గురజాడ అప్పారావు

0
927

శ్రీ గురజాడ అప్పారావు గారు తన రచనల ద్వారా సామాజిక చైతన్యం తెచ్చిన ఘనుడు! కన్యాశుల్కం నాటకంలో ఆయన సృష్ఠించిన గిరీశం, మధురవాణి, బుచ్చమ్మ, వెంకటేశం, రామప్పంతులు, అగ్నిహోత్రావధాన్లు, సౌజన్యారావు పంతులు లాంటి మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి. ‘దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అని ఎలుగెత్తి చాటిన వైతాళికుడు ఆయన. సాంఘిక దురాచారాలైన బాల్య వివాహాలను, కన్యాశుల్కాన్ని ఖండించిన మహనీయుడు. కుల, మత, వర్గ విబేధాలను రూపుమాపేందుకు ఆయన చేసిన కృషి మరువరానిది.

శ్రీ గురజాడ 21-09-1861 న నేటి విశాఖ జిల్లాలోని రాయవరం గ్రామంలో జన్మించారు. తండ్రి వెంకట రామదాసు, తల్లి కౌసల్యమ్మ. పదేళ్ళ వరకు చీపురుపల్లిలో చదివారు. విజయనగరంలో బి.ఏ చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి ఆయనకు సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు. బెంగాలీ భాషకు ఠాగూర్ వలే, వీరుకూడా తెలుగు వ్యవహారిక భాషా ప్రచారానికి ఎనలేని కృషిచేసారు.1884 లో మహారాజ కాలేజి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు.1885లో అప్పలనరసమ్మ గారితో వివాహమైంది. 1886 లో డిప్యూటీ కలెక్టరు ఆఫీసులో హెడ్ క్లర్కుగా పనిచేసారు.1886లో రాజావారి సంస్థానంలో చేరారు. 1887 లో కళాశాలలో అధ్యాపక పదవిని నిర్వహించాడు. 1911 లో మద్రాసు యూనివర్సిటీ లోని బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో సభ్యులయ్యారు.

శ్రీ గిడుగు రామమూర్తి గారితో కలసి వాడుక భాషావ్యాప్తికి నడుంబిగించారు. ఆ రోజుల్లో సంఘదురాచారాల బాధితులలో, బాలవితంతులు, వేశ్యలు అధికంగా ఉండేవారు. ఆ ప్రేరణతోనే వీరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కన్యాశుల్కం నాటకాన్నిమొత్తం వాడుక భాషలో రచించారు. 1890 ప్రాంతంలో వ్రాసిన ఈ నాటకం లోని, ప్రతి మాట ఒక ‘Quotation’!

తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి..

డామిట్ ! కథ అడ్డంగా తిరిగింది..!

పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్

నాతో మాట్లాడటమే ఒక education..

నమ్మినచోట చేస్తే మోసం, నమ్మని చోట చేస్తే లౌక్యం‘…. ఇలాంటివి కోకొల్లలు.

ఇవన్నీ వారి నాటకంలోనివే! అవి నేటికీ, రేపటికీ కూడా మరువలేనివి. వారి రచనలన్నీ నాటి సామాజిక పరిస్థితులను తనదైన బాణీలో వినిపించేవారు. అందుకు చక్కని ఉదాహరణ ‘కన్యాశుల్కం’, పూర్ణమ్మకథ లాంటివి. వారి భాషా శైలి ఆడంబరంగా ఉండేది కాదు. ఆనాటి బ్రాహ్మణ సమాజంలో ఉన్న అనాచారాలను, దురాచారాలను కడిగివేసారు. సౌజన్యారావు పంతులు గారిని ఉద్దేశించి ఒక వేశ్య అయిన, మధురవాణి చేత, ఆయన ఇలా చెప్పిస్తారు

— “బ్రాహ్మణులలో కూడా మంచివారు ఉంటారన్న మాట!” అని. కుహనా బ్రాహ్మణులకు అది ఒక కొరడా దెబ్బ.

