ఈ పాదం ..ఇలలోన నాట్యవేదం..!!

0
511

మయూరి అనే సినిమాలో ” ఈ పాదం ..ఇలలోన నాట్యవేదం.. ఈ పాదం నటరాజుకే ప్రమోదం” అంటూ ఓ పాట ఉంటుంది.

ఆ పాటలో వివిధ విషయాలలో పాదం యొక్క ఉనికీ,ఆవశ్యకతనీ చెపుతూ సాగుతుంది.
ఒక రచనకి పదాలు ముఖ్యం. పదాల ద్వారానే ఒక రచనానిర్మాణం జరుగుతుంది.రచనలోని విషయం, శైలీ తెలిసేది ఆ రచనలోని పదాల పరంపర ద్వారానే.రచనని ముందుకు సాగించేది పదాలే. ఒక గొప్ప రచన అవటానికి ఏదేని విషయం గొప్పదవటానికి విషయ వస్తువు కన్నా ముందు నాణ్యమైన పదాలు..వాటి అమరిక అవసరం అవుతుంది. ఈ పదాలే పాదాలు. అలా ప్రతిచోటా వచ్చే పదం/పాదం యొక్క విశిష్టతని చెపుతుందాపాట.

ఇహ విషయానికి వస్తే …. అబ్ స్ట్రాక్ట్ గానూ, లేక ఉదహరించి చెప్పిన భావాలని యధాతథంగా ఊహించుకోవటం అనేది సమస్య. ప్రపంచం/ లోకం/ సమాజం నాలుగు రకాలైన మనుషులతో ముందుకు సాగుతుందీ అని చెపుతూ

తన మేధస్సు/ ఆలోచనల ద్వారా సమాజహిత విషయాలని ఆలోచించేవాడు బ్రాహ్మనుడనీ, అంగబలంతో రాజ్యాన్ని/సమాజాన్ని/ప్రజనీ కాపాడేవాడు క్షత్రియుడనీ, సమాజాన్ని/ప్రజకి కావలసిన ఆహర ధాన్య/వస్తువులని విక్రయించేవాడు వైశ్యుడనీ, సమాజాన్ని శ్రమతో నడిపేవాడు శ్రామికుడనీ చెపుతూ..
సమాజాన్ని/ప్రపంచాన్ని మనిషితో పోల్చి చెపితే వాళ్లు తల, భుజాలు..పొట్ట..పాదాలని రిప్రజెంట్ చేస్తారనీ చెప్పుకొచ్చారు. ఇదంతా అబ్ స్ట్రాక్ట్ భావన. మనుషులు తల, చేతులనించి, కాళ్లనించీ పుడతారా ? అనే ఆలోచన కూడా చేయకుండా యథాతథంగా తీసుకుంటే ఎలా ???

అసలు ఆ చెప్పే మనిషి ఉన్నాడా ? నేనే అదీ, నేనే ఇదీ.. నేనే సర్వం ,నేనే సకలం అంటూంటే.. అసలు ఒక మనిషి అలా అన్నీ ఎలా అవుతాడూ? కనక అదంతా ఒక అబ్ స్ట్రాక్ట్ భావన అని తెలుసుకోకపోతే ఎలా ??

మనిషి శరీరంలో ప్రతి భాగం అమూల్యమైనదే.. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. ఒక్క సారి..మనం కాళ్ళు.. చేతులు లేకుండా ఊహించుకుంటె జీవించటం ఎంత కష్టమవుతుందనేది ఎరుకలోకొస్తుంది.
పాదాలు అనగానే హీనం అని భావించుకునే వాళ్లకి పాదాల విలువ చెప్పటం కష్టమే కాని, ఒక మనిషిని/ మనని నిలబెట్టేవి కాళ్ళు. నడిపించేవి..ప్రపంచాన్ని చూపెట్టెవి కాళ్లు.

మనం ఎవరినైనా అత్యంత గౌరవించేవాళ్ల ముఖారవిందానికి నమస్కరిస్తున్నామని చెప్పం..పాదాభివందనం అంటాం. పాదాలకి ఉన్న ప్రాముఖ్యతని గుర్తించాలి. ఆలోచిస్తూ కూర్చునేవాడు ఎన్నటికీ బావుపడడు. అడుగు ముందుకేసేవాడే ముందుకు వెళతాడు.

ఆ విధంగా శ్రామికులని పాదాలుగా అభివర్ణించటం జరిగింది. వాళ్ళే సమాజాన్ని నిలబెట్టేది. నడిపించేది. ముందుకు సాగేలా చెసేది. ఒక సమాజంలో కేవలం ఒక రకమైన మనుషులే ఉండటం వల్ల సమాజం మనుగడ సాగించదు.

మనం ఒక కంపనీని తీసుకున్నట్టయితే…అందులో వస్తు ఉత్పత్తి జరుగుతుంది. కంపనీ ఎస్టాబ్లిష్ చేయటం. ఏ వస్తు ఉత్పత్తి ఎలా జరగాలి..వివిధ దశలు, ప్లాన్స్..మొదలైనవన్నీ ఆలోచించి
ఎక్సిక్యూట్ చేసే విభాగం, మార్కెటింగ్, సేల్స్ చూసుకొనే విభాగం,మిషినరీ/ యంత్ర, వస్తు, ఉద్యోగుల రక్షణ చూసుకునే విభాగం, వస్తు ఉత్పత్తిలో అవసరమయ్యే శ్రామిక విభాగం ఉంటాయ్ కదా.
ఇలా ఏ కాలంలొ అయినా ఈ నాలుగు రకాల వ్యక్తులు ఉండవలసిందే. కేవలం ఆలోచనలు లేదా కేవలం పరిపాలన/రక్షణ , లేదా వస్తువిక్రయం వినియోగం వల్ల మాత్రమే సమాజాభివృద్ది కాదు కదా.

