శ్రావణమాసం

0
676

లక్ష్మీ సర్వ సంపదలకీ అధిష్ఠాతృ దేవత. ఇంద్రియ నిగ్రహం, శాంతం, సుశీలత్వం వంటి సుగుణాలకు ఆధారమైన సర్వ మంగళ రూపం లక్ష్మీదేవిది.

లోభం, మోహం, రోషం, మదం, అహంకారం వంటి గుణాలేమి లేని చల్లని చల్లని తల్లి ఆమె.
సర్వ సస్యాలు ఆమె రూపాలే. వైకుంఠంలో మహాలక్ష్మి, స్వర్గంలో స్వర్గలక్ష్మి,  రాజ్యంలో రాజ్యలక్ష్మి,  గృహాలలో గృహలక్ష్మి అంటూ సర్వ ప్రాణులలో, ద్రవ్యాలలో మనోహరమైన శోభ లక్ష్మీ రూపమే.

లక్ష్మీదేవి అన్నిచోట్ల ఉండే దయారూపిణి. అలాంటి లక్ష్మీదేవిని పూజించే లక్ష్మీప్రద మాసమైన శ్రావణమాసం వచ్చేసింది. జ్యోతిష్య శాస్త్రరీత్యా శ్రావణమాసం ఆధ్యాత్మికంగా లక్ష్మీప్రదమైన మాసం.  ఈ మాసం లక్ష్మీదేవిని ఆరాధించేవారి సకల సంపదలు చేకూరుతాయి. 

ఇంకా వరలక్ష్మీవ్రతం ఆచరించే వారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు శుభ ఫలితాలను ఆ లక్ష్మీమాత అనుగ్రహిస్తుంది. సోమ, శుక్రవారం.. లక్ష్మేదేవికి ఇష్టమైన రోజులు. ఆ రోజుల్లో పొద్దున, సాయంత్రం దీపారాధన చేయడం దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది.  అలాగే శ్రావణ అష్టమి, నవమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ వంటి తిథులు లక్ష్మీపూజకు శ్రేష్టమైనవని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మి
శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మీని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది.
శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం.

ముఖ్యంగా శ్రావణ రెండో శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు.
ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్యు బాగుంటుందని మహిళల విశ్వాసం. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు.
మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూళం, శెనగలు ఇస్తారు.
ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగాదలిచి గౌరవిస్తారు.

శ్రావణ మాసంలో గోవులు, తామరపుష్పాలు, పాడిపంటలు, ఏనుగులు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలనూ అర్చించే వారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పువ్వులు, పండ్లతోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరిత వర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి, శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, స్త్రీలు ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా ఉండే ఇళ్లు, బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు, వేదఘోష, సత్వగుణ సంపదలు, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలనలోనూ మహాలక్ష్మీ దేవి నివసిస్తుందని పురోహితులు చెబుతున్నారు.

అందుచేత శ్రావణ శుక్రవారం పూట తులసీపూజ, ఆలయాల్లో పాలు, తేనెతో అభిషేకాలు చేయించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు సూచిస్తున్నారు.  శ్రావణ శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగది శుభ్రం చేసుకోవాలి.
గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. 

అనంతరం అమ్మవారి ప్రతిమ లేదా పటానికి కర్పూర హారతులు సమర్పించి, చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టాలి.  పూజా సమయంలో దుర్గాష్టకం లేదా ఏదేని అమ్మవారి శ్లోకములతో స్తుతించాలి.
ఇంకా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఉపవాసముండి, అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పురోహితులు అంటున్నారు.
శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మీ లేదా అమ్మవారిని ఆలయాల్లో దర్శించుకునే వారికి పుణ్యఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.

అంతేగాకుండా.. మల్లెపువ్వులు, కస్తూరి, జాజిపువ్వులను అమ్మవారి కోసం సమర్పించి, నేతితో దీపం వెలిగించే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అనుకున్న కార్యాలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు.

