రుగ్మతలు-నివారణలు

0
695

పిల్లల వ్యాధులు:

 1. పిల్లల మెడలో ఉల్లిపాయ కట్టిన వడదెబ్బ తగలదు.
 2. నేలతాడి చూర్ణమును వాముతో కలిపి తీసుకున్నచో దగ్గు తగ్గును. కఫముతో కూడిన దగ్గుకు నేలతాడి చూర్ణమును మంచి నూనెతో కలిపి నాకించ వలెను.
 3. ఎండిన సాదా తమలపాకుతో పోగవేసిన బిడ్డల దగ్గు తగ్గును.
 4. వస తో తేలికగా (diluted) కషాయము చేసి బిడ్డలకు తలస్నానము చేయించిన మూర్చ పోవును.
 5. వసను నీటి తో గానీ సారాయితో గానీ నూరి శిశువుల రోమ్మునకు పట్టించిన దగ్గును, శ్లేష్మమును హరించును.
 6. కుప్పింత రసం తీసి ఒక స్పూన్ లో ఒక ఉప్పు రాయిని నూరి కలిపి త్రాగించిన పిల్లల కడుపు నొప్పి తగ్గును.
 7. 20 చుక్కల ఉల్లి రసము మూడింతల మోతాదు తేనె, తేనెకు సమమైన నీటిని కలిపి రోజుకు 3 – 4 సార్లిచిన చంటి పిల్లల కోరింత దగ్గు నివృతియగును.
 8. వడగట్టిన గోమూత్రములో 2 తులముల ఉప్పు కలిపి త్రాగించిన పిల్లలు ప్రక్కలు తడుపుట తగ్గిపోవును.
 9. అతి వస చూర్ణము చిన్న ముక్కను బియ్యపు కడుగుతో కలిపి త్రాగించిన చిన్నపిల్లల విరోచనములు తగ్గును.
 10. ఇంగువను నీటితో అరగదీసి కడుపు మీద లేపనము చేయుచుండిన పిల్లల పాలు కక్కుట తగ్గును.
 11. సున్నమునకు, కరక్కాయ పేడులు, రేలా గుజ్జు సమపాళ్ళలో కలిపి నూరి కందుల పరిమాణము టాబ్లెట్ చేసి ఉదయం, సాయంత్రం ఒక మాత్ర ఇచ్చిన పిల్లల కడుపు ఉబ్బరం ఎటువంటి వైనను తగ్గును.
 12. తమలపాకులకు ఆముదము రాసి వెచ్చబరచి రొమ్ముపై, పొట్టపై, తల పైనను పెట్టు చుండిన పిల్లల జలుబు తగ్గి పోవును.

అతి మూత్రము:

 • వేసవి కాలంలో చెట్ల నుంచి రాలిన మామిడి పిందెలను గాని లేక చెట్ల నుంచి తెంపి వాటిని గాని ఎండబెట్టి పోడిచేసుకోండి. బాగా చిన్న పిందెలు మాత్రమే పొడి చేయుటకు వీలవుతుంది. అలా తయారు చేసిన పిందెల పొడికి 2 రెట్లు పంచదార కలిపి సీసాలో భద్రపరచుకుని రోజువారి ఉదయం పూట 2 టీ స్పూన్ల పోడిని తినాలి. ఇలా తినడం ఇష్టపడక పోతే, 1 కప్పు నీటిలో ఈ పొడిని కలిపి త్రాగావచ్చును. ఇలా నెల రోజుల సేవనంతో అతి మూత్రము తగ్గి పోతుంది.
 • ముదురు వేప చెక్క చూర్ణము 5 గ్రా. పంచదార 3 గ్రా. ఈ రెండు ఒక గ్లాసులో కలిపి 2 పూటలా తాగుతూంటే అతి మూత్రము హరించి పోతుంది.

