్పు చేసాను. ఏదో టెన్షన్ ఆవహించింది. అది అంటువ్యాధి లాగా నా మైండ్ లో వ్యాప్తి చెంది మరి కొన్ని తప్పులకు దారితీసింది.

‘ఎలా రాసావు’  అన్న తల్లితండ్రులకు ‘బానే రాశాను’ అని ఓ పొడి పొడి జవాబు ఇచ్చాను. కాని  నా బాధ ఎవరికి చెప్పుకోను.కారణం ఏదైనా కాని నాకు వందల్లో రాంక్ వచ్చి తల్లితండ్రుల కల సాకారం అయ్యే అవకాశం లేదు.

పరీక్ష రాస్తుండగానే జారిపోయిన తప్పులు మనసుకు తెలిసిపోతూనే ఉంది. అప్పటినుండి నేను నలిగి పోతూనే ఉన్నాను.

“ కాంపిటీటివ్ పరీక్షలకు తెలివి ఒక్కటే కాదు అసలైనది  ఓ తప్పు దొర్లినా సడలని కాన్ఫిడెన్స్ తో తరువాత వాటి మీద కాన్సంట్రేట్ చెయ్యాలని అనే విషయాన్ని మర్చిపోయాను. నేనో స్టుపిడ్ ని. అందుకే  ఇలా జరిగింది”

“ ‘మా అబ్బాయి అర్జున్ కి పేరుకు తగ్గట్లే, వాడి చదువు మీద లక్ష్యం  తప్పితే వేరే దానిమీద దృష్టి ఉండదు. ఈ కాలం పిల్లాల్లాగా కాదు’ అమ్మ, నాన్న పదిమంది తో నా గురించి ఆనందంగా చెప్పుకునే మాటలు గుర్తు కొచ్చాయి.

“ ఆ మాటలు విన్నప్పుడు నాకు యెంత గర్వంగా ఉండేది| వాళ్లకి నాపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసాను. ఇన్నాళ్ళు ఓ తెలివిగల అబ్బాయికి అమ్మా నాన్న గా ఆనందంగా ఉన్న వాళ్ళు ఎప్పుడూ చూడని అపజయం చూడబోతున్నారు. నాలుగైదేళ్ళగా తెల్లవారు ఝామున ట్యూషన్స్, అర్ధరాత్రి దాకా చదువుతో నేను పడ్డ కష్టం వృధా అయిపోయిందని బాధగా ఉంది. మంచి రాంక్  తెచ్చుకుని ఐ.ఐ.టి. లో సీటు సంపాదించాలని తన గురించి వాళ్ళు కన్న కలలు కూడా  కళ్ళ ముందు కదిలాయి.

నా వలన వారికి అవమానం.  దీనికి నాకు శిక్ష పడాల్సిందే ……ఎవరో తీర్పు ఇచ్చి ఇంకెవరో శిక్షించటం కాదు.  తీర్పు, శిక్ష రెండూ నావే. నాకు నేనే శిక్ష విధించుకుంటాను. ఆ శిక్ష మరణ శిక్ష. నేను చచ్చి పోవాలి. అదే పరిష్కారం. చనిపోయే ముందు వారికి క్షమించమని ఉత్తరం రాయాలి. వాళ్ళు నా బాధని అర్ధం చేసుకుంటారు.రిజల్ట్స్ వచ్చే టైంకి నేను బ్రతికి ఉండకూడదు”

“ అర్జున్, వంట్లో బాగోలేదా, గదిలోనే ఉండిపోయావు” తలుపు దగ్గర ఎదురుగా బామ్మ.

ఉలిక్కిపడ్డ నేను అంతలోనే సర్దుకుని  “కాస్త తలనొప్పిగా ఉంది, అంతే బామ్మా “ అన్నాను.

