వెయిటింగ్‌‌.!

0
430

క్షణాలు, నిముషాలు, గంటలు గడిచిపోతున్నాయి.. చూపు గుమ్మం వైపే.. వస్తానన్న మనిషి రాలేదు. ఇప్పట్లా ఫోన్లు లేవు, కాల్ చేసి వెళ్లిపోదామంటే, నాలుగైదు గంటలు వెయిట్ చేశాక ఆ మనిషి వస్తాడు. అతను లేట్‌గా రావడానికి అతని కారణాలు అతనికుంటాయి. వేరే పనులుండొచ్చు, మనం అంత ప్రయారిటీ కాకపోవచ్చు.

టౌన్‌లో కాలేజ్‌కెళ్లి.. సాయంత్రం ఇంటికెళ్లడం కోసం సెంటర్లో ఓ టీ కొట్టు పక్కన రెండు జేబుల్లో చేతులు దూర్చుకుని ఓ స్థంభానికి ఆనుకుని గంటన్నరా, రెండు గంటల వెయిటింగ్.. యెస్ ఇప్పట్లా క్యాబ్‌లు లేవు, ఆటోలు లేవు, GPSలు లేవు.

కొన్ని కోట్ల మంది జీవితాలు 20 ఏళ్ల క్రితం ఇలాగే ఉండేవి. అలాంటి వాళ్లలో నేనూ ఒకడిని. ఆఫ్టరాల్ ఓ చిన్న పని కోసం అన్ని గంటలు వెయిట్ చేయాల్సి రావడం మన వెనుకబాటుతనంగా ఇవ్వాళ అన్పించవచ్చు. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే అంతకన్నా పెద్ద ఎడ్యుకేషన్ ఏదీ లేదు. ఓర్పు, సహనం పుస్తకాల్లో చదివి అవేంటో అర్థం కాకుండా పేరెంట్స్‌ని మీద ప్రతీ చిన్న దానికీ కసురుకునే జనరేషన్‌కీ.. అవే ఓర్పు, సహనాలు వ్యవస్థలోని పరిస్థితుల వల్ల కళ్లారా చూసిన జనరేషన్‌కీ ఆలోచనల్లో, విలువల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది.

ఎవరి ఆఫీసులోనో, ఇంట్లోనో ఓ ఇరుకు గదిలో కూర్చుని చేతిలో ఫోన్ల లాంటివి కూడా ఏమీ లేనప్పుడు, పక్కన మాట్లాడడానికి మనిషి కూడా లేనప్పుడు అలా డోర్ వైపు తదేకంగా చూస్తూ ఆలోచనల్లోకి వెళ్లిపోయి మనస్సులో ఏర్పడే సంఘర్షణ ఓ వ్యక్తిత్వానికి రూపం పోస్తుందని ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మనలోకి మనం తొంగి చూడడానికీ, శూన్యంలోకి చూడడానికీ తీరుబడి లేదు. అస్సలు మనస్సులో వేక్యూమే లేదు. ఒక్క నిముషం ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది, వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకుంటాం. Facebook news feed స్క్రోల్ చేస్తాం, లేదా ఏదో యూట్యూబ్ వీడియో చూస్తాం, లేదా గేమ్ ఆడుకుంటాం. ఇంకెక్కడ ఆలోచనలు? అసలు మనకు మనస్సనేది ఒకటుంది అన్నదే చాలా వరకూ తెలీదు. మనకు తెలిసిన మన మనస్సంటే మన ఎమోషన్లు మాత్రమే.

మనకు కావలసిన పని ఐదు నిముషాలు ఆలస్యమైనా… నన్నే ఇంత వెయిట్ చేయిస్తారా అని అంతెత్తున ఎగురుతాం. ఇదీ మన సహనం స్థాయి ఇప్పుడు! అన్నీ క్షణాల్లో జరిగిపోవాలి. అన్నీ డిమాండ్ చేసి, రూల్స్ మాట్లాడి వెంటనే జరిపించుకోవడం మనం గొప్పదనంగా భావిస్తాం. “చూశావా.. ఎలా పనిచేయించుకున్నానో” అని పక్కనోళ్లకి గర్వంగా చెప్పుకుంటాం.