ఆకలి:

 • ఒక కప్పు అల్లం రసం, ఒక కప్పు నిమ్మ రసం, ఒక పావు కప్పు బెల్లం వీటిని ఒక పాత్రలో పోసి సన్న మంట మీద తీగ పాకం వచ్చే వరకు ఉడికించి చల్లార్చి ఒక గాజు పాత్రలో భద్రపరిచి, రోజువారి ఉదయం, సాయంత్రం, ఒక టీ స్పూన్ పాకం సేవించిన ఆకలి పెరుగును.
 • 2 గ్రా. అల్లములో కొంచెము ఉప్పును వేసి ఉదయం తినవలెను.
 • 5 గ్రా. శొంఠి చూర్ణమును పావు గ్లాస్ బియ్యము కడిగిన నీటితో కలిపి తీసుకోనవలెను.
 • పిప్పళ్ళు, చిత్రమూలము, వాయు విదంగములు, గానుగ గింజల పప్పు, కరక్కాయ పేడులు సమపాళ్ళల్లో పొడి చేసి కలిపి దానికి రెండుం పావు బెల్లం పొడిని కలిపి నూరి మిరియములంత ఉండలను చేసి పూటకొకటి మంచి నీటి అనుపానముతో సేవించవలెను.
 • ఉప్పు, శొంఠి సమబాగాలుగా తీసుకుని కొంచెం దోరగా వేయించి దంచి పొడి చేసుకుని బోజన సమయంలో మొదటి ముద్ద లో 5 గ్రా. పొడి కలిపి తింటూ ఉంటె నాలుక, గొంతు శుభ్రమై కఫము తగ్గి, ఆకలి పెరిగి, ఆహరం బాగా జీర్ణమై వంటపడుతుంది.

విరిగిన ఎముకలు:

 • నల్లేరు కాడలు కుమ్ములో ఉడకబెట్టి దంచి రసం తీసి, 10 – 20 గ్రా. మోతాదుగా రసమును గోరువెచ్చగా త్రాగిన, విరిగిన ఎముకలు అతుక్కోనును.
 • పావు లీ. ఆవు పాలు మరగబెట్టి అందులో 30 గ్రా. పటిక బెల్లం పొడి, 20 గ్రా ఆవు నెయ్యి, 2 గ్రా లక్క పొడి కలపండి. రోజు వారి ఉదయం, రాత్రి (12 గం. వ్యవధి) రెండు వారాలు తీసుకోవాలి. విరిగిన ఎముకలు ధృఢంగా అతుక్కుంటాయి.
 • ఎముకలను దృఢపరిచే ఆహారాలుగా వేడి పాలు, నువ్వులు, ముడి తేనె, గుమ్మడి విత్తనాలు ఉన్నాయి. ఎముకల సమస్యలతో బాధపడే వారు వీటిని తరచూ తినడం మంచిది.

వాయు సమస్యలు:

 • 50 గ్రా వాము, 50 గ్రా మిరియాలు. 25 గ్రా ఉప్పు, వీటిని దోరగా వేయించి దంచి చూర్ణం చేసి ఆహారం తరువాత ఒక టీ స్పూన్ మోతాదుగా మంచి నీటితో సేవించవలెను.
 • 10 మునగ ఆకులను నూరి, 1 కప్పు నీటిలో మరగబెట్టి, చల్లార్చి రోజువారి సేవించండి. ఈ మిశ్రమం జఠర సమస్యలను నివారిస్తుంది.
 • 10 మునగ ఆకులను నూరి 1 కప్పు నీటిలో మరగబెట్టి, చల్లార్చి రోజువారి సేవించండి. ఈ మిశ్రమం జఠర కోశము లో ఏర్పడిన వ్రణములను నివారిస్తుంది.
 • అర టీస్పూను దాల్చిన పొడిని 1 కప్పు వేడి పాలకు జోడించి సేవించండి. ఐచ్ఛికంగా 1 టేబుల్ స్పూను ముడి తేనెను జోడించవచ్చును. ఈ మిశ్రమం వాయువును నివారిస్తుంది.
 • 1 గ్లాసు వేడినీటికి, 2 టీస్పూనులు ఆపిల్ సైడర్ వెనెగర్ జోడించి, చల్లార్చి రోజువారి సేవించండి. ఈ మిశ్రమం వాయువును నివారిస్తుంది.
 • సోపు గింజలు, దంచిన అల్లం, ఏలకులు సమాన భాగములుగా తీసుకొని చక్కగా కలపండి. ఈ సమ్మేళనం 1 టీస్పూను తీసుకొని చిటికెడు ఇంగువ జోడించి, 1 కప్పు నీటిలో కలపండి. రోజువారి ఈ మిశ్రమమును 1 – 2 సార్లు సేవించండి. ఈ మిశ్రమం వాయువును నివారిస్తుంది.
 • 1 కప్పు మజ్జిగలో 1 టీ స్పూను శుభ్రపరచిన వాము, అర టీ స్పూను నల్ల ఉప్పు జోడించి, ఈ మిశ్రమమును రోజువారి సేవించండి. ఈ మిశ్రమం వాయువును నివారిస్తుంది.

