సోషల్ యాక్సెప్టెన్స్..

0
398

పది మంది చేత ఆమోదించబడడం..  అలా పదిమంది చేత ఆమోదించబడడడం కోసం జీవితం మొత్తం త్యాగం చేసేయడం.. మన జీవితాన్నీ, మన ఆలోచనల్నీ తాకట్టు పెట్టి ఇతరులకు నచ్చినట్లు బ్రతికేయడం.. తరాల తరబడి కొన్ని కోట్ల జీవితాలు ఈ మత్తులో అస్థిత్వం కోల్పోతుంటాయి.

“నా జీవితం పట్ల నాకు పూర్తి కంట్రోల్ ఉంది.. ఎవరికీ ఇబ్బంది కలగకుండా నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతాను… ఎవడో నన్ను ఒప్పుకోవలసిన పనిలేదు.. నేనేంటో నాకు తెలుసు…” అనే తరహా వ్యక్తిత్వం అతి కొద్ది మందిలోనే కన్పిస్తోంది. అటు చూసీ, ఇటు చూసీ.. అందరూ తలూపితే, ఒకరో ఇద్దరో భుజాన చేయేసి భరోసా ఇచ్చినట్లు బిల్డప్ ఇస్తేనే రంగంలోకి దూకే వాళ్లే కన్పిస్తుంటారు కానీ అసలు ఎవరి వైపూ చూడకుండా తలొంచుకుని తమ పని తాము చేసుకు పోయే వాళ్లని వేళ్లపై లెక్క పెట్టాల్సి వస్తోంది.

సమాజం అనబడే ఓ పదిమంది మనుషుల సమూహం ఎన్నో జీవితాన్ని తమ గుడ్డి ఆలోచనలతో, తమ ఇగోలతో, స్వార్థాలతో హైజాక్ చేసేస్తోంది. ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ ఏ వ్యక్తికా వ్యక్తికి ఎటూ ఉండనే ఉంటుంది.. మనుషుల్ని నైతికంగా తయారు చేస్తున్నామన్న సాకుతో సమాజమనే మనుషుల సమూహం ఎవరికి వారు నీతి తప్పుతూనే అందరూ కలిసి మరో మనిషిని బలి పశువుని చెయ్యడం సర్వ సాధారణం అయిపోయింది.

ఏ మనిషి లైఫ్‌కైనా రెండే ఛాయిస్‌లు ఉన్నాయి.. తనకి నచ్చినట్లు బ్రతకడమా, పక్కోడికి నచ్చినట్లు బ్రతకడమా అన్నది. ఇక్కడ ప్రతోడీకీ తనకు నచ్చినట్లు బ్రతకాలనే ఉంటుంది.. కానీ ఎమోషనల్, సైకలాజికల్ ట్రాప్‌ల వల్ల ఇతరుల మొహాల వైపు చూసి వాళ్లకు నచ్చినట్లు బ్రతకడం మొదలెట్టే వాళ్లే ఎక్కువ. వ్యక్తిగా నువ్వేం సాధించావన్నది వెనక్కి తిరిగి చూసుకుంటే.. నీ ప్రయాణాన్ని పాడు చేసిన సమాజమే దోషిగా కన్పిస్తుంది తప్పించి నువ్వు సాధించేదీ కన్పించదు.

అది చెయ్యొదంటాడు ఒకడు.. అందులో నువ్వు రాణించలేవంటాడు.. నీ వల్ల కాదంటాడు మరొకడు… మనకి ఇలాంటివి అస్సలు అచ్ఛి రావంటాడు ఇంకొకడు… ఫలానా సందర్భంలో నువ్వు అలా ఉండాల్సింది.. నువ్వు ఈ ఆర్టికల్ రాయకుండా ఉండాల్సింది.. ఈ మూమెంట్లో నువ్వు మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చోవలసింది.. నువ్వు ఆ అమ్మాయితో చనువుగా ఉండకుండా ఉండాల్సింది.. నువ్వు అమెరికా వెళ్లకుండా ఉండాల్సింది.. ఇలా ప్రతోడూ ముందుకు కదిలే మన ప్రయాణాన్ని కాలు అడ్డం పెట్టి చోద్యం చూస్తూ కంట్రోల్ చేయాలని చూసే వాడే!

దాదాపు ఇరవై ఏళ్ల నుండి సొసైటీని, మనుషుల ఆలోచనల్నీ సమీపంగా చూశాక అర్థమైందొక్కటే… సొసైటీ ఓ భ్రాంతి. అది లేదనుకుని మన పని మనం చేసుకుపోతే ఇదే సొసైటీ మనల్ని ఆపడం మానేసి హర్షించడం మొదలెడుతుంది.. అలా కాకుండా ప్రతీ క్షణం సొసైటీ మనల్ని ఒప్పుకోవాలని ఆలోచిస్తూ పోతే ఎవడూ ఒప్పుకోడు. పుట్టినప్పుడు ఎలా జీరోగా ఉన్నామో పోయేటప్పుడు అలా జీరోగానే పోవాల్సి వస్తుంది. సో సోషల్ బారియర్స్ తెంచుకోండి.

నల్లమోతు శ్రీధర్

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.