“అందుకేనా అమ్మా వాళ్ళు షాపింగ్ కి పిలిచినా వెళ్ళలేదు. మొహమంతా పీక్కు పోయింది. కళ్ళు కూడా యెర్ర పడ్డాయి. భోజనం చేసేసి ఏదన్నా టాబ్లెట్ వేసుకుని కాసేపు పడుకో”.

“వద్దు బామ్మా, నాకు తినాలని లేదు”.

“కొద్దిగా తిను. ఖాళీ కడుపు తో టాబ్లెట్ వేసుకుంటే తిప్పుతుంది. లే, పద”. ఆ మాటలకు తప్పనిసరిగా లేచి బామ్మ వెనక నడిచాను .

****

శిక్ష డిసైడ్ అయిపోయింది. అమలు చేసే విధానమే తెలియక తన్నుకుంటున్నాను. నా శిక్షను ఎలా అమలు పరచాలి. ఉరివేసుకోవటమా , మేమున్న యైదో అంతస్తు నుండి దూకెయ్యటమా….

ఆలోచిస్తుంటే గుండె దడగా ఉంది. లేచి బయటకు బయలుదేరాను.

“అసలే తలనొప్పి అన్నావు. రెస్ట్ తీసుకోకుండా ఎక్కడికి బయలుదేరావు “

“రేపు నా రిజల్ట్స్ వచ్చిన తరువాత కూడా బామ్మ ఇదే ప్రేమ చూపుతుందా …అడిగి చూస్తే …’ఐ.ఐ.టి. లు , రిజల్ట్స్ లు ఏమిటిరా ? నాకు అర్ధం కాల ‘  అంటుందేమో. ..నవ్వొచ్చింది.

“ఏమిటిరా , సమాధానం చెప్పకుండా నీలో నువ్వే నవ్వుకుని నడుకుంటూ పోతున్నావు “ వెనకనుండి బామ్మ మాటలు వినపడుతున్నాయి.

ఊరి మీద పడి ఏదో తిరుగుతున్నా అలవాటైన కాళ్ళు, మనసు సముద్రపు వడ్డుకే లాక్కెళ్ళాయి. బీచ్ నాకు మహా ఇష్టం. విశాఖలో పుట్టి పెరిగిన వారికి బీచ్ ఇష్టం లేకుండా ఉంటుందా|

సాయంకాలం అవుతోంది. అప్పుడప్పుడే చల్లబడుతోంది. నా ఆలోచనలాగానే ఎగిరిపడుతున్న అలల్ని చూస్తూ కూర్చున్న.

“బాబూ , పల్లీలు కావాలా . మసాల పల్లీలు బాబు. చాల రుచిగా ఉంటాయి” ఎదురుగా ముసలాయన. బలహీనమైన అతని శరీరం చూస్తే వెంటనే కొనేయ్యాలనిపించింది. కాని చెదిరిన మనసుతో జేబులో రూపాయి లేకుండా నాలుగు కిలోమీటర్లు నడివచ్చిన నాకు అతనికి ఏ సహాయము చెయ్యలేని స్థితి.

పల్లీలు కొనమని ఇంకోసారి అడిగి నా నుండి సమాధానం రాక ఏ భావం లేని మొహంతో ముందుకు నడిచాడు.

ప్రక్కకి చూసాను. ఇద్దరు పిల్లలు. ఓ పిల్లాడు చూస్తుంటే మరో పిల్లాడు ఇసుకతో మేడ కడుతున్నాడు.

నా బాల్యం కళ్ళముందు కదిలింది….ఆసక్తిగా చూస్తున్నాను…గూడు అయిపోవచ్చింది .

అంతలోనే చిన్నోడు ఆకతాయితనంగా గూడును తోసేసి పరుగెత్తాడు.

