కొకైన్, హెరాయిన్ లాంటి డ్రగ్స్ కంటే చాలా డేంజరస్ వాక్యం Facebookలో ఒకటుంది.. “What’s on your mind?” అని!
ఎవరి మాటా ఎవరూ వినని ఈరోజుల్లో మన గోడు అంతా వినడానికి సిద్ధంగా ఉన్న ఓ కల్పతరువుగా అది అందరికీ కన్పిస్తుంది. ఇడ్లీ తింటూ, బిర్యానీ తింటూ, ఫ్రెండ్ పక్కన నిలబడి నిజంగా సంతోషంగా ఉంటామో లేదో గానీ వారితో ఓ సెల్ఫీ దిగి feeling happy అని ఓ స్టేటస్ పెడితే మాత్రం ఖచ్చితంగా సంతోషం వస్తుంది. ఆ సంతోషం కోసమే అకేషన్లని సృష్టించుకుంటూ ఉంటాం కూడా!
యెస్ నిజమే.. మన లోపల చాలా ఫ్రస్టేషన్, సొసైటీ పట్ల కోపం, మనుషుల పట్ల ద్వేషం, లేదా నిలువెల్లా మంచితనం మూర్తీభవించిన మనుషుల్లా యోగుల్లాంటి ఆర్టిఫీషియల్ మెచ్యూరిటీ.. అవన్నీ అందరికీ కన్పించాలి. Facebook రాకముందు ఈ కోపాలూ, ద్వేషాలూ, ఈ మంచితనాలూ ఎలా వెళ్లగక్కాలో తెలీక అన్నీ దిగమింగుకుని చాలా చిన్న ఏజ్‌లో హార్ట్ అటాక్‌లు వచ్చేవి. అయితే ఇప్పుడు Facebook వల్ల పరోక్షంగా జీవితకాలం పెరిగింది.. అలాగే పరోక్షంగా ఒబేసిటీ లాంటివి పెరిగి మరో రకంగా హార్ట్ అటాక్‌లు వస్తున్నాయనుకోండి 🙂
నీకు ఎమోషన్లు ఉండడం తప్పు కాదు.. వాటిని వెళ్లగక్కడం తప్పు కాదు.. కానీ Facebook జగన్నాటక సూత్రధారి! పొద్దున్నే పేపర్లో వచ్చిందో, టివిలో చూసిందో నీ మైండ్‌లో రిజిస్టర్ అయ్యే లోపే Facebookలో వేలాది గొంతులు panicగా, మాస్ హిస్టీరియాతో గగ్గోలు పెడతాయి.. అంతే… నీకు తెలీని ఏ చిన్న విషయమైనా నీ మైండ్‌లో నాటుకుపోతుంది. కాసేపు “ఓ అవునా, అలా జరిగిందా” అనుకుంటావు. News feed స్క్రోల్ చేసుకుంటూ పోతూ నీకు తెలిసిన వారంతా దాని గురించి ఏదో ఒకటి రాసేస్తూ ఉంటారు. అవి చదివేసరికి నీ మైండ్లోనూ ఓ అభిప్రాయం ఫ్రేమ్ అవుతుంది. ఇక నీకు మనసాగదు. అంత లేట్‌గా ఆ టాపిక్ మీద రెస్పాండ్ అవుతున్నందుకు ఏదో తప్పు చేసిన వాడిలా నువ్వూ గుంపులో చేరిపోతావు. దాని గురించి నీ అభిప్రాయమూ కక్కేస్తావు.
సో ఇలాంటివి నీ స్వంత ఎమోషన్లు కాదు.. Facebook అనే మాయా ప్రపంచంలో నీ వర్చ్యువల్ స్నేహితులు కల్పించే కృత్రిమమైన ఎమోషన్లు.. ఇంకా ఘాటుగా చెప్పాలంటే వాళ్లు అప్పటికే పిచ్చిలో కొట్టుకుపోతూ నీకూ పిచ్చి అంటించే ప్రయత్నం, వాళ్లకి వాళ్లు అంటించరు.. అంటించడానికి నీకు news feed అనే ప్రవాహం ఉంది కదా!
ఈ కృత్రిమ ప్రపంచంలో స్లోగన్లు సృష్టించబడతాయి, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ నీలాంటోళ్లని టెమ్ట్ చేసి.. shares, likes, reach పెంచుకోవడానికే ప్రత్యేకంగా తయారు చెయ్యబడతాయి.. నీ అభిప్రాయానికి దమ్మిడీ విలువ లేకపోయినా కేవలం నీ కామెంట్ కోసం “ఇండియా పాకిస్తాన్‌ని ఓడించాలా లేదా?” అంటూ అతి అమాయకమైన, సులభమైన ప్రశ్నలు సంధించబడతాయి. పిచ్చోళ్లలా మనం వాటికి వీరావేశంతో సమాధానం ఇస్తుంటాం. ఇదంతా ఓ ఆట.. సోషల్ మీడియా ఆట. ఆ ఆటలో పావులవుతున్నది నువ్వు, నీ ఎమోషన్లు, నీ టైమ్, ఇవన్నీ కలిసి నీ ఉజ్వల భవిష్యత్.. ఇప్పటికైనా కళ్లు తెరువు!!
– నల్లమోతు శ్రీధర్