వర్ష రుతువు రాకతో వచ్చే పవిత్రమైన మాసం శ్రావణం. ఈ రుతురాగం వర్షాలతో పాటు శ్రావణంతో ఇంటింటా హర్షాతిరేకాలను తీసుకువస్తుంది. శ్రావణ ఘడియలు మొదలవ్వడంతోనే.. సందడి వాతావరణం నెలకొంటుంది. ప్రతి లోగిలి ముగ్గులతో మురిసిపోతుంటుంది. ప్రతి గడపా పసుపుతో తళతళమెరుస్తుంది. ప్రతి ద్వారమూ తోరణాలతో.. పచ్చదనంతో పరిఢవిల్లుతుంది. శ్రావణం రాకతోనే పండుగల వెల్లువ మొదలవుతుంది.

శ్రావణ మాసం రైతుల మాసం. ఈ నెలలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. చెరువులు, జలాశయాలు జలకళను సంతరించుకుంటాయి. గ్రామాల్లో పొలం పనులు వేగం పుంజుకుంటాయి. పొలం గట్ల వెంబడి, బావుల దగ్గర కలుపు మొక్కలు విపరీతంగా పెరుగుతాయి. దీంతో కీటకాలు, సర్పాల సంచారం కూడా పెరుగుతుంది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన మగవారికి క్రిమికీటకాదుల నుంచి ఏ ప్రమాదం రాకూడదని కోరుతూ.. ఆడవాళ్లు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. తమ మాంగల్యం బలంగా ఉండాలని కాంక్షించి శ్రావణ మంగళవారం నాడు మంగళ గౌరి వ్రతాన్ని చేస్తారు. తమ ఇల్లు సిరి సంపదలతో తులతూగాలని శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. నోము పూర్తయిన తర్వాత ముత్తయిదువులకు తాంబూలం ఇచ్చి.. వారి ఆశీర్వాదం తీసుకుంటారు.

హరిహరులకూ ప్రీతిపాత్రమే..
శ్రావణ మాసంలో వచ్చే మంగళ, శుక్రవారాలే కాదు.. సోమవారాలు, శనివారాలు కూడా ప్రత్యేకమైనవే! సోమవారాలు పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారు. శనివారాలు వేంకటేశ్వరస్వామిని పూజిస్తారు. శ్రీనివాసుడు శ్రవణం నక్షత్రంలో అవతరించిన సందర్భంగా శ్రావణంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సోమవారం, శనివారాలు ఉపవాసాలు ఉంటారు. మొత్తంగా చెప్పాలంటే శ్రావణంలో నాలుగేసి చొప్పున వచ్చే సోమ, మంగళ, శుక్ర, శనివారాలు వేటికవే ప్రత్యేకమైనవి.

స్వాహా దేవికి హోమం..
శ్రావణ మాసంలో ప్రతి రోజూ పర్వదినమే! శ్రావణ శుద్ధ పాడ్యమి అగస్త్య మహాముని జన్మదినం. విదియ రోజు అగ్నిదేవుడి భార్య అయిన స్వాహాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు భార్యాభర్తలిద్దరూ హోమం చేస్తారు. పంచమి రోజు నాగులపంచమిగా ప్రసిద్ధి. శ్రావణ శుద్ధ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమని కూడా అంటారు. ఆ నాడు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. రక్షా బంధనం (రాఖీ పండుగ) దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతుంది. ఇదే రోజు విష్ణుమూర్తి హయగ్రీవుడిగా అవతరించాడు కనుక.. ‘హయగ్రీవ ఉపాసన’ చేస్తారు. శ్రీకృష్ణ భగవానుడు అవతరించిన శ్రావణ బహుళ అష్టమి ‘జన్మాష్టమి’గా, ‘కృష్ణాష్టమి’గా జరుపుకుంటారు. శ్రావణ బహుళ అమావాస్య ‘పొలాల అమావాస్య’గా ప్రసిద్ధి. గ్రామాల్లో రైతులు.. పశువులను అలంకరించి, పూజిస్తారు. ఇలా ఎన్నో పండుగల సమాహారం శ్రావణ మాసం.

