Role Models కావాలా?

0
339

మనకు మార్గదర్శకత్వాలు కావాలి…. దిశానిర్దేశాలు కావాలి…

అనుక్షణం మనం చేసేది తప్పో కరెక్టో అని, చేసే పని ఆపేసి జనాల రియాక్షన్లని గమనిస్తూ ముందుకు సాగే అభద్రత మనది…

ప్రతీ రంగంలో ఓ రోల్ మోడల్‌ని డిసైడ్ చేసుకుని.. ఆ మోడల్‌లానే మనమూ ఓ ఐకాన్‌లా ఎదుగుదాం అన్న ఓ తాపత్రయం… ఇలాంటి ప్రయత్నంలో మన స్వంత శైలిని, మార్గాన్నీ పోగొట్టుకుంటున్నాం అన్న విషయమే గ్రహింపుకు రాని గుడ్డిదారి మనది…
జీవితాన్ని రెండు విధాలుగా జీవించొచ్చు..

1. సమాజంలో ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ పీపుల్‌ని నిశితంగా గమనిస్తూ… వారి నుండి నేర్చుకుంటూ.. వారి శైలిలో జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం…

2. ప్రపంచంతో అస్సలు సంబంధమే లేకుండా… మనకంటూ కొన్ని లక్ష్యాలూ, ఆ లక్ష్యాలకు కావలసిన మార్గాలూ మనమే నిర్ణయించుకుని… దేన్నీ గమనించకుండా.. ఏదీ అనుసరించకుండా పరిశ్రమిస్తూ పోవడం…
మొదటి పద్ధతి వల్ల వందమంది కొత్త వివేకానందలూ, గాంధీలూ, మదర్ థెరిస్సాలూ తయారవ్వొచ్చు…
రెండవ మార్గం ఎంచుకుంటే మన శైలే మనల్ని ప్రత్యేకంగా నిలుపుతుంది.


ఎన్నో ఏళ్లుగా నాకు తారసపడుతున్న అనేకమంది మనుషుల్ని చూస్తున్నాను…. ఓ రొటీన్ జీవన విధానం…. కొన్ని పరిమితమైన లక్ష్యాలు…. బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం పొందాలి, మంచి పార్టనర్ కావాలి, బాగా డబ్బు సంపాదించాలి, ఏ లోటూ లేకుండా బ్రతకాలి.. అంతే! చాలా చాలా చాలా అల్ప సంతోషపు జీవితాలు!!

ఈ రొటీన్‌ని ఛేధించాలంటే మనకు ఇన్ సెక్యూరిటీ… డబ్బు మీద యావ లేకుండా మనకు ఆత్మసంతృప్తినిచ్చే ఏ పనైనా చేయాలంటే సాటి మనుషుల నుండి వచ్చే సూటిపోటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేని బేలతనం…. అందుకే జనాల కోసం మనం డబ్బు సంపాదించే మెషీన్లుగా తయారవుతున్నాం. డబ్బే కాదు… సోషల్ స్టేటస్ వంటివెన్నో మనం కాని మనల్ని మనలో జీవింపజేస్తున్నాయి.


నేను ఈ మాట ఇప్పటికి కొన్ని వందలసార్లు చెప్పుంటాను… మళ్లీ చెప్తున్నాను….

“ఉన్నది ఒక్కటే జీవితం…”

దాన్ని ఓ మూసలో బ్రతికేయాలా, వైవిధ్యంగా జీవించేసి… “యెస్… ఈ మనిషి కాబట్టి ఇలా చేయగలిగారు” అని అందరూ ఆశ్చర్యపోయేలా బ్రతకాలా అన్నది మన ఛాయిస్…

ఛాయిస్ మన చేతిలోనే ఉండడం వల్ల సహజంగానే మనం ఈజీ మెధడ్ ఎంచుకుంటున్నాం…

కానీ లైఫ్ ఇంత చప్పగా ఉండకూడదు… ఇంత కాజువల్‌గా ఉండకూడదు… అందరిలానే సినిమా హాళ్ల చుట్టూనో, రూమర్ల చుట్టూనో, రాజకీయాల చుట్టూనో, డబ్బు ఆలోచనల్లోనో తిరుగుతూ మనిషి సమాధి అయిపోకూడదు….
జీవితాన్ని ఆస్వాదించొచ్చు.. కానీ జీవితాన్ని ఆస్వాదనతో ముగించేయకూడదు!!


“ఎంజాయ్ చెయ్యడానికే జీవితం ఉంది” అనే ఓ డైలాగ్ మనం తరచూ వింటుంటాం…

ఓ బద్ధకస్తుడు తనని తాను సమర్థించుకోవడానికి సృష్టించిన ఈ డైలాగ్‌ని మనం మోసుకు ప్రవర్తిస్తున్నామంటే… ఇదేం ఎంజాయ్‌మెంట్…
ఎంజాయ్‌మెంట్ అంటే శ్రమలో ఉంది, కష్టంలో ఉంది, వైవిధ్యపు ఆలోచనల్లో ఉంది.. జీవితాన్ని మన పద్ధతిలో సాధించి ప్రత్యేకత చూపడంలో ఉంది….. అలాగే జీవితాన్ని అంతే అణుకువగా ముగించడంలోనూ ఉంది…


ఎన్నోసోషల్ ట్రాప్‌ల మధ్య సమాధి అయిపోవడానికి కాదు ఇంత విలువైన జీవితం మనకు వడ్డించబడింది… ఎక్కుపెట్టబడిన బాణంలా మన చేతిలో ఉంది జీవితం…. దాన్ని ఎంత సూటిగా గురిచూస్తామో, ఎంత దూరం గురికొట్టగలమో మనకు మనం నిర్ణయించుకోవాలి గానీ… ఎవరి కాలి అడుగుల్లోనో భద్రంగా అడుగులేస్తూ నడిచే అసమర్థపు నడక కాదు జీవితం!


నల్లమోతు శ్రీధర్

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.