మూర్ఛ:

 • కుంకుడు రసం గుడ్డలో వడగట్టి, ఆ రసాన్ని, అపస్మారము వచ్చి తెలివి తప్పి ఉన్న రోగుల ముక్కుల్లో 2, 3 చుక్కలు వేస్తె వెంటనే ఆ ఉపద్రవం నుండి కోలుకుంటారు, మూర్ఛ లేనప్పుడు కూడా నలగగొట్టిన కుంకుడు ముక్కల వాసన చూస్తూ వుంటే మూర్చ హరించి పోతుంది.
 • జఠామాంసి 60 గ్రా. శుభ్రం చేసి, మెత్తగా నూరి, జల్లించి, వస్త్రఘాళితం పట్టండి. దాల్చిన పొడి 5 గ్రా. అదే విధంగా తయారు చెయ్యండి. పరి శుద్ధమైన హారతి కర్పూరం 3 గ్రా. తీసుకోండి. ఈ మూడింటిని చక్కగా కలిపి ఒక గాజు సీసాలో నిలవ చెయ్యండి.

రోజువారి ఈ చూర్ణాన్ని రెండు పూటలా మూడు వేళ్ళకు (చూపుడవేలు, మధ్య వేలు, బ్రొటన వేలు) వచ్చినంత తీసుకోండి. సమస్య తీవ్రంగా ఉంటే 8 గంటల వ్యవధిలో రోజువారి 3 సార్లు తీసుకోండి.

దీని వలన క్రమంగా నాడులు శుద్ధి చెంది, రక్త ప్రసరణ క్రమబద్ధమై, మెదడుకు శక్తి కలిగి అపస్మారకము, మూర్ఛ శాశ్వతంగా నివారణ అవుతాయి.

మలబద్దకం:

 • 3 అంగుళాల దాల్చిన చెక్కలు 4, 1 కరక్కాయ బెరడు ఈ రెండు సమబాగాలుగా కలిపి 1 కప్పు నీటిలో అరకప్పు అయ్యేవరకు మరిగించి కషాయం చెయ్యండి, చల్లబరచి 20 CC, రోజువారి నిద్ర పోయే ముందు సేవిస్తే సుఖ విరేచనం అయి మలబద్దకం నివారణ అవుతుంది.
 • మలబద్దకం నివారణకు 4 క్యారెట్లు తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి, 1 ఆపిల్ తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి, పావు సైజు తాజా క్యాబేజీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. మూడింటిని శుభ్రమైన నీటిలో చక్కగా కడగండి. 3 కప్పు ల నీటిలో బాగా మరిగించండి. చల్లబరచి, వడకట్టండి.రోజువారీ ఈ పానీయాన్ని 1 కప్పు ఉదయం దంత ధావన అనంతరం, రాత్రి నిద్ర పోయేముందు 1 కప్పుసేవించండి.
 • దీర్ఘకాలిక మలబద్ధకం, అజీర్ణం నివారణకు ఉదయము అల్పాహారానికి ముందు ఉడికించిన బీట్ రూట్ అర కప్పు తినండి

దగ్గు:

