యవనిక

0
576

అమ్మా !! హరిశ్చంద్రుడు ఇక్కడనుండి కాశీ దాక ఎందుకు పోయాడమ్మా !! చంద్రమతి ని ఇక్కడ కొనే వాళ్ళు ఎవరూ లేరా !! ` నా 5-6 ఏళ్ల వయసులో నేను మా అమ్మని అడిగిన ప్రశ్న. ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది . కానీ మా ప్రకాశం జిల్లా వాళ్లకు కాదు . ఎందుకంటే మా జిల్లాకు హరిశ్చంద్రుడి కి ఉన్న అనుబందం అలాంటిది. ఆ నాటకం లో మా వాళ్ళు ఎంత లీనమవుతారు అంటే హరిశ్చంద్రుడు మా రాజే, కాశి వరకు వెళ్ళాడు అన్నంత గాడంగా అల్లుకు పోయింది మా జిల్లాతో పద్య నాటకం . నాకు ఇప్పటికీ బాగా గుర్తు, రాత్రి ఏ ఎనిమిదికో, తొమ్మిదికో ప్రారంభం అయిన నాటకం, ఉదయం 5 గంటలకు కానీ అయిపోదు. తెల్లవార్లూ ఆ నాటకాన్ని చిన్నా, పెద్దా అంతా అలా కళ్ళప్పగిచ్చి చూదటం .

పెద్ది రామారావు గారు రాసిన `యవనిక` చూడగానే ఒక్కసారిగా నోస్టాల్జియా ( సరైన పదం కాదేమో, దాన్ని మించిన మరో అనుభూతి, దాన్ని మాటల్లో చెప్పలేము కాబట్టి ప్రస్తుతానికి అదే వాడేస్తున్నా) ప్రతి వారినీ కుదిపేస్తుంది. సినిమాలకు బ్రహ్మరధం పడుతూ రాముడన్నా, కృష్ణుడు అన్నా రామారావు లాగే ఉంటాడు అని మనసా, వాచా, కర్మణా నమ్మి కూడా పద్యాన, వచనాన, కర్ణాన షణ్ముఖి ఆంజనేయ రాజును కూడా రాముడే కృష్ణుడే అనుకున్న క్షణాలు కళ్ళముందు కనపడతాయి .

చీమకుర్తి నాగేశ్వరరావు ఒక్కసారిగా గొంతెత్తి ` దేవి ! కష్టములెట్లున్ననూ, పుణ్యక్షేత్రమైన వారణాసి ని దర్శించితిమి ` అని వచనం లో చెప్పి ` భక్త యోగ పదన్యాసి ! వారణాసి ` అని పద్యం అందుకుంటే కళ్ళముందు కాశి కనపడేది, కాదు కాదు, ఆ కాశి క్షేత్ర మహిమ విందామని విశ్వనాధుడు , విశాలక్షి తో కలిసి వచ్చి ఆ పద్యం అయిపోగానే పరుగు పరుగున కాశికి వెళ్ళిపోతాడు , ఆ తర్వాత చంద్రమతి ని వేలంపాట పెట్టే సీన్ ని ఎప్పుడూ విశాలాక్షి కీ చూపించి ఉండడు , ఒకవేళ కనుక అది కనుక విశాలక్షి చూసుంటే ఆ కరుణ రాసానికి కరిగి పోయి ఆమె కూడా గంగ అయ్యేది.

అంతే కాదు కాటి సీను లో డివి సుబ్బారావు ఒక్కసారి గొంతెత్తి `..ఇది …ఇది పిశాచులతో నిటలేక్షణుందు..నిశాలేక్షణుండు ..గజ్జె కదిలించి ఆడు రంగస్థలమ్ము ` అని పాడుతుంటే చిన్నపిల్లల గుండె భయంతో ఒక్కసారి ఆగి కొట్టుకొనేది … ` బాలసూర్య ప్రభాకళితంబై వెలుగొందుంచున్నదది …మాంగల్యంబు కాబోలు..` అని పాడుతుంటే కళ్లలో నుండి నీళ్ళు అలా కారిపోతూ ఉండేయి. నిజానికి ఆ పదాల్లో ఒక్క ముక్కకి అర్థం తెలియదు, కానీ ఆ గొంతులో పలికే ఆ భావం ,రాగం చాలు . అంతలా కదిలించేయి .