“స్టుపిడ్ , నేను కట్టుకుంది తన్నేస్తావా . నేను మళ్ళీ కట్టుకుంటాను “తమ్ముడు పరుగెత్తిన దిక్కుగా ఇసుక  కసిగా విసిరేస్తూ కోపంగా అరిచాడు పెద్ద పిల్లాడు. కాస్త దూరంలో కూర్చున్న వాళ్ళ తల్లి తండ్రులు పెద్దవాడిని ఓదార్చ టానికో ఏమో లేచి వచ్చారు.

చిన్నప్పుడు నేను కట్టిన గూడు పడిపోతే ‘అన్నయ్యా, మళ్ళీ కట్టు. నేను కూడా హెల్ప్ చేస్తాను’ అనేవాడు తమ్ముడు. ఎందుకో వాడు ప్రక్కనుండి చూసేవాడే కాని కట్టేవాడు కాదు. మాకున్న యైదేళ్ళ అంతరం వాడి మనసులో నాకు పెద్దరికాన్ని అంటగట్టిందేమో.

నేను లేచి సముద్రం దగ్గరగా నడిచాను. అలలు కాళ్ళను తడిపి మరలుతున్నాయి. వచ్చి పోతున్న అలల ఆటల్ని చూస్తూ గడపటం నాకు మహా ఇష్టం. అమ్మా,నాన్నలతో , స్నేహితులతో…. ఎన్నో సార్లు వచ్చాను. ఒంటరిగా రావటం మటుకు ఇదే మొదటిసారి. మరల నా ఆలోచన మొదలయ్యింది. ఆలోచనను ప్రక్కకు నెడుతూ ఇంకాస్త ముందు కెళ్ళాను.

“అవును, ఇలా సముద్రంలోకి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతే.. …ఓ పావుగంట ఊపిరి ఆడక గిల గిల కొట్టుకుని చచ్చిపోవటం మరీ కష్టం కాదేమో..కానీ బాడీ కోసం అమ్మా వాళ్ళు చాల కష్టపడాల్సి రావచ్చు..

అసలు బాడీ దొరుకుతుందా? దొరికినా ఉబ్బిపోయి భీకరంగా ఉండొచ్చు. పాపం వాళ్ళు తట్టుకోలేరు. ఊహు, ఇలా చచ్చినా చావద్దు “

వెనక్కి బయలుదేరాను. ఇందాక గూడు తన్నేసి పారిపోయిన చిన్నోడు అన్న ప్రక్కకు చేరి సారీ లు చెప్పి మంచి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఆదాయం వచ్చిన ఆనందమో , రాని ఆవేదనో సెనక్కాయలు అమ్ముకునే తాత పొగ పీలుస్తున్నాడు.

‘అర్జున్, మన బైక్ సాయంత్రానికి రెడీ అవుతుందన్నాడు. నేను ఆఫీసు నుండి వచ్చేసరికి లేట్ అవుతుంది. రేపటి నుండి వారం రోజులు ఊరిలో కూడా ఉండము. నువ్వు తీసుకొచ్చెయ్యి. బిల్ పే చేసేసాను. నువ్వు ఏమీ ఇవ్వక్కర్లేదు“ నాన్న ప్రొద్దున చెప్పిన మాటలు   గుర్తుకొచ్చాయి. చనిపోయేముందు చిన్న సహాయం చేద్దామనిపించింది. బైక్ మీద లాస్ట్ డ్రైవ్ కూడాను.  మెకానిక్ షాప్ కేసి అడుగులు వేసాను.

****

ఆ షాప్ కు నేను నాన్న తో కలిసి అప్పుడప్పుడు వస్తుంటాను. సర్వీస్ , చిన్న చిన్న రిపెర్స్ కి బైక్ ని, స్కూటర్ ని నాన్న ఆ షాప్ లోనే ఇస్తారు. షెడ్ ఓనర్ అక్కడ పనిచేస్తున్న వ్యక్తుల పనిని శ్రద్దగా సూపెర్వైజ్ చేస్తున్నాడు. అసలు ఆయన ఓ మెకానిక్ షడ్ కి ఓనర్ లాగా అనిపించడు. పెద్ద పోస్ట్ లో ఉన్న ఉద్యోగిలాగా ఉంటాడు.