నువ్వు గొప్పోడివి కావచ్చు.. నీకు అన్నీ రూల్స్ తెలియొచ్చు… నువ్వు తలుచుకుంటే అన్ని పనులూ అయిపోవచ్చు.. నిన్ను ఎవరూ వెయిట్ చేయించకపోవచ్చు.. నీకంటే ముందే వచ్చి నీకోసం వేచి చూస్తూ ఉండొచ్చు. ఇంత ప్లాన్డ్ ఎన్విరాన్‌మెంట్లో నువ్వు ఏం సాధిస్తున్నాననుకుంటున్నావో వాటితో పాటు చాలానే కోల్పోతున్న విషయమూ తెలీట్లేదా?

రెండు నిముషాలు ఫోన్ చేతిలోకి తీసుకోపోతే మనస్సులో ఏదో వెలితి. మాది చెరువు జమ్ములపాలెం అనే విలేజ్. బాపట్లకి 7 కిలోమీటర్ల దూరం. చాలా విషయాలకు గంటలు గంటలు వెయిటింగ్‌‌లోనే సరిపోయేవి. నాకు మొదటి నుండి టైమ్ కంటే ఓ అరగంట ముందే ఎక్కడికైనా వెళ్లే అలవాటు. సినిమా ఫీల్డ్‌‌లో ఫిల్మ్ జర్నలిస్టుగా ఉన్నప్పుడు చెన్నైలో 9 గంటలకి సినిమా ఓపెనింగ్ అంటే చాలాసార్లు నేనూ, మా ఫొటోగ్రాఫర్ నాగేశ్వరరావు 7.45, 8 కల్లా వెళ్లిపోయేవాళ్లం. హీరోహీరోయిన్లు, డైరెక్టర్, ప్రొడ్యూసర్లు, ఇతర జర్నలిస్టులు10 గంటలకి తీరిగ్గా వచ్చే వాళ్లు. ఇప్పటికీ నాకదే అలవాటు నేను ఎక్కడికి వెళ్లినా అరగంట, కొన్నిసార్లు గంట ముందే ఉంటాను. నా తప్పిదం వల్ల నేను లేట్ రావడం వల్ల ఐదు నిముషాలు కూడా ఆలస్యమైన విషయాలు ఏమీ నా లైఫ్‌లో లేవు. అలాగే ఎవరైనా లేట్‌గా వస్తే చిరాకు పడిందీ లేదు. యెస్.. వెయిట్ చేయడం నా బాధ్యత. ఓర్పుగా ఉండడంలో ఉన్న సంతోషం అంత ఈజీగా అర్థం కాదు.

సో అంత ముందు వెళ్లి.. అందరూ లేట్‌గా వస్తుంటే.. ఇప్పటికీ నాకు చాలా వెయిటింగే ఎదురవుతుంది. కానీ ఏరోజూ నేను బోర్ ఫీలవ్వను, చీటికీ మాటికీ ఫోన్ చేతిలోకి తీసుకుని టైమ్‌పాస్ చేయను. ప్రశాంతంగా వచ్చే పోయే వాళ్లని చూస్తూ, లేదా ఆకాశంలోకి చూస్తూ ఆలోచనల్లోకి వెళ్లిపోతుంటా. ఎంతమందికి తెలుసు అందులో ఉండే సంతోషం?

నీతో నువ్వు ఉండడం చేతకాని రోజున నీకు స్మార్ట్‌ఫోనో, ఫేస్‌బుక్‌నో తప్పనిసరిగా ఉండాల్సిన రోజున అది నీ జీవితం మాత్రం కాదు.. నీ జీవితం నీ చేతుల్లోంచి వెళ్లిపోయినట్లే.. ఇది అర్థం చేసుకో!!


నల్లమోతు శ్రీధర్

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.