ప్రశంస..!

0
617

డ్రగ్స్ విషయం గురించి మీ స్పందన ఏంటి అని మీడియా వాళ్ళు జగపతిబాబుని అడిగితే, ఒక వయసు వచ్చి అన్నీ తెలిసి చెడిపోతే అది వాళ్ళ కర్మ కానీ స్కూల్ పిల్లల వరకూ ఇది వెళ్ళింది అని తెలిసి నేను చాలా బాధ పడ్డాను, షాక్ కి గురయ్యాను, కంగారు పడిపోయాను….

Tv లో న్యూస్ చూడగానే నేను మొదట చేసిన పని ఏంటీ అంటే, మా అమ్మాయ్ దగ్గరకి వెళ్ళి, చాలా థ్యాంక్స్ అమ్మా నువ్వు ఇలాంటి పనులు ఏమీ చేయకుండా, ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా నువ్వు చెడిపోకుండా నా పరువు తీయకుండా వున్నందుకు, అని చెప్పాను అన్నాడు....

ఇలా ఎంతమంది పేరెంట్స్ చేస్తారు?? ఎంతమంది తమ పిల్లలు చేసిన మంచి పనులకి లేదా తమకి తెచ్చిన పేరుకి అభినందనలు చెప్తూ వుంటారు?? ఎంతమంది తమ పిల్లల్లో వున్న మానసికోల్లాసాన్ని రెట్టింపు చేసేందుకు ప్రయత్నిస్తూ వుంటారు??

ఎంతసేపు ఇది చెయ్యి ఇలా వుండకూడదు ఇదే చేయాలి అని చెప్పడమే కాదు, చేసింది మంచి పని అయినప్పుడు కమ్మని అభినందన కూడా ఒక దివ్య ఔషధంగా పని చేస్తుంది, పొగిడితే చెడిపోతారు అనేది ఉత్తి మాట, చేసిన మంచి పనికి ఇచ్చే అభినందన వల్ల అది ఇంకా మంచి పనులు చేయడానికి, మంచిగా వుండడానికి, బ్రతకడానికి చేయూతనిస్తుంది….

ఇంట్లో స్వేచ్ఛ, గుర్తింపు లేనప్పుడే పిల్లలు బయట అవి వెతుక్కుని చెడు స్నేహాలకి, చెడు అలవాట్లకి బానిసలు అయ్యి తమ జీవితాలతో పాటు ఇంటి పరువు కూడా తీసి పారేస్తున్నారు…..

పిల్లలతో Friends లా వుండండి, వాళ్ళు ఏదైనా మీతో పంచుకునే Freedom ఇవ్వండి, మిమ్మల్ని చూసి కూడా వాళ్ళు ప్రభావితం అవుతూ వుంటారు, కనుక వాళ్ళ ముందు మీరు పోట్లాడుకోవడం, వాళ్లకి మీ బలహీనతలు తెలిసేలా ప్రవర్తించడం, వేరొకరి గురించి నీచంగా మాట్లాడడం ఇవన్నీ వాళ్ళ మానసిక స్థితి మీద ప్రభావం చూపి, రేపు మిమ్మల్ని వేలెత్తి చుపేలా చేస్తాయి….

వాళ్ళకి పనికిమాలిన పురాణాల కథలు చెప్పకుండా, సమాజంలో ఎలా మెలగాలి ఏ పని చేస్తే నీకు మంచి పేరు వస్తుంది ఏది చెడ్డ పేరు తీసుకోస్తుంది అనేవి చెప్పండి….

ఆడపిల్ల అయితే స్వేచ్ఛకి విచ్చలవిడితనానికి మధ్య వున్న చిన్న గీత గురించి వివరించి చెప్పండి, మగపిల్లల అయితే సమాజంలో ఒక ఆడపిల్లతో ఎలా మెలగాలి, ఎలా గౌరవం ఇవ్వాలి, ఎలా ప్రవర్తించాలి అనేది చెప్పండి….

పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తులు అంతస్తులూ చదువులు హోదాలు కాదు, కాసింత సంస్కారం, తనని తాను సరిదిద్దుకునే జ్ఞానం, మంచి మనసు, సరైన దిశగా పయనించే మెదడు!! ఇవి ముఖ్యమైనవి…. ఆ తర్వాతే ఆస్తులు అంతస్తులూ మిగతావి….

టీనేజ్ దాటేవరకూ వాళ్ళ మనసు మెదడుని మలిచే భాద్యత కేవలం తల్లిదండ్రులదే….ఇప్పటి వరకూ పెరిగాం పెద్దోళ్ళం అయిపోయాం అనుకోకండి, మీ అసలు ఎదుగుదల కూడా మీ పిల్లల పెంపకంలోనే తెలిసేది, బయటపడేది….

ఎక్కువ స్థాయిలో పనిచేసే రియాక్ట్ అయ్యే వయసు గల మీ పిల్లల్లో ఇంకా ఎక్కువ ఉద్రేకం ఉద్వేగం ఎక్కువ స్థాయిలో వుంటాయి అనే చిన్న కామన్ సెన్స్ మరచిపోవద్దు, అలాంటి సందర్భంలో మీరే అహం పక్కన పెట్టి హుందాగా పెద్దరికంగా ఆలోచించి వారితో మెలగాలి…. (ఎదిగే కొద్దీ ఒదగడం అంటే ఇదే)

పెద్దరికం అంటే పిల్లలకీ మీకు మధ్య అడ్డు గోడ కట్టేసుకోవడం కాదు, అడ్డుగా ఏమున్నాయో తెలుసుకుని మీరే వాటిని తొలగించడం……”


@ అభిలాష

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.