“ఏంటి అర్జున్ , నీ రిజల్ట్స్ రేపేగా వచ్చేది. పార్టీకి రెడీ అవ్వనా “ నవ్వుతూ పలకరించాడు షెడ్ ఓనర్.

“ప్రపంచం దృష్టంతా నా రిజల్ట్ మీదేనా ?” నాలో కలవరం.

“ఆ రోజుల్లో నేను మెకానికల్ ఇంజనీర్ అవ్వాలనుకున్నాను. కాని అవ్వలేకపోయాను” గతం లోని అపజయాన్ని తలచుకున్నందుకేమో ఆయన మొహం లో ఏదో బాధ.

“ఎందుకు చదవలేకపోయారు” నాలో తెలుసుకోవాలనే ఆత్రుతత.

“హటాతుగా నాన్న చనిపోవటంతో ఇంజనీరింగ్ లో చేరి సంవత్సరం కూడా కాకముందే చదువు ఆపెయ్యాల్సి వచ్చింది. ఆర్జన కోసం షెడ్ లో చేరాను. ఆసక్తి తో అవసరమైన దానికన్నా ఎక్కువే నేర్చుకున్నాను.కొన్నాళ్ళకు నా ఓన్ షాప్ పెట్టుకున్నాను. ఇప్పుడు పదిమందికి పని ఇవ్వగలుగుతున్నాను”  ఇప్పుడు ఆయన మొహం లో తొంగి చూస్తున్న సంతృప్తి చూస్తే ఇందాక ఆయన మొహం లో విచారం తొంగి చూసిందనుకోవటం నా పొరపాటే అనిపించింది.

“కనీసం నా కొడుకన్నా ఇంజనీర్ అవ్వాలనుకున్నాను. వాడేమో ఇలాంటి షెడ్స్ ను బాగా డెవలప్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు. నా తీరని కల వాడి ద్వారా తీర్చుకోవాలనుకున్నాను. కాని వాడికి ఇంట్రెస్ట్ లేనపుడు నేను ఏం చెయ్యలేను కదా| ఏదో ఒక దానిలో వాడికి ఎదగాలనే కోరిక ఉంది .అది చాల్లే అని తృప్తి పడుతున్నాను. గత జ్ఞాపకాల ప్రభావేమో మొదటిసారి అంతలా మాట్లాడాడు నాతో.

వర్కర్స్ తో కలిసి పని చేస్తున్న వాళ్ళబ్బాయి ‘కొత్త దాని లాగా తయారయ్యింది. ఇప్పట్లో ఇంకేం ప్రాబ్లం రాదు “ అని బైక్ తీసుకువచ్చి  ఇచ్చాడు.

పేరుకుపోయిన డస్ట్ ను వదిలించుకుని , రిపెర్లని సరిచేసుకుని  తళతళ లాడుతున్న బైక్ ను తీసుకుని ఇంటికి బయలుదేరాను.

****

అమ్మ, తమ్ముడు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. కావలసినవి సర్దుతూ సందడి చేస్తున్నారు.మనాలి ప్రయాణం గురించి మహా సంబరంగా ఉంది వాళ్లకు. మొట్టమొదటి సారి మంచు కొండలిని చూడబోవటం పెద్ద థ్రిల్.నాలుగేళ్లగా బయటికి వెళ్ళింది లేదు. కోచింగ్ లు , ర్యాంక్ ని మైంటైన్ చేసుకోవటం లోనే అన్నేళ్ళ టైం గడిచిపోయింది.ఇన్నాళ్ళకు అంత పెద్ద ట్రిప్ కు వెడుతున్నందుకు నేనూ చాల సంతోషించాలి. కాని రిజల్ట్స్ గురించిన బెంగే నాకు ఏ ఆనందమూ లేకుండా చేస్తోంది.

