ఏమండోయ్ శ్రీవారూ..

0
1194

ఎక్కడున్నారూ..ఎంత సేపు ఈ ఎదురుచూపులు?
చూసి చూసి కళ్లు కలువలవుతాయేమో..
ఇంతకీ నా గొడవ ఏమిటా అనుకుంటున్నారు కదూ..
ఇదిగో ఇదీ సంగతి.

ఎమోయ్ త్వరగా వచ్చే స్తా ఈ రోజు అంటూ వెళ్ళారు శ్రీవారు.
ఆయనటు వెళ్ల్గానే హడావిడిగా పనులన్నీ చక్కబెట్టి..
పిల్లలకి క్యారేజీలు ఇచ్చివచ్చి ఓ ముద్ద తిని..నడుం వాలుద్దాం అనుకున్నా..
శ్రీవారి మాట మదిలో మెదిలి సాయంకాలపు ఉపాహారాల తయ్యారి కానించి
పిలల్లలను రెడీ చేసే లోపు ఫోను.

ఎమోయ్ అంతా రెడీనా పది నిమిషాల్లో వచ్చేస్తా అని ..
అమ్మో అనుటూ ఉతికిన బట్టలు లాగి గబ గబా మడతలు వేసి
పప్పు కడిగి పక్కన పెట్టి..మళ్ళీ రావటానికి లేట్ అవుతుందేమో అని
పిల్లలకి తినిపించి..వారినలా కూర్చోబెట్టి
ఆకలంటారేమో అని కాసిన్ని ప్యాక్ చేసుకుని..మంచి నీళ్ళు పెట్టి
గ్యాస్ కట్టేసి తాళాలు వేసి ఓసారలా వీధిలో కన్నేసి
ఇంకా రావటం లేదని పిల్లలకు టివి పెట్టి
శ్రీవారికిష్టం కదా అని కాసిన్ని సన్నజాజులు మలకట్టి జడలో తురుముకుని
కుక్కర్ పెట్టేస్తే పోలా అని పెట్టేసి కూరలు తరిగేస్తే వచ్చాక పని సులువు కదా అని
అవీ చేసుకుంటూ చూపులనేమో గుమ్మనికి కట్టేసి మనసుని ఆయన దగ్గరకు పంపి..
చేతులు మాత్రం పనులు చేసుకుంటూ పోతున్నాయి

అమ్మా ఇంక ఎంత సేపు అని అడిగే పిల్లలకు హోంవర్కులు కానిచ్చేయండిరా..
అంటూ నచ్చచెప్పి పుస్తకాలు తెరిపించి
వంటింట్లోకి వచ్చి పప్పు గ్రైండర్ లో పడేసి అది తిరుగుతూ ఉంటే నేను
దానితో అలోచనల లోకంలో కూరుకుపోయా..
పది నిమిషాల టైం ఇంకా కాలేదా..అంటూనే పిల్లలకి అన్నం పెట్టి
పనులన్నీ చక్కబెట్టి
పిల్లలతో కసేపు ఆడుకుని నిద్రపుచ్చి
ఏమయిందో అన్న కంగారు ఓ పక్క ఉన్నా..
అలవాటయిన విషయమే కదా అనుకుంటూ ఓ నిట్టూర్పు.

పదినిమిషాలంటే ఇంతే అనుకుంటూ
ఇలాంటి ఎన్ని పది నిమిషాలో కదా..
అంటూ గుమ్మానికి వేళ్ళాడదీసిన చూపులను లాక్కొచ్చి
వాడిన సన్నజాజులను..నలిగిన మనసుని పక్కన పెట్టి
అలోచనలన్నీ నిశ్చలమైన నేను …

ఇట్లు
ఎదురుచూస్తున్న

మీ శ్రీమతి


@తులసి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.