ఒక్క సారి ఆ మెట్రో ఫ్లై ఓవర్ చూస్తే,.. ప్లానర్లూ, ఇంజనీర్లూ,కావలసిన సామాగ్రి ఇచ్చేవాళ్ళూ.. కడుతూన్న శ్రామికులూ కనపడటం లేదా మనకి. అందరూ కలిస్తేనే కదా నిర్మాణం. ఎవరెవరి స్కిల్ ని అర్హతని బట్టి కదా అక్కడ వాళ్ళు పనిచేస్తూ అది నిర్మింపబడుతోంది.

ఇలా సమాజాభివర్ణనలో భాగంగా అబ్ స్ట్రాక్ట్ గాను..సింబాలిగ్ గా చెప్పిన విషయాలని తప్పుగా అర్థం చేసుకుంటూ న్యూనతా భావనని మనం పెంపొందించుకోవటం, మనకి మనం పెట్టుకున్న న్యూనతలోంచి ఆవేశపడటం ఎంతవరకు సమంజసం ?

ఒకానొక కాలంలో విద్య అంటే వృత్తిపనే… ఎవరికి సంభందించిన విద్యని వారసత్వంగా అందిపుచ్చుకొని ఆయా వృత్తులని చేపట్టి జీవించటం జరిగేది..తమకి చేదోడు వాదోడుగా ఉంటటానికి వివాహం చేసుకునేవాళ్ళని కూడా అదే వృత్తిలో చేసుకునేవాళ్ళు. దాన్ని ఎవరూ బలవంతంగా ఎవరిమీదా రుద్దిందిలేదు. కాకపోతే సమాజంలో ధనం/ డాబు/దర్పం సంపద ప్రాదిపతికన హెచ్చుతగ్గులు ఉన్నాయనేది వాస్తవం. అవి ఇప్పటికీ ..ఎప్పటికీ ఉంటాయి.

ఫలానా కులంలో పుట్టావు కనక ఫలానా వృత్తినె చేపట్టాలీ బలవంతాలు ప్రస్తుత సమాజంలో లేవు. విద్యారంగం అందరికీ అన్ని రకాల విద్యలనీ అభ్యసించే వీలు కల్పించింది. ఎవరైనా ఏదైనా చదవచ్చు..ఆయా వృత్తికి కావలసిన అర్హతలు సంపాదించుకొని, ఆ వృత్తిని బట్టి ఆహార్య, ఆచార వ్యవహారాలని మార్చుకొని ఆ వృత్తిని చెపట్టవచ్చు. కాకపోతే కొన్నింటికి ఖచ్చితమైన ఆహార్యం అవసరమవుతుంది. అది విధిగా పాటించాలి. ఉదాహరణకి పోలీసు అవ్వాలనుకున్న వ్యక్తి ఆ యూనిఫాం వేయాలి. అనర్గళంగా వేదమంత్రాలు వల్లించేవాడెవరైనా బ్రాహ్మనుడే అవుతాడు. రోగాలని నయం చేస్తే డాక్టరే అంటారు. సినిమా తీస్తే దర్శకుడే అంటారు.

ఏ విధ్యలో నైనా రాణించాలంటే ఆ విద్యలో నిపుణత సాధించాలి. కొన్ని విద్యలకి మనస్పూర్తిగా అంకితమవటం అవసరమవుతుంది. కేవలం ‘జీవిక’ కే కాక.. అంతర్గత ఆనందాన్ని తట్టిలేపగలిగే కళల్లో రాణించాలన్నా, భావనాత్మక ఆనందాన్ని పొందాలన్నా దాని పట్ల అపారమైన ప్రేమ, ఆసక్తి అంకిత భావం అవసరం. ఏదో పైపైన నేర్చుకుంటె అందులో వచ్చేదేమీ ఉండదు. అందుకే అలాంటి విద్యలని ఎంచుకునే ముందే మన అర్హత గురించి ఆలోచించుకోవాలి. ఇక్కడ అర్హత అంటే అంకితభావం మాత్రమే. అంతగా మనని మనం ఇచ్చుకోలేనపుడు వాటి గురించి ఆలోచించకపోవటమే బెస్టు. సంగీత, నాట్య, చిత్రలేఖనం వంతి లలిత కళలతో పాటూ అధ్యాత్మికత కూడా ఒక కళే !!

కనక సమాజంలో కేవలం జీవిక ఇచ్చే ఉద్యోగ సద్యోగాలు, వృత్తివిద్యలకి కావలసిన నైపుణ్యాన్ని సొంతం చేసుకునే వాళ్లకెపుడూ సమాజంలో విలువా, అవసరం, గౌరవం ఉంటూనే ఉంటుంది. కళని అభ్యసించి, కళాకారుడిగా తాను ఆనందపడుతూ, ఇతరులని కూడా అనందిప జేసేవాళ్లకి గౌరవ మర్యాదలూ, తగు సంపదా చేకూరుతుంది.

దేనికైనా సాధన, పోటీ తత్వన్ని తట్టుకొని ఎదగటం అనేది ఉంటుంది. వీటిగురించి ఆలోచించి ఆ దిశగా జనాన్ని మార్చటం, ఆ దిశలో చేయాల్సిన కృషిని చేయకుండా ….ఎక్కడివో చింతకాయపచ్చడి కాలంలో విషయాలన్ని రాసుకుంటూ సమాజాన్ని తప్పుదోవ పట్టించకూడదు.


@ Chakradhar Rao

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.