వేదాధ్యయన కాలం
వేద వాఙ్మయం శ్రావణ మాసంలోనే పుట్టిందంటారు. హయగ్రీవుడనే రాక్షసుడు వేదాలను అపహరిస్తే.. విష్ణుమూర్తి హయగ్రీవుడిగా వచ్చి వేదాలను సంరక్షించాడు. హయగ్రీవుడు అవతరించింది శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడే! అందుకే వేదాధ్యయనానికి, జ్ఞాన సముపార్జనకు శ్రావణ మాసం అనుకూలమైనదని చెబుతారు. శ్రవణం వల్ల నేర్చుకోవలసింది వేదం. కొత్తగా ఉపనయనం అయిన వారికి జంధ్యాల పౌర్ణమి రోజు మౌంజీ బంధనం తొలిగిస్తారు. ఆ మరుసటి రోజు నుంచి వేదాధ్యయనం ప్రారంభిస్తారు.

మగవాళ్ల మాసం కూడా..
శ్రావణ మాసం అనగానే… ఆడవాళ్ల మాసం అనే అపోహ ఉంది. ‘‘పురుషానాం అయం మాసః శ్రావణం పరికీర్తితః’ అని పురాణోక్తి. అంటే పురుషులకూ ఈ మాసం ప్రత్యేకమైనదే! శ్రావణం చాతుర్మాసాల్లో ఒకటి. బ్రహ్మచారులు, గృహస్థులు, వాన ప్రస్థాశ్రమంలో ఉన్నవారు, సన్యాసులు ప్రత్యేక వ్రతాలు చేసే కాలమిది. శ్రావణంలో ముప్ఫయ్‌ వ్రతాలు ఆచరించాలని స్కాంద పురాణ అంతర్గతమైన ‘శ్రావణ మాస వైభవం’లో తెలియజేశారు. మౌనవ్రతం, లవణ వ్రతం, దదీ వ్రతం లాంటి వ్రతాలు చేస్తుంటారు.. ప్రతి వ్రతంలోనూ మనిషి జీవన ప్రమాణాలనూ, ఆయురారోగ్యాలనూ పెంచే శాస్త్రీయత ఉంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న శ్రావణ మాసాన్ని ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించుకుందాం.

దేవుడికీ వ్రతం..
కామ్యార్థ సిద్ధికి మనుషులు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. శ్రావణంలో దేవుడి కోసం చేసే వ్రతం కూడా ఉంది. దానిని పవిత్రోత్సవం అంటారు. రంగు రంగుల దారాలతో దండలు చేసి.. వాటిని పాలలోనో, తేనెలోనో, నీటిలోనో రెండు రోజుల పాటు ఉంచుతారు. దీనిని అధివాసం అంటారు. శ్రావణ శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ మూడు రోజుల్లో ఒకనాడు ఆ దారపు దండలను ఆలయాల్లోని దేవతామూర్తికి అలంకరిస్తారు. ఇలా చేయడం వల్ల.. ఆ ఏడాదిలో అర్చకులు, ధర్మాధికారులు, భక్తుల ద్వారా తెలియక జరిగిన అపచారాలు నివృత్తి అవుతాయని ఆగమశాస్త్రం చెబుతోంది.

శ్రావణ శుద్ధ దశమి రోజు శివలింగాన్ని పాలతో అభిషేకిస్తే.. ధనహాని ఉండదని శాస్త్రం చెబుతోంది. శుద్ధ ఏకాదశి రోజు లక్ష్మీనారాయణుడిని పంచామృతంతో అభిషేకిస్తే..

దీర్ఘాయుష్షు కలుగుతుందని ఉవాచ.


@ తులసి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.