పారిపోతున్నా

0
392

పారిపోతున్నా.. మనుషుల నుండీ, ఆలోచనల నుండీ…! అలసిపోయి కాసేపు ఆగా… తల నుండి పాదాల వరకూ చాలా కళ్లు స్కానింగ్ చేసేశాయి.. అలా స్కాన్ చేసిన ఫేసుల్లో ఒక్కోటీ ఒక్కో డిఫరెంట్ హావభావం… ఆ కళ్లన్నింటినీ తట్టుకునే శక్తి లేక మెల్లగా తలదించుకున్నా.. నాలోకి నేను ముడుచుకుపోతూ..

సమూహం మధ్య ఏదో మాట్లాడుతున్నా.. నా మాటలు ఎవరికీ తలకెక్కడం లేదు.. అందరి ఆలోచనా.. అసలు నేనెవరు, నేను మాట్లాడితే తామెందుకు విన్పించుకోవాలి.. అసలు ఏంటి నా గోల.. అన్న లోపల భావాన్ని అణుచుచుకుంటేనే కళ్లూ, తలా ఎగరేసి చూస్తున్నారు.. నేను మనిషిని, నాకూ కొన్ని మాటలుంటాయి, నా మాటల్నీ ఈ గాలి చాలా చెవులకు చేరవేయడానికే ఉంది.. అన్న concern కూడా ఎవరికీ లేదు…

ఏదో బాధొచ్చి ఏడుస్తున్నా.. “ఏంటి చిన్న పిల్లాడిలా ఏడ్వడం” అనుకుంటూ అందరూ నవ్వుతున్నారు.. నా బాధ నా గుండెల్ని దాటి ఆ గుండెలకు అర్థమయ్యేదెప్పటికో.. ఏడ్వడం ఆపేశా.. అప్పటిదాకా జాలిగా చూసినోళ్లంతా అటెన్షన్‌లోకొచ్చారు.. ఇప్పుడు నేను బలహీనుడిని కాదు కదా… వాళ్లకి డైజెస్ట్ అవనేమోనని మొహకవళికలు సర్ధుకుంటున్నారు..

నా బతుకు నేను బతుకుతున్నా.. అయినా తమ బతుకులొదిలేసి నా బతుకుని పట్టించుకునే వాళ్లే కన్పిస్తున్నారు… ఇక నేనూ నా బ్రతుకొదిలేసి అందర్నీ తేరిపారా చూసేస్తున్నా.. ఇప్పుడు హాయిగా ఉంది… నా బ్రతుకులో.. నా ఆలోచనల్లో చిల్లులున్నా నాకేం పట్టట్లేదు. ఐయామ్ హాపీ..

నన్ను నేను కోల్పోయా… ఇది నా జీవితం అని ఎప్పుడో మర్చిపోయా… నా బతుకంతా ఎవరేమనుకుంటారనో, ఎవరేమనుకోవాలనో నన్ను నేను మార్చుకుని నటించేయడమే..

నేను స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నా… అసలు నా ఆలోచనల్లో స్వేచ్ఛ ఉంటేగా బడాయి కాకపోతే! నేనే ఓ చిన్న సమాజపు ఆలోచనల్లో బంధీని!!

తల సర్ధుకుంటున్నా.. షర్ట్ సరిచేసుకుంటున్నా.. షర్ట్ కాకపోతే చున్నీ సరిచేసుకుంటున్నా.. నాకు నేను కన్పించినంత వరకూ క్షణాల్లో స్కాన్ చేసుకున్నా.. ఇప్పుడు బయటి కళ్ల వైపు మళ్లాయి నా కళ్లు… ఏ కళ్లు ఎలా చూస్తున్నాయో.. ఆ కళ్లెనుక భావమేమిటో సైకాలజీతో తంటాలు పడుతూ… రొమ్ములు విరుచుకుంటూ.. ముడుచుకుపోతూ సాగిపోతున్నా.

కష్టమొచ్చినా కటువుగా మాట్లాడకూడదట.. కటువుగా మాట్లాడితే మనుషులు తిట్టుకుంటూ దూరమైపోతారట.. మనుషుల కోసం నా కష్టాన్ని లోపల కప్పెట్టి చిరునవ్వుని అప్పు తెచ్చుకున్నా… వావ్.. నేను స్థితప్రజ్ఞుడినైపోలేదూ…. జనాలు భలే పిలిచేస్తున్నారే…

నా ఆనందాన్ని మరీ ఎక్కువ expose చెయ్యకూడదట.. అందరూ కుళ్లుకుంటారట.. దాంతో ఆనందం ఆవిరైపోయి చెడు జరిగిపోతుందట.. లోపల ఉరకలెత్తుతున్న ఆనందాన్ని ఠపీల్మని ఒకటిచ్చి.. చల్లబరిచి… ఓ చిన్న చిరునవ్వుతోనే సరిపెట్టేశా… వావ్.. మళ్లీ పొగిడేస్తున్నారు… అసలు పొంగిపోని మనిషంటూ.. నేల మీద మనిషంటూ… నా గుండెకి కదా తెలిసేది నేను నేలమీద ఉన్నానా.. నింగిలో ఉన్నానా అని!

ఎన్ని చెప్పుకున్నా అంతే… ఇంకే లేదు.. నేనంటూ.. నాకంటూ…!! నేను పరాధీనం అయిపోయాను.. నన్ను ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించేసింది… నాలో ఓ గాంధీ మేల్కొవట్లేదు.. ఓ స్వాతంత్ర్య ఉద్యమం జరిగే ఛాన్సే లేదు.. అయినా నాకు అవసరం లేదని డిసైడ్ అయ్యాక.. నన్ను నేను అందరికీ అర్పించేసుకుని అందరి acceptanceలో నా ఉనికిని చూసుకుంటూ మురిసిపోవడం మొదలెట్టాక నేను నాకెందుకు..! లోపల గుండేదైనా వేషాలేస్తే ధడాల్మని డోర్లు క్లోజ్ చెయ్యడమే.. సద్ధుమణిపోతుంది… ఇంకా తట్టుకోలేకపోతే వెధవ ప్రాణం పోతే పోయింది.. పోయినా నేను ఈ మనుషుల్లో బ్రతికే ఉన్నాగా.. ఆ స్వార్థం చాలు… నాకు నేను లేకపోయినా చాలు ఈ జీవితానికి!!


– నల్లమోతు శ్రీధర్

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.