అలా సమాజంలో ఉన్న అనేక లోపాలను చూపించి తెలుగు వారికి వెలుగుజాడ అయ్యారు శ్రీగురజాడ. అంత గొప్ప నాటకమైన కన్యాశుల్కం 13 -08 -1992 న 100 సంవత్సరాల పండుగను పూర్తి చేసుకుంది. కొన్ని వేల ప్రదర్సనలు ఇవ్వబడింది. ‘గిరీశం’ పాత్రను ప్రముఖులు ఎందరో వారివారి ఫక్కీలో నటించిపెరుతెచ్చుకోవటమే కాక, నాటకం యొక్క గొప్పతనాన్ని ప్రజలకు గుర్తు చేసారు. కన్యాశుల్కం నాటకం యొక్క 100 సంవత్సరాల పండుగను విజయనగరంలోని గురజాడ వారి గృహంలో కవులు, రచయితలు, నటులు అతి సంబరంగా చేసుకున్నారు. శ్రీ గురజాడ వారి 76 వ జయంతి సందర్భంలో, శ్రీ జొన్నలగడ్డ సోమయాజులుగారు(‘శంకర శాస్త్రి’)వారి బృందం కన్యాశుల్కం నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. సోమయాజులు గారిసోదరుడైన శ్రీ రమణమూర్తి గిరీశం పాత్రకు ప్రాణ ప్రతిష్టచేశారు.

శ్రీ గురజాడ వారు కన్యాశుల్కం నాటకాన్ని ఆనాటి సంఘంలో ఉన్న దురాచారాలైన బాల్యవివాహాలను, ఆడపిల్లలలను అమ్ముకునే విష సంస్కృతిని ఎండగట్టారు. వీరు సృష్టించిన గిరీశం పాత్ర అజరామరమైనది. నేటికీ మహారాజశ్రీ గిరీశం గారిలాంటి ఆషాడ భూతులు మన మధ్యనే ఉన్నట్లనిపిస్తుంది.

శ్రీ గురజాడవారి ‘పుత్తడి బొమ్మ-పూర్ణమ్మ’ బాల్య వివాహ దురాచారానికి బలైపోయిన ఒక అమాయకురాలైన బాలిక కరుణామయ గాధ. దీన్ని వీరు ఒక గేయ కథలాగా వ్రాసారు. వీరికి ఆంగ్ల సాహిత్యంలో చక్కని ప్రావీణ్యం ఉంది. వీరు ఆంగ్లంలో ‘Songs and the blue hills’ అనే గేయాలు వ్రాసారు. వారు వ్రాసిన కథలలలో — మీ పేరేమిటి?, పెద్ద మసీదు, సంస్కర్త హృదయం, మాటా- మంతి లాంటి మొదలైన వాటిలో ఆనాటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబ జేస్తూ నేటికీ నూతనంగా కనిపిస్తాయి.

అంతేగాక, శ్రీ గురజాడ అప్పారావు గారు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు. హేతువాది.19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్దిమొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు.

1892 లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. 1897లో కన్యాశుల్కం తొలి కూర్పును మహారాజా ఆనంద గజపతికి అంకితమిచ్చారు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యాశుల్కం రెండవ కూర్పును 1909 లో రచించారు. వీరి రచనలకు ప్రేరణ — శ్రీ వీరేశలింగంగారి సంస్కరణోద్యమం. ఒక విధంగా చెప్పాలంటే, కన్యాశుల్కం లోని ‘సౌజన్యారావు పంతులుగారి’ పాత్ర వీరేశలింగం గారిని దృష్టిలోఉంచుకొని సృష్టి చేసినదేనని చాలామంది అభిప్రాయం. 53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30 న అప్పారావు గారు అనారోగ్యం చేత మరణించారు. ఆయనకు ముగ్గురు సంతానం – ఇద్దరు కుమార్తెలు , ఒక కుమారుడు. గురజాడ రచనల్లో కన్యాశుల్కం (నాటకం) అగ్రగణ్యమైనది. కన్యాశుల్కం దురాచారాన్ని విమర్శిస్తూ గురజాడ రచించిన ఈ నాటకం భారతీయభాషల్లో వెలువడిన ఉత్తమోత్తమమైన రచనలలో ఒకటి. 1892 లో ప్రచురించిన మొదటి కూర్పుకుఎన్నో మార్పులు చేసి 1909 లో రెండవకూర్పును ప్రచురించారు. వాడుక భాషలో, విజయనగర ప్రాంత యాసలో రాసిన ఈ నాటకం 100 సంవత్సరాల తరువాత కూడా ఈ నాటికీ పాఠకులను అలరిస్తూ ఉంది. ఈ నాటకం కన్నడం, ఫ్రెంచి, రష్యన్, ఇంగ్లీషు (2 సార్లు), తమిళం, హిందీ (2 సార్లు) భాషల్లోకి అనువాదమైంది. గురజాడమరణం తరువాత కన్యాశుల్కం పై ఎన్నో వివాదాలు రేగాయి. అది అసలు ఆయన రాయనేలేదనీ, వేరెవరో రాస్తే, తన పేరు వేసుకున్నారని ఒకటి; ఆయన ఇంగ్లీషులో రాస్తే, వేరే ఒకాయన దానిని తెలుగులోకి అనువదించారని మరొకటి, ఇలాగ కొన్ని వివాదాలు రేగాయి. చివరికి ఆవాదనలన్నీ అసత్యాలని తేలిపోయాయి. ఈ వివాదాలన్నీ గురజాడ మరణం తరువాత వచ్చినవే. ఇన్ని వివాదాల మధ్య కన్యాశుల్కం కొన్ని వందల ప్రదర్శనలు పూర్తి చేసుకుంది. 100 ప్రదర్శనలు పూర్తి చేసుకున్న మొదటి తెలుగు సాంఘికనాటకమదే!

