అనుభవం కొద్దీ ..!

0
472

దేన్నయినా, ఎవర్నయినా ఉన్నది ఉన్నట్లు accept చెయ్యడం… ఇంతకన్నా బెస్ట్ ప్రిన్సిపుల్ లైఫ్‌లో ఏదీ లేదు… చాలా ప్రశాంతతని ఇచ్చే దృక్పధమిది. జీవితంలో ఎంత త్వరగా దీన్ని adopt చేసుకోగలిగితే మిగిలిన జీవితం అంత సంతోషంగా ఉంటుంది.

ప్రపంచంలో అన్నీ interlinkedగా కన్పిస్తాయి. ఒకదాన్ని మారిస్తే మరొకటి మారుతుందనుకుంటాం.. మార్చడానికి విశ్వప్రయత్నం చేస్తాం.. అది మొండికేసుకుని కూర్చుంటుంది.. చివరికి డిజప్పాయింట్ అయి ద్వేషాన్ని వెళ్లగక్కుతాం.

వాస్తవానికి అన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయినట్లు కన్పిస్తున్నవే అయినా దేనికది డిటాచ్ అయ్యే ఉంటుంది. ఇద్దరు మనుషులు కావచ్చు, రెండు పరిస్థితులు కావచ్చు, చివరకు ఒక మనిషీ, మరో పరిస్థితీ కావచ్చూ దేనికీ విడదీయలేనంత అటాచ్మెంట్ ఏదీ ఉండదు. అవంతే చూడడానికి బలంగా కన్పిస్తాయి. వాటిని మార్చి తీరాలనే అనవసరమైన ప్రేరణని మనకు కలిగిస్తాయి. దగ్గరగా వెళ్లి చూస్తే అవి మారడం బ్రహ్మతరం కూడా కాదు. సో అలాంటప్పుడు అవి కాదు మారాల్చింది… మనం మారాలి.

యెస్.. మనం ఎవర్నీ మార్చలేము.. జస్ట్ ఆలోచనని కలిగించగలం అంతే. కొన్ని విషయాల్లో మనం బాధ్యతగా ఉంటే సరిపోతుంది. ఆలోచన కలిగించడం బాధ్యత కూడా! అలాగని కళ్లెదుట కన్పించే ప్రతీ దాన్నీ నెత్తికెత్తుకోవడమూ, మనుషుల్ని ఇష్టమొచ్చినట్లు విమర్శించడమూ, మనం బ్రతికేదే కరెక్ట్ మిగతా వాళ్లు బ్రతికేది తప్పన్నట్లు ప్రవర్తించడమూ మన ఇమెచ్యూరిటీకి నిదర్శనం.

అదేమంటే అనుభవం కొద్దీ చెప్తున్నామంటాం.. కానీ మన అనుభవం ఎవరికీ అవసరం లేదు. ఎవరి జీవితాన్ని వాళ్లు explore చేసుకుంటారు. ఏది కరెక్టో, ఏది తప్పో తెలుసుకుంటారు, మహా అయితే ఒకటి రెండు తప్పుటడుగులు వేస్తారేమో! కానీ అన్నీ మనం కరెక్ట్ చేయాలనుకోవడం, ఓ వ్యక్తి తనకంటూ ఓ వ్యక్తిత్వాన్ని సముపార్జించుకునే క్రమంలో మనం వేలుపెట్టడం అనవసరం. దీనివల్ల సాధించేదేదీ లేదు మన ప్రశాంతతే పోతుంది.

మనుషులకు గార్డియన్‌లా, గాడ్‌ ఫాదర్‌లా ఉండాలనుకోవడం ఎవరూ ఊహించలేనంత పెద్ద స్వార్థం. పైకి అంతా మంచి మనిషిగానే కన్పిస్తుంది.. కానీ ఇతరుల జీవితాల్ని వాళ్లు కోరకుండానే చేతుల్లోకి తీసుకుని చీటికీ మాటికీ వారి వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడం.. అదేమంటే శ్రేయోభిలాషులం అనే ముసుగు తొడుక్కోవడం, వాళ్ల జీవితాల్లో ఏదైనా మంచి జరిగితే అది మన వల్లే జరిగిందని ఠాంఠాం వేయడం.. ఉప్పొంగిపోవడం ఇదంతా చిన్న పిల్లాడికుండే చిన్న చిన్న కోరిక లాంటి పెద్ద స్వార్థం!

కళ్ల ముందు అన్నీ జరుగుతూనే ఉంటాయి. మనం వేలుపెట్టినా, పెట్టకపోయినా! నీ సలహా అవసరం అయినప్పుడు, నీ జోక్యం అవసరం అయినప్పుడూ, నువ్వు తప్ప దిక్కు లేనప్పుడు ఆటోమేటిక్‌గా అందరూ నీ దగ్గరకే వస్తారు. అంతే తప్పించి అందరి జీవితాల్లోకీ తోసుకుని నువ్వెళ్లకు.. చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. జరిగేదాన్ని చూస్తూ as it isగా అర్థం చేసుకుంటూ, కామ్‌గా నీ పని చేసుకోవడం అంత గొప్ప పరిణితి జీవితంలో ఇంకేదీ లేదు.

అయినా దేవుడు హాపీగా బ్రతకమని లైఫిస్తే.. అనవసరమైన వాటినన్నింటినీ తలకెత్తుకుని పనికిమాలిన టెన్షన్ పడడం అవసరమా.. కాస్త ఆలోచించండి!!


– నల్లమోతు శ్రీధర్

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.