“అన్నయ్య, ఈ షర్టు నీకోసం నేనే సెలెక్ట్ చేసాను “ పరిగెత్తుకుని వచ్చి చూపించాడు.

“నువ్వు రమ్మంటే రాలేదు. నీ సైజ్ చెప్పి వాడే సెలెక్ట్ చేసి కొన్నాడు . చిన్నోడైనా భలే మేనేజ్ చేసాడు” మురిపెంగా చెపుతోంది అమ్మ.

“నా చావు వలన ఏర్పడే పరిస్థితిని కూడా  వీడు మానేజ్ చేస్తాడా ? నేను  లేని లోటును వాడు పూడుస్తాడా? వీళ్ళందరూ కూడా నేను పోయిన నాలుగు రోజుల తర్వాత నార్మల్ అయిపోతారా. నన్ను మరిచిపోయి బ్రతకాటినికి తమ్ముడు ఉన్నాడు. ఫరవాల నేను మరీ టెన్షన్ పడక్కర్లేదు …” అనేక ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి.

నా రూమ్ లోకి వెళ్లి మంచం మీద అడ్డంగా పడ్డాను. నేను రాయాలనుకున్న  లెటర్ గుర్తొచ్చింది. నా చివరి అక్షర జ్ఞాపకం వాళ్ళని బాధ పెడుతుందేమో?  ఓ ఫైల్యూర్ క్యాండిడేట్ కి చివరి జ్ఞాపకాలు మిగిల్చే హక్కే లేదేమో అనిపించింది.  ఆ పని విరమించుకున్నాను. లేవలేనట్లు అలాగే పడున్నాను. స్మృతులు, ఆలోచనలు …కలగాపులగంగా ఉంది మనసు. ఆలోచనలకు మధ్య మధ్య లో ఆగని కన్నీరు తోడయ్యింది….

అమ్మ పిలుపుకు లేచి డిన్నర్ కి వెళ్లాను. డిన్నర్ చేసినంత సేపూ మా ప్రయాణం గురించే కబుర్లు. నా రిజల్ట్స్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. రేపు రిజల్ట్స్ వస్తాయనే విషయం వీళ్ళకు గుర్తుందా అని అనుమానంగా కూడా వచ్చింది నాకు.

“అన్నయ్యా, మనాలి సూపర్ ఉంటుందట. నేను నెట్ లో చూసాను. రోతంగ్ పార్క్ బ్యూటిఫుల్ ట. పేరాగ్లైడింగ్ , రాఫ్టింగ్ ..నేను అన్నీ ఎంజాయ్ చేస్తాను”  ఉత్సాహంగా మాట్లాడేస్తున్నాడు. రేపు నా రాంక్ చూసి వీడు కూడా డిజప్పాయింట్ అవుతాడు. ఈ ఉత్సాహమంతా  పోతుంది.

“అర్జున్, ఈ క్రొత్తవి కాకుండా నీ డ్రెస్ లు ఇంకా ఏమేమి సర్దాలో ఇవ్వు”  అన్న అమ్మ మాటకు రూమ్ నుండి చేతికొచ్చిన నాలుగు డ్రెస్ లు తీసుకువచ్చి ఇచ్చాను.

“ఎప్పటివో తెచ్చావేమిటి. నీకు చదువు తప్ప ఏదీ పట్టదు “ డ్రెస్ లు చూసి అమ్మ గొణుక్కుంటూ వెళ్లి నేను తెచ్చినవి వెనక్కి పెట్టి వేరేవి తెచ్చుకుంది. నా పట్ల, నా చదువు పట్ల ఆమెకున్న నమ్మకానికి నాకు బాధ కలిగింది.

