అందమైన బాల్యం

0
1039

స్వప్నాలు ఆకాశంలో పూస్తాయని
ముక్కు గోకితే దేవుడు ప్రత్యక్షం అవుతాడని
నెమలీకలు పిల్లలు పెడతాయని
పెన్సిల్ చెక్కుతో రబ్బరు చేస్తారని
ఊడిన పన్ను కంట పడకుండా దాచాలని
ఒట్టు వేస్తే అబద్ధం చెప్పకూడదని
దొంగతనం చేస్తే దేవుడు కొడతాడాని
అన్నం మానేస్తే పేగులు ఏడుస్తాయని
కాకెంగిలితో పంచుకునే కమ్మదనాన్ని..
చిలకొట్టిన పండు కోసం దెబ్బలాడుకున్న రోజులు
రంగు పూల రెమ్మలతో పుస్తకాల్లో అచ్చులేయాలని
పూలను పుస్తకాల పుటల్లో దాచాలని
గింజలు తింటే చెవుల్లో నుండి మొక్కలు మొలుస్తాయని
కనురెప్పల్లో వెంట్రుకలు రాలితే ఓ కల నిజమవుతుందని
ఆకాశంలో చుక్కలను దొంగల్లా..
మంచం కోళ్లలా చూసిన రోజులని
చుక్క రాలితే కోరిక తీరుతుందని
చందమామలో కుందేలుపిల్లని ఊహించిన రోజులని
ఆకులతో అభరణాలని చేసి పెట్టుకుని మెరిసిన క్షణాలని
బొమ్మల పెళ్లిళ్లు చేసి పెళ్లి పెద్దలైన రోజులని
దెబ్బ తగిలితే అమ్మ మంత్రం వేస్తే తగ్గిపోయే రోజులని
మొండి తనానికి విరుగుడుగా నాన్న చెవిలో చెప్పిన రహస్యానికి నవ్వుల పూలు విరిసిన రోజులని
తాతమ్మ ట్రంకు పెట్టెలో ఉండే దెయ్యానికి భయపడే బాల్యాన్ని
తాతయ్య కబుర్లలో నిద్రపుచ్చిన చిన్నతనాన్ని
ఇంటి వసారాలో ఊగిన ఉయ్యాల శబ్దాలని
చలికాలంలో కాగిన చలిమంట చిట చిటలతో
హాయిగా నిదరోయిన రాత్రులని
ఎక్కడని వెతకను ఇప్పుడు..
వెతికినా దొరకవెప్పటికీ….


@ తులసి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.