నానమ్మ

0
421

కొన్ని సాయంత్రాలు ఎప్పటికీ వసివాడవు
ఎప్పటికి అదే పరిమళాలు వెదజల్లుతుంటాయి
వేసవిలో పగలంతా ఎలా గడిచినా
సాయంత్రాలయ్యేప్పటికి మాత్రం మనసంతా
ఇంటి వాకిలి చుట్టూ తిరుగుతుండేది
ఎప్పుడెప్పుడు నానమ్మ
దీపం పెట్టి బయటకు వస్తుందా
పిల్లలూ రండర్రా అంటూ పిలుస్తుందా…
అని పంచేంద్రియాలనూ కేంద్రీకరించి ఉండేవాళ్ళం
అలా అని ఆట మానమంటే.. ఊహు..
కుదరనే కుదరదు ఆట ఆటే..
పిలుపు వినబడితే మాత్రం ఆటకు b.c పెట్టేసి ఇంట్లోకి పరుగులు

హడావిడిగా కాళ్లు..చేతులు కడిగేసి
బుద్దిగా చేతులు చాపి ప్రసాదం తినేయటం
గబగబా చాప తెచ్చి కింద పరిచేసి
ఎంచక్కా వసారా గోడకి జారిగిలపడి
నానమ్మ కోసం ఎదురు చూపులు..
ఎంచక్కా సాంబ్రాణి వేసి ..
అగరొత్తులు వెలిగించి అక్కడే ఉండే గుంజకి గుచ్చి
నిదానంగా చిన్న పీట మీద కూర్చునేది..
సన్నజాజులో…జాజులో..మల్లెలో మాలకడుతూ
కథలు మొదలయ్యేవి..

ఎదో ఒకటి మొదలైతే
మొత్తం అవ్వాలని మేము..
కుదరదని ..రోజుకు కొంత అని తాను..
వాదనలోనే మాకు భోజనాలు ముద్దలు చేసి పెడుతూ..
తినకపోతే ఛణుకులు విసురుతూ..నవ్వుతూ నవ్విస్తూ..
పక్కలు సర్దించేసేది…..

అలా వేసవి సాయంత్రాలన్నీ ఎన్నటికీ మనసుని వీడని జ్ఞాపకాలే…


 

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.