 • దగ్గు కొరకు ఆయుర్వేద సిరప్. 6 మధ్య సైజు ఉల్లి పాయలు తీసుకొని వాటి తొక్కలు ఒలిచి, వేరులు కట్ చేసి, శుభ్రపరచండి. దానికి 4 టేబుల్ స్పూనుల ముడి తెనె కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక చిన్న గిన్నెలో వేసి మూత పెట్టి, ఒకపెద్ద గిన్నెలో నీళ్ళుపోసి దానిలో ఈ చిన్న గిన్నెను ఉంచండి. 2 గంటల పాటు సన్నని మంటలో వేడి చేయండి. చల్లబరచి 3 గంటల వ్యవధిలో 1 టేబుల్ స్పూను సేవించండి.
 • 6 ఎండిన ఖర్జూరాలు అర లీటరు పాలలో 25 నిముషాలు సన్నని మంటమీద మరిగిచండి. రోజువారి 3 సార్లు 1 కప్పు ఈ మిశ్రమమును సేవించండి. ఈ మిశ్రమము పొడి దగ్గును నివారించడంలో అత్యంత ప్రభావవంతమైనది.
 • పసుపు కొమ్ము వేయించి, దంచి పొడి చేసుకొని, రోజువారి 3 గ్రా 1 కప్పు నీటితో గాని పాలతో గాని రోజువారి 1 – 2 సేవించండి. ఈ పానీయం పొడి దగ్గు నివారించడంలో అద్భుతమైనది.
 • 2 అంగుళాల అల్లం పై నున్న తొక్కను తొలగించి, సన్నని చక్రలుగా తరిగి, దాని సమర్ధత నిలపడానికి కొద్దిగా దంచి, 3 కప్పుల నీటికి జోడించి, మరగబెట్టండి. చల్లార్చి అర కప్పు పానీయాన్ని రోజువారి చిన్న చిన్న గుటకలతో త్రాగండి. ఈ మిశ్రమము నిరంతరగా వచ్చే దగ్గును, గొంతు నొప్పి, గొంతు లో అడ్డుపడే కఫమును నివారిస్తుంది
 • 2 టీస్పూనుల ముడి తేనె, 2 టీస్పూనుల అల్లం రసం దగ్గును, గొంతు నొప్పి, గొంతు లో అడ్డుపడే కఫమును నివారిస్తుంది.
 • చిన్న దాల్చిన పేడును నోటిలో ఉంచుకొని చప్పరించితే దగ్గు, గొంతు బొంగురు నివారించ బడతాయి
 • కరక్కాయ పేడును బుగ్గలో పెట్టుకొని చప్పరించి, రసమును మింగుతూంటే దీర్ఘ కాలంగా పీడిస్తున్న దగ్గు నివారణ అవుతుంది.

కుష్టు:

 • కరక్కాయ పేడులు, నల్ల జీడి గింజలు, నువ్వులు, బెల్లము సమపాళ్ళల్లో కలిపి దంచి గోళీ కాయల సైజు ఉండలను చేసి రోజువారి 3 సార్లు సేవించిన కుష్టు వ్యాధి పూర్తిగా నివారణవుతుంది.
 • అడ్డరస ఆకు, చేదు పొట్ల, కరక్కాయ, తాడి, ఉసిరికలు, తిప్ప తీగ ఆకు చూర్ణము సమపాళ్ళల్లో కలిపి రోజువారీ 3 సార్లు నెయ్యిలో కలిపి మూడు నెలలు సేవించవలెను.
 • ఆకాకర పువ్వుల రసమును శరీరమునకు పూయవలెను.
 • వాయువిదంగాలు, కరక్కాయ బెరడు, సైంధవ లవణము, బావంచాలు, తెల్ల ఆవాలు, గానుగ విత్తులు వీటిని సమ భాగాలుగా తీసుకుని గోమూత్రములో మెత్తగా మర్దించి, శరీరానికి పట్టిస్తూ వుంటే కుష్టు వ్యాధి హరించి పోతుంది.
 • గానుగ గింజలు, కోడిశాపాల గింజలు, సమంగా కలిపి మెత్తగా నూరి లేపనం చేస్తూ ఉంటె క్రమంగా కుష్టు వ్యాధి హరించి పోతుంది.
 • ఎర్రగా వుండే వేప లేత చిగురాకులు పది వరకు తీసుకుని వాటితో పాటు మూడు మిరియాలు కలిపి దంచి ఆ ముద్దను కొన్ని మాసాల పాటు తింటే దారుణమైన కుష్టు రోగాలు హరించి పోతాయి.

