అనుభూతులు

0
746

జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తలుచుకుని మురిసిపోయేందుకు గానూ కొన్నైనా మరిచిపోలేని మధుర జ్ఞాపకాలు ప్రతీ మనిషికీ తప్పకుండా వుండాలి. బాల్యంలో తోబుట్టువులతో కలిసి మట్టిలో క్రిందా మీదా పడి దొర్లడాలు, కొట్టుకోవడాలు , అంతలోనే అన్నీ మరిచిపోయి కలిసిపోవడాలు , స్కూల్ లో టీచర్స్ కి , తోటి పిల్లలకి నిక్ నేమ్స్ పెట్టడాలు, టీనేజ్ లో స్పెషల్ క్లాసెస్ వున్నాయంటూ ఇంట్లో అబద్ధాలు చెప్పి ఫ్రెండ్స్ తో కలిసి సినిమా లకి వెళ్ళడాలు , కాలేజీ లో అందమైన అమ్మాయిలకి సైట్ కొట్టడాలు, ప్రేమలేఖలు వ్రాయడాలు, బదులుగా వాళ్ళ చేతి చెంప దెబ్బ తినడాలు, వాలు చూపులూ, కోర చూపులూ , ఆ పైన వివాహం జరిగాక లైఫ్ పార్టనర్ తో  కలబోసుకున్న కొంటె ఊసులూ, చిలిపి చేష్టలూ , అంతలోనే చిరు అలకలూ, ప్రణయ కలహాలూ. చెప్పుకుపోతే ఇలా ఎన్నో, ఎన్నెన్నో.

మా జీవితం మీరు వర్ణించినంత సుందరంగా ఏమీ సాగలేదు. మా బాల్యం లో కూడా అంత గొప్ప అనుభూతులేమీ లేవు ‘ అంటారా? . ఏం ఫరవాలేదు. మీకందలేదని మీరనుకుంటున్న ఆ అందమైన అనుభూతులనీ , జ్ఞాపకాలనీ ఇప్పుడు మీరు మీ పిల్లలకి అందించండి. ‘ చదవండి, ర్యాంకులు సాధించండి ‘ అంటూ ఆ పసివాళ్ళని మీ మాటలతో, హెచ్చరికలతో ఒకటే ఊదరకొట్టకుండా వాళ్ళని వాళ్ళ బాల్యాన్ని హాయిగా ఆస్వాదించనివ్వండి. వాళ్ళతోపాటు మీరు కూడా ‘కోల్పోయాను’ అనుకుంటున్న  ఆ బాల్యపు మధురిమలని పొందండి. సరదాగా మీ పిల్లలతో పాటు వెళ్లి పానీపూరి తినండి. చిరు చినుకులు పడుతుండగా మీ టెర్రస్ మీదకి వెళ్లి పిల్లలతో పాటుగా తనివితీరా తొలకరి వర్షంలో తడవండి. మీ అదృష్టం బావుండి అదే సమయానికి  ఎండా వానా కలిసొచ్చి ఆకాశంలో ఇంద్రధనుస్సు వెలిస్తే ఆ అద్భుతాన్ని కళ్ళారా చూడండి. ఆ దృశ్యాన్ని మీ సెల్ ఫోనులో బంధించండి. పిల్లలతో కలిసి సెల్ఫీ లు దిగండి.

మీ పిల్లలు టీనేజి లో వుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ని మీ ఇంటికి ఆహ్వానించండి. ఇక అర్థరాత్రి దాటినా కేరింతలతో ఫుల్ స్టాప్, కామా లేకుండా సాగిపోయే వాళ్ళ కబుర్లని, నవ్వులని మీకు ఓపికుంటే తలుపుకి మీ చెవిని అతికించేసి వినండి. భలే తమాషాగా వుంటాయి ఆ వయసులో వున్న పిల్లల కబుర్లు. అలా మీరు వింటున్న టైం లో పొరపాటున ఆ పిల్లలు గానీ దఢాలుమని తలుపులుగానీ తెరిస్తే మీరు దొంగతనంగా వాళ్ళ మాటలు వింటున్న విష్యం బైటపడి పోయి వాళ్ళ మీద మీరు గూఢచర్యం చేస్తున్నారేమోనని వాళ్ళు అపోహ పడే ప్రమాదముందని మాత్రం మరిచిపోకండి.