తెలుగు భాష లో ప్రధమ శ్రేణిని నిలిచే పది పుస్తకాలలో కన్యాశుల్కానికి ప్రధమస్థానంఇస్తాను. ప్రపంచపు నూరు గొప్ప పుస్తకాలలో కన్యాశుల్కంఒకటి. కన్యాశుల్కం నాటకానికి సాటి రాగల రచన భారతీయ సాహితంలో మృచ్చకటికం తప్ప మరోటి లేదు” – శ్రీశ్రీ

“కన్యాశుల్కం బీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకం” – శ్రీ శ్రీ

“కవిత్రయమంటే తిక్కన, వేమన, గురజాడ” – శ్రీశ్రీ”

గురజాడ 1915 లో చనిపోలేదు, అప్పుడే ఆయన జీవించడం ప్రారంభించాడు” – దేవులపల్లి కృష్ణశాస్త్రి

శ్రీ గురజాడవారి 150 వ జయంతి ఉత్సవాలను 2015లో జరుపుకున్నాం. ఈ సందర్భంలో శ్రీ వెల్చేరు నారాయణరావు గారు కన్యాశుల్కం నాటకాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేసి ‘Girls for sale’ అనే పేరుమీద విడుదల చేసారు, దీని ప్రచురుణ కర్తలు పెంగ్విన్ క్లాసిక్స్ సంస్థ. దీనిని ఒక అంతర్జాతీయ ప్రతిగా విడుదల చేసారు. అంతకు ముందు 2007 నుండీ ఇండియానా యూనివర్సిటీ ప్రెస్ ముద్రణగా ఈ ఆంగ్లానువాదం చలామణిలో ఉంది.

కన్యాశుల్కం ఆంగ్లంలోకి అనువదించ పడినదని మనం సంతోష పడనవసరం లేదు. ఈ ప్రతిలో చాలా తప్పులు(ఘోరమైనవి కూడా)దొర్లినవి. గురజాడ వారి పేరు పూర్తిగా ఇవ్వకపోవటమే కాకుండా, ఆయన పేరులో స్పెల్లింగ్ సరిగా లేకపోవటమనేది, అనువాదకుని మరియూ ప్రచురుణకర్తల నిర్లక్ష వైఖరికి నిదర్శనం. దానిసంగతి పక్కన పెడితే, నాటకంలోని 5వ అంకంలో, రామప్ప పంతులు ప్రయోగించిన ‘అపవిత్రపు ముండాకొడుకు’ అనే తిట్టును ‘Impure Low Caste Bastard’ అని అనువదించారు. ఇది తప్పుడు అనువాదమే కాకుండా, కు(ల)సంస్కారంతో కూడినది కూడా. ఇది అనువాదం కాదు, ‘అనువధ’ అని గురజాడ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. ‘అపవిత్రపు ముండాకొడుకు’ అనే తిట్టులో కులప్రసక్తి లేనేలేదు! ఈ ప్రతిని మళ్ళీ పరిష్కరించి విడుదల చేస్తే బాగుంటుంది

ఎప్పటికీ ఆణిముత్యం– దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్!

గురజాడ వారి కన్యాశుల్కం నాటకాన్నివ్రాసి 125 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ..

నాటక అభిమానులు/ప్రియులందరికీ చక్కటి అనుభూతి కలిగించటానికి .. కొద్ది రోజులలో Rgb Infotain .. ఒక చిన్న ప్రయత్నం చేయబోతుంది … వివరాలు తదుపరి భాగంలో..!!!


Aravind Arya Pakide

Painting by : Kurelli srinivas…

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.