లెక్కల జీవితం..!

0
535

ఆ పని చేస్తే ఏమొస్తుంది.. ఈ పనిచేస్తే ఎంతొస్తుంది.. ఎప్పుడూ ఈ లెక్కలేసుకుంటావెందుకు… వచ్చేదెటూ శాశ్వతంగా ఉండదు, ఇవ్వాళ రానిదెటూ రేపైనా వస్తుంది…

గుండె మీద చెయ్యేసుకుని ఈ పని నేను చేస్తే బాగుణ్ణు అన్పిస్తే చేసేయి… కూడికలూ, తీసివేతలూ, భాగాహారాలూ చిన్నప్పుడెప్పుడో చదువుకున్నంత మాత్రాన ఎప్పుడూ వాటిని వాడాలని లేదు.

కొన్ని పనులు చేస్తే మనస్సు సంతోషంతో ఉప్పొంగిపోతుంది… కొన్ని పనులు ఏ లెక్కలకూ అందవు. నేను గంట కష్టపడ్డాను కాబట్టి నాకు ఇంత రావాలి.. నేను ఇంతసేపు మాట్లాడాను కాబట్టి నాకు ఇంత ఫలితం ఉండాలి… అంటూ ఏంటి బ్రదరూ ఈ పిసినారి ఆలోచనలు.

నువ్వు ఒళ్లొంచాలంటే డబ్బులూ, నువ్వు మాట్లాడాలంటే డబ్బులూ, నువ్వు నవ్వాలంటే డబ్బులూ.. అస్సలు ఎక్కడికి పోతున్నావు? ఈ యావలో పడి నీ మొహం బిగదీసుకు పోతోందని గమనిస్తున్నావా? నిన్ను చూసి జనాలు పారిపోతున్నారు…

“ఏరా అబ్బాయ్.. ఏం చేస్తున్నావు.. నెలకి ఎంతొస్తుందేంటి” అని కన్పించిన ప్రతీ ఒకర్నీ అడగడం ఎందుకు? ఎందుకీ పనీపాటా లేని ఆరాలు చెప్పు. ఎంతొస్తే నీకేంటి.. ఒకడిని ఇంకొకడితో పోల్చి చిన్నచూపు చూస్తే కానీ నీ శాడిజం శాటిస్‌ఫై కాదా చెప్పు? ఏం చేసుకుంటావు ఈ వికృతపు ఛేష్టలను, ఆలోచనలను?

ఎవడి బతుకు వాడు బతుకుతున్నాడు… ఇంకొకడి లైఫ్‌లో కెళ్లి నువ్వేదో గొప్పోడివైనట్లు వేలెత్తి ఎందుకు చూపిస్తావు?

పూరీ జగన్నాధ్ గురించీ.. సుబ్బరాజు గురించి కధలు కధలుగా చెప్పుకుని నీ లోపాల్ని కప్పి పుచ్చుకోవడం… ఏ పనీ చేతకాని నీ బద్ధకాన్ని గాలికొదిలేయడానికి సిగ్గనిపించట్లేదా? అసలు ఒక్కసారి అద్దంలో నీ మొహం చూసుకో.. ఏ పని చెయ్యడానికైనా పనికొస్తావా.. ఇతరుల మీద పడి ఏడవడం తప్పించి?

నోరు తెరిస్తే డబ్బు మాటలు.. డాబుసరి మాటలూ… ఒళ్లంతా కొవ్వొక్కిన మాటలూ… కాస్త నీ మీద నువ్వు ఫోకస్ పెట్టకూడదా… నీ జీవితం అన్నా బాగుపడుతుంది?


@ నల్లమోతు శ్రీధర్

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.