“అమ్మా, ప్రొద్దున్నుండీ నాకు తలనొప్పిగా ఉంది. నేను పడుకుంటాను”

“అర్జున్, యెంత సేపు బాధ పడతావు. నా రూమ్ లో జందుబామ్ తెచ్చుకుని రాసుకో నాన్నా “

బామ్మ మాట కాదనలేక జందు బామ్ బాటిల్ కోసం ఆమె రూమ్ లోకి వెళ్లాను. డ్రా లో బాటిల్ తీసుకుంటున్న నాకు ప్రక్కన ఉన్న ఇంకో బాటిల్ మీద దృష్టి పడింది. ‘దేవుని దయవల్ల నాకు మార్గం కనపడింది‘ నా భావనకు  నాకే నవ్వొచ్చింది. ఆ  బాటిల్ కూడా జేబులో వేసుకున్నాను.

నా రూమ్ కెళ్ళి నాకిష్టమైన హారీ పాటర్ నావెల్ తీసుకుని బెడ్ మీద వాలిపోయాను. ఆ బుక్ అంటే నాకు పిచ్చి. ఎన్ని సార్లు చదివానో. కాని అంత ఇష్టమైన బుక్ కూడా మైండ్ కు ఎక్కటం లేదు. కళ్ళు ఆ బుక్ మీద.  ఆలోచనలు మాత్రం రేపు రాబోయే రిజల్ట్స్ మీద, నా తీర్పు, నా శిక్ష, నేను అమలు చెయ్యబోయే పధకం మీద.

అలసిన మనసో, తనువో నన్ను నిద్ర లోకి నెట్టేసాయి…

****

అర్ధరాత్రి చటుక్కున మెలకువ వచ్చింది. విపరీతమైన దాహం. నోరు ఎండిపోతోంది. బెడ్ ప్రక్కన చూసాను. వాటర్ బాటిల్ లేదు. పడుకునే ముందు వాటర్ బాటిల్ బెడ్ ప్రక్కన పెట్టటం, బి.కాంప్లెక్స్ టాబ్లెట్ ఇవ్వటం అమ్మ కు అలవాటు. నేను తలనొప్పి అని చెప్పబట్టి నన్ను డిస్టర్బ్ ఇష్టం లేకేమో రూమ్ లోకి వచ్చినట్లు లేదు. ట్యూబ్ లైట్ కూడా వెలుగుతోంది. టేబుల్ మీద బామ్మ రూమ్ నుండి తెచ్చిన స్లీపింగ్ టాబ్లెట్ బాటిల్ ‘యూజ్ మీ ‘ అని పిలుస్తోంది.

‘ఆ టాబ్లెట్స్ వేసుకోవాలి. నా ఆలోచనలకు, ఆవేదనకు  ఫుల్ స్టాప్ పడుతుంది” టాబ్లెట్ బాటిల్ చేతిలోకి తీసుకున్నాను.  ఫ్రిజ్ లో వాటర్ బాటిల్ తెచ్చుకోవటానికి లేచి హాల్ లోకి నడిచాను.

“ఏంటీ, నిద్ర పట్టటం లేదా. వాడి కన్నా నీకు ఎక్కువ టెన్షన్ గా ఉన్నట్లుంది” రూమ్ నుండి నాన్న గొంతు వినపడింది. చటుక్కున ఆగిపోయాను.

“అంత ఏం లేదు. కాస్త అలసటగా ఉంది”

“రేపు రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ హడావిడిలో ఈ ప్రయాణం కూడా పెట్టావు. నాలుగు రోజుల తరువాత పెడితే పోయేది”

“రేపు రిజల్ట్స్ కాబట్టే పెట్టానండీ”

“నువ్వు చెప్పేది ఏమీ అర్ధం కావటం లేదు”

“ఈ రోజుల్లో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ గురించి ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. అర్జున్ ఇప్పటిదాకా అపజయం చవి చూడలేదు.అపజయం కలిగితే వాడికి తట్టుకునే శక్తి ఉందో లేదో కూడా తెలీదు….”