మీ విలువైన కాలాన్నంతా ఆఫీస్ కి, పనికే అంకితం చేసేసి, ఆస్థులని పోగేసి, యింకా యింకా నాలుగు తరాలకి సరిపడా సంపాదించాలన్న అర్థంలేని తాపత్రయంలో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీకు చివరకి మిగిలేది ఎప్పటికైనా డి మానిటైజ్ అయిపోక తప్పని విలువ లేని రంగు కాగితాలే అన్న విషయాన్ని త్వరగా తెలుసుకోండి. వయసు పెరిగి మీ ఒంట్లో ఓపిక తరిగిన మీదట ఇక అప్పుడు మీ కుటుంబ సభ్యులతో తీరిగ్గా కాలాన్ని గడుపుదామని మీరు అనుకునే సమయానికి మానసికంగా వారంతా అప్పటికే మీకు అందనంత దూరంగా జరిగిపోయి వుంటారు. అప్పుడు మీకు జీవితంలో మిగిలేది భరించలేని ఒంటరితనమే. అందుకే తీసుకున్న జీతానికి సరిపడా పని చేయండి, పని లో ఆనందాన్ని పొందండి , కానీ పని ని, ధన సంపాదననే జీవితంగా మాత్రం మలుచుకోకండి. జీవితంలో ఏ సమయంలో దేనికి ఎంత ప్రాధాన్యత నివ్వాలో సరిగ్గా తెలుసుకోండి. మీ పిల్లలకి , మీ జీవితభాగస్వామి కి నెమరేసుకునేందుకు సరిపడా చక్కటి అనుభూతులనివ్వండి, మీరూ పొందండి.

మీ జీవితంలో అసలైన సిరిసంపదలు అయినవారితో మీరు పంచుకునే అందమైన అనుభూతులే. మీ పిల్లలకి మీరివ్వాల్సిన ఆస్థులు ఇళ్ళు, స్థలాలు, నగలు, నాణ్యాలు కావండీ. ప్రేమానురాగాలతో కూడిన అనుభవైక్యమైన అనుభూతులే మీరు వాళ్లకివ్వాల్సిన పెన్నిధులు. మీ పిల్లలు వాళ్ళ జీవితాన్ని రివైండ్ చేసుకుని చూస్తే తియ్యగా నెమరేసుకునేందుకు కావలసినన్ని మధురమైన అనుభూతులని మీరు వాళ్లకి ఇవ్వగలిగారంటే మీరు మీ జీవితంలో విజయం సాధించినట్లే.

రెక్కలొచ్చి పక్షులు ఎగిరిపోయినట్లుగా మీ పిల్లలు వాళ్ళ జీవిత లక్ష్యసాధనలో వారి గమ్యాలకి చేరువౌతూ మీకు మెల్లిమెల్లిగా దూరమయ్యే సమయంలో వారితో ఇన్నేళ్ళు పెనవేసుకుపోయి అనుభవించిన ఆ అందమైన అనుభూతులూ , వాటి జ్ఞాపకాలూ , ఇవే మిమ్మల్ని కడదాకా సంతోషంగా ఉంచేవి. ఆ అనుభూతుల ని తరచి తరచి గుర్తు చేసుకోవడంలో ఉండే ఆనందమే మీతో పాటుగా వుండి మీ చేత వైతరణి ని ఆనందంగా , సులభంగా దాటించేస్తుంది. అందుకే యికనైనా మేలుకోండి. ఆలస్యం చేయకుండా చక్కటి చిక్కటి అనుభూతుల పరంపరలని పోగు చేసుకోండి. ఆ అనుభూతులరాశినే వారసత్వంగా మీ వారసులకి అందించండి. ఏ ముష్కురులూ కొల్లగొట్టలేని, ఎంతమంది కి పంచినా తరిగిపోని అక్షయపాత్ర లాంటి  ఆ అనుభూతుల వారసత్వసంపదని పోగేయడమే మీ వంశాచారంగా తరతరాలుగా  కొనసాగేలా ఆనందానుభూతుల సృష్టికి మీరే తొలిఅంకురాన్ని నాటండి.


అప్పరాజు నాగజ్యోతి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.