ఇవన్నీ గతాలే, ఇప్పటి తరానికి తెలిసింది చాలా తక్కువ, పద్య నాటకం అంటే చెవులే కాదు, సర్వావయాలు కోసుకొనే మా ప్రకాశం జిల్లాలోనే ఇప్పుడు నాటకం ఒక కొడీగడుతున్న దీపం. అలాంటి నాటకాల గురించి , ఇప్పటి తరానికి తెలియచేసిన పెద్దిరామారావు గారి వ్యాసాల సంపుటి `యవనిక` నిజంగా గొప్ప ప్రయత్నం. అటు పద్య నాటకం గురించే కాదు, సాంఘీక నాటకాలు, నాటకాలలో జరుగుతున్న ప్రయోగాలు, వాటి తప్పొప్పుల గురించి సమగ్రమైన విశ్లేషణ ఇందులో కనిపిస్తుంది . నాటకాలకు ఇక భవిష్యత్తు లేదు అనుకుంటున్న సమయంలో పాటిబండ్ల ఆనందరావు గారు రాసిన ` పడమటి గాలి ` ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. కాకపొతే ఇప్పటికి కూడా అది కొద్దో, గొప్పో నాటకం మీద అభిమానం ఉన్నవారికో, సాహిత్యాభిమానులకో తప్ప సామాన్య జనం ముఖ్యంగా అర్బన్ ప్రజలకు దాని గురించి తెలియదు. ఇలాంటి వ్యాసాల ద్వారా అలాంటి గొప్ప నాటకాల గురించి తెలుసుకొనే అవకాశం ఉంటుంది. అలాగే అరుణ సౌదా `బర్బరీకుడు ` మరొక అధ్బుతమైన నాటకం, పురాణాల్లో మరో కోణాన్ని మనముందు ఉంచే ప్రయత్నం . ఇలాంటి నాటకాల గురించి ఈ వ్యాసాల్లో తెలియచేయటం వల్ల, ప్రజల్లో నాటకాల పట్ల అవగాహన పెరిగే అవకాశం ఉంది .

అలాగే వ్యాస రచయిత స్వయంగా నాటక రచయిత , దర్శకుడు కావటంతో ప్రస్తుత నాటక రంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. అందుకే వాటి గురించి నాటకాల భవిష్యత్తు గురించి చాలా విపులంగా చర్చించే అవకాశం దొరికింది. పరిషత్తు నాటకాలు మంచిదే కానీ, నాటకాల పరిధి పరిషత్తు ని దాటి ప్రజల్లోకి రావాలి అనే రామారావు గారి ఆలోచన నిజంగా అనుసరణీయం కూడా. అలాగే తెలుగులో ప్రసిద్ద కథలను నాటకాలుగా మారిస్తే నాటకాలకు మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది . పెద్ది రామారావే గారే `చీకట్లోంచి చీకట్లోకి `, `బొమ్మ ` , ` చివరి గుడిసె `, `వర్షం ` లాంటి ప్రసిద్ద కథలను నాటకాలుగా మార్చాడు . ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరిగితే తెలుగు నాటకరంగం డ్రాయింగ్ రూం సెట్లో నుండి బయటపడి ప్రజల్లోకి వెళ్తుంది .

నేను చూడలేదు కానీ, `ఎకనిమిక్ హిట్మాన్ ` ని నాటకంగా ఎలా మలిచారో నిజంగా ఆశ్చర్యంగా ఉంది, దాని తీరుతెన్నులను వివరిస్తుంటే అది చూడలేకపోయినందుకు నిజంగా బాధ పడుతున్నా, డయాస్ వెనుకభాగంలో ఒక సాలెగూడు వేలాడుతూ ఉండటం, దాన్ని వరల్డ్ బ్యాంక్ కి మెటఫర్ గా వాడటం నిజంగా అద్భుతం . ఇలాంటి ప్రయోగాలు చేసే `రఘువీర్ ` లాంటి వాళ్ళు, `పడమటి గాలి ` సృష్టి కర్త ` పాటిబండ్ల ఆనందరావు ` లాంటి వాళ్ళు ఉన్నంతకాలం , తెలుగు నాటకం వెలుగుతూనే ఉంటుంది . కాకపొతే అది డ్రాయింగ్ రూం సెట్లో పెట్టిన దేవుడి పటాల ముందు కాకుండా కనీసం దేవాలయంలో దివిటీ లా అయినా వెలిగితే పది మందికి దాని గొప్పతనం తెలుస్తుంది . పెద్ది రామరావు గారు తన `యవనిక ` ద్వారా ఆ దివిటీని వెలిగించే ప్రయత్నం చేస్తున్నారు .

అంతా బాగానే ఉంది కానీ `చింతామణి ` లాంటి గొప్ప నాటకం చివరకు చౌకబారు హాస్య నాటిక గా ఎందుకు మారిందో, దానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి !! అలాగే ` చిల్లెరకొట్టు చిట్టెమ్మ` లాంటి ఫెమినైన్ సమస్యలున్న లాంటి నాటకాలకు కూడా ఎందుకు చీడ పట్టిందో కూడా రాసినట్లయితే నాలాంటి వాళ్ళకు తెలుసుకొనే అవకాశం ఉండేది ( ఇది కేవలం నాకు తెలియదు కాబట్టి తెలుసుకోవాలనుకొనే చిన్న ఆశే )


@Mohan Ravipati

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.