బోదకాలు:

 • పాతబెల్లము, మంచి పసుపు సమంగా కలిపి నూరండి. రోజువారి 2 సార్లు 10 గ్రా ఈ మిశ్రమమును, 30 గ్రా గోమూత్రములో కలుపుకుని, సేవించవలెను, క్రమంగా బోదకాలు, కుష్టు, అతి దాహము నివారించబడతాయి.

ఉబ్బసం:

 • వాకుడు చెట్టు వేరు, అడ్డ ఆకులు, ఉత్తరేణి చెట్టు వేరు, పొగాకు ఈ నాలుగు పదార్దములు సమ భాగాములుగా గ్రహించి ఎండబెట్టి, కాల్చి బూడిద చేసి, ఆ బూడిదను నాలుగు రెట్లు మంచి నీళ్ళు పోసి 3 రోజులు నిలువ వుంచవలెను. ప్రతి రోజు కర్రతో 3 సార్లు కలుపుతూ ఉండాలి. 4 వ రోజు కుండలో పైన పేర్కొన్న తేట నీటిని వంచుకుని, కళాయి పాత్రలో పోసి పొయ్యి మీద పెట్టి మరిగిస్తే అది క్రమంగా ఘవీభవించి పాత్ర అడుగున ఉప్పు లాగా పేరుకుంటుంది దాన్ని తీసి ఒక గాజు పాత్రలో నిలవ చేసుకుని రోజువారి 2 సార్లు రెండు గురివింద గింజలంత పొడిలో ఒక స్పూన్ తేనె కలిపి సేవిస్తూ వుంటే, కఫము హరించి ఉబ్బసం నివారణ అవుతుంది.
 • వాకుడు పండ్లు, పిప్పళ్ళు, గంతుబరంగి, లవంగాలు, శొంఠి వీటిని సమంగా తీసుకుని చూర్ణం చేసి రోజువారి 3 గ్రా వేడి నీళ్ళల్లో కలిపి 3 సార్లు (8 గం వ్యవధి) సేవిస్తూ వుంటే దగ్గు, ఉబ్బసం తగ్గుతాయి.
 • చక్కరకేళి అరటి పండును గోమూత్రములో వేసి పిసికి రోజువారి ఉదయం తింటూ ఉంటె దారుణమైన ఉబ్బసం కూడా తగ్గి పోతుంది.
 • 50 గ్రా బూడిద గుమ్మడి ఆకు రసములో చిటికెడు యవకశారము కలిపి సేవిస్తే ఉబ్బసం తగ్గుతుంది.
 • అర స్పూను నీరుల్లి రసం, అర టేబుల్ స్పూను అల్లం రసం, 5 తులసి ఆకుల రసంతో గాని 1 టేబుల్ స్పూను ముడి తేనె తో గాని కలిపి రోజువారి ఉదయం, రాత్రి (12 గం వ్యవధి) సేవించండి.
 • 1 టీ స్పూన్ ఎండిన ఉసిరి పొడి తో, 1 టీ స్పూన్ ముడి తేనెను కలిపి. రోజువారి ఉదయం సేవించండి.
 • ఉల్లిపాయలు శ్వాస నాళాల సంకోచాన్ని నివారిచడంలో సహాయపడతాయి. శుభ్రమైన పలుచని వస్త్రం లో దంచిన ఉల్లిపాయలను మూటగట్టి ఛాతి మీద ఉంచితే శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది.
 • 2 క్యారెట్ల తొక్క తీసి శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. పాలకూర 1 కట్ట శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. 1 ఆపిల్ తొక్క తీసి శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. 1 వెల్లుల్లి తొక్క తీసి, పాయలు చేసి, రెండు చివరలు కట్ చేసి, చిన్న చిన్న ముక్కలుగా తరగండి. ఇవ్వన్ని ఒక గిన్నెలో, 3 కప్పుల నీటితో మరిగించండి. చల్లారిన ఈ మిశ్రమాన్ని 4 టేబుల్ స్పూనులు రోజువారి ఉదయం, రాత్రి సేవించండి. ఐచ్ఛికంగా ముడి తేనె కలపవచ్చును.

మూలకర్త శ్రీ కార్తిక్ రాయల

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.