“దానికి ప్రయాణానికి ఏమిటి సంబంధం “

“రిజల్ట్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడవద్దని చెప్పింది వాడికి ఎక్కువ టెన్షన్ పెట్ట కూడదనే. అసలు ఈ ట్రిప్ పెట్టింది రిజల్ట్స్ వచ్చే రోజు వాడిని దూరంగా తీసుకెళ్ళాలనే.  రేపు రిజల్ట్స్ వాడు కోరుకున్నట్లు వస్తే ఈ ట్రిప్ ‘సెలెబ్రేషన్’ అవుతుంది. లేకపోతె  ఈ ట్రిప్ పది మంది సానుభూతి పలకరింపులనుండి వాడికి ‘ప్రొటెక్షన్’ అవుతుంది. ఏ మలుపుకైనా సిద్ధపడి ఉండాలి. తప్పదు”

“ఓ విషయంలో వాడు అదృష్టవంతుడు “

“ఏ విషయంలో”

“నీలాంటి తల్లిని పొందిన విషయంలో”

నా జయాపజయాల గురించి ఇన్ని కోణాల్లో అమ్మ ఆలోచిస్తుందా? ఆశ్చ్యర్య మేసింది…. రేపటి రిజల్ట్స్ గురించి బెంగ తీరిన మనసుతో, నీళ్ళు నిండిన కళ్ళతో నిచ్చలంగా నిలబడిపోయాను. కాస్త తేరుకుని అతి మెల్లగా నడుచుకుంటూ బామ్మ గదిలోకి వెళ్లి చేతిలోని టాబ్లెట్స్ ఉన్న బాటిల్ అక్కడ టేబుల్ మీద పెట్టేసి నా రూమ్ లోకి వెళ్లాను. ఎదురుగా గోడ మీద  “విన్నర్స్ నెవ్వర్ క్విట్ . క్విట్టర్స్ నెవ్వర్ విన్ “ అని అమ్మ అతికించిన పోస్టర్  కొత్త ఆలోచనలకు ఊపిరి పోసింది.


ప్రేమించే తల్లులు ఎంతోమంది ఉంటారు.కాని ‘పిల్లవాడికి అపజయం కలుగుతుందేమో, అది వాడు భరించగలడో లేదో’ అని అప్రమత్తతో ఉండే తల్లులు అరుదేనేమో |

అలాంటి తల్లులకు ఈ కథ అంకితము

యమున చింతపల్లి

5 COMMENTS

  1. BAHUMATHIKI ARHAMYNA KATHA , SUPER GA RASARU YAMUNA GARU.
    VIDYARDHI MANASIKA SANGHARSHANA, THALLI AAVEDANA ( KANAPADANI) CHALA CHAKKAGA RASARAU, YAMUNA GARIKI HRUDAYA POORVAKA ABHINANDANALU. MALUPU SARYNA TITLE

  2. Ardham chesukone aadarinche Amma manasuki addam pattindi mee kadha.
    Tragedies Malachi twist kosam vankara tinkaralu poneeyakunda viluvalaki positivity ki praadhaanyamicchinanduku maa visaakha samudram goorchi prastaavinchinanduku krutjnatalukrutjnatalu,chi sou yamunagaaru

  3. చాలా బాగా రాశారు యమున గారు.పిల్లల మానసిక సంఘర్షణ కు అద్దం పట్టే లా ఉంది.రిజల్టు ముందు తల్లి పిల్లల ఆలోచనలు​ ఎలా ఉంటాయో కళ్ళ కు కట్టి పట్టు రాసారు.నిజం గా ఫీలు కలిగింది.సూయిసైడు ఆలోచన తలుచుకుంటే నేఒళ్ళు జలదరించింది.ఈ‌కాలం పిల్లల ఆలోచనలకు అద్దం పట్టినట్టు ఉంది
    మంచి కధ రాసారు. -ధర్భా రాజ్యలక్ష్మి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.