ఏంటి ప్రేమ..!

0
552

ప్రేమ….

ఏంటి ప్రేమ….??

ఈ ప్రేమ వల్ల ఏం పొందుతున్నారు?? ఏం సాధిస్తున్నారు??

నిజం చెప్పాలీ అంటే ఇద్దరి మధ్యా వున్న స్వేచ్ఛ కోల్పోతున్నారు….
ఇద్దరి మధ్య వుండాల్సిన దగ్గరతనం కోల్పోతున్నారు….
ఇద్దరి మధ్య వున్న అలౌకిక ఆనందం పోగొట్టుకుంటున్నారు….

వుండకూడని అహాన్ని, నిర్లక్ష్యాన్ని, చిన్నచూపుని, అడ్డుగోడలనీ చక్కగా పెంచేసుకుంటున్నారు….

గుండె నిండా మోయలేనంత ప్రేమ, బరువైన భావాలు, కానీ చెప్పుకోరు!! ఒకరికి తేలికైపోతామేమో అనే భయం, మరొకరికి చెప్పినా పట్టించుకోవడం లేదు, లెక్క చేయడం లేదు అనే బాధ…. ఒకరి భయం ఒకరికి అడ్డు గోడ, ఒకరి బాధ ఒకరికి దూరమయ్యే ఆనందం….

ఇంటి పక్క వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, ఆఖరుకి ముష్టి వాళ్ళతో కూడా సరదాగా మాట్లాడుతూ వుంటారు, ఈ ప్రేమ వున్న చోట మాత్రం అంటీ ముట్టనట్టు ఎవరో అన్నట్టు ప్రవర్తిస్తూ వుంటారు, మళ్ళీ ఒకరు మాట్లాడాలని ఒకళ్ళు ఎదురు చూస్తూ ఏదో లోకంలో బతికేస్తు వుంటారు….

ఇంకెవరి కోసం ఆ ప్రేమ, ఆ భావాలు ఇవన్నీ, ఇంక దేనికీ అంత తపన, ఏం పొందడానికి, ఏం ఆనందానికి?? గుండె పగులుతున్నా గానీ గొంతు దాటని భావాలని ఎందుకు మోస్తారు??

వీళ్లేక్కడకి పోతారులే అనే నిర్లక్ష్యమా!!, మనుషులు ఎక్కడకి పోరు, మనసులే ముక్కలై పోతాయి!!

చెబితే అలుసైపోతామేమో అనే అభద్రతా భావమా, ఇద్దరి మధ్య ప్రేమ వున్నప్పుడు అలుసు అయిపోతాము అనే ప్రశ్నే పతనం!!

ప్రాణం పెట్టే ప్రేమలు వున్నప్పుడు ప్రాణాలు వెలిగించుకోకుండా నలిపేసుకుంటూ, చాటుమాటుగా, అడ్డుగోడ చాటుగా ఎందుకు దాక్కుని ప్రేమని హింసించుకుంటూ వుంటారో నాకు అర్దం కాదు….

కలలు రావాల్సిన కంట్లో, కన్నీళ్ళు వస్తుంటాయి, తేలిక పడాల్సిన మనసులు భారాలు మోస్తూ వుంటాయి, ఒకరికి ఒకరుగా వుండాల్సిన వాళ్ళు ఒకర్ని ఒకరు పోటీలు పడి బాధ పెట్టుకుంటూ వుంటారు….

చివరకి మిగిలేది ఏంటీ, మనసులు అలసిపోతాయి, మనుషులు పిచ్చి పట్టిపోతారు, అంత ప్రేమ ప్రశ్నలా కనపడుతుంది, అన్ని భావాలు భయం పుట్టిస్తాయి….

ఏదో సాధించాలి ఏదో పొందాలని తాపత్రయ పడి, ఎవరిని వారు సాధించుకుంటూ ఎవర్ని వారు కోల్పోతూ ఏళ్ళు గడిపేస్తుంటారు….

పైగా దేప్పుకోడం ఇంత ప్రేమిస్తుంటే అర్ధం కాదా, తెలుసుకోలేవా అని!! చెప్తే కదా, చూపెడితే కదా తెలిసేది…., చెప్పే స్వేచ్ఛ చూపెట్టే చనువు ఇచ్చినప్పుడే కదా అర్ధమయ్యేది….

ఒకరికొకరు Open గా వుండడం అనేది మాజిక్, అద్భుతం, అనంతమైన ఆనందం!! అది ఫీల్ అవ్వకుండానే మనసులు నాశనం చేసేసుకుని ఒకరి నుండి ఒకరు దగ్గర కాలేనంత దూరాలు పెంచేసుకుంటున్నారు….

మనసుల్ని నవ్వించి ఆనందం పొందండి, అంతేగానీ హింసించి బాధని కొని తెచ్చుకోవద్దు